జనవరి 23 నేతాజీ జయంతి
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో విదేశాలలో సుక్షితులైన భారత జాతీయ సైన్యం బ్రిటిష్ ఇండియా మీద దండెత్తి రావడానికి అనువుగా ఉంటుందని, కాబట్టి ఈ కీలక సమయంలో జైలులో మగ్గిపోయేందుకు సిద్ధం కావద్దని సుభాస్‌చంద్ర బోస్‌కు సలహా ఇచ్చారు వినాయక్ దామోదర్ సావర్కర్. కలకత్తాలో ముస్లిం లీగ్ శ్రేణులను తనవైపు తిప్పుకోవడానికి సుభాస్‌చంద్ర హాల్‌వెల్ స్మారకస్తూపం కూల్చివేత ఉద్యమం ఆరంభించారు. ఈ స్తూపాన్ని 1760లో కొద్దికాలం మాత్రమే కలకత్తా ప్రెసిడెన్సీ గవర్నర్‌గా పనిచేసిన జి. హాల్‌వెల్ నిర్మించాడు. 1757 నాటి ప్లాసీ యుద్ధంలో జరిగిన బ్లాక్‌హోల్ ఉదంతంలో చనిపోయిన బ్రిటిష్ సైనికుల ‘త్యాగానికి’ గుర్తుగా ఇది నిర్మించారు. ఇది బ్రిటిష్ వారికి అనుకూలం. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు అవమానం. బ్లాక్‌హోల్ విషాదంగా పేరు పడిన ఆ ఉదంతం ఇది: సిరాజుద్దౌలా సేనకు దొరికిన ఈస్టిండియా కంపెనీ సైనికులు కొందరిని ఒక చీకటిగదిలో బంధించారు. వారంతా చనిపోయారు. కాగా, సావర్కర్ హెచ్చరించినట్టే బోస్‌ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆయన జైలు నుంచి తప్పించుకుని దేశం వీడి వెళ్లవలసి వచ్చింది. రెండో ప్రపంచయుద్ధంలో ఖైదీలుగా పట్టుబడ్డ భారతీయుల జాతీయసైన్యంతో విదేశీ గడ్డ మీద నుంచి బ్రిటిష్ ఇండియా మీద ఆయన దండయాత్ర ఆరంభించారు. ఈ పరిణామం క్రమాన్నీ, ప్రాధాన్యాన్నీ సావర్కర్ సరిగ్గా గుర్తించారు. అసలు బ్రిటిష్ వారు 1857 నుంచి జరుగుతున్న సైనిక తిరుగుబాట్లు వల్లనే భారత్ విడిచివెళ్లారు గాని, ఇతర పోరాటాల వల్ల కాదని సావర్కర్ ఉద్దేశం. ఈ రెండు అంశాలను సావర్కర్ ఈ వ్యాసంలో వివరించారు. చిత్రంగా హిందువులకు ప్రతినిధిగా సావర్కర్‌నే జిన్నా గుర్తించిన విషయం కూడా ఈ వ్యాసం ద్వారా తెలుస్తుంది. బ్రిటిష్ ఇండియా సైన్యంలో మన యువకులు చేరి, యుద్ధవిద్య నేర్చి ప్రభుత్వం మీద తిరగబడాలన్న సావర్కర్ వాదనలోని నిజం నేతాజీ చర్య ద్వారా వ్యక్తం కావడమే ఇక్కడ గమనించాలి.
జూన్ 22, 1940. నాటి దేశాభిమాని, నేటి నేతాజీ సుభాస్‌చంద్ర బోసు తలవనితలంపుగా బొంబాయిలో నన్ను కలుసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. హిందూ మహమ్మదీయ విభేదాలను శాశ్వతంగా పరిష్కరించాలనే స్థిర సంకల్పంతో ఆయన బొంబాయి వచ్చారు.
జిన్నాతో సంప్రతింపులకు వెళ్లడంతో సుభాస్ ‘‘గాంధీజీని గూడ త్రోసిరాజన్నాడు’’ అని వ్యాఖ్యా నించాయి పత్రికలు. నా యెదుటికి వచ్చి కూర్చోవడం తోనే ‘‘నాతో సంప్రతించడానికి జిన్నా అంగీకరించ లేదు. ఆయన ఉద్దేశం ప్రకారం మీరే హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారట. నేను కాదట’’ అన్నారు.
జైళ్లు నింపడంవల్ల ప్రయోజనం
ఆ విషయాన్నప్పటికి విడిచిపెట్టేశాం. నేను ఆయనను సూటిగా ప్రశ్నించాను. ‘‘ఒక్క విషయం చెప్పండి. బ్రిటిష్‌వాళ్లు యిప్పుడు పూర్తిగా యుద్ధం విషయంలో మునిగి వున్నారు. ఇలాంటప్పుడు మీవంటి గొప్ప నాయకులు ‘హాల్‌వెల్ స్మారకాన్ని తొలగించాలి’ వంటి చిల్లరమల్లర ఆందోళనలు లేవదీసి జైళ్లను నింపడంలో ప్రయోజనం యేమైనా వుందంటారా?’’
‘‘అది ప్రజానీకంలో బ్రిటిష్ వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి తోడ్పడుతుంది’’ అని ప్రత్యుత్తర మిచ్చారు సుభాస్‌బాబు. నేను దాని కంగీకరిస్తూ ‘‘అవును, అయితే ఈ బ్రిటిష్ వ్యతిరేకత బ్రతికి వుండి తమ నిరంకుశత్వంతో మన దేశంపై అధికారం చలాయించే వేలాది బ్రిటిష్‌వాళ్లవైపు గాక చచ్చిపోయిన హాల్‌వెల్ వంటి నిరంకుశ ప్రభువుల వైపు మళ్లడం వృథా కాదా’’ అన్నాను.
‘‘మీరు అంత చిన్న చిన్న వాటిని గురించి జైళ్లకు వెళ్లడంవల్ల శత్రువులకు చిక్కిపోతున్నారు. సుభాస్‌బాబూ! నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. మీకు సాయుధ విప్లవకారులతో ఎల్లప్పుడు సన్నిహిత సంబంధం వుండేది కదూ? సేనలను హిందువులతో నింపి తద్వారా హిందూ జాతిని పౌరుషవంతంగా చేయాలి, అని నేను తలపెట్టిన ఉద్యమం మీకు నచ్చుతుందనుకుంటాను. ఇట్టి ఉద్యమం విజాతీయ శక్తులకు బలం చేకూరుస్తుందని తదేకంగా దీనిని దుయ్యబట్టే కాంగ్రెసు నాయకులతో మీరు ఏకీభవిస్తున్నారని తెలిసే నేను మీతో ఈ సంగతి చెబుతున్నాను.’’
రాస్‌బిహారీతో తాదాత్మ్యం
ఈ సందర్భంలోనే నేను ఆయనకు మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన కొన్ని సంఘటనలను వివరంగా చెప్పాను. ఆనాడు జర్మనుల వల్ల దొరికిన మన భారత సైనికులనందరిని మన విప్లవవీరులు సంఘటితపరచి జర్మనులతో మైత్రి నెరపి ముక్తిసేనలను నిర్మించిన విధానాలను వివరించాను. ‘‘ఇటీవలనే రాస్‌బిహారీ బోస్ నాకు రాసిన ఉత్తరం ఈ సంవత్సరంలోగా జపాన్ యుద్ధం ప్రకటిస్తుందని సూచిస్తున్నది. అదే కనుక నిజమైతే అధునాతన పద్ధతులలో జపాన్, జర్మనీ, ఆయుధాలతో సుశిక్షితులై విదేశాలలోనుంటున్న వేలాది భారతీయులు బయట నుండి భారతదేశం మీదికి దండెత్తడానికి ఒక మహదవకాశం లభిస్తుంది. అలాంటప్పుడు మీ వంటి దేశ నాయకులు అల్పమైన అనవసరమైన క్షుద్రాందో ళనలో దిగి నిర్బంధితులై వుండటం దేశానికెంతో ప్రమాదకరం. మిమ్ము పట్టుకోవడానికని అధికారులు తెగ తిరుగుతున్నారు, క్షణమాత్రమైనా వృథా చేయకుండా దేశ సంరక్షణ కోసం రాస్‌బిహారీ బోస్ తదితర విప్లవవీరులతో మీరు ఏకం కావాలి. ఒక్కసారిగాని మీరు భారతదేశాన్ని దాటి బయటకి వెళ్లితే జర్మనీ ఇటలీ దేశాలలో వేలాది భారత యుద్ధ ఖైదీలకు బాహాటంగా నాయకత్వం వహించవచ్చు. మీ ప్రధాన లక్ష్యమైన భారతదేశ సంపూర్ణ స్వాతంత్య్రాన్ని నిరాఘాటంగా ప్రకటించవచ్చు.
జపాన్ యుద్ధరంగంలోకి దూకగానే బర్మా మీదుగా గాని బంగాళాఖాతం ద్వారాగాని లేక మీ ఇష్టం వచ్చిన మార్గంలో బ్రిటిష్ ఇండియాపై దండెత్తి రావచ్చు. నా దృష్టిలో ఈ మహత్తర కార్యాన్ని సాధించగల ధైర్యసాహసాలు శక్తి సామర్థ్యాలు కలిగిన మహావీరులు ఇద్దరో ముగ్గురో మాత్రమే వున్నారు, వారిలో మీరు ఒకరు’’.
మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నారు సుభాస్ బాబు. ‘‘కలకత్తాలో ఏం జరుగుతుందో ముందు చూడాలి. తర్వాత నేను నా కార్యక్రమాన్ని నిర్ణయించు కుంటాను’’ అని ప్రత్యుత్తరమిచ్చి వెళ్లిపోయారు.
అటు పిమ్మట
తర్వాత నేనూహించుకున్నట్లుగానే హాల్‌వెల్ ఉద్యమంలో ఆయన పాల్గొన్నట్లు, అందుకు గాను వారిని నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడైతే జైలుకి వెళ్లారో అప్పుడే ఆయన తన పథకాలన్నీ వదలుకోవలసి వచ్చింది. ఆ క్షణంలో ఆయన ముందున్న ఏకైక లక్ష్యం, ఎలాగైనా సరే జైలు నుంచి తప్పించుకొనే సాహసాన్ని ప్రదర్శించి జర్మనీకిగాని జపాన్‌కుగాని వెళ్లిపోవడం.
మనకు చేరిన వార్తలను బట్టి ఇదే ధృవపడింది. ఆయన జైలులో నిరశన వ్రతం పూనారు. అంతే కాదు, తన కప్రతిష్ట తెచ్చిపెడుతుందన్న శంకను గూడ లెక్కచేయక, ప్రపంచాన్ని సంభ్రమపరిచేట్టుగా రహస్యంగా తప్పించుకొని బయటపడ్డారు.
వీరసావర్కరుకు నేతాజీ అభినందనలు
జర్మనీలో ప్రవేశించగానే సుభాస్‌చంద్ర బోసు హిట్లరు, ముసోలనీలతో ఒప్పందం చేసుకొన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని ప్రకటించారు. ఆధునిక జర్మనీ యుద్ధ సామగ్రితో సుశిక్షితులైన భారత యుద్ధ ఖైదీలను సంఘటితపరచి, ముక్తి సేనలను నిర్మించారు. జర్మనీ సబ్‌మెరీన్లలో ప్రయాణంచేసి జపాన్ ఆక్రమిత సింగపూర్ భూభాగం చేరుకున్నారు. జపానీయుల సహాయంతో రాష్‌బిహారీబోస్ నిర్మించిన 50వేలమంది సుధృఢ సైనికులు గల భారత జాతీయసేనకు అధిపతి అయ్యారు. స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ‘ఛలో ఢిల్లీ’ అనే సింహగర్జనతో జయ నినాదంతో అస్సాం పొలిమేరలో బ్రిటిష్‌వారి నెదిరించి పోరాడారు. ఇదంతా ఎలా జరిగిందో చెప్పనక్కరలేదు.
నేను బ్రిటిష్ సేనలను హిందూ యువకులతో నింపివేయటంవల్లనే ఆధునిక యుద్ధసామాగ్రితో శిక్షణ పొందిన సుమారు 60 వేలకు పైబడ్డ సైనికులు గల సేనను నిర్మించడానికి, బోసుకు సాధ్యమయింది. ఈ విషయాన్ని సుభాస్‌బాబే స్వయంగా అంగీకరించారు. 1944 సం।। జూన్ 25వ తేదీన సింగపూర్ నుండి ఆజాద్ హింద్ రేడియోలో ప్రసంగిస్తూ స్వతంత్ర భారత సైన్యాధిపతి నేతాజీ ‘‘కాంగ్రెసుపార్టీ నాయకులందరు దూరదృష్టి లేకపోవడంవల్లనూ, తమ తప్పుడు రాజకీయ సిద్ధాంతాలవల్లనూ భారతసేనలోని సైనికులనందరిని విదేశీ తొత్తులని తూలనాడుతున్నపుడు వీర సావర్కరు ధైర్యంగా ముందుకు వచ్చి భారత యువకులంతా ప్రభుత్వసేనల్లో చేరాలని సలహా నివ్వడం వింటే ఉత్తేజాత్మకంగా వుంది.
తమంతట తాము సంతోషంగా సైనికులుగా చేరిన ఈ యువకులే మన స్వతంత్ర భారతసేనకు శిక్షితులైన సైనికులను సమకూర్చి పెట్టారు’’ అని స్పష్టం చేశారు.
భారత జాతీయసైన్య పురోగమనం
1964 ఆగష్టులో ప్రఖ్యాత జపాన్ గ్రంథకర్త శ్రీ జె.జె.సిపావా ‘‘జపానులోని ఇద్దరు ప్రఖ్యాత భారతీయులు’’, అనే ఒక పుస్తకాన్ని ప్రచురించారు. రాస్‌బిహారీ, సుభాస్‌చంద్ర బోసుల అంతర్జాతీయ విప్లవకార్యక్రమాలు ఆ పుస్తకంలో ఉన్నాయి.
ఒక దినచర్య రూపంలోనున్న ఆ పుస్తకంలో గ్రంథకర్త ఇలా రాశారు.
‘‘…. ఫిబ్రవరి. సింగపూరు మీద జపానీయుల దాడి ప్రారంభమైంది…’’ ‘‘… బ్రిటిష్‌వారి ఆధ్వర్యంలో భారత సేనల ప్రతిఘటన తీవ్రంగా వుంది. జపాన్ ఇంపీరియల్ గార్డ్సు ప్రధాన కార్యస్థానం చాలా దెబ్బతిన్నది.’’
‘‘…. భారత జాతీయ సైన్యాధిపతి ఒక్కరే ముందుకు నడిచారు. ఎదిరి సైన్యంలోని భారత అధికారులను, బ్రిటిష్‌సేనలో వున్న భారతీయులను ఉద్దేశించి భారతదేశం ఎడ వారి భక్తి ప్రపత్తులను వృథాచేయవద్దని, భారత స్వాతంత్య్రావశ్యకతను గూర్చి వారికి హృదయాలను కదలించేటట్లు మనసున బాగా నాటేటట్లుద్బోధించారు. అత్యద్భుత కార్యమొకటి సాధ్యమైంది. బ్రిటిష్‌వారి వైపున ఉన్న భారతసేనలు తుపాకులు క్రింద పెట్టాయి. ద్వితీయ ప్రపంచ సంగ్రామానికి గాను సావర్కరు నిర్దేశించిన సైనికీకరణ విధానం రూపొందడం ప్రారంభమైంది.’’
‘‘ఉత్తేజాత్మకమైన ఆయన ఉపన్యాసం ముగిసింది.
భారత సైనికుల జయజయ ధ్వానాలు మిన్నుముట్టాయి. ద్విగుణీకృతోత్సాహంతో వారందరు భారత జాతీయసేనలో చేరిపోయారు. జపాన్ ఇంపీరియల్ గార్డ్సు గూడా ఈ దృశ్యాన్ని చూస్తూ ఒక్కుమ్మడి నిశ్చేష్టులై పోయారు.’’
‘‘…సింగపూరు పతనం.’’
‘‘…. 45 వేలమంది బ్రిటిష్ సైనికులు భారతీయులతో సహా స్వాధీనమయ్యారు. ఈ భారతీయ సైనికులను, అధికారులను తనతో కలుపుకుని యాభైవేలకు మించిన సుదృఢ సైనికశక్తిగా భారత జాతీయసైన్యం విజృంభించింది.’’
ఈ భారత జాతీయసైన్యం మన దేశంపై దండెత్తుతున్నప్పుడే, అహింసా కాంగ్రెసు వాదులు గూడా దేశమందంతటా అహింసా విప్లవాన్ని లేవదీశారు. ‘‘భారతదేశాన్నుండి వైదొలగండి, కాని మీ సైన్యాలను మాత్రం ఇక్కడే వుంచండి’’ ఇదీ వీరి నినాదం.
ప్రజానీకం ఈ వివాదంలో మొదటి భాగం మాత్రమే విన్నారు. అసంబద్ధమైన, అధైర్యాన్ని పురికొల్పే ఆ రెండో భాగాన్ని వారు వినలేదు. పర్యవసానంగా దేశం మొత్తం అట్టుడికినట్టు ఉడికిపోయింది. దేశభక్తులనే కాంగ్రెసువాదులు వందలాదిగా నిర్బంధితులై జైళ్లను నింపివేశారు. కాని భారతదేశానికావల మనవారు విజృంభిస్తున్న తీరు ఈ కాంగ్రెసువాదువల్ల బుద్ధిపూర్వకంగా మరుగున పడింది. తమ అహింసాత్మక విధానం విఫలం కావడం అనుభవపూర్వకంగా తెలుసుకొని, తమను సాయుధ బలాలతో నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రతిఘటించడానికి తుదకువారు సాయుధ విప్లవపంథానే చేపట్టవలసి వచ్చింది.
వారందరు అజ్ఞాతవాసంలో వెళ్లారు. వెంటనే అహింసావాదుల రక్తపిపాసులైన విప్లవవీరులతో కూడిన కాంగ్రెసు రహస్య సంస్థగా పరిణమించింది.
బ్రిటిష్‌వారు ఎందుకు వైదొలగారు?
భారతదేశానికి బయట జాతీయసైన్యం తెస్తున్న వత్తిడి, లోపల కాంగ్రెస్ విప్లవవీరుల ప్రతిఘటన ఈ రెండింటి నడుమ ఇరుక్కొని బ్రిటిష్‌వారు సతమతమవుతున్న సందర్భంలో జపాన్‌లో మొట్ట మొదటిసారిగా అణుబాంబు బాంబు పడింది.
మిత్రమండలి వారి దిగ్విజయంతో యుద్ధం అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే ఆ విజయం బ్రిటిష్‌వారికి విజయంగా పరిణమించలేదు. యుద్ధం ముగిసేటప్పటికి భారతదేశానికి ప్రతిగా బ్రిటిష్‌వారి స్థితి ఈ క్రింది విధంగా వుంది.
- ఉన్న మూడు సైనిక శాఖలలోను దాదాపు భారతీయులందరు విప్లవం లేవదీశారు. ఇంకా ఇతరులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
- ప్రత్యేకంగా ప్రజల స్వాతంత్య్రోద్యమాన్ని అణచివేయడానికే తీసుకొచ్చిన బ్రిటిష్ సేనలతో 1857వ సంవత్సరం ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని నిరోధించారు. కాని ఇప్పుడు జపాన్, జర్మనీలు యుద్ధంలో ఓడిపోయినప్పటికీ సోవియట్ రష్యా రూపంలో ఇంకొక నూతన శత్రువు వారి నెదిరిస్తున్నాడు. కాగా అణుబాంబు (అమెరికా ప్రయోగించినది) శత్రువులకే గాకుండా, అమెరికా మిత్రకూటమిలో నున్న బ్రిటన్‌కు కూడా భయభీతులు కల్గించింది. కనుక భారతదేశం వంటి సంపూర్ణ బ్రిష్ వ్యతిరేకతతో విజృంభించే ప్రజాశక్తిని అణచడానికి, నిరంకుశత్వం చలాయించడానికి బ్రిటిష్ సేనలను పంపడం దుస్సాధ్యమైనది.
- భారతదేశంలో విజృంభిస్తూన్న ప్రజా విప్లవానికి బ్రిటిష్‌వారు లొంగక తప్పింది గాదు.
బ్రిటిష్ పార్లమెంటులో భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదిస్తూ అప్పటి ప్రధానమంత్రి అట్లీ, మాజీ ప్రధాని చర్చిల్ వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా ‘‘మన పోషణలోని సైన్యం ఎంత మాత్రం బ్రిటన్ పట్ల భక్తి విశ్వాసాలు కల్గి ఉండటం లేదు. భారతదేశాన్ని గుప్పిటలో ఉంచుకోవటానికి తగినంత పెద్ద సైన్యం ఇప్పుడు బ్రిటన్‌కు లేదు. కనుకనే బ్రిటన్ భారతదేశానికి అధికారాన్ని అప్పగిస్తున్నది’’ అన్నాడు.
ఈ ద్వంద్వమైన సైనిక బలహీనత బ్రిటిష్‌వారిని భారతదేశాన్నుండి వైదొలిగే పరిస్థితుల్ని తెచ్చిపెట్టింది. అంతేగాని వారి హృదయ పరివర్తనం మాత్రం దీనికి కారణం కాదు.
భారతదేశంలోనూ, బయటా 1906 నుండి 1947వరకు సాగిన జాతీయ అంతర్జాతీయ సైనిక విప్లవమే బ్రిటిష్‌వారిని లొంగ దీసిందన్న విషయం మన మెన్నటికి మరువగూడని సత్యం –
దురదృష్టవశాత్తు ఈ క్లిష్ట సమయంలో బ్రిటిష్ వారితో సంప్రదింపులు జరపడానికి ప్రజాప్రతి నిధులుగా ఎన్నికైనవారు మాత్రం మనోధైర్యం లేనివారుగా ఉన్నారు.
ఆ విప్లవవీరులు పదే పదే వీరిని హెచ్చరిస్తూన్నప్పటికీ –
భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చాటుకొంటున్న యీ దుర్బలుల దుశ్చర్యల వల్ల ‘క్విట్ ఇండియా’ ఉద్యమం, స్ల్పిట్ ఇండియా’కు అంటే దేశ విభజనకు దారితీసింది.
జరిగిందేదో జరిగిపోయింది. మనమీనాడు సాధించవలసిన దానిని మన తత్త్వానికి చెందిన శక్తి మీద ఆధారపడి రేపు పూర్తి చేద్దాం. ప్రస్తుతం మనం సాధించినది కూడా ఈ వెయ్యి సంవత్సరాల చరిత్రలో సాటిలేని విజయం – ఈనాడు కనీసం ముప్పాతిక మువ్వీసం భారతవర్షమైనా బ్రిటిష్‌వారి ఘోర శత్రువు నుండి బైటపడింది.
– 18.2.55, జాగృతి సంచిక నుండి