A man in handcuffs sits behind a gavel waiting for the judge to render his decision.

కవులకు, కళాకారులకు, మేధావులకు, పోరాటవీరులకు జన్మనిచ్చిన భూమి అది… ఒక రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ను, అరవింద ఘోష్‌ను, నేతాజీ సుభాస్‌చంద్ర బోసును… ఒక శ్యామా ప్రసాద్‌ ‌ముఖర్జీని తీర్చిదిద్దిన నేల అది! కానీ, నేడు ఆ మట్టిలో ఆ వాసనలు రావడం లేదు… దేశ విభజన సమయంలో బెంగాల్‌కు ప్రధానిగా ఉండి, హిందువులపై ఊచకోతకు నాయకత్వం వహించి, సమర్ధించిన హుస్సేన్‌ ‌సుహ్రావర్ది వారసత్వమే కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. అవి క్షేత్రస్థాయిలో జరిగే  స్థానిక సంస్థల ఎన్నికలైనా, రాష్ట్ర స్థాయి లేక సార్వత్రిక ఎన్నికలు అయినా, లేదా కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తులకు వచ్చినా హింస అన్నది సర్వసాధారణ విషయంగా, అక్కడి అధికార పార్టీ నాయకుల హక్కుగా కొనసాగిపోతోంది. మొన్నటికి మొన్న, రేషన్‌ ‌పంపిణీ దగా కేసులో అనుమానితుడైన బ్లాకు స్థాయి తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు షాజహాన్‌ ‌షేక్‌ ఇం‌ట్లో సోదాల కోసం వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టొరేట్‌ (ఇడి) అధికారులపై జరిగిన హింస, ఆ భావనకే  అద్దం పడుతోంది.

గత అక్టోబర్‌లో అరెస్టు చేసిన రాష్ట్ర మంత్రి జ్యోతిప్రియొ మాలిక్‌కు, శంకర్‌ ఆధ్యాకు సన్నిహితు డైన బ్లాకు స్థాయి నాయకుడు షాజహాన్‌ ‌షేక్‌ ఇం‌టిని రేషన్‌ అ‌క్రమాల ఆరోపణలతో సోదాలు జరిపేందుకు జనవరి 5వ తేదీన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేష్‌ఖలి గ్రామానికి ఈడీ అధికారులు వెళ్లారు. అక్కడ రాజమహలు వంటి భవన సముదాయంలో సోదరులతో ఉన్న షాజహాన్‌ ‌షేక్‌, ‌వారు బయి• గేటుతీసి ప్రవేశిస్తుండగా, ప్రధాన ద్వారం కూడా తీయకుండా తన అనుచరులకు ఫోన్‌ ‌చేయడం, అందుకోసమే సిద్ధంగా ఉన్నట్టు వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు అక్కడకు చేరుకొని అధికారులపై, సీఆర్‌పీఎఫ్‌ ‌సిబ్బందితో కలబడడం, రాళ్లతో దాడి చేయడం జరిగిపోయాయి. ఈ దాడిలో ఈడీ వాహనాలు ధ్వంసం కాగా, రెయిడ్‌ ‌కోసం వచ్చిన ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రి పాలయ్యారు. చిత్రమైన విషయం ఏమిటంటే, ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే, షాజహాన్‌ ‌షేక్‌, అతడి ముగ్గురు సోదరులు ఇంటికి తాళం వేసి మాయం అయిపోవడం. ఈ వ్యవహారంలో ఈడీ లుకౌట్‌ ‌నోటీస్‌ను జారీ చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఈడీ బోంగాంవ్‌ ‌మాజీ మునిసిపల్‌ ‌చైర్మన్‌ ‌శంకర్‌ ఆధ్యా నివాసంపై, షేక్‌ ‌షాజహాన్‌ ‌నివాసంపై దాడులు నిర్వహిం చేందుకు వచ్చారు. షేక్‌ ‌షాజహాన్‌ ‌కేవలం తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌బ్లాకు స్థాయి నాయకుడే కాదు, ఉత్తర 24 పరగణాల జిల్లా పరిషత్తులో మత్స్య, పశు వనరుల అధికారి. రేషన్‌ ‌స్కాం కేసుగా చెప్పుకునే ఇందులో కొన్ని వందల కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యం లోనే నాటి రాష్ట్ర మంత్రి అరెస్టు అయ్యారు.

దాడి చేయడం, పారిపోవడం వంటి పరిణామా లన్నీ అంత వేగంగా ఎలా జరిగిపోయాయి? ఇందుకు సమాధానం కాంగ్రెస్‌ ‌నాయకుడు, బెర్హంపూర్‌ ఎం‌పీ అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధరి చాలా బాగా చెప్పారు. ‘‘బెంగాల్‌లో అధికారంలో ఉన్న పార్టీ అటువంటి వారి బాగోగులు చూసుకుంటు న్నప్పుడు ఈడీ• ఏమి చేయగలదు?’ అంటూ ‘ఇండి’ కూటమిలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌భాగస్వామి అయినప్పటికీ విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ఈడీ ఇడియట్‌ అం‌టూ ఆయన నిందించారు. ఈడీ• అధికారులపై అధికారంలో ఉన్న ప్రభుత్వ గూండాలు దాడి చేయడం అన్నది రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇవాళ వారిని కేవలం గాయపరిచారు, రేపు వారిని హత్య చేయవచ్చు కూడా. అలా జరిగితే, నేను ఏ మాత్రం ఆశ్చర్యపోను’’ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఆయన భారతీయ జనతా పార్టీపై కూడా సరిహద్దు పోరస్‌గా (కంచె లేకుండా, భదత్రలేని) ఉన్న సమస్యపై విరుచుకు పడ్డారు. ‘బీజేపీ ఎప్పుడూ రొహింగ్యాల విషయమై రగడ చేస్తుంటుంది… కానీ ఈ సమయమంతా ఎక్కడు న్నారు? హోం మంత్రిత్వ శాఖ ఎక్కడుంది? ఈ విషయంలో వార్తలు వెలువడిన వెంటనే వారు ధృవీకరణ రాజకీయాలు ప్రారంభించారు. ‘బాగోగులు చూసుకునే వారికి వ్యతిరేకంగా వారు ఏదో ఒక చర్య తీసుకోవా’లంటూ అధీర్‌ ‌రంజన్‌ ‌కోరారు.

దీనిపై పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్ర గవర్నర్‌ ‌సి.వి. ఆనంద బోస్‌ ‌కూడా తీవ్రంగా స్పందించారు. నిందితులు ఇప్పటికే సరిహద్దు దాటి ఉంటారనే ఆందోళనను వ్యక్తం చేస్తూ, వారిని తక్షణమే అరెస్టు చేసి, తీవ్రవాదులతో అతడికి సంబంధాలు ఉన్నాయని వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయమని అధికారులను ఆదేశించారు. ఒకవేళ షాజహాన్‌ ‌షేక్‌కు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నా మనం ఆశ్చర్య పోవలసింది ఏమీలేదు. ఎందుకంటే, ఒక బ్లాకు స్థాయి నాయకుడిపై ఈడీ దాడి జరుగుతుంటే, ఎటువంటి రెచ్చగొట్టే మాటలు, చేతలు లేకపోయినా, తమ నాయకుడి నుంచి ఒక్క ఫోన్‌ ‌కాల్‌ అం‌దిన వెంటనే వందలాది మంది తక్షణం స్పందించి వచ్చి వారిపై కలబడి గాయపరచడం అన్నది సాధారణ విషయం కాదు. దాదాపు 800 నుంచి 1000 మంది వరకూ అల్లరిమూకలు ఈడీ అధికారులను హత్య చేయాలన్న ఉద్దేశంతో దాడి చేశాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఒక వ్యవస్థీకృత సంఘటన అనేది లేకుండా ఇంత పెద్ద ఎత్తున వ్యక్తులు బయిటకు రావడమన్నది జరగదనేది మనకు తెలిసిన విషయమే. వీరిలో ఎంతమంది బాంగ్లా దేశీలు ఉన్నారన్న విషయాన్ని ఇప్పటికైనా అధికారులు తెలుసుకుంటే మంచిది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో మమతా బెనర్జీ నేతృత్వం లోని పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వం విఫలం అయిందని గవర్నర్‌ ‌బోస్‌ ‌విరుచుకుపడ్డారు. ఆయన గుర్తించవలసిన విషయం ఏమిటంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి మరీచక అనే విషయాన్ని. ఎందుకంటే, ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరగడం అనేది అక్కడ నిత్యకృత్యంగా మారింది.

కాగా, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్‌ ‌గంగోపాధ్యాయ్‌ ఈ ‌ఘటనను రాజ్యాంగ సంక్షోభంగా పేర్కొంటూ, గవర్నర్‌ ‌జోక్యంతో రాష్ట్రపతి పాలనను అమలు చేయాలని వ్యాఖ్యానించారని, అలాగే, సందేష్‌ఖలీలో పారామిలటరీ దళాలను మోహరించా లనే బలమైన అప్పీలు కూడా ఉందని, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ ‌కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు.

కేంద్ర అధికారులపై దాడులు కొత్త కాదు

రోజ్‌వాలీ చిట్‌ఫండ్‌ ‌కేసుకు సంబంధించి చిత్ర నిర్మాత శ్రీకాంత్‌ ‌మొహతా ఆఫీసుకు సీబీఐ బృందం 2019లో వెడుతున్నప్పుడు, వారిని కోల్‌కతాలోని కస్బా పోలీసు స్టేషన్‌ ‌వద్దే ఆపేశారు.

అదే సంవత్సరంలో తర్వాత కాలంలో, శారదా చిట్‌ఫండ్‌ ‌కేసులో అభియో గాలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీస్‌ ‌కమిషనర్‌ ‌పార్క్ ‌స్ట్రీట్‌ ‌నివాసానికి వెడు తున్న సీబీఐ బృందాన్ని కూడా అడ్డుకున్నారు. కుమార్‌ ‌నివాసం బయిట షేక్‌స్పియర్‌ ‌శరనీ పోలీసు స్టేషన్‌ ‌బృందం సీబీఐని అడ్డుకుంది. ఈ చర్యకు వ్యతిరేకంగా స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే స్వయంగా కోల్‌కొతా మైదానంలో 70 గంటలపాటు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీసు పదవికి కుమార్‌ను నియమించారు.

ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం, ఎన్నికలలో హింసకు అధికార పార్టీయే కారణ మంటూ బీజేపీ, ఇతర టీఎంసీ వ్యతిరేక పార్టీలు ఆరోపణలు చేశాయి. కలకత్తా హైకోర్టు సీబీఐ, జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ ఆర్‌సి)ను దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించింది. అయితే, జాతీయ మైనార్టీ కమిషన్‌ ‌వైస్‌ ‌చైర్‌పర్సన్‌, ఎన్‌హెచ్‌ఆర్‌సి బృంద సభ్యుడు అయిన అతీఫ్‌ ‌రషీద్‌ ‌కోల్‌కతా దక్షిణ శివారులో ఉన్న జాదవ్‌పూర్‌ ‌ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు దాడి జరిగింది.

బాలల హక్కుల ప్యానెల్‌కూ తప్పని తిప్పలు

ఏప్రిల్‌ 2023‌న బాలలహక్కుల సంరక్షణకు జాతీయ కమిషన్‌ (ఎన్‌సిపిసిఆర్‌) ‌కూడా పోలీసు దౌర్జన్యంపై ఆరోపణలు చేశారు. ఒక ఏడేళ్ల బాలికను, పొరుగువారు హత్య చేసిన ఉదంతంలో కోల్‌కొతాలోని తిల్‌జలా పోలీసు స్టేషన్‌లో హత్యకు సంబంధించిన వివరాలు పరీక్షిస్తున్నప్పుడు అక్కడి పోలీసులు తమపై దౌర్జన్యానికి దిగినట్టు బాలల హక్కుల సంస్థ అధిపతి ప్రయాంక్‌ ‌కానూంగో ఆరోపించారు. తనపై దాడి చేయడమే కాకుండా పోలీసు సిబ్బంది రహస్యంగా ఎన్‌సిపిసిఆర్‌ ‌దర్యాప్తును వీడియో రికార్డింగ్‌ ‌చేశారని ఆయన ఆరోపించారు.

గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర దినాజ్‌పూర్‌ ‌జిల్లాలో అత్యాచారానికి, అనంతరం హత్యకు గురైన 17 ఏళ్ల యువతి కుటుంబాన్ని కలుసుకునేందుకు వెళ్లినప్పుడు స్థానిక అధికారులు తనను అడ్డుకున్నారని కూడా కానూంగో ఆరోపించారు. ఆ సమయంలో అక్కడ నిషేధ ఉత్తర్వులను విధించామని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధించు కుంది. పశ్చిమ బెంగాల్‌ ‌బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ‌తమ జాతీయ సంస్థపైనే ప్రత్యారోపణలకు దిగింది. ఆ బాలిక హత్యపై జాతీయ సంస్థ రాజకీ యాలు చేస్తోందంటూ రాష్ట్ర సంస్థ విమర్శలకు దిగింది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికార పార్టీపై దుమ్మెత్తి పోసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవా లను కోవడం లేదు. ‘తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే’ అన్నట్టుగా ‘ఇండి’ కూటమిలో మా భాగ స్వామివి అయినా సీట్ల పంపకాల్లో వాటాలు కుదరడం లేదు కనుక నిన్ను వదలం అన్న చందంగా కాంగ్రెస్‌ ‌తీవ్రంగా దాడికి దిగింది. ఏదో ఒకరకంగా, మమతా బెనర్జీని ఇరుకున పెట్టి ఎన్నికల్లో తాము మరిన్ని సీట్ల నుంచి పోటీ చేయాలన్నది వారి వ్యూహంలా కనిపిస్తోంది.

ఇక బీజేపీ కేవలం రొహింగ్యాలు, శాంతిభద్రతల కార్డుపైనే పోటీ చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది. న్యాయవాది సుదీప్త దాస్‌గుప్తా ఈ విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తి గంగోపాధ్యాయ దృష్టికి తీసుకువెళ్లినప్పుడు, ఈ ఘటన గురించి తనకు తెలుసునని, ఒకవేళ అది జరిగి ఉంటే ఇడి అధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్‌ ‌దృష్టి పెట్టేలా చూడాలి అని వ్యాఖ్యానించి నట్టు వార్తలు వచ్చాయి.

ఈడీపై దాడి చేసిన అల్లరి మూకల్లో రొహింగ్యాలు కూడా ఉన్నారని సూచిస్తూ జాతీయ దర్యాప్తు ఏజెన్సీతో దర్యాప్తు మాత్రమే కాక మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి. షాజహాన్‌ ఇం‌టిపై దాడి చేసే సమయంలో ఇడి అధికారులు, సిఆర్‌పిఎఫ్‌ అధికారులపై దారుణంగా దాడి జరిగింది. జాతి వ్యతిరేక అల్లరి మూకల్లో రొహింగ్యాలు కూడా ఉన్నారని నా అనుమానం. కనుక ఈ అరాచకతను అణచివేసేందుకు తగిన చర్య తీసుకో వలసిందిగా కేంద్ర హోం మంత్రికి, బెంగాల్‌ ‌గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ సోషల్‌ ‌మీడియా పోస్ట్ ‌ద్వారా బెంగాల్‌ ‌ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్‌ ‌చేశారు. ఆమెకు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు. తమపై ప్రాణాంతక దాడి జరుగుతోందనని సాయం కోసం ఈడీ అధికారులకు ఫోన్‌ ‌చేశారు. ఎవరి రక్షణలో ఈ హింస సాగుతోంది? మమతా బెనర్జీ సంరక్షణలోనే అంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ ‌భాటియా విమర్శలు చేశారు. ఇండి కూటమిలో భాగస్వామి అయినా రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధరి కూడా విమర్శించారన్న విషయాన్ని ఆయన పట్టి చూపారు.

రాష్ట్రంలో పలుమార్లు ఇటువంటి హింసాత్మక ఘటనలు జరిగినా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. ఎంత ఎన్నికలు త్వరలోనే జరుగుబోతున్నా, ఇప్పుడు ఈ విషయంలో మమతా బెనర్జీ చర్య తీసుకుంటారని భావించడం అత్యాశే అవుతుందేమో!

డి. అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE