కొన్నిసార్లు చేసే పనులు అవి యాదృచ్ఛికమైనా లేక రోజువారీ కార్యక్రమాల్లో భాగమైనా వాటివల్ల కలిగే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. ప్రధాని నరేంద్రమోదీ జనవరి 3,4 తేదీల్లో లక్షద్వీప్‌లో జరిపిన పర్యటన సరిగ్గా ఈ కోవకు చెందిందే. ఆయన అక్కడ జరిపిన పర్యటనకు హేతువు ఒకటైతే, దీని పరిణామాలు భిన్నదృశ్యాన్ని ఆవిష్కరింపజేయడం విచిత్రం. ఇందుకు ప్రధాన కారణం ముగ్గురు మాల్దీవుల మంత్రులు!
వారి అనాలోచిత వ్యాఖ్యలు భారత్-మాల్దీవుల దౌత్య సంబంధాలు కుదుపునకు లోనయ్యేలా చేసి, చైనాను ఇరకాటంలోకి నెట్టి, ఇజ్రాయిల్ ఆగ్రహానికి కారణమైంది. ఇంతకూ ప్రధాని లక్షద్వీప్‌కు వెళ్లింది అక్కడ రూ.1150కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించ డానికి! ఇందులో అతిముఖ్యమైంది కోచి-లక్షద్వీప్ సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్. దీనివల్ల కోచితో లక్షద్వీపాల్లోని 11 దీవులకు నేరుగా సమాచార అనుసం ధానత ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లక్షద్వీప్‌కు ఇటువంటి సదు పాయం కలగడం ఇదే ప్రథమం! ఇంతటి ముఖ్యమైన ఈ అంశం మీడియాలో ప్రధానంగా చోటుచేసుకోక పోవడం ఒక విచిత్రమైతే, ప్రధాని లక్షద్వీప్ తీరంలో తాను విహరించిన ఫోటోలను అప్‌లోడ్ చేసిన తర్వాత, ఈ పర్యటనపై మాల్దీవుల మంత్రి మరియం షియునా మోదీని జోకర్‌గా, ఇజ్రాయిల్ దేశపు తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేయడం, మంత్రులు మహ్జూమ్ మజీద్, మల్షా షరీఫ్ కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేయడం, ఇందుకు ఇజ్రాయిల్ ఆగ్రహం, మాల్దీవుల అధ్యక్షుడు పర్యటిస్తుండటంతో ఇరకాటంలో పడినప్పటికీ చైనా దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడానికి యత్నించడం వంటి పరిణామాలు శరవేగంగా చోటుచేసుకున్నాయి. ఇంతకూ ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులకు వ్యతిరేకంగా మాట్లాడారా అంటే అటువంటిదేమీ లేదు. లక్షద్వీప్‌లో పర్యటించండి అంటూ దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వ్యాఖ్యానించారు. దీనివల్ల తమ దేశంలో పర్యాటకం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో హ్రస్వ దృష్టితో మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు అసలుకే మోసం తెచ్చాయి.
ప్రధాని వెళ్లడానికి కారణం
జనవరి 3, 4 తేదీల్లో మోదీ లక్షద్వీప్‌లకు వెళ్లడానికి ఒక కారణముంది. ఆగస్టు 15, 2019న ఆయన ఎర్రకోట నుంచి మాట్లాడుతూ లక్షద్వీప్‌కు వెయ్యి రోజుల్లోగా ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్‌ను కల్పిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత రెండు నెలలకు మంత్రివర్గ ఆమోదం లభించింది. కొవిడ్ కారణంగా పనులు ఆలస్యమైనప్పటికీ ఇప్పటికి ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ కనెక్షన్ వచ్చింది. దీన్ని ప్రారంభించడానికి మోదీ అక్కడకు వెళ్లారు. ఇదీ అసలు సంగతి! నిఘాకు కీలకమైన ప్రదేశం లక్షద్వీప్. కొచ్చి (కొచ్చిన్)కి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్షద్వీప్ సమాచార పరంగా ప్రధాన భూభాగంతో అనుసంధానించే పక్రియ ఇది. ఇందులో టూరిజం అభివృద్ధి ఒక భాగం మాత్రమే. దీన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడ స్నార్కెలింగ్ చేశారు. ఇది ఒక తరహా డైవింగ్. స్నార్కెల్ అనే ట్యూబ్, డ్రైవింగ్ మాస్క్ వేసుకొని సముద్రం అడుగున ఈత కొడుతూ అక్కడి జీవరాసులను వీక్షించవచ్చు. దీంతోపాటు అక్కడి బీచ్‌ల్లో ఆయన విహరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసూయకు గురైన మాల్దీవుల మంత్రులు విపరీత వ్యాఖ్యలు చేశారు. ఇవి వివాదం సృష్టించిన నేపథ్యంలో లక్షద్వీప్ టూరిజం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.
రూ.1150కోట్ల అభివృద్ధిపనులు
లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని ప్రారంభించిన అభివృద్ధి పనుల విలువ రూ.1150 కోట్లు. ఇవి టెక్నాలజీ, విద్యుత్, నీటి వనరులు, ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించినవి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది కొచి-లక్షద్వీప్ సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ (కె.ఎల్.ఐ-ఎస్.ఒ.ఎఫ్.సి) ప్రారంభం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి లక్షద్వీప్ భారత ప్రధాన భూభాగంతో కె.ఎల్.ఐ- ఎస్.ఒ.ఎఫ్.సి. ద్వారా అనుసంధానమైంది. దీనివల్ల ఇప్పుడున్న దానికంటే వందరెట్ల వేగంతో ఇంటర్నెట్ సదుపాయం లక్షద్వీప్ వాసులకు అందుబాటులోకి వస్తుంది. సమాచార మౌలిక సదుపాయాల రంగంలో లక్షద్వీప్‌లో ఓఎఫ్‌సీ విప్లవాత్మక మార్పు తీసు కొచ్చింది. అంతకు ముందు కేవలం ఉప గ్రహ వ్యవస్థ ద్వారా మాత్రమే లక్షద్వీప్‌కు కమ్యూనికేషన్ సదుపాయం ఉండేది. అదీ పరిమితమైన బ్యాండ్ విడ్త్‌తో ఉండటంవల్ల పెరుగుతున్న డిమాండ్‌కు, అందుబాటులో ఉన్న సదుపాయానికి పొంతన ఉండేది కాదు. ప్రస్తుతం ఎస్‌ఓఎఫ్‌సీ అందుబాటు లోకి రావడంతో పదకొండు ద్వీపాలు కవరత్తి, అగత్తి, అమితి, కద్మత్, ఛట్లెట్, కల్పెనీ, మినుకోయ్, అండ్రోత్, కిల్టన్, బంగారం, బిట్రా ద్వీపాలు, కోచితో నేరుగా సమాచార సదుపాయాన్ని పొందుతాయి. ఈ ప్రాజెక్టుకు అయిన మొత్తం ఖర్చును టెలికమ్యూనికేషన్ శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ భరించింది. గ్లోబల్ టెండర్ ప్రాతిపదికన ఎన్‌ఈసీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ పనులను పూర్తిచేసింది. అయితే ఈ ప్రాజెక్టును అమలు చేసింది ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్.
వెల్లువెత్తిన నిరసనలు
మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో భారతీయుల్లో ఆగ్రహం పెల్లుబికింది. సోషల్ మీడియా ద్వారా వారు తమ నిరసనలను తెలియజేయడమే కాదు బాయ్‌కాట్ మాల్దీవుల ఆన్‌లైన్ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మనదేశానికి చెందిన ప్రముఖులతో పాటు, వాణిజ్యవేత్తలు కూడా తమ అభిప్రాయాను మార్చుకోవడం మొదలుపెట్టారు. చివరకు ఈజ్ మై ట్రిప్ విమానాల బుకింగ్‌ను నిలిపేసింది. దాదాపు పదివేల హోటల్ బుకింగ్స్, ఐదువేల ఫ్లైట్ బుకింగ్స్ రద్దయినట్లు సోషల్ మీడియాలో ప్రచారమైంది. దీంతో అక్కడి మాల్దీవ్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (మాటి) ఈజ్ మై ట్రిప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్లీ తమ దేశానికి బుకింగ్స్ తెరవాలని కోరింది. తమ నేతలు కొందరు చేసిన విచారకర వ్యాఖ్యలు, దేశ ప్రజల అభిప్రా యం కాదని స్పష్టంచేయడమే కాదు, తమ దేశ పర్యాటకరంగ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకమన్న సంగతిని గుర్తుచేసింది. ఇదిలావుడగా మాల్దీవుల పర్యాటక శాఖ ఇటీవల విడుదల చేసిన జాబితా ప్రకారం 2023లో ఈ ద్వీప దేశాన్ని అత్యధికంగా సందర్శించింది భారతీయులే. వీరి సంఖ్య 2,09,198 కాగా 2,09,146తో రష్యా రెండో స్థానంలో ఉంది. 1,87,118తో చైనా మూడో స్థానంలో ఉంది. 2022లో కూడా మాల్దీవులను అత్యధికంగా 2,40,000 మంది భారతీయులు సందర్శించారు.198,000తో రష్యా రెండో స్థానాన్ని, 177,000తో బ్రిటన్ మూడోస్థానంలో నిలిచింది. మాల్దీవులకు భారత పర్యాటకులు ఎంత ముఖ్యమో ఈ సమాచారం వెల్లడిస్తుంది.
మారని మొయిజ్జూ
ఇంత జరుగుతున్నా చైనాలో ఐదురోజుల పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జూ వ్యవహారశైలిలో మార్పు కనిపించకపోవడం గమనార్హం. ప్రస్తుతం నెలకొన్న వివాదం నేపథ్యంలో చైనా తన దేశం నుంచిపెద్ద మొత్తంలో పర్యాటకును మాల్దీవులకు పంపాలని కోరడమే ఆయన వైఖరికి నిదర్శనం. ఫ్యూజియన్ ప్రావిన్స్‌లోని బిజినెస్ ఫోరమ్ సమావేశంలో మాట్లాడుతూ చైనా తమకు అత్యంత సన్నిహిత అభివృద్ధి భాగస్వామిగా పేర్కొనడంతో పాటు, బెల్ట్ అండ్ రోడ్‌ను పొగడ్తతో ముంచెత్తాడు. కేవలం దీనివల్లనే మాల్దీవుల్లో ఎన్నడూ లేని రీతిలో మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయని చెప్పాడు. కొవిడ్-2019కి ముందు మాల్దీవు మార్కెట్‌లో చైనా అగ్రస్థానంలో ఉండేదని, దాన్ని మళ్లీ పునరుద్ధ రించడానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవ డానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఫోరం సమావేశంలో పేర్కొనడం గమనార్హం. ఇదే సమయంలో తమ దేశంలో చైనా పర్యాటకుల సంఖ్య తగ్గిపోందని, వీరి సంఖ్యను మరింతగా పెంచాలని కోరాడు. ఇదిలావుండగా మొయిజ్జూ చైనా పర్యటన సందర్భంగా మాల్దీవుల్లో పర్యాటక అభివృద్ధి కోసం రెండు దేశాల మధ్య 50మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరిందని మాల్దీవుల మీడియా వెల్లడించడం గమనార్హం. మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో అధ్యక్షుడు మొయిజ్జు దిగిపోవాలన్న డిమాండ్లు దేశంలో జోరందుకున్నాయి. ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పార్లమెంటరీ మైనారిటీ నేత అలీ అజీం పిలుపు నివ్వడం కొసమెరుపు. అయితే మొహమ్మద్ మొయిజ్జు త్వరలో అంటే జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మనదేశంలో అధికార పర్యటన జరిపే అవకాశాలున్నాయి. గత ఏడాది యూఏఈలో జరిగిన పర్యావరణ సదస్సులో భారత ప్రధాని మోదీతో, మొయిజ్జు భేటీ అయినప్పుడు ఢిల్లీ పర్యటనపై చర్చజరిగినట్టు తెలుస్తోంది.
లక్షద్వీప్‌పై పెరిగిన క్రేజ్
మోదీ పర్యటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్‌పై ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయంది. ఈ ప్రాంతం గురించి ఇంటర్నెట్‌లో విపరీతంగా వెతికేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్‌ల గురించి ఇంటర్నెట్‌లో వెతికేవారి సంఖ్య ఒకేసారి 3400 రెట్లు పెరిగింది. ప్రస్తుతం లక్షద్వీప్‌లో పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చినట్లయితే అందుకు తగిన సౌకర్యాలు ఇంకా ఏర్పడలేదు. పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి వుంది. ఇప్పుడు లక్షద్వీప్‌లో ఐదు నక్షత్రాల హోటల్స్, విమానా శ్రయం మెరుపు వేగంతో ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో తాజ్ బ్రాండ్ కింద లక్షద్వీప్‌లో రిసార్టులు నెలకొల్పడానికి టాటా గ్రూప్ నిర్ణయించింది. తాజ్ సుహెలీ, తాజ్ కద్‌మత్ బ్రాండ్‌ల ద్వారా దేశ, విదేశీ టూరిస్టులను ఆకర్షించాలని భావిస్తోంది. కేరళ తీరం నుంచి 200 -300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్షద్వీప్ అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. ప్రస్తుతం పది దీవుల్లో మాత్రమే జనాభా ఉన్నారు. మిగిలిన 17 దీవులు నిర్మానుష్యంగా ఉంటాయి. కొచ్చిన్ నుంచి ఇక్కడకు విమాన రాకపోకలున్నాయి. ఇక్కడి జనాభా మొత్తం ముస్లింలే. మలయాళం యాసలో మాట్లాడతారు. ఒకప్పుడు పల్లవుల పాలనలో కొనసాగిన ప్రాంతంగా చెప్పే లక్షద్వీప్‌లో ప్రస్తుత జనాభా 70వేలు. మలయాళం, జెసేరీ, తమిళం, మలయాళ యాసతో అరబిక్, మహ్ల్ భాషలు ఇక్కడ వాడుకలో ఉన్నాయి. ప్రధానంగా మలయాళం, అరబిక్ సంస్కృతి ఇక్కడ వ్యాప్తిలో ఉంది. ఇవి మాల్దీవుల్లోని చాగోస్ దీవులను పోలి వుంటాయి. మాల్దీవులు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
మినికోయ్‌లో విమానాశ్రయం
లక్షద్వీప్‌లో మౌలిక సదుపాయల అభివృద్ధిలో భాగంగా మినికోయ్ దీవుల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫైటర్ జెట్లు, సైనిక రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లతోపాలు వాణిజ్య విమానాల నిర్వహణ సామర్థ్యం వుండేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలన్నది కేంద్రం లక్ష్యం. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలకు బేస్‌గా పెరుగుతున్న పైరసీని అరికట్టేందుకు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ఇది మరింత వెసులుబాటు కలిగి స్తుంది. ప్రస్తుతం లక్షద్వీప్‌లో అగట్టిలో మాత్రమే విమానాశ్రయం ఉంది. మినికోయ్ లో విమానాశ్రయం వస్తే పర్యాటకం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. మాల్దీవులకు కేవలం 564 కిలోమీటర్ల దూరంలో వున్న మినికోయ్ ద్వీపంలో ఇప్పుడు అతిపెద్ద నేవెల్ బేస్ రాబోతున్నది. ఈ మార్గంలో ప్రతి నిముషానికి 12 ఓడలు ప్రయాణిస్తాయంటే ఈ ప్రాంతం వాణిజ్యపరంగా ఎంతటి ప్రాధాన్యం కలిగిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.
దెబ్బతిన్న చైనా వ్యూహం
మాల్దీవుల్లో భారత బలగాలను తొలగించి తన సైనికులను ఉంచాలన్న చైనా వ్యూహానికి మాల్దీవుల మంత్రుల అనాలోచిత వ్యాఖలతో దెబ్బ బలంగానే తగిలింది. లద్దాక్, అరుణాచల్ ప్రదేశ్‌లో భారత బలగాలను అత్యధిక సంఖ్యలో మోహరించేలా చేయడం ద్వారా డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచకుండా చేయాలన్న వ్యూహాన్ని అమలుపరుస్తోంది. ఇందువల్ల తాను కూడా నష్టపోతున్న సంగతి వేరేమాట. అయితే ఇప్పుడు మాల్దీవుల మంత్రులు చేసిన నిర్వాకంతో లక్షద్వీప్‌లో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయం వల్ల చైనాకు మొదటికే మోసం వచ్చినట్లయింది. హిందూ, అరేబియా మహాసముద్రాల్లో మన నిఘా మరింత పెరగనుండటం, ఆ దేశానికి మరింత ఇబ్బందికరం. అండమాన్ నికోబార్ ఐలాండ్ వద్ద మనకు ట్రైసర్వీస్ కమాండ్ ఉంది. ఇప్పుడు లక్షద్వీప్‌లో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుతో అరేబియా సముద్రంపై మన నిఘా మరింత పెరుగుతుంది.
మాల్దీవుల మాట ఎట్లా ఉన్నా మోదీ రాజతంత్రం ఇప్పుడు చైనా తలపట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టింది. రాజకీయ చదరంగంలో ఇది అద్భుతమైన ఎత్తుగడ అని ఆనంద్ మహీంద్రా పేర్కొనడంలో ఇంతటి నిగూఢ అంతరార్థం దాగివున్నదని అర్థం చేసుకోవాలి. జనవరి 12వ తేదీతో మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ఐదురోజుల చైనా పర్యటన ముగుస్తున్న నేపథ్యంలో చైనా ఒక ప్రకటన చేస్తూ, మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తు న్నామని, మాల్దీవుల సార్వ భౌమత్వం, స్వాతంత్య్రానికి తమ మద్దతుంటుందని పేర్కొనడం వెనుక, మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను ఉపసంహ రించుకుంటే, తమ సైనికులు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారన్న అర్థం దాగివుంది.
మోదీ ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యను చైనా పేర్కొన్నట్టు విశాల దృష్టితో ఆలోచించడం ఎలా సాధ్యం? నీతులు ఒకరికి చెప్పడానికి తప్ప తనకు వర్తించవన్న చైనా వైఖరికి ఇది నిదర్శనం. మాల్దీవులను సమాన భాగస్వామిగా పరిగణిస్తాం తప్ప, ఢిల్లీకి దూరంగా ఉండాలన్నది తమ అభిమతం కాదని గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో చెప్పిన సుద్దులు పైపైన చెప్పేవి మాత్రమేనన్నది సుస్పష్టం. చైనాను నిందించడం మానమంటూ పేర్కొంది. అసలు చైనాను ఎవరు నిందించారు? లక్షద్వీప్‌లో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి, చైనాను నిందించడానికి సంబంధ మేంటి? విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో చైనా సలహాలు మనదేశానికి అవసరంలేదు. మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు చైనా పర్యటనలో ఉండగా గ్లోబల్ టైమ్స్‌లో ఈవిధమమైన వ్యాఖ్యలు రావడం గమనార్హం.
నిజానికి చైనాను నమ్ముకున్న ఏదేశం బాగుపడ్డ దాఖలాలు లేవు. శ్రీలంక, నేపాల్ దేశాలు చైనా పంచన చేరి తీవ్రంగా నష్టపోయాయి. పాక్ పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు భూటాన్ పరిస్థితీ ఇదే చందంగా మారింది. భారత్ ఎంత చెప్పినా వినకుండా చైనాకు సన్నిహితంగా మెలగాలని ప్రయత్నించినందుకు ప్రతిఫలం ఏంటంటే, సాంస్కృతికంగా అత్యంత విలువైన బెయుల్ ఖెన్‌పజాంగ్ ప్రాంతంలోని భూటాన్ రాజు భూములను చైనా కబ్జా చేసి అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టింది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన ఉత్తర, పశ్చిమ, నైరుతి ప్రాంతాలోని భూములను సలామీ స్లైస్ పద్ధతిలో ఆక్రమిస్తోంది. భూటాన్ నెత్తీనోరూ బాదుకున్నా ఫలితం లేదు.
అనవసరంగా ఇజ్రాయిల్‌ను…
పప్పెట్ ఆఫ్ ఇజ్రాయిల్ ఇన్ లైఫ్ జాకెట్ అంటూ మాల్దీవుల మంత్రి మరియం ఎక్స్‌లో పేర్కొనడం ద్వారా ఇజ్రాయిల్‌ను అనవసరంగా లాగింది. మాల్దీవులకు ఇజ్రాయిల్‌కు పడదు. ఇజ్రాయిల్ పౌరులను మాల్దీవులు బ్యాన్ చేసింది. ఇజ్రాయిల్ ప్రభుత్వం కూడా మాల్దీవులకు వెళ్లవద్దని తన పౌరులకు ట్రావెల్ అడ్వయిజరీ విడుదల చేసింది. రెండు దేశాల మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంబంధాలను, మోదీపై చేసిన వ్యాఖ్యలు మరింతగా దిగజార్చాయి. ఇది జరగడానికి కొద్దిరోజుల క్రితం భారత్, ఇజ్రాయిల్ నుంచి నిపుణులను పిలిపించి, లక్షద్వీప్‌లో డిశాలినేషన్ చేసే ప్రాజెక్టును అప్పగించారు. అంటే మంచినీరుగా మార్చే పక్రియ. మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును ఇజ్రాయిల్ నిపుణులు తక్షణమే చేపట్టారు. ఇది పూర్తయితే లక్షద్వీప్‌లో తాగునీటి సమస్య తీరి, పర్యాటకం ఊపందుకోగలదు.
-జమలాపురపు విఠల్‌రావు,
సీనియర్ జర్నలిస్ట్