సుభద్రకి దుఖం పొంగుకు వస్తోంది. ఒక గంటలో కొడుకును, కోడల్ని, ఇద్దరు మనుమరాళ్లను వదలి వేల కిలోమీటర్ల దూరం, తమ దేశం వెళ్లిపోతుంది.ఈ ఆరునెలలుగా మనుమరాళ్లు ఇద్దరూ మరీ దగ్గర అయిపోయారు. మళ్లీ తనకి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చే ఓపిక లేదు. తనకి తెలుసు. ఒంట్లో తేడా వచ్చేసింది. రక్తపోటు, చక్కెర వ్యాధి రెండూ తన ఒంటిని గుల్ల చేసేసాయి. అరవై ఏళ్లకే ఇక శాశ్వతంగా వెళ్లిపోయే రోజులు దగ్గరపడ్డాయి అని అర్థం అయిపోతోంది. ఇక ఈ జీవితంలో కొడుకు కుటుంబాన్ని చూసే అవకాశం లేనట్లే!
నాన్నమ్మ, మళ్లీ ఎప్పుడు వస్తారు మీరు? తాతయ్య అమెరికాలో తనకి తోచదు అన్నా, నువ్వే బలవంతంగా తీసుకుని మా వేసవి సెలవులు మొదలవగానే వచ్చేయండి! అంది ఎనిమిదేళ్ల పెద్ద మనుమరాలు స్వీటీ.
సుభద్ర పెదవుల మీద జీవం లేని నవ్వు. ఇక మీదట మేము రాలేము స్వీటీ, మా పని అయి పోయింది. ఇక మీదట మమ్మల్ని చూడటానికి మీరే రావాలి తల్లి కంఠంలో జీర కనిపెట్టేశాడు శ్రీరామ్.
అదేమిటమ్మా, అలా అంటావు? నాన్నకి డెబ్బై, నీకు మరో నాలుగేళ్లు తక్కువ. అప్పుడే పని అయి పోయిందని అంటావేమిటి? మన విజయ అత్తయ్యకు ఎనభై ఏళ్లు దగ్గిర పడుతున్నాయి, ఇప్పటికీ దాదాపు ప్రతి ఏడాదీ వచ్చి, రామం బావను చూసి వెళ్లడం లేదూ! కారు అద్దంలో నుంచి తల్లి మొహంలోకి చూస్తున్నాడు శ్రీరామ్
అలా చెప్పరా, రోజుకోసారి ఇక నా పని అయి పోయింది అంటుంది భార్య మీద ఫిర్యాదు చేసినట్లుగా అన్నాడు జానకిరామ్.
మీరు ఎన్నయినా చెప్పండి, మరో ఏడాదికి మించి నేను వుండను. భోరున ఏడ్చేసింది సుభద్ర ఇదే వీళ్లను చూడటం ఆఖరిసారి
నాన్నమ్మ ఏడ్పు చూసి బిత్తర పోయారు స్వీటీ, పింకీ.
ఊరుకోండి అత్తయ్య గారు, మిమ్మల్ని అలా చూసి, పిల్లలు బెంబేలు పడి పోతున్నారు. మీకు ఏ రోగం లేదు. ఉన్నదల్లా బెంగ, భయం అంతే! మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. చూస్తూ ఉండండి. ఏడాది తిరగకుండా మీరే మళ్లీ వస్తారు. మేము వచ్చినా రెండు వారాలకు మించి ఉండలేం కదా, అదే కొంచెం ఓపిక చేసుకుని మీరు వచ్చారు అనుకోండి, ఆరు నెలల పాటు అందరం సరదాగా ఉండొచ్చు నచ్చ చెబుతోంది కోడలు శృతి.
వాషింగ్టన్ విమానాశ్రయంకి చాలా దగ్గరలోనే కారు ఆపు చేశాడు శ్రీరామ్.
ఆరుగురు ఏర్‌పోర్ట్‌లోకి వెళ్లారు. శ్రీరామ్ దగ్గరుండి నాలుగు పెట్టెలు, చెక్ ఇన్‌లో ఇచ్చేశాడు. మందులు, తినుబండారాలు సర్దిన లాప్‌టాప్‌బాగ్ జానకిరామ్ దగ్గర ఉంది. డబ్బు, పాస్‌పోర్ట్‌లు జాగ్రత్తగా తన దగ్గర బ్యాగ్‌లో ఉంచుకుంది సుభద్ర.
జాగ్రత్త రా! మీరు తిరిగి వెళ్లేసరికి రాత్రి పది దాటి పోతుంది కొడుకు భుజం మీద, చేయి వేస్తూ, కంటనీరు కనబడకుండా మొహం పక్కకు తిప్పుకొని, రుమాలుతో కళ్లు అద్దుకున్నాడు జానకిరామ్. తండ్రి కళ్లు ఎర్రబడటం గమనించి, ఎందుకు నాన్నా, బాధ పడటం. రోజూ ఫోన్‌లో చూసుకుంటాం కదా ధైర్యం చెబుతున్నట్లుగా అన్నాడు శ్రీరామ్
ఫోన్‌లో చూసుకున్నా, కలసి ఉన్నట్లుగా ఉండదు కదరా కన్నా! నాకు ఏదైనా అయితే సమయానికి మీరు రాగలరో లేదో అనే నా బెంగ చంకలో పింకీని కోడలు చేతికి ఇస్తూ, మళ్లీ భోరు మంది సుభద్ర.ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, కొడుకు కుటుంబం అమెరికాలో కూతురి కుటుంబం ఆస్ట్రేలియా లో.ఎవరూ దగ్గరలో లేరు. పైగా ఎవరికి వారే బిజీ.
రోదిస్తున్న తల్లి భుజం రాస్తూ, చాలా సేపు మౌనంగా ఉండిపోయాడు శ్రీరామ్. కొడుకు గుండెల్లో సుభద్ర తల! సుభద్ర కన్నీటికి శ్రీరామ్ చొక్కా తడిసి పోతోంది.
సెక్యూరిటీ చెక్‌కి వెళ్లాలేమో? జానకిరామ్ మాటలకు అందరిలో చలనం వచ్చింది.
స్వీటీ , పింకీలను వదలలేక వదలలేక భారంగా కదిలింది సుభద్ర.
వీల్ చైర్‌లో నుంచి వెనక్కి తిరిగి దూరంగా ఉన్న కొడుకు కుటుంబాన్ని కంటి నిండుగా చూసుకోవాలి అనుకుంది సుభద్ర. అయితే ఆ ఆశ తీరే అవకాశం లేకుండా, కళ్ల నిండా నీళ్లే.
విమానంలో ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుని ఉన్న, సుభద్ర భుజం తడుతూ, ఎంత సేపని బాధ పడతావు? ఆరు నెలల పాటు అందరం సంతోషంగా గడిపాం కదా! వాళ్లు మనం ఎప్పుడు వస్తామన్నా సుస్వాగతం అంటారు .నీకు ఎప్పుడు బెంగగా అనిపిస్తే అప్పుడు వచ్చేదాం.!ఊరడింపు గా అన్నాడు జానకిరామ్.
భర్త చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, చాలా సేపు మౌనంగ ఉండిపోయింది సుభద్ర మీకు చెప్పినా అర్థం కావడం లేదు. నాకు అస్సలు ఓపిక ఉండటం లేదు. ఇక ఎంతో కాలం నేను ఉండను
అదిగో, మళ్లీ అవే పిచ్చి మాటలు. నీకేమీ కాదు. కోడలు అన్నట్లు బెంగ రోగమే నీది. మనసు మళ్లించుకోవాలి. ఒక నెల పోయాక ఒకసారి తిరుపతి వెళ్లివద్దాం.నీకు కొంచం మనశ్శాంతిగా ఉంటుంది
ఇద్దరూ విమానంలో ఎయిర్ హోస్టెస్ తెచ్చిన వేమీ తినలేదు. కోడలు సర్ది ఇచ్చిన పూరి, కూర తిని సీటులో వెనక్కి వాలారు.
అనంతమైన ఆకాశంలో విమానం దూసుకు పోతోంది. కిటికీ లోంచి చీకట్లోకి చూస్తున్నాడు జానకిరామ్. ఉండండి మెరుపులు. కాసేపట్లోనే క్షణం ఆగకుండా ఏకధాటిగా మెరుపులు మొదల య్యాయి. అవతల జోరుగా వర్షం పడుతున్నట్లు ఉంది. విమానం పైకి, కిందకు ఊగి పోతోంది. బయట వాతావరణం అస్సలు బాగా లేదని, సీట్‌బెల్ట్‌లు అందరూ పెట్టుకోవాలని పైలట్ పదేపదే హెచ్చరిస్తున్నాడు. విమానం వెళుతుంటే వింత శబ్దాలు, గరగరమంటూ. విపరీతమైన కుదుపు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న సుభద్ర ఉలిక్కి పడి లేచింది. ఏమిటి, విమానం ఇలా ఊగి పోతోంది? అంది భయంగా.
బయట వాతావరణం బాగు లేదట. తుఫాన్‌లా వుంది
కిటికీ అవతలి మెరుపుల్ని చూపిస్తూ అన్నాడు జానకిరామ్.
విమానం హఠాత్తుగా కిందకు జారి పోతోంది. అందరూ హాహాకారాలు చేస్తున్నారు.
జానకిరామ్ వెన్నులో ఒణుకు మొదలు అయింది. ఈ విమానం కూలిపోయేలా ఉంది సుభద్ర, ఇదే మనకి ఆఖరి. రోజు అయ్యేలా ఉంది
కాసేపటికే విమానం విపరీతంగా ఊగి పోతోంది. పెద్దగా శబ్దాలు. చాలామంది గట్టిగా అరుస్తున్నారు, కొందరు పెద్దగా ఏడుస్తున్నారు.
భయపడకండి, ఏమీ కాదు. ఆ అమ్మవారే మనని చూసుకుంటుంది భర్తకి ధైర్యం చెబుతోంది సుభద్ర
భార్య చేతిని గట్టిగా పట్టుకొని, పెళ్లయిన కొత్తల్లో చిన్న జీతం వల్ల నిన్ను సుఖ పెట్టలేక పోయాను. నీ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చ లేకపోయాను. నా కోపాన్ని కూడా భరిస్తూ, పిల్లల్ని చక్కగా పెంచుకు వచ్చావు. నా వల్ల నీకు ఎటువంటి సుఖం లేకపోయింది. నన్ను క్షమించు! మనసులో ఉన్నదంతా గబగబ చెప్పేయాలని చూసాడు జానకిరామ్
మీతో నా కాపురం సుఖంగానే గడిచింది. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు. అంతకంటే ఏం కావాలి నాకు? నేనే నోటి దురుసు మాటలతో మీ మనసు నొప్పించి ఉంటాను. నన్ను క్షమించండి. ఇక మీరు కళ్లు మూసుకుని శివ నామస్మరణ చేసుకోండి. ఏ భయమూ ఉండదు భర్తకు దగ్గరగా జరుగుతూ అంది సుభద్ర.. ఒణుకుతున్న పెదాలతో జానకిరామ్ ఓం నమశ్శివాయ అనడం మొదలు పెట్టాడు. కాసేపటికే జానకిరామ్ కళ్ళు బరువుగా మూతలు పడ్డాయి.
* * *
ఆంటీ, మా వాటా తాళం మీ దగ్గర వుందా? గుమ్మంలో అలికిడి విని లోపల నుంచి వచ్చిన పరిమళను అడిగింది శ్రీలత.
లేదమ్మా, మీ అమ్మగారు, నాన్నగారు మీ అన్నయ్య దగ్గరకు అమెరికా వెళ్లారు కదా! తాళం ఏమీ మాకు ఇవ్వలేదు ఎదురు వాటా పరిమళ
నేను కూడా వచ్చాను ఆంటీ శ్రీలత వెనక వున్న శ్రీరామ్ ముందుకు వచ్చాడు.
మరి మీ అమ్మగారు, నాన్నగారు? ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ.
ఇద్దరూ విమాన ప్రమాదంలో ఒకేసారి పోయారు ఆంటీ! శక్తి లేని దానిలా, రెండు అడుగులు ముందుకు వేసి, గుమ్మం పక్కనే ఉన్న సోఫాలో కూలబడి రెండు చేతుల్లో మొహం దాచుకుంది శ్రీలత.
పక్క నే బాంబ్ పడినట్లు అదిరి పడింది పరిమళ. ఏమంటున్నావు, నువ్వు?
మీకు తెలియదా ఆంటీ. పదిహేను రోజుల క్రితం వాషింగ్టన్‌లో బయలు దేరిన విమానం తుఫాన్‌లో చిక్కు కుని, అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయి మొత్తం మూడు వందల మంది దాకా పోయారని! అందులోనే అమ్మా, నాన్న ఉన్నారు. పిల్లలతో అందరం రాలేక అమెరికా నుంచి నేను, ఆస్ట్రేలియా నుంచి చెల్లి బయలు దేరి వచ్చాం. తిన్నగా కాశీకి వెళ్లి, పన్నెండు రోజుల కర్మకాండ జరిపించి వస్తున్నాం తను కూడా చెల్లెలి పక్కన కూర్చుంటూ అన్నాడు శ్రీరామ్.
ఎంత ఘోరం జరిగిపోయింది. అసలు నమ్మలేక పోతున్నాను. చాలా, చాలా బాధగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు ఇద్దరికీ రెండు గ్లాసుల్లో మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది పరిమళ.
పరిమళ కూతురు వెళ్లి చెప్పిందేమో, అపార్ట్‌మెంట్‌లో ఒక్కొక్కరే వచ్చి, అన్నా చెల్లెళ్లను పలకరించి పోతున్నారు. అందరూ పలకరిస్తూ ఉంటే, ఇద్దరికీ దుఃఖం పోంగుకు వస్తోంది.
పరిమళ తెచ్చిన కాఫీ తాగక ఇద్దరూ కాస్త తేరు కున్నారు.
ఐతే వీధి తాళం బద్దలు కొట్టక తప్పదు! అన్నాడు శ్రీరామ్.
తాళం బద్దలు కొట్టాక కూడా మీరు ఇంట్లోకి అడుగు పెట్టేలా ఉండదు.ఆరు నెలలుగా మూసి ఉన్న ఇల్లు, దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. మేం వెళ్లి నప్పుడు తాళాలు మీ అమ్మగారికి ఇచ్చి వెళ్లాం. పనిమనిషికి సగం జీతం ఇస్తే, పది రోజులకోసారి వచ్చి, ఇల్లంతా తుడిచి, పోచా చేసేది. అందుకే మేం తిరిగి వచ్చిన రోజు ఇల్లు ఎప్పటిలా శుభ్రంగా ఉంది. మీ అమ్మగారు తాళం ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆవిడ ఎవరినీ త్వరగా నమ్మరు కదా! మేం వచ్చాక దగ్గర ఉండి శుభ్రం చేయించుకుంటాం అన్నారు పరిమళ చెప్పుకుంటూపోతోంది. ఇంతలో వాచ్‌మన్ వచ్చాడు.
వాడిని చూస్తూనే, విన్నావుగా! జానకిరామ్ అయ్యగారు, అమ్మగారు విమానం కూలిపోయి చనిపోయారట. ఇంటి తాళం బద్దలు కొట్టాలి, ఎవరినైనా తీసుకురా! అని పురమాయించి, మీరు మొహమాట పడకుండా ఈ రోజుకి మా ఇంట్లోనే ఉండి, మీ పని చూసుకోండి, కూరా, పప్పు ఉన్నాయి, కొద్దిగా అన్నం పడేసి వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది పరిమళ.
ఉండుండి దుఖం పాంగుకు వస్తోంది శ్రీలతకి.
కొంచం మనసు దిటవు చేసుకో శ్రీ. మనకు ఇప్పుడు బోలెడు పని వుంది చెల్లెలి భుజం తడుతూ అన్నాడు శ్రీరామ్.
ఒక గంట కష్టపడ్డాక వీధి తాళం బద్దలు అయింది. అయితే పరిమళ చెప్పినట్లుగా ఇంట్లో కి అడుగు పెట్టే వీలే లేదు. ఇల్లంతా, దుమ్ము, బూజులు. రాత్రి పది అయ్యేదాకా పని మనిషి ఇల్లంతా శుభ్రం చేస్తూనే ఉంది.
ఈ రాత్రికి మా ఇంట్లోనే పడుకోండి. రేపు పక్కలు దులిపి, దుప్పట్లు మార్చుకుందురుగానీ! అంది పరిమళ.
ఆ రాత్రికి వాళ్లింట్లోనే పడుకున్నారు శ్రీరామ్, శ్రీలత.
మర్నాడు కాఫీ తాగుతూనే తమ ఇంట్లోకి వెళ్లారు. అది మూడు పడక గదుల ఫ్లాట్, ఎంతో విశాలంగా వుంది.
మీరు ఇద్దరే కదా, రెండు పడక గదుల ఫ్లాట్ తీసుకోమని అంటే నాన్న వినలేదు మూడు గదుల్లో నిండి పోయివున్న సామాను చూస్తూ అన్నాడు శ్రీరామ్. గదులు ఖాళీగా పెట్టలేక అక్కరలేని సామాను అంతా ఇంట్లో నింపేశారు
ఇంట్లో ఏది ఎక్కడుందో తెలియడం లేదు చుట్టూ చూస్తూ అయోమయంగా అంది శ్రీలత.
ముందు బీరువాలో కాగితాలు చూడాలి తల్లి తండ్రుల పడక గదిలోకి నడిచాడు శ్రీరామ్.
గోద్రెజ్ బీరువా లాక్ చేసి ఉంది. ఎక్కడా తాళం చెవి కనిపించలేదు.
అమ్మ తాళం చెవి తనతో తీసికెళ్లి ఉంటుంది అంది శ్రీలత అల్మారాలు అన్నీ వేతికేసాక .
మనిషికి కబురు వెళ్లి, వాడు మళ్లీ వచ్చి, బీరువా తాళం బద్దలు అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. బీరువా నిండా పట్టు చీరలు. చీరల క్రింద కొన్ని ఆస్తి పత్రాలు, బాంక్ డిపాజిట్ రసీదులు వున్నాయి.
ఆ పత్రాలు అన్నీ తీసి ఒకటొకటే చూసాడు శ్రీరామ్
నాన్న నలుగురు మనుమరాళ్ల కోసం పదిహేను లక్షల చొప్పున నాలుగు ఫ్లాట్లు తీసుకున్నానని అన్నారు కదా! ఆ నాలుగు ఇక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలో నాలుగు పక్కలా ఉన్నాయి. ఇప్పుడు అవి అసలు అమ్ముడు పోతాయో లేదో? ఇంత కంటే ఆ పదిహేను లక్షలు బాంక్ డిపాజిట్‌గా ఉంచ వలసింది తల పట్టుకున్నాడు శ్రీరామ్.
ఇంతకీ విల్లు రాశారో, లేదో ఆ స్థలాలు అన్నీ అమ్మ పేరున ఉన్నాయి. అసలు ఎన్ని డిపాజిట్లు ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, వాటి మీద అప్పులు ఉన్నాయా వంటి వివరాలు కూడా ఎక్కడా పుస్తకంలో రాసి పెట్ట లేదు. అంతా అగమ్యగోచరంగా ఉంది
ఇద్దరూ బీరువా అంతా వెతికారు. ఎక్కడా విల్లు లేదు. ఆస్తి, అప్పుల వివరాలు రాసిన పుస్తకం లేదు.
ఇక్కడ దొరికిన డిపాజిట్‌లన్నీ నాన్న పేరున ఉన్నాయి, అమ్మ వాటికి నామినీ. విల్లు లేనప్పుడు ఇవన్నీ మనకి రావాలంటే తల క్రిందులుగా తపస్సు చేయాలి చిరాకు పడి పోయాడు శ్రీరామ్.
నేను మరో పది రోజులకు మించి ఇక్కడ ఉండలేను
నేను నాలుగు రోజులు మించి ఉండలేను, అవతల మీ బావగారు ఇద్దరు ఆడపిల్లలతో నానా అవస్తా పడుతున్నారు కుండబద్దలు కొట్టినట్లుగా అంది శ్రీలత.
చేసేదేమీ లేక బీరువా మూసి, ఇల్లంతా తిరిగి చూసారు.రెండు అల్మారాల నిండా జానకిరామ్ బట్టలు. మూడు అల్నారాల లో సుభద్ర చీరలు.
ఈ వయసులో వీళ్లకు ఇన్ని బట్టలు ఎందుకు? ఇద్దరూ చెరో పాతిక ఉంచుకుంటే సరిపోదా? ఇప్పుడీ బట్టలన్నీ ఏంచేస్తాం? చిరాకుపడ్డాడు శ్రీరామ్.
పనిమనిషిన తీసుకుపొమ్మందాం సలహా చెప్పింది శ్రీలత.
అయితే పనిమనిషిని పిలిచి అడిగితే అది పోయిన వాళ్ల బట్టలు మాకు వద్దు సార్. మేం తీసుకోం! అనేసింది నిర్మొహమాటంగా.
ఇంతకు ముందే వాళ్లు ఎక్కువగా ఉన్న బట్టలు కావలసిన వాళ్లనందరినీ పిలిచి ఇచ్చేసి ఉంటే, వాళ్లు సంతోషంగా తీసుకు పోయి ఉండేవారు. ఇప్పుడు ఎవరూ తీసుకోం అంటే, వీటిని మనమేం చేసుకుంటాం? ఉసూరు మన్నాడు శ్రీరామ్.
ఇలారా అన్నయ్యా! వంటింట్లో నుంచి కేక వేసింది శ్రీలత చూడు, ఈ వంటింట్లో అడుగడుగునా స్టీలు సామాన్లు ఉన్నాయి. స్టీలు గుండిగలు, బకెట్లు, పెద్ద పెద్ద కంచాలు, గిన్నెలు ఒకటేమిటి స్టీలు దుకాణం ఉంది ఇక్కడ! అసలు అమ్మ ఇంత సామాను ఎందుకు పోగుచేసినట్లు? ఇప్పుడు ఇవన్నీ మనం ఎవరికీ ఇవ్వాలి? ఇవన్నీ చూస్తుంటే నాకు జడుపు జ్వరం వచ్చేలా ఉంది
నా తల బద్దలయి పోతోంది తల బాదు కున్నాడు శ్రీరామ్.
ముందు ఎవరినైనా బ్రోకర్‌ను చూసి, ఇల్లు బేరం పెడదాం. స్థలాల సంగతి మళ్లీ వచ్చినప్పుడు చూద్దాం సలహా చెప్పింది శ్రీలత.
బ్రోకర్ ఇల్లంతా తిరిగి చూసి, విల్లు, ఇంటి కాగితాలు చూపించమన్నాడు
ఇంటి పత్రాలు ఉన్నాయి. విల్లు లేదు. అయితే నాన్న, అమ్మ పోయాక ఇల్లు నాదే కదా అన్నాడు శ్రీరామ్
వీలునామా మీ పేరు మీద ఉంటేనే మీరు ఇల్లు అమ్మ గలరు. లేకపోతే ఈ ఆస్తికి మీరే వారసులంటూ ధ్రువపత్రం కోర్టు నుంచి తెచ్చు కోవాలి. అది రావ డానికి ఎంతో తిరగాలి, చాలా సమయం పడుతుంది. బ్యాంక్ డిపాజిట్‌లకి కూడా ఆ ధ్రువపత్రం కావలసి ఉంటుంది. వాళ్ల డెత్ సర్టిఫికెట్ కూడా కావాలి. అవన్నీ వచ్చాక కబురు చేస్తే వస్తా వెళ్లి పోయాడు బ్రోకర్.
అయితే వెళ్లిన వాడే మళ్లీ వెనక్కు వచ్చి, అమ్మడానికి ఇల్లు ఖాళీగా ఉండాలి. సామాను అంతా తీయించెయ్యండి అన్నాడు.
సామానుతో సహా బేరం పెట్టండి అన్నాడు శ్రీరామ్
ఇంటి యజమానులిద్దరూ ఇద్దరూ ప్రమాదంలో పోయారంటేనే ఎవరూ ఇల్లు కొనడానికి ముందుకు రారు. అటువంటప్పుడు వాళ్ల సామాను ఎవరు తీసుకుంటారు? సామాను తీసేసి ఇల్లు ఖాళీగా ఉంచండి వెళ్లి పోయాడు బ్రోకర్.
ఇది లాకర్ తాళం చెవిలా ఉంది! పోపుల డబ్బాలో నుంచి ఏదో తాళం చెవి బయటకు తీసింది శ్రీలత
అది ఏ బాంక్ లాకరో, లాకర్ నంబర్ ఏదో మనకి తెలియదు కదా! ఇక్కడి పరిస్థితి చూస్తూంటే నాకు పిచ్చిపట్టేలా వుంది జుట్టు పీక్కున్నాడు శ్రీకాంత్.
నాకు తల తిరిగిపోతోంది. ఈ ఆస్తి వద్దు, ఈ డబ్బులు వద్దు, ఈ తల నొప్పులు వద్దు. నేను వెళ్లి పోతాను తన పెట్టె చేతిలోకి తీసుకుంది శ్రీలత.
నాకు అంత కన్నా వద్దు. అవతల వదిన, పిల్లలు ఎప్పుడు వస్తావంటూ గోల పెట్టేస్తున్నారు! తానూ చేతి లో పెట్టేతో ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు శ్రీరామ్.
పరిమళ ఆంటీకి కూడా చెప్పకుండా, ఇద్దరూ లిఫ్ట్ బటన్ నొక్కి కిందకు దిగిపోతున్నారు.
అయ్యో, ఇంటి తలుపు తాళం వేయలేదు, ఒరేయ్ శ్రీరామ్, ఒసేయ్ శ్రీలతా గట్టిగా అరుస్తు న్నాడు జానకిరామ్.
నిద్రలో ఏమిటి పిల్లల్ని కలవరిస్తున్నారు? అప్పుడే బెంగా, మళ్లీ నన్నంటారు! భర్తను కుదుపు తోంది సుభద్ర.
ఏమిటి! మనం బతికే ఉన్నామా? విమానానికి ఏమీ కాలేదా? నమ్మ లేనట్లుగా చుట్టూ చూస్తున్నాడు జానకిరామ్. ఇదంతా కలా? .
మీరు కళ్లు మూసుకున్న కాసేపటికే, శివనామ స్మరణ చేస్తూ మంచి నిద్ర లోకి జారుకున్నారు తొందరలోనే విమానం కూడా తుఫాన్‌ను దాటేసింది. మీరు చేసిన నామ స్మరణ మనని బతికేలా చేసింది.. ఇంతకీ ఎందుకా అరుపులు?
ఏమీ లేదు. మనం ఇంటికి వెళ్లగానే చేయ వలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. మన తక్షణ కర్తవ్యం ఏమిటో తెలియజేయడానికి దేవుడు మనని చావనీయ లేదు.! అంత తుఫాన్‌లో నిద్ర పట్టేలా, అందులో కలగనేలా, ఆ కల ద్వారా కనువిప్పు కలిగేలా చేశాడు
మీ మాటలు నాకు కొంచం కూడా అర్థం కావడంలా. అయినా మనకి ఇంటికి వెళ్లి వెంటనే చేయవలసిన పనులేం ఉన్నాయి? ఆశ్చర్య పోయింది సుభద్ర.
ఇంటికి వెళ్లాక చెబుతాను. అప్పటి దాకా ఓపిక పట్టు! అన్నాడు జానకిరామ్.
– మాచిరాజు కామేశ్వరరావు
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది