• డాక్టర్‌ చిత్తర్వు మథు

(సైన్స్‌ ఫిక్షన్‌ )

ఎవరూ ఊహించలేదు అలా జరుగుతుందని. ఇప్పటి సైన్స్‌ను బట్టి భవిష్యత్తు చెప్పేవాళ్లు, పత్రకారులు, యూట్యూబ్‌లో ప్రళయం గురించి ముందే చెప్పేవాళ్లూ, రక్షణ మంత్రిత్వ శాఖలోని విశ్లేషకులూ కంప్యూటర్‌ స్పెషలిస్టులూ కల్పనా రచయితలూ ఎవరూ ఊహించలేదు. ఒక గంటలో అంతా అయిపోయింది.

అడవి. ఢిల్లీకి 238 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌. ఇక్కడికి నిన్ననే వచ్చారు రాజ్‌, ప్రియా. అడవి అంతర్భాగంలో ఉన్న ఒక గెస్ట్‌ హౌస్‌ లో నివాసం. ఇలా ఒక హాలిడే ట్రిప్‌ కింద వచ్చారు,

అర్ధరాత్రి రెండు గంటలకి ప్రియాకి మెలకువ వచ్చింది. పక్కనే రాజ్‌ గాఢనిద్రలో ఉన్నాడు. దూరంగా ఉరుము లాంటి చప్పుడు. అర్ధరాత్రి ఒక్కసారి నక్కలు అరచినట్లు, పక్షులు రెక్కలను రెపరెపలాడిస్తూ చెట్ల ఆకుల నుంచి పైకి ఎగిరినట్లు విపరీతమైన ధ్వనులు.

లేచి బయటకు వచ్చింది ప్రియా. అంతా చీకటిగా ఉంది. చేతిలో సెల్ఫోన్‌ ఒక్కసారి మెరిసి ఆగింది.

హెచ్చరిక హెచ్చరిక. మరో 30 నిమిషాల్లో ఢిల్లీ తదితర పరిసర ప్రాంతాలపై బాంబుల దాడి ప్రారంభమవుతుంది. ప్రజలందరూ భూగర్భంలోని బంకర్లలో వేగంగా తలదాచుకోవాలి. అత్యవసరమైన ఆహారం మందులు తప్ప మిగిలిన ఏ సామానులు తీసుకుని వెళ్లవద్దు. హెచ్చరిక… మూడు నాలుగుసార్లు ఫ్లాష్‌ అవుతోంది. ఆ హెచ్చరిక వచ్చిన టైం చూసింది 9 గంటల 45 నిమిషాలు. ఇప్పుడు రెండు గంటల 35 నిమిషాలు అయింది. అంటే… అంటే ప్రియకు గుండె ఆగినంత పని అయింది.

లేచి బయటకు వచ్చింది ప్రియా. ఢిల్లీపై అణుబాంబులు పడటం అంతా విధ్వంసం జరిగిపోయిందా? మళ్లీ మళ్లీ ఉరుములు దూరం నుంచి వస్తున్నాయి. చెట్ల ఆకుల మధ్య నుంచి ఆకాశం కేసి చూస్తే ఆకాశంలో నల్లటి మబ్బులు తెల్లని వెన్నెల మబ్బులను కూడా కమ్మేస్తున్నాయి. గబగబా లోపలికి పరిగెత్తింది. ‘రాజ్‌! రాజ్‌! లే నిద్రలే!’

లాప్టాప్‌ ఆన్‌ చేసి న్యూస్‌ చానల్స్‌ చూడసాగింది. తెరమీద చుక్కలు చుక్కల స్టాటిక్‌ తప్ప మరి ఏమీ రావటం లేదు.

 మొబైల్‌ డేటా సరిగ్గా రావటం లేదు.

 రాజ్‌ కళ్లు తెరిచి చూస్తున్నాడు. ‘ప్రియా ఏం జరిగింది?’

హఠాత్తుగా ల్యాప్టాప్‌లో న్యూస్‌ ఛానల్‌లో సందేశం రాసాగింది.

‘‘నా పేరు యశ్‌పాల్‌. ఇప్పుడు ఢిల్లీలోని బంకర్‌ నుంచి మాట్లాడుతున్నాను. ఒక భయంకరమైన ఉత్పాతం జరిగింది. ఢిల్లీ మొదలైన పెద్ద నగరాల అన్నిటి మీద బాంబు దాడి జరిగింది. నగరాలన్నీ నాశనం అయిపోయాయి. ఇది ఎవరు చేశారో తెలియటం లేదు’ అతను అలా చెప్తూ ఉండగా తెర మీద ఒక ఫోటో రాసాగింది. ఢిల్లీ నగరపు ఆకాశం మీద కుక్క గొడుగు రూపంలో ఒక పెద్ద నల్లటి పొగ మేఘం అల్లుకుని ఉంది. రోడ్లమీద జనం కకావికలుగా పరిగెత్తుతూ కనిపించారు.అన్ని భవనాల నుంచి మంటలు కనబడుతున్నాయి. ‘‘ఒక అరగంట ముందు వచ్చిన హెచ్చరిక ఆధారంగా కొంతమంది మాత్రమే బంకర్లలో ప్రాణాలు కాపాడుకున్నాం. ప్రధానమంత్రి రక్షణ మంత్రిత్వ శాఖ ఏమయ్యారో తెలియదు. ఆర్మీ జనరల్‌ మిలిటరీ ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి ప్రజలకి పునరావాస చర్యలు చేపడుతున్నారు. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. రేడియేషన్‌ వల్ల అపాయం. ప్రజలు బయటికి రాకూడదు అని ప్రకటనలు చేస్తున్నారు. కొన్ని లక్షల మంది చనిపోయారని భావిస్తున్నారు. ఇది వినాశనం. ప్రళయం. ఇది దేశంలో ఇతర ప్రాంతాల్లో వారికి తెలియాలని నేను మెసేజ్‌ పంపిస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నా కొద్ది రోజులు పాటు అండర్‌ గ్రౌండ్‌ బంకర్లలో గాని ఇళ్లలోనే తల దాచుకోండి. కనీసం మూడురోజులు బయటికి రావద్దు. ఆహారం నీరు రేడియేషన్తో కలుషితం అవుతాయి. చెరువులు నదులు కూడా రేడియేషన్‌ ప్రభావం వల్ల కాలుష్యంతో నిండి పోతాయి.’’ ఇదే సందేశం మాటిమాటికి రాసాగింది. అవే ఫోటోలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి.

‘‘ఓ మై గాడ్‌’’ అని తల పట్టుకుని ప్రియ, ‘‘హూ ఐ కాంట్‌ బిలీవ్‌ దిస్‌’’ అని రాజ్‌ ఇద్దరూ రెండు నిమిషాలపాటు అచేతనంగా అయిపోయారు. ఆ భయంకరమైన వార్త వాళ్లకి తిరుగులేని షాక్‌ కలుగ జేసింది.

‘‘బయటకు పోయి ఫారెస్ట్‌ గార్డులని, ఇతర సెక్యూరిటీ ఆఫీసర్లని అడుగుదాం పద!’’ అన్నది ప్రియ.

‘‘వెళ్లే ముందు మనకి కావలసిన దుస్తులు, ఆహారం నీళ్లు ప్యాక్‌ చేసుకుని బయటపడటం మంచిది. ఎందుకంటే బయట పరిస్థితులు మనకు తెలియవు.’’

మిణుకు మిణుకుమని దీపాలు ఆరుతూ వెలుగుతూ, ఒక్కసారిగా కాటేజీలో కరెంటు పోయింది. చిమ్మ చీకటి. బయట కీచురాళ్ల శబ్దం, అక్కడక్కడ తోడేళ్ల అరుపులు. దూరంగా పులుల గాండ్రిరపులు తప్ప ఏ శబ్దాలు వినిపించడం లేదు.

ఫ్లాష్‌ లైట్‌తో గబగబా కొన్ని దుస్తులు నీళ్ల సీసాలు బ్రెడ్‌ ప్యాకెట్లు చెరొక బ్యాగ్‌లో పెట్టుకొని బయటకు వచ్చారు. వాళ్ల కాటేజీ రిసెప్షన్‌ ఆఫీసు ఒక కిలోమీటర్‌ దూరం ఉంది. నడవసాగారు. అక్కడక్కడ విసిరేసినట్లు ఉన్న కాటేజీలు నిర్మానుష్యంగా ఉన్నాయి. లైట్లు లేవు. ఆఫీస్‌ దగ్గర 24 గంటలు డ్యూటీలో ఉండవలసిన వ్యక్తి లేడు.

‘‘మనం గాఢ నిద్రలో ఉన్నాం. వీళ్లందరికి ముందే ఈ వార్త తెలిసి పారిపోయినట్లుంది!’’

గేట్‌ దగ్గర లైట్లు ఆరిపోయి ఉన్నాయి. ఇక్కడ ఆకాశంలో నల్లటి మబ్బులు కనిపిస్తున్నాయి.

అవి వలయాలు వలయాలుగా తిరుగు తున్నాయి.

రాజ్‌ భయంగా అన్నాడు. ‘‘ఈ సాయంత్రం మనం చూసినప్పుడు ఆకాశంలో మబ్బులు లేవు. ఇవి బహుశా దాడి జరిగిన తర్వాత ఆకాశంలో అలముకున్న రేడియేషన్‌ మేఘాలు. నిజంగానే అణుదాడి జరిగితే ఒక వారం రోజులు పాటు భయంకరమైన రేడియోధార్మికశక్తి ఆకాశంలో మబ్బులుగా ఏర్పడి నల్లటి యాసిడ్‌ వర్షంలా కురవచ్చు. నిజంగానే ఢిల్లీ ఇతర నగరాలు నాశనం అయిపోయి ఉంటే బతికున్న వాళ్లు కూడా ఈ రేడియోధార్మికశక్తితో మరణించవచ్చు. ఆహార పదార్థాలు, తాగే నీళ్లు నదులు చెరువులు అన్ని రేడియేషన్తో కలుషితమైపోయే ఛాన్స్‌ ఉంది. ఏం చేద్దాం.’’

‘‘అణుబాంబు దాడి గురించి నీ విజ్ఞానం బాగానే ఉంది. ఇప్పటి వరకు మనం అదృష్టవంతులమే అనుకోవాలి. ఏదైనా వాహనం దొరికినా నెమ్మదిగా సురక్షితమైన ప్రాంతానికి వెళ్దాం. లేకపోతే నడుద్దాం. నిజానికి రేడియేషన్‌ సూట్లు గాని భూమి అడుగున గల బంకర్లు గానీ మనని రక్షిస్తాయి. కానీ అవి ఇక్కడ లేవు.’’ అన్నది ప్రియా.

ఢల్లీికి పోయే హైవే నిర్మానుష్యంగా ఉంది. ఒక్క వాహనం కూడా లేదు. ఒక్క దీపం కూడా లేదు. ఇద్దరూ నడవడం మొదలుపెట్టారు.

రాజ్‌కీ ప్రియాకీ పరిచయం రెండేళ్ల నుంచి ఉంది. రాజ్‌ ఢిల్లీలో నోయిడాలో ఒక సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌. కృత్రిమ మేధస్సుకి సంబంధించిన రీసెర్చ్‌ చేస్తూ ఉన్నాడు. ఒక వీకెండ్‌ ఏదో పబ్బులో పరిచయమైంది ప్రియ. ఒకరికొకరు ఆకర్షితులైనా ఇద్దరికీ ఒకరి గురించి ఒకరి వివరాలు ఇంకా సరిగ్గా తెలియదు.

ఎప్పుడు ఆమెని వివరాలు అడిగినా ఇంకొంచెం సమయం కావాలి అనేది. ఆమె నంబర్‌ లేని ఒక కార్లో రావడం, వెళ్లేటప్పుడు ఫోన్‌ చేస్తే మరొక కార్‌ పిక్‌అప్‌ చేసుకోవడం జరిగేది. రాజ్‌కి అది ఆశ్చర్యంగా, అనుమానంగా ఉన్నా, ఆమె తెలివి తేటలు ఒక రకమైన ఆకర్షణ ప్రత్యేకమైన వ్యక్తిత్వం అతన్ని చాలా ఆకర్షించాయి. ఆమె ఒక గొప్ప ధనవంతుడి కుమార్తె గాని లేక పెద్ద ఆఫీసర్‌ గానీ కావచ్చు అనుకునేవాడు.

ఇద్దరూ సినిమాలకు వెళ్లేవారు. కనీసం 15 రోజులకు ఒకసారి రెండు మూడు గంటలైనా గడిపేవారు. ఈసారి వారాంతంలో మాత్రం టైగర్‌ పార్క్‌కి వెళ్దాం అని ప్రియ ప్రపోజ్‌ చేసింది.

చీకట్లో ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూనే ఉన్నారు.

‘‘ఈ ప్రళయం ఈ విలయం వచ్చినప్పుడైనా నీ గురించి చెప్పవా!’’ అన్నాడు రాజ్‌.

నడిచేదల్లా ఆగి నవ్వి అన్నది ప్రియా .

‘‘ఎప్పటి నుంచో గోప్యంగా ఉండాల్సిన అవసరం ఉందేమో. ఇది ప్రపంచ మంతా వినాశనం అయిపోతున్న క్షణం. బహుశా నేను చేయవలసింది చాలా ఉందేమో…

భుజాన వేసుకున్న బ్యాగ్‌లో బట్టలు, ఫోను, కొన్ని నోట్లు, వాటికి అడుగున డాడీ ఇచ్చిన ఒక పరికరం అప్రయత్నంగానే తడిమి చూసింది. ‘‘ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ నువ్వు ఎవరో తెలియకూడదు. నీ బాయ్‌ ఫ్రెండ్‌కి కూడా నేను ఇచ్చిన పరికరం గురించి చెప్పకు. అవసరం వచ్చినప్పుడు ఆ పరికరం నీకు హెల్ప్‌ చేస్తుంది. అది ఒక పెన్‌ డ్రైవ్‌ లాంటిది.

‘‘పాస్వర్డ్‌ ఉందా డాడీ ఏమన్నా?’’

ఆయన చెప్పాడు ‘‘నీ తలలోనే ఉంచుకో!

 ‘‘సురక్షణ 2041’’

‘‘అమ్మ… అమ్మ పేరు… ‘‘ ఆశ్చర్యపోయింది.

‘‘అవును ప్రియా! ఆపత్‌ కాలంలోఅదే నీకు రక్ష.’’

*******

కొన్ని గంటల ముందు… ఢిల్లీలో…

ప్రధానమంత్రి విక్రమ్‌ రావు తన సెక్రటేరియట్‌లో ఇద్దరు ఆంతరంగికులతో కూర్చుని ఉన్నాడు. ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు అన్నీ వచ్చి ఉన్నాయి. జనరల్‌ సమర్‌ సింగ్‌ ఈ రాత్రికి విప్లవం తెచ్చేందుకు చేసేందుకు కచ్చితంగా పథకం రచించాడు. త్రివిధ బలాలు అతని చేతుల్లోనే ఉన్నాయి. ఏం చేయాలి?

‘‘ఇది నాకు ఎప్పటి నుంచో అనుమానంగానే ఉంది’’ అన్నాడు విక్రమ్‌ రావు. ఆయన ఒక అభ్యుదయ ప్రధానమంత్రి. ప్రజాసేవ సంస్కరణలు పేద జనానికి ఉపయోగపడే విధంగా అమలు పరిచే పథకాలతో ప్రభుత్వంలోకి వచ్చినవాడు. త్రివిధ బలాల అధ్యక్షుడు జనరల్‌ సమర్‌ సింగ్‌ అతని ఒకప్పటి క్లాస్‌మేట్‌ అయినా ఇద్దరికీ అంతులేని రాజకీయ విభేదాలు ఉండేవి.

‘‘విక్రమ్‌! ఈ సంక్షేమ పథకాలకు ఎక్కువగా బడ్జెట్‌ ఖర్చు పెట్టడం పనికిమాలిన పని. వ్యాపారవేత్తలకి, పెద్ద పరిశ్రమలకి టాక్స్‌లు తగ్గించి ప్రోత్సాహకాలు ఇస్తే మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఆ రకంగా పేదవాళ్లకు కూడా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఇంకా మనం ప్రపంచంలో తిరుగులేని శక్తిగా అవతరించవచ్చు. మిలిటరీకి కాకుండా ఇలాంటి పథకాలకు ఎక్కువ ఖర్చు చేయడం వల్ల దేశం దెబ్బ తింటుంది.’’ అని వాదించేవాడు సమర్‌ సింగ్‌.

‘‘సమర్‌ ! మనని ఎన్నుకున్నది పేద ప్రజలు. వాళ్లు ముఖ్యం మనకి. మనది ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిన రక్షణ వ్యవస్థ. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మిస్సైల్స్‌, అణుబాంబులతో సహా అన్నీ ఉన్నాయి మనకి. ఇంకా ఆయుధాలకు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ దేశంలో ఇంకా 150 కోట్ల జనాభా ఉన్నది. పేద ప్రజలు ఎక్కువ శాతం మంది ఉన్నారు. వ్యవసాయం వల్ల ఏమీ లాభం రావటం లేదు. ఉద్యోగాలు లేని వాళ్లకు, వయసు మీరిన వాళ్లకు, ఆదాయం లేని వాళ్లనీ ఆదుకునే పథకాలు రచించడంలో తప్పేముంది? దీనివల్ల చాలా మందికి ఉపయోగం.’’ అని విక్రమ్‌ రావు వాదించేవాడు.

అయితే గత ఆరు నెలలుగా జనరల్‌ సమర్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని మార్చటానికి పథకాలు రచిస్తున్నాడని, దీనికి చైనా లాంటి విదేశాలూ, బడా వ్యాపారవేత్తలు ప్రోత్సహిస్తూ, సాయం చేస్తున్నాని కూడా ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు విక్రమ్‌ రావుకు వస్తూనే ఉన్నాయి. మిలిటరీలో ఎయిర్‌ ఫోర్స్‌లో ఇతర కీలక రక్షణ వ్యవస్థలలో అతనికి చాలా మంది అనుకూలంగా ఉన్నారని సమాచారం కూడా విక్రమ్‌ రావుకి అందింది.

ఈరోజు సాయంత్రం 6:00కి తనకి అత్యంత విధేయులైన ఆఫీసర్లు ఒకరిద్దరూ, తన పార్టీ సభ్యులూ, కొంతమంది మంత్రులూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఆర్మీ కదలికలు ఎక్కువైనాయి. కొన్ని వందల ట్యాంకర్లు ఆగ్రా `ఢిల్లీ మార్గంలో వస్తున్నాయి. ఆకాశంలో ఎయిర్‌ ఫోర్స్‌ జెట్‌ విమానాలు కదలికలు ఎక్కువైనట్లు గమనించాము.

 రక్షణమంత్రి మాత్రం కనబడలేదు. అతను కూడా సమర్‌ సింగ్‌ వైపు ఉండి ఉండాలి.

సమయం 8 అవుతుంది. నాలుగు రోజుల క్రితమే విక్రమ్‌ రావు ఒక నిర్ణయానికి వచ్చాడు.

అతని అంతరంగికులు ఇద్దరు ఆఫీసర్లు ఆ గదిలోనే ఉన్నారు.

‘‘మనం అనుకున్నది నిజమే. సైనిక తిరుగుబాటు జరుగబోతోంది. సైన్యంలో ఎవరూ మనకు అనుకూలంగా లేరు. మిత్ర దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్‌ ఆస్ట్రేలియా ఏమీ స్పందించలేదు. వాళ్ల రక్షణమంత్రి సలహాల ప్రకారం మన జనరల్‌ సమరసింగ్‌ని సస్పెండ్‌ చేయమని చెప్పారు. ఎలా కుదురుతుంది? అతనికి ఇంకా రెండు సంవత్సరాలు సర్వీస్‌ ఉంది.సస్పెండ్‌ చేస్తే ఇంకా తిరుగుబాటు చేయడానికి తగిన ఆధారాలు సృష్టించినట్లు అవుతుంది. ఇలా ఆలోచించాడు విక్రమ్‌రావు. దీన్ని ఎదుర్కోవడానికి ఒకటే మార్గం. ప్రధానమంత్రి ఆఫీస్‌ కిందనే ఒక రహస్య ద్వారం ఒక న్యూక్లియర్‌ దాడికి రక్షణగా ఉండే బంకర్‌లోకి మెట్ల మీదుగా కిందకి దిగారు.

‘‘సార్‌ ఆర్‌ యు సూర్‌?’’ అని అడిగాడు ఒక ఒక అంతరంగికుడు.

‘‘తప్పదు. ఇలాంటి పరిస్థితి కోసమనే నేను కృత్రిమ మేధస్సుతో ఒక కృత్రిమ దాడిని నిర్వహిద్దాం అనుకున్నాను.సమర్‌ సింగ్‌ను భయపెట్టి వెనక్కి పంపించవచ్చు. ఆ తరువాత మిలిటరీ కోర్టులో అతన్ని ముద్దాయిగా నిలబెట్టొచ్చు’’. అండర్‌ గ్రౌండ్‌ బంకర్‌లో కంట్రోల్‌ రూమ్‌లో న్యూక్లియర్‌ ఎటాక్‌ అని ఉన్న పెద్ద పానల్‌ దగ్గర ఎర్రగా మెరుస్తున్నాయి అరచేతి రూపంలో తెరలూ బోర్డులు. దానిమీద తన చేతిని వేసి ఆథరైజేషన్‌ ఇచ్చాడు ప్రధానమంత్రి రావు. తర్వాత దాంట్లో ఒక స్లాట్లో ఒక వృత్తాకారంలో ఉన్న ఒక డిస్క్‌ని పెట్టాడు. స్క్రీన్‌ పాస్వర్డ్‌ అడిగింది. ‘‘సురక్షణ 2041’’ అనే పాస్వర్డ్‌ టైప్‌ చేశాడు.

ఆ తరువాత ఇక పదండి అని వేగంగా వారు పైకి వచ్చి ప్రధానమంత్రి కార్యాలయాన్ని మూసివేసి బయట ఎదురు చూస్తున్న ఒక వాహనంలో ఒక రహస్య మిలిటరీ ఎయిర్‌ పోర్ట్‌కి వెళ్లిపోయారు. ప్రధానమంత్రి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ఆకాశవీధిలో భారతదేశపు దక్షిణం వైపు ఎగిరి వెళ్లిపోయింది.

అక్కడ దేశపు టెక్నాలజికల్‌ రాజధాని హైదరాబాదులో తనకోసం అక్కడి ముఖ్యమంత్రి అతని పరివారం ఎదురు చూస్తారు. ఈ ఉత్పాతం అయిపోయేదాకా అక్కడే ఉండొచ్చు ఇదే ప్రధాన మంత్రి పథకం.

********

8 గంటల 30 నిమిషాలకి ఢిల్లీ ఆగ్రా హైవేలో కనీసం 50 మిలిటరీ ట్యాంకర్లు, వాటిపైన విమానాలు ఆ చుట్టుపక్కల మిషన్‌ గన్స్‌ ధరించిన సైనికులు మార్చింగ్‌ చేస్తూ వస్తున్నారు ఆ లైన్‌కి వెనకాల ఉన్న పెద్ద మిలిటరీ జీప్‌లో జనరల్‌ సమర్‌ సింగ్‌ అతని అసిస్టెంట్‌ థాపా కూర్చుని ఉన్నారు. ‘‘విక్రమ్‌ ఏమి చేయలేడు. అక్కడికి వెళ్లడం సైన్యాన్ని తనవెంట ఉన్నట్లు, ఆయుథాలు చూపించడం ‘నువ్వు మర్యాదగా, శాంతియుతంగా రాజీనామా చేయాల’ని కోరడం, అతను ఒప్పుకుంటే సరే…లేకపోతే అవినీతి అరోపణలపై బంధించి జైలులో ఉంచి విచా రించడం… ఆ తర్వాత మిలటరీ ప్రభుత్వాన్ని డిక్లేర్‌ చేయడం, జరుగుతుంది. అదీ పథకం. తర్వాత వచ్చే శాంతి భద్రతల సమస్యలు తానే పరిష్కరించు కుంటాడు. విక్రమ్‌ రావు కేవలం రాజకీయ నాయకుడు.అతనికి యుద్ధం చేసే నేర్పు లేదు. ప్రపంచ దేశాలు ఎక్కడినుంచీ అతనికి సపోర్ట్‌ లేదు.అనుకున్న ప్రకారం మనం ప్రభుత్వాన్ని ఆక్రమించుకుంటే నేను సుమారు పదిన్నరకు టీవీలలో ప్రకటన చేస్తాను. సైనిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను. దేశంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది’’ అన్నాడు సమర్‌ సింగ్‌.

‘‘అంతా సక్రమంగా జరుగుతుందని ఆశిద్దాం’’ అన్నాడు మరొక జనరల్‌. అదే సమయంలో నక్కలు ఊళపెట్టినట్లు, గుడ్లగూబ కూసినట్లు సైరన్లు మోగసాగాయి. అందరి సెల్‌ ఫోన్లలో సందేశాలు రాసాగాయి. ‘‘హెచ్చరిక! హెచ్చరిక! హెచ్చరిక! మెసేజ్‌ ! ఒక అరగంట తర్వాత అణుబాంబులతో నగరం మీద దాడి జరగబోతోంది! ప్రజలందరూ దగ్గర్లో ఉన్న భూమి అడుగున ఉన్న న్యూక్లియర్‌ బంకంలలో తల దాచుకోవాలి. ఎమర్జెన్సీ! ఎమర్జెన్సీ!

కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలందరి మొబైల్‌ ఫోన్లకి ఎమర్జెన్సీ సందేశాలు ఉండే ఒక ప్రక్రియ చేపట్టారు. దీనివల్ల ఏదైనా ఉపద్రవం జరిగినప్పుడు అందరికీ హెచ్చరిక చేసే సదుపాయం ఉంది. ఇలా అణుబాంబు దాడికి అరగంట కంటే సమయం లేనప్పుడు ఇలాంటి అత్యవసర సందేశాలు ఆటోమేటిక్‌గా పంపుతారు.

మెల్లగా కదులుతున్న ట్యాంకర్లన్నీ హఠాత్తుగా ఆగిపోయాయి. సమర్‌ సింగ్‌ అతని పక్కనున్న జనరల్‌ థాపా కూడా ‘‘ఏం జరుగుతోంది?’’ అని అరిచారు. కొంతమంది సైనికులు పరిగెత్తుకొని అతని జీపు పక్కనకొచ్చారు అర్జెంటుగా ఢిల్లీ ఆగ్రా హైవేలో ఉన్న 901 బంకర్‌కు మీరు వెళ్లాలి. అంతకంటే మార్గం లేదు. అణుబాంబు దాడులు చాలా అపాయం.’’

ఎక్కడ ట్యాంకులు అక్కడ ఆగిపోయినాయి. జనరల్‌ సమర్‌ సింగ్‌, మేజర్‌ జనరల్‌ థాపా… మోటార్‌ సైకిళ్లపై వేగంగా వచ్చిన సైనిక రక్షకభటులతో ప్రత్యేకంగా ఆర్మీ అధికారులకు ఏర్పరిచిన న్యూక్లియర్‌ బంకర్‌ వైపు వెళ్లిపోయారు.

అరగంట తర్వాత పెద్ద చప్పుడుతో ఢిల్లీ నగరం మీద అణుబాంబులు పడ్డాయి. ఆకాశంలో ఒక నల్లటి మేఘాలు కనబడ్డాయి.

నగరం అంతా చీకటి అయింది. ఆ శబ్దానికి ఢిల్లీ పరిసర ప్రాంతంలో పది కిలోమీటర్ల వరకు ప్రకంపనలు రేగాయి. ఇళ్లు కూలిపోయాయి. పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు పడిపోయాయి. ఆ మంటల్లో అనేక మంది చనిపోయారు. గాయపడిన వారి అరుపులు, హాహాకారాలు అర్తనాదాలు ఎంతో దూరం వినబడ్డాయి. ఎక్కడికి అక్కడ న్యూక్లియర్‌ ఫైర్‌ అలారాలు మోగుతూనే ఉన్నాయి.

ఉత్పాతాలు, విలయాలు అగ్ని ప్రమాదాలు జరిగిపోయాయి. ఇది ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. ఇంటర్నెట్‌ వ్యవస్థ టెలివిజన్‌ వ్యవస్థ అంతర్జాతీయంగా సమాచారం ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి.అది కనీవినీ ఎరుగని ప్రళయం. చాలా తక్కువ మంది సజీవంగా బయటపడ్డారు.

రేడియేషన్‌ ప్రభావం వల్ల చర్మంపై బొబ్బలు కారణంగా ఆ తర్వాత కూడా వందల మంది చనిపోయారు. నదులు చెరువులు నీళ్లు కలుషితం అయిపోయినాయి. పంటలన్నీ మాడి నల్లటి రంగులోకి మారిపోయాయి. ఈ అణుబాంబులతో దాడి ముందే తెలిసిన బంకర్లలో దాక్కున్న వాళ్లు మాత్రం రక్షణ పొందారు. సమర్‌ సింగ్‌ అతని పరివారం అంతా బంకర్‌లలో దాగి ప్రాణాలు రక్షించుకున్నారు.హైదరాబాద్‌ వెళ్లిన ప్రధాన మంత్రి ఏమయ్యాడో తెలియదు.

 దక్షిణాదిలోని అన్ని నగరాలు కూడా దెబ్బతిన్నాయి. డజన్లకొద్దీ విస్ఫోటనాల తరువాత, 15 రోజులు 20 రోజులకి దోపిడీ దొంగలు, ఆయుధాలు, రేడియేషన్‌ రక్షణ సూట్‌లు ధరించిన కొంతమంది సైనిక మూకలు ఆహారం కోసం, డబ్బులు కోసం దోపిడీలు దాడులు మొదలు పెట్టాయి. దేశంలో ఒక్కొక్క ప్రాంతం వివిధ రౌడీ మూకల కింద చేరిపోయింది. ఎవరు బలవంతుడు అయితే వారిని వార్‌ లార్డ్స్‌ అంటారు. ఒకొక్కచోట ఒక వార్‌ లార్డ్‌ పరిపాలించాడు. అరాచకం మొదలైంది. అంతర్జాతీయంగా ఎక్కడేమి జరుగు తుందో తెలియడంలేదు. కానీ ప్రపంచంలో చాలా వరకు దేశాలు నాశనమై కృత్రిమ మేధ నడిపే వ్యవస్థ తప్ప మిగతావన్నీ నశించిపోయాయని అనుకున్నారు. అది ఒక వినాశన కాలం.విధ్వంసానంతర ప్రపంచం.

సైన్యాన్ని భయపెట్టడానికి తిరుగుబాటు అణచడానికి, ఒక ‘‘ఫాల్స్‌ అలారం’’(తప్పు హెచ్చరిక) సృష్టించడానికి, విక్రమ్‌ రావు చేసిన పని వల్ల కావచ్చు లేదా ఆ సిగ్నల్‌ వల్ల ఇతర దేశాల్లో చైనా, పాకిస్తాన్‌ వాటిలోని కృత్రిమ మేధ పొరపాటుగా రియాక్ట్‌ అయ్యి వాటిని చూసి చైనా పాకిస్తాన్లు ఏదో దాడి చేస్తున్నాయని భయంతో మరికొన్ని దేశాలు అమెరికా, బ్రిటన్‌, రష్యా, చైనా ఆస్ట్రేలియా, లాంటి దేశాల నుంచి అణుబాంబులతో కృత్రిమ మేథ ఆటోమేటిక్‌గా చేసిన మిసైల్‌ గొలుసు కట్టుదాడుల వల్ల ప్రపంచమంతా నాశనం అయ్యి ఉండవచ్చు. ఎవరూ చెప్పలేకపోయారు.

కానీ ఒక దీర్ఘ కాలపు ‘‘న్యూక్లియర్‌ వింటర్‌’’ మొదలయింది. వాతావరణం శీతలమై పోవటం. వానలు విఫలమై, అణుధార్మికత వల్ల తరచూ ఆమ్లవర్షాలు (అంటే ఏసిడ్‌ రెయిన్‌) కురవడం, పంటలు నాశనం అయిపోవడం, నెలల తరబడి కారు మబ్బులు కప్పుకొని ఉండటం అదే అణు ధార్మికత వల్ల దీర్ఘకాలంగా శీతలకాలం ఏర్పడటం.

న్యూక్లియర్‌ వింటర్‌. ఒక అరాచకం, భయం కరమైన మూకల దాడులు, ఆహారం నీరు కోసం కూడా పోరాటాలు సాధారణం అయిపోయాయి.ఇలా ఆరు నెలలు జరిగింది.అయితే ఈ విషయాలు ఏవీ ప్రియా, రాజ్‌లకి తెలియదు. అడవిలో ప్రియా, రాజ్‌, గెస్ట్‌ హౌస్‌లోనే చాలా రోజుల బాటు తలదాచు కున్నారు. పగటిపూట రోడ్లమీద నడుస్తూ దగ్గర గ్రామాలలోని షాపులలో, ఇళ్లలో ఆహారం నీరు కోసం వెదుకుతూ దొరికినవి తెచ్చుకుని ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రియా మాత్రం తన గతాన్ని రహస్యంగానే దాచుకుంది. తన బ్యాగ్‌లోని వృత్తాకార పరికరం రాజ్‌కి కనపడకుండా జాగ్రత్త పడుతోంది.

ఢిల్లీకి రుషికేశ్‌ కి మథ్య మార్గంలో హైవేకి 40 కిలోమీటర్ల దూరంలో ఉందా గ్రామం. అది వారు దిగిన అడవిలోని గెస్ట్‌హౌస్‌కి దగ్గరగా ఉంది. న్యూక్లియర్‌ దాడి జరిగిన ఈ ఆరు ఏడు నెలల్లోనూ ప్రియా రాజ్‌ రెండు రోజులకు ఒకసారి ఆ గ్రామానికి వెళ్లటం,దొరికిన ఆహారం, నీళ్లు తెచ్చుకోవడం ఒకరోజు మరో గ్రామంలో పూర్తిగా నిర్మానుష్యమైన ఇళ్ల మధ్య ఒకే ఒక్క గ్రామీణ హాస్పిటల్‌ కనిపించింది. అక్కడ గాయాలతో, ఒంటినిండా బొబ్బలతో జ్వరంతో మూలుగుతున్న ఒక మధ్య వయస్కుడు కనిపించాడు. అతడు ఒక డాక్టర్‌. అణుదాడులు జరిగిన తర్వాత కూడా గాయాలతోనూ, రేడియేషన్‌ సిక్నెస్‌తో వచ్చిన వారికి సేవలు చేసి ఇక్కడే ఉండి పోయానని చెప్పాడు. క్రమంగా అతనికీ రేడియేషన్‌ జ్వరం వచ్చింది. గ్రామస్తులలో కొందమంది సురక్షితంగా ఉన్న దక్షిణాపథం వైపు, మరికొందరు ఎక్కడ ఆసరా దొరికితే అక్కడికి, వెళ్ల గలిగిన సామాన్లతో వెళ్లిపోయారు. అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి సమర్‌ సింగ్‌ సైనికులు దాడి చేస్తున్నారు. వారే కాకుండా ఇతర బందిపోటు దొంగలు ముఠాలు దోపిడీ చేసుకునేవారు, గూండాలు పట్టణాలనీ నగరాలనీ దోచుకుని, ఆహారపదార్థాలను, నీటి సీసాలు, ఇతర మందుల్ని దొరికినవి దొరికినట్టే తీసుకొని పోతున్నారు.

అతని పరిస్థితి చూస్తే జాలి వేసింది. ఆ క్లినిక్‌ లో దొరికిన బ్యాండేజ్‌ గుడ్డలతో మందులతో అతనికి కట్లు కట్టి, నీరు, ఏంటీ బయోటిక్స్‌ మందులు ఇచ్చి సేవ చేశారు. గుప్తా అనే ఆయన  కొనఊపిరితో ఉన్నాడు. కొంచెం కళ్లు తెరిచి చూసి ప్రియా వంకే చూడడసాగాడు.

హీనమైన స్వరంతో చెప్పాడు. ‘‘జనరల్‌ సమర్‌ సింగ్‌ సైనికులు నీ ఫోటోని అందరికీ చూపిస్తూ ఈమె ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతున్నారు. ఢిల్లీలో రేడియేషన్‌ ప్రభావం తట్టుకోవడానికి భూగర్భంలో ఒక పెద్ద బంకర్లు నిండిన నగరాన్ని సమరసింగ్‌ నిర్మించాడు. అతనికి అక్కడి నుంచి పరిపాలన సాధ్యమవుతోంది. ఇతర దేశాల వారూ అతనికి సహాయం చేస్తున్నారు. అయితే అతనికి ఢిల్లీ చుట్టుపక్కల తప్ప దేశం మొత్తంమీద అధికారం లేదు. దేశంలో అరాచకం పేరుకుపోయింది. ఒక రాష్ట్రం, నగరం అని లేకుండా వివిధ ప్రాంతాల్లో గూండాలు మాఫియాలు పరిపాలిస్తున్నారు. నీ గురించే జనరల్‌ సమర్‌ సింగ్‌ ఎందుకు వెదుకుతున్నాడో అర్థం కావటం లేదు.’’ అలా చెప్తుండగానే అతని ప్రాణం పోయింది.

కాసేపు మౌనంగా నిలబడ్డారు రాజ్‌, ప్రియా. దగ్గరగా దొరికిన బెడ్‌ షీట్లతో అతని భౌతికకాయాన్ని చుట్టి ఊరి బయట శ్మశానానికి తరలించారు. అంత నిర్మానుష్యంగా ఉంది. శవాలను పూడ్చిపెట్టడానికి కూడా మనుషులు, ఏర్పాట్లు లేవు. ఇద్దరూ కలసి గొయ్యి తవ్వి తీసి ఖననం చేయడానికి ఎంతో సమయం పట్టింది.

రాజ్‌ అన్నాడు. ‘‘ప్రియా! ఇప్పటికైనా చెప్పు! నువ్వు ఎవరివి? నీకోసం సమర్‌ సింగ్‌ మనుషులు ఎందుకు వెతుకుతున్నారు?’’

‘‘చెప్తాను అంతా. మన గెస్ట్‌హౌస్‌ కి చేరదాం.

పాడుపడిన షాపుల పక్కనే, దోపిడీ జరిగిన సూపర్‌ మార్కెట్‌ ఒకటి ఉంది. ఇంకా దాంట్లో కొన్ని పదార్థాలు మిగిలే వున్నాయి. కొన్ని బ్రెడ్‌ ప్యాకెట్‌లు, నీటి సీసాలు, కొంత బియ్యం తీసుకుని ఫారెస్ట్‌ గెస్ట్‌ హౌస్‌ వైపు దారి తీశారు.

దూరంగా మోటార్‌ సైకిల్‌ శబ్దాలు వినబడ సాగాయి. రోడ్డు పక్క ఉన్న ఒక పాడుపడిన ఇంట్లో దాక్కొని కిటికీలోంచి బయటకు చూశారు. ఆలివ్‌ గ్రీన్‌ యూనిఫాంలో రేడియేషన్‌ సూట్లు ధరించి మిషన్‌ గన్లతో ముగ్గురు సైనికులు మోటార్‌ సైకిళ్లు గ్రామం మధ్య ఆపి చుట్టూ చూడసాగారు.

వారిలో ఒకడు మెగాఫోన్‌తో ప్రకటన చేయసాగాడు.

‘‘మీ గ్రామస్తులకి ఒక హెచ్చరిక. ఇది ఎమర్జెన్సీ. ఎవరి బాగోగులు వారే చూసుకోవాలి. త్వరలో పరిస్థితులు బాగుపడి ప్రభుత్వం మీకు సహాయం చేయడానికి వస్తుంది. అయితే ప్రియారావు అనే యువతి గురించి తెలిస్తే, ఫోన్‌ ద్వారా కానీ, వ్యక్తి గతంగా గాని మాకు సమాచారం ఇవ్వాలి. అందుకు మంచి బహుమతి ఉంటుంది.’’ అన్నది ఆ ప్రకటన సారం.

వాళ్లు ఒక అరగంట వరకు గ్రామమంతా కలయ తిరుగుతూనే ఉన్నారు. మొరిగే రెండు కుక్కలూ, దిక్కుతోచకుండా తిరుగుతున్న చిక్కిపోయిన ఆవులూ తప్ప గ్రామం అంతా నిశ్శబ్దంగా ఉంది.

‘‘ఎవరూ లేరు. పోదాం. పదండి. గ్రామంలో అందరూ చనిపోయి నట్లున్నారు.’’

మోటార్‌ సైకిల్‌ శబ్దం క్రమంగా దూరమైంది. రాజ్‌ ప్రియా మధ్య నిశ్శబ్దం. 10 నిమిషాలు.

‘‘ఇప్పుడైనా చెప్పు ప్రియా! ఎవరు నువ్వు?’’

‘‘ఓకే! రాజ్‌.! ప్రస్తుతం ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు. నిజం చెప్తాను. నేను ప్రధానమంత్రి విక్రమ్‌ రావు కుమార్తెని. నేను వీకెండ్‌ హాలిడేకి నీతో బయలుదేరి వచ్చేముందు ఆయన నాకు ఎంతో జాగ్రత్తలు చెప్పారు. నాకెప్పుడూ నా స్నేహితులతో తిరిగే స్వతంత్రం ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా భయంతో ఉన్నట్టు కనిపించారు. ‘జాగ్రత్త అమ్మా. నీ బాయ్‌ ఫ్రెండ్‌కి కూడా నువ్వు ఎవరో తెలియజేయొద్దు’ అని చెప్పారు. అదే సమయంలో ఆయన నాకు ఒక ఎలక్ట్రానిక్‌ పరికరం అనుకుంటాను ఇచ్చారు దాని పాస్వర్డ్‌ నాకు తెలుసు కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. జరిగిన ఈ అణుదాడి, దానికి సంబంధం ఏదో ఉండి ఉంటుంది. నన్ను రక్షించడం కోసమే ఆయన ఇది నాకు ఇచ్చి ఉంటారు. దాని ఉపయోగమేమిటో అర్థం కాలేదు.

నువ్వు సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుడివి కాబట్టి నీకు ఏమైనా తెలుస్తుందేమో.ముందు మనం అడవిలోని గెస్ట్‌హౌస్‌కి వెళ్లి ప్రయత్నిద్దాం.’’

రాజ్‌ ఆశ్చర్యానికి అంతులేదు. అతను తల పట్టుకుని ఓ అని చప్పుడు చేశాడు.

‘‘ప్రియా నువ్వు నన్ను కూడా కూడా నమ్మలేదా! ఇప్పటికీ ఆరు నెలలు వృథా అయిపోయింది. ఏది పరికరం చూద్దాం!’’

‘‘సాయంత్రం అయిపోయింది. మనం అడవికి చేరిపోయేసరికి చీకటి పడిపోతుంది. అక్కడ చూద్దాం దీని సంగతి.’’ అన్నది ప్రియా.

మిగతా వచ్చేవారం…

About Author

By editor

Twitter
YOUTUBE