భారతదేశం మూడు శతాబ్దాలపాటు పారతంత్య్ర కుతంత్రాల్లో అలమటించింది. బ్రిటీష్ వారి కుటిల దాస్య శృంఖలాల్లో మగ్గింది. భారతీయులు స్వాతంత్య్రరహిత జీవనాన్ని భరించలేకపోయారు. పారతంత్య్ర జీవనాన్ని అనుభవిస్తున్న భారతీయులకు వీరసావర్కర్ మాటలు స్ఫురించాయి. ‘‘పక్షి బంగారు పంజరంలో బంధించబడి జీవించడం కన్నా స్వేచ్ఛారణ్యాల్లో విహరించడం మిన్న’’ అనే భావన భారతీయుల్లో ఆలోచన రేకెత్తించింది. వారిలో జాతీయతా భావాలు పొటమరించాయి. బ్రిటీష్ దమననీతిని ఖండిస్తూ, వారి పాలనకు చరమగీతం పాడేందుకు జాతీయోద్యమానికి సంసిద్ధులయ్యారు.
సాహిత్యం సమాజానికి దర్పణం వంటిదని షెల్లీ చెప్పారు. ‘‘కవులు ఎన్నుకోబడని జాతి చరిత్రకు శాసనకర్తల వంటి వారన్న’’ షెల్లీ అభిప్రాయం యథార్థం. ఒక దేశాన్ని నిర్మించడంలో కవుల పాత్ర మహత్తరమైనది. రూసో, వాల్టేర్‌ల రచనలు ఫ్రెంచ్ విప్లవానికి దారితీసాయి. టాల్‌స్టాయ్, మాక్సిమ్ గోర్కీ, బ్రోస్టావిస్కీ ప్రభృతుల రచనలు రష్యా ప్రజల్లో అద్భుతమైన మార్పును తెచ్చాయి. ఆ సంఘటనల స్ఫూర్తితో తెలుగు కవులు పారతంత్య్ర ఛేదకంగా, స్వాతంత్య్ర సాధకంగా తమ కలాలను ఝళిపించారు. తమ రచనల ద్వారా ప్రజల హృదయాల్లో జాతీయోద్యమ భావాలను ప్రేరేపించారు.
తొలి జాతీయోద్యమ కవి చిలకమర్తి
బ్రిటిష్ వ్రారు విభజించి పాలించే విధానంలో 1905లో బెంగాల్‌ను రెండు ముక్కలు చేయడంతో భారతీయుల గుండెలు భగ్గుమన్నాయి. బిపిన్ చంద్రపాల్ దక్షిణ భారతదేశంలో ప్రముఖమైన పట్టణాల్లో ప్రేరణాత్మక ప్రసంగాలు చేసి, ప్రజలను ఉత్తేజపరచి, జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించాడు. అందులో భాగంగా ఆంధ్రదేశంలో మచిలీపట్టణం, విశాఖ పట్టణం, రాజమండ్రి వంటి పట్టణాల్లో ఉపన్యాసాలు చేశాడు. 1907వ సంవత్సరం ఏప్రిల్ 5,6,7 తేదీల్లో రాజమండ్రిలో ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలను చేశాడు. ఆ ఉపన్యాసాలను ప్రముఖ తెలుగుకవి చిలకమర్తి అనువదించారు. చివరిరోజు సభలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ దురాగతాలను, దోపిడీ విధానాన్ని జాతీయతాస్ఫోరకంగా, చైతన్య ప్రేరకంగా, ఆశువుగా ‘‘భరత ఖండంబు చక్కని పాడి ఆవు / హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ / తెల్లవారను గడుసరి గొల్లవారు / పితుకుచున్నారు మూతులు బిగియబట్టి’’ అని చెప్పారు. చిలకమర్తి పలుకులు కమ్మని కలకండ పలుకుల్లా, అమృతపు గుళికల్లా ప్రజలను ఆకర్షించాయి. భారతమాతను పాడి ఆవుతో, భారతీయ సంపదను పాడితో, హిందువులను లేగలతో, వారనుభవించే కష్టాలను లేగదూడల ఏడ్పుతో వర్ణించారు. తెల్లవారిని ‘గడుసరి గొల్లవారు’ అనడం వల్ల వారి నిర్దాక్షిణ్య , కాఠిన్యాన్ని, సంపదను కొల్లగొట్టడాన్ని సూచించారు. మూతులు బిగియబట్టి అనే పదబంధం వల్ల సమకాలీన స్వాతంత్య్రరహితమైన దుస్థితిని వ్యక్తపరచాడు. అప్పట్లో ఈ పద్యం తెలుగు ప్రజల నాలుకలపై నాట్యం చేసింది.
దేశాభిమానరహితులైన కొందరు పండితులు బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ పద్యంలో చిలకమర్తి తెల్లవారిని గొల్లవారితో పోల్చి అభిశంసించాడని చెప్పి, జైలుశిక్ష విధించేట్లు చేశారు. దేశాభిమానులైన మరికొందరు పండితులు బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ పద్యంలో చక్కని విరుపుతో, ‘తెల్లవారన్ గడుసరు గొల్లవారు’ అనే అర్థంచెప్పి అందులో నిందార్థమేదీ లేదని నిరూపించి జైలునుంచి విడిపించారు. చిలకమర్తి పద్యాన్ని తెలుగులో తొలి జాతీయ కవితగా విమర్శకులు గుర్తించారు.
బ్రిటిష్ వారు దమననీతితో, జాతీయోద్యమంలో పాల్గొన్న దేశభక్తులను జైల్లో పెట్టేవారు. చిలకమర్తి వారు కారాగారవాసాన్ని లెక్క చేసేవారు కాదు. లాలా లజపతిరాయ్‌ను నిర్బంధించి జైల్లో ఉంచిన సందర్భంగా భారతదేశపు స్థితి ఒక కారాగారంగా ఉందని వర్ణిస్తూ ‘‘భరతఖండంబె ఒక గొప్ప బందిఖాన / అందులోనున్న ఖైదీలు హిందుజనులు / చెరయంచు వేరెగలదె!’’ ఒక్క గదినుండి మార్చె వేరొక్క గదిని/ పెట్టుటే కాక చెరయంచు వేరెగలదె!’’ భారతీయులు బానిసత్వంలో ఎంత బాధపడ్డారో, పారతంత్య్రం వల్ల ఎంత కుమిలిపోయారో భరత ఖండంబె ఒక గొప్ప బందెఖాన అనే పాదం వల్ల వ్యక్తమవుతుంది. చిలకమర్తి వారి వేదన ఈ పద్యంలో గమనార్హం. స్వాతంత్య్ర భావనాకాంక్షితులు, దేశాభిమాన దీక్షితులైన వారికి చెరసాలలు చంద్ర శాలలుగా, అరదండలు, విరిదండలుగా, చోడంబలె పరమాన్నంగా మోటుకంబళ్ళు పట్టుసెల్లాలుగా భాసిస్తాయని చెప్పి, కారాగార భీతులను దేశాభిమాన దీధితులుగా ప్రబోధించారు. తొలి జాతీయో ద్యమకవిగా చిలకమర్తి ఎందరో కవులకు స్ఫూర్తిని కలిగించారు.
విశ్వమానవ జాతీయగీతం
గురజాడ దేశభక్తి ఖండిక
గురజాడ వారి దేశభక్తి ఖండిక ఆయన జాతీయ దృక్పథానికి, విశాల దృష్టికి, అభ్యుదయ కాముకతకు, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి స్వర్ణపతాక. ప్రజాకవిగా సరళమైన పదాలతో ముత్యాలసరాల గేయ చంధస్సుతో జనసామాన్యానికి దేశభక్తి ప్రబోధం కలిగించారు. ‘‘ఈ గేయం బంకించంద్రుని వందేమాతరం, రవీంద్ర కవీంద్రుని జనగణమన వంటిదన్న’’ విషయం అక్షరసత్యం. ఆ గీతాల్లో లేని విశాల దృక్పథం గురజాడ గేయంలో కనిపిస్తుంది. ఇందులో ఎక్కడా ప్రత్యేకించి ఒక్క భారతదేశానికి మాత్రమే సంబంధించిన ప్రశంస లేదు. ఏ దేశం వారికైనా దేశభక్తిని ప్రబోధించే విధంగా ఉంది. అందుకే ఇది విశ్వమానవ జాతీయగీతం అన్న సినారె అభిప్రాయం సమంజసంగా ఉంది. ఈ గీతంలో ‘‘దేశాభిమానం / నాకు కద్దని / వట్టి గొప్పలు చెప్పబోకోయ్ / కూడి ఏదైనా / గట్టి మేల్ తలపెట్టవోయ్’’ ప్రజల్లో నిర్మాణాత్మకమైన గట్టిమేలు చేయడమే దేశాభిమానానికి నిదర్శనమని వట్టిమాటలు కాదన్న ప్రబోధం జాతీయోద్యమంలో ప్రజలను ప్రభావితం చేసింది.
దేశభక్తి కవితకు స్ఫూర్తిప్రదాత రాయప్రోలు
రాయప్రోలు వారు భారత జాతీయాభిమాన స్ఫూర్తితో రచించిన జన్మభూమి గీతం ‘‘ఏ దేశమేగినా / ఎందు కాలిడినా / పొగడరా నీతల్లి / భూమి భారతిని / నిలుపరా నీ జాతి / నిండు గౌరవము’’ జాతీయోద్యమ స్ఫోరకంగా దేశభక్తి తత్పరతను ప్రబోధించారు. జాతీయోద్యమంలో యువకుల్లో గొప్ప స్పందన కలిగించి ఈ గీతం ప్రచారం పొందింది.
రాయప్రోలు వారు ఆంధ్రాభిమానంతో తొలిసారిగా తెనుగుతల్లి పదాన్ని ప్రయోగించారు. జాతీయోద్యమంలో ఆంధ్రులు సమైక్యంగా పోరాడాలన్న కాంక్షతో 1914లో ప్రబోధం ఖండిక రచించారు. ‘‘అమరావతి పట్టణమ్మున బౌద్ధులు / విశ్వవిద్యాలయమ్ములు స్థాపించునాడు’’ అనే పద్యాన్ని నెల్లూరులో జరిగిన ఆంధ్రోద్యమ సభలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చదివి వినిపించగా, సభికుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. అప్పటివరకు ఆంధ్రరాష్ట్రం విషయంలో కలహించు కునే నాయకులు ఈ పద్యాల స్ఫూర్తితో సమైక్యతా భావాన్ని ప్రకటించారట. కవిత్వం సామాజిక ప్రయోజనాన్ని సాధించాలనే ఆధునిక విమర్శ సిద్ధాంతానికి లక్ష్యంగా ప్రబోధం ఖండిక ద్వారా రాయప్రోలు వారు కవితా పరమార్ధాన్ని సాధించారు. రాయప్రోలువారి ‘ఆంధ్రావళి’ కవితా సంపుటి స్ఫూర్తితో పరమార్థాన్ని సాధించారు. రాయప్రోలు విశ్వనాథ, దువ్వూరి, తుమ్మల, జాషువా, కరుణశ్రీ, కొడాలి వంటివారు ఆంధ్రాభిమాన కవిత్వ రచనకు పూనుకున్నారు. విశ్వనాథ వారి ఆంధప్రశస్తి, ఆంధ్రపౌరుషం వంటి ఖండకావ్యాలు దేశభక్తి ప్రదీప్తికి నిదర్శనాలు. జాషువా ‘‘భరతమాత’’ ఖండిక అత్యంత ప్రసిద్ధికెక్కిన దేశభక్తి కవిత. తుమ్మల జాతీయో ద్యమంలో ప్రముఖ నాయకుడైన గాంధీజీ ఆత్మకథ, మహాత్మ కథ వంటి గ్రంథాలు రచించాడు. కరుణశ్రీ ‘విజయశ్రీ’ కావ్యంలో ధ్వనిపూర్వకంగా పారతంత్య్రాన్ని నిరసించాడు. మహాత్ముని వ్యక్తిత్వాన్ని గూర్చి బ్రిటిష్ వారి దురాగతాలను గూర్చి హృద్యమైన పద్యకవితలు రచించాడు. కొడాలి వారి ‘‘హంపి క్షేత్రం’’ గత వైభవ కీర్తికి చక్కని దృష్టాంతం. దువ్వూరి వారి నైవేద్యం, మాతృమందిరం, స్వాతంత్య్ర రథం గొప్ప దేశభక్తి ఖండికలు. వేదులవారి ‘‘కాంక్ష’’లో త్యాగధనుల ప్రశంస ఉంది.
జాతీయోద్యమం ప్రచార కవిత్వం
గేయకవి సార్వభౌముడైన గరిమెళ్ల సత్యనారాయణ బ్రిటీష్ ప్రభుత్వ పాలనను గర్హిస్తూ, తెల్లవారిని నిరసిస్తూ, ప్రజలను ప్రబోధిస్తూ, గేయాలు రాశారు. ఆయన గేయాల్లో ఆనాటి బ్రిటీష్ వారి దుండగాలను, దురాగతాలను కళ్లకు కట్టినట్లు వర్ణించారు. ‘‘మా కొద్దీ తెల్లదొరతనము / దండాలండోయ్ / మేముండలేమండోయ్ బాబు / ఉప్పు పన్ను, పప్పుపన్ను / ఊరికెళితే పన్ను / సైతాను ప్రభునిక / సాగనీయమండోయ్ బాబు’’ అంటూ తెల్లవారి పాలనలో ప్రజలకు కలిగిన బాధలను హృదయవిదారకంగా వర్ణించి, నిరసించారు. సైతాను ప్రభుతలో ‘‘సైతాను’’ పదప్రయోగం ఆ ప్రభుత్వ దుర్మార్గాన్ని సూచిస్తుంది. ఈ గేయం ఆనాడు గొప్ప ప్రచారంతో పాటు, గాంధీజీ మెప్పు పొందింది.
కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ‘‘వీరగంధం తెచ్చినారము / వీరులెవ్వరో తెలుపుడి’’ అనే గీతం ద్వారా ప్రజల్లో వీరత్వాన్ని ప్రదీప్తం చేశాడు. మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి ‘‘అంటరానివారెవ్వరు / మా వెంట రాని వారే’’ అంటూ అధిక్షేపాత్మకంగా ప్రబోధించారు. తెలుగు కవులంతా ప్రజలను జాగృతం చేశారు.
డా।।పి.వి.సుబ్బారావు
విశ్రాంత అధ్యాపకుడు