తెలంగాణలో ఉద్యోగాల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తోన్న నిరుద్యోగుల పరిస్థితి గత ప్రభుత్వం నిర్వాకంతో ఇంకా దీనంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి అప్‌డేట్స్ కని పించకపోవడం, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు పెద్దగా సాగకపోవడం యువకుల్లో నిరాశను నింపుతోంది. ఫలితంగా మున్ముందు జరగబోయే పోటీ పరీక్షల పరిస్థితి ఏమిటన్నది సందిగ్ధంగా మారింది.
టీఎస్‌పీఎస్సీ పరీక్షలు, ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగులు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మరో పదిరోజుల్లో గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉండగా..ఏర్పాట్లు చేస్తున్న సంకేతాలు మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా పరీక్షలు మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, రాజీనామాలతో పాటు.. పలు పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలను నిర్వహిస్తుందా? లేదంటే.. జాబ్ క్యాలెండర్ వైపే మొగ్గు చూపుతుందా? అనే ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణ, పలు పరీక్షల తేదీల ప్రకటనపై స్పష్టత కొరవడింది. గత ఏడాది వరుస నోటిఫికేషన్లు విడుదలైనా.. 2023 ఆరంభంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పలు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే..! మరికొన్ని పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేశారు. అయినా.. నియామకాల పక్రియ డోలాయమానంగా ఉంది. అప్పట్లో నిరుద్యోగులకు అండగా ఉండి.. పోరాటాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ మార్పులో నిరుద్యోగుల భాగస్వామ్యం కూడా కీలకంగా నిలిచింది. సీఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలతో పాలనను ఉరుకులు-పరుగులు పెట్టిస్తున్నట్లే, టీఎస్‌పీఎస్సీ విషయంలో కూడా త్వరితగతిన నిర్ణ యాలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గ్రూప్-2 పరీక్షకు పట్టుమని పదిరోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో.. షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందా? లేక తొలుత ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌నే కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తుందా? అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ మేరకు సర్కారు ముందుకెళ్తే.. ఫిబ్రవరి దాకా ఆగాల్సిందే. ఆలోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే.. మళ్లీ కథ మొదటికే అని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
ఇక, గ్రూప్-1 పోస్టులకు సంబంధించి చూస్తే.. అభ్యర్థుల భవిత కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది. 503 గ్రూప్-1 పోస్టుల కోసం మొదటిసారి 2022 అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌ను ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దు చేశారు. 2023 జూన్‌లో రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలలో లోపాలుండడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టు కెక్కారు. అధికారులు పొరపాట్లు చేశారని నిర్ధారించిన కోర్టు.. పరీక్షను రద్దు చేసింది. దాంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణకు రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును బట్టి గ్రూప్-1 పరీక్ష ఉంటుందా? రద్దవుతుందా? అనేది తేలుతుంది.
మరోవైపు.. గ్రూప్-2 వ్యవహారం చూస్తే.. షెడ్యూల్ ప్రకారం..2023 ఆగస్టు 29, 30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు, లీకేజీ నేపథ్యంలో నిరుద్యోగుల ఆందోళనతో నవంబరు 2, 3 తేదీలకు వాయిదా వేశారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడం, నవంబరు 3 నుంచి నామినేషన్ల పక్రియ కారణంగా పరీక్షలకు బందోబస్తు కుదరదని పోలీసుశాఖ పరోక్షంగా తేల్చిచెప్పడంతో ఆ పరీక్షలు 2024 జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేశారు. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా, 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజా తేదీలకు కేవలం 10 రోజుల వ్యవధే ఉంది. ప్రశ్నపత్రాల తయారీ విషయాన్ని పక్కనపెడితే.. పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల జారీకి కూడా సమయం పెద్దగా లేదు. దీంతో.. ఆ పరీక్ష మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
అటు.. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-3, గ్రూప్-4 ఫలితాలయితే పత్తా లేకుండా ఓయాయి.1,363 గ్రూపు-3 పోస్టుల నియామకానికి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైనా.. ఇప్పటికీ పరీక్షలను ప్రకటించలేదు. ఈ పోస్టులకు 5.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక లీకేజీ కారణంగా డివిజనల్ అకౌంట్స్ అధికారి ఉద్యోగాల పరీక్షలు రద్దయినా, తదుపరి పరీక్షల తేదీని ప్రకటించలేదు. అలాగే, 8,039 గ్రూప్-4 పోస్టుల కోసం పరీక్షలను నిర్వహించారు. గ్రూప్-1 మాదిరిగా తప్పులు చేయకుండా.. నిర్వహణలో లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఫైనల్ కీని కూడా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫలితాల విడుదలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. అయితే.. డిసెంబర్10, 2023న ఫలితాలను విడుదల చేస్తామంటూ ప్రకటన వెలువడ్డా.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
వీటితో పాటు.. మరికొన్ని పోస్టుల విషయంలోనూ ఫలితాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. 71 లైబ్రేరియన్ పోస్టులు, 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 1392 జూనియర్ లెక్చరర్ల పోస్టులు, 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, 185 వెటర్నరీ సర్జన్ల పోస్టులు, 175 టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టులు, 22 ఉద్యాన అధికారుల పోస్టులతో పాటు అకౌంట్స్ ఆఫీసర్స్, పాలిటెక్నికల్ లెక్చరర్లు, భూగర్భ అధికారులు, ఏఎంవీఐ, వ్యవసాయ అధికారుల పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించినా.. ఫలితాలను పెండింగ్‌లో పెట్టారు.
ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలు, నిర్వహించాల్సిన పరీక్షల షెడ్యూల్‌పై టీఎస్‌పీఎస్సీ స్పష్టత ఇవ్వడం లేదు. ఒక పక్క చైర్మన్, సభ్యుల రాజీనామాలతో టీఎస్‌పీఎస్సీలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మరో 10 రోజుల్లో గ్రూపు-2 పరీక్షలను నిర్వహించాల్సి ఉన్నా, అందుకు కమిషన్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలను నిర్వహించా లంటే.. ఇప్పటికే ప్రశ్నపత్రాలకు తుది రూపునివ్వడం, హాల్‌టికెట్ల జారీ, సెంటర్ల ఏర్పాటు వంటి చర్యలను తీసుకోవాలి. మరో పక్క ప్రభుత్వం కూడా కమిషన్ విషయంలో ఒక నిర్ణయానికి రావడం లేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. పాత, కొత్త నోటిఫికేష•న్లపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై నిరుద్యోగుల్లో చర్చలు సాగుతున్నాయి.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులు లింగారెడ్డి, కారెం రవీందర్‌రెడ్డి, ఆర్.సత్యనారాయణ రాజీనామాలను గవర్నర్ డా।।తమిళిసై సౌందర రాజన్ గారు ఇంకా ఆమోదించలేదు. కోట్ల అరుణ కుమారి, సుమిత్ర ఆనంద్ మాత్రం సభ్యులుగా కొనసాగుతున్నారు. రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో కమిషన్ మనుగడలో ఉన్నట్లా..? లేనట్లా..? అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. గవర్నర్ మరికొంతకాలం రాజీనామాలను పెండింగ్‌లో పెడితే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. గవర్నర్ నిర్ణయం తీసుకునేవరకు టీఎస్‌పీఎస్సీ కార్యకలాపాలు స్తంభించి పోతాయా? అనే చర్చ జరుగుతోంది. గవర్నర్ ఆ రాజీనామాలను పెండింగ్‌లోనే పెడితే.. ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయం ఉందని నిపుణులు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీలో చైర్మన్ సహా.. మొత్తం 11 మంది సభ్యులు ఉండాలి. చైర్మన్, ముగ్గురు సభ్యులు రాజీనామా చేయగా.. ఇద్దరు సభ్యులు కొనసాగు తున్నారు. మరో ఐదు పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ఐదు పదవులను భర్తీ చేసి.. వారిలో ఒకరిని ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగాల భర్తీ పక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ అంశం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.
-సుజాత గోపగోని,
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్