A man in handcuffs sits behind a gavel waiting for the judge to render his decision.

దివ్యకృతి. ఎలా ఉంది పేరు?

దివ్య అంటే దీపిక, అగ్నిశిఖ.

అందం, ప్రకాశం, శపథం – మరెన్నో అర్థాలు.

తల్లిదండ్రులు ఏ సుముహూర్తంలో ఆ పేరు పెట్టారో కానీ, సార్థకం చేసుకుంది.

అపూర్వ, అపురూప ఘన విజయాన్ని సొంతం చేసేసుకుందంటే… అదీ ఆమె పట్టుదల. ఆత్మవిశ్వాసం! అఖండ దివ్య తేజం, ఈక్వెస్ట్రియన్‌ ‌క్రీడల్లో అర్జున అవార్డు సాధించింది. ఇంతటి మహా ఘనతను వశం చేసుకున్న భారతీయ  తొలి వనిత దివ్యకృతి. ఉడుంపట్టు వంటి తత్వం, ఎంత శ్రమనైనా భరించి బయటపడగలిగే శక్తీ యుక్తీ.

‘దివ్యాకృతి’ అనీ పిలుచుకోవచ్చు మనం!

అందులోనూ పేరుకు తగిన వనిత.

ఇప్పటికీ ఆసియా సంబంధిత క్రీడారంగంలో నంబర్‌ ‌వన్‌. ‌ప్రపంచ స్థాయిలోనే (గ్లోబల్‌) ‌ర్యాంకింగ్స్‌లో, నిర్ణీత అంశానికి చెందినంత వరకు నంబర్‌ 14. ‌రికార్డుల సృష్టి తనకు కొత్తేమీ కాదు.

అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును ఇప్పుడిలా చేజిక్కించుకోవడమంటే రికార్డులకీ రికార్డు! రాష్ట్రపతి భవన్‌లో ఇటీవలనే ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కృతి స్వీకరణ పక్రియా పూర్తయింది.ఆసియన్‌ ‌క్రీడోత్సవాల స్వర్ణపతక విజేత, ఈక్వెస్ట్రియన్‌లో ఏకైక వనిత అంటుంటే చప్పట్లు మారుమ్రోగాయి.

ఇంతకూ ఎవరీ దివ్యకృతి? ఈక్వెస్ట్రియన్‌ ‌విలక్షణత ఇంకా ఏమిటి? సవివరంగా తెలుసుకుందాం. ఇంతకన్నా ముందు, గత ఐదేళ్ల తన ‘సూపర్‌ ‌పవర్‌’‌నూ తలచుకుంటే….

ప్రతి భారతీయ హృదయమూ ఉప్పొంగిపోతుంది!

క్రీడ అనేది శారీరక శ్రమ. అంతకుమించి మానసికపటుత్వం. అందులో పోటీలంటే ఎంతెంతో ఒత్తిడి.

దృఢత్వం చూపితేనే, అన్నింటినీ తట్టుకుంటేనే విజయం వరిస్తుంది.

వ్యక్తిగతంగా, జట్టుపరంగా.

నియమాలు, నిబంధనలు ఉండనే ఉంటాయి. వాటిని అనుసరిస్తూనే, సకాలంలో స్పందించి విజృంభిస్తేనే గెలుపు పిలుపు లభిస్తుంది.

దివ్యకృతి తలపులన్నీ… బాల్యం నుంచీ విజయసాధన కోసమే.

ఆమెకి ఇప్పుడు 24 ఏళ్లు. స్వరాష్ట్రం రాజస్థాన్‌. ‌స్వస్థలం జైపూర్‌ ‌ప్రాంతం. చిన్నపుడు బడి చదువంతా అజ్మీర్‌లో అయింది. బాలికల పాఠశాలలో విద్యాభ్యాసం. డిగ్రీ చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కళాశాల నుంచి.

తల్లిదండ్రుల నుంచి పట్టుదల నేర్చుకుంది. తోబట్టువు నుంచి సహనశక్తి అలవరచుకుంది. ఈ రెండూ ‘ఈక్వెస్ట్రియన్‌’‌కి మూలాధారాలు. ఉడుంపట్టు వంటి తత్వం, ఎంత శ్రమనైనా భరించి బయటపడగలిగే శక్తీ యుక్తీ.

గుర్రపు స్వారీ. ఈ క్రీడ సమస్తం దూకుడుమయం. ఎంతో వేగం ఉండాలి. కచ్చిత అంచనా కావాలి. సవారీలో చాకచక్యం కనబరచాలి. యుద్ధ విద్య, శారీరక విన్యాసం….ఈ రెండు కలగలిసిన సాహసోపేత చర్య. ఈ అంశానికి ఎంత పూర్వచరిత్ర ఉందో, అంతకుమించిన ఆధునికతా నెలకొంది. పోటీలు/ పందేలలో నరాలు తెగి ఊడిపడేంత ఉత్కంఠ.

వీటన్నింటినీ మొదటి నుంచీ అలవాటు చేసుకుంది దివ్యకృతీ సింగ్‌. ‌తండ్రి తేజ్‌సింగ్‌. ‌సాహసక్రీడల గురించిన మక్కువ పెంచారు. తల్లి అల్కా. ఎటువంటి అనూహ్య స్థితినైనా ఎదుర్కోగలిగిన స్థిరచిత్తాన్ని కలిగించారు.

దివ్యకృతి ఉన్నత పాఠశాల దశ నుంచే గుర్రపు స్వారీ మీద ఆసక్తి ప్రదర్శించింది. అదే క్రీడాంశంలో పాల్గొంటూ ఉండేది. కాలక్రమంలో జూనియర్‌ ‌నేషనల్స్‌కి ఆడింది. ఆలిండియా స్థాయి ఈవెంట్లు, ఇతర దశల ఉత్సవాల్లోనూ తరుచుగా పాల్గొనేది. ఛాంపియన్‌షిప్‌ ‌గురించి కలలు కంటుండేది. వాటి సాకారానికి తనవంతు ప్రయత్నమూ ముమ్మరంగా చేస్తుండేది. ఈక్వెస్ట్రియన్‌ ‌స్పోర్టస్‌కి ఇంటర్నేషనల్‌ ‌ఫెడరేషన్‌ ఉం‌దని మనందరికీ తెలుసు. అథ్లెట్ల ట్రెస్సేజ్‌ ‌వరల్డ్ ‌ర్యాంకింగుల గురించి కూడా తెలియాల్సి ఉంది.

ఫెడరేషన్‌ అం‌టేనే ఆ క్రీడాంశాల అంతర్జాతీయ పాలక సంస్థ. ప్రధాన కార్యాలయం స్విస్‌లో ఉంటుందనేదీ అందరికీ తెలిసిన విషయమే. స్థూలంగా ఫెడరేషన్‌ ఈక్వెస్ట్రీ ఇంటర్నేషనల్‌ (ఎఫ్‌ఈఐ). ‌దీనికి శతాధిక సంవత్సరాల చరిత్ర ఉండటం మరెంతో విశేషం, వందనీయం. అనుబంధం అంతర్జాతీయ ఒలింపిక్‌ ‌కమిటీలో.

ఆసియన్‌ ‌గేమ్స్. ఆసియాడ్‌, ‌నాలుగేళ్లకు ఒకసారి జరిగే క్రీడోత్సవం. ఆసియా నలుమూలల నుంచీ జట్లు వస్తాయి. తదుపరి పరిస్థితుల ప్రభావంతో, ఖండాంతర ఖ్యాతి సంపాదించుకుంది. బహుళత్వ క్రీడ అన్న మాట. నిరుడు చైనాలో జరిగిన పోటీల్లో భారత్‌ ‌విశ్వరూపం చాటి చెప్పింది. శతాధిక సంఖ్యలో పతకాలు గెలుచుకుంది. వీటిల్లో స్వర్ణాలు ఎన్నో ఉన్నాయి. దివ్యకృతి సింగ్‌ ‌వీర విజృంభణతో ఈక్వెస్ట్రియన్‌ ‌స్వర్గం భారత్‌కు లభించింది. ఒకటీ రెండూ మూడూ కాదు, నాలుగు దశాబ్దాల తర్వాత!

సువర్ణ పతకధారి దివ్య ప్రత్యేకించి డ్రెస్సేజ్‌ ఈవెంట్‌లో ‘గోల్డ్’ ‌స్వాధీన పరచుకుంది. చరిత్రాత్మకం. ఇదంతా బృంద ప్రాతినిధ్యం. ఇందులో ప్రతీ దేశం నుంచీ ముగ్గురు లేదా నలుగురు రైడర్లు పోటీపడితే, వారి వ్యక్తిగత స్కోర్లతో జట్టు మొత్తం స్కోరునీ రూపొందించారు. అంటే, ఉమ్మడి భాగస్వామ్యం ఉంటేనే విజయ ప్రాప్తి. ఈ రీత్యా దివ్య తానేమిటో చాటి చెప్పింది. నాటి నుంచి నేటివరకు భారత్‌ ‌సాధించిన పతకాల సంఖ్యను 14కి చేర్చింది. అదివరకటి మూడు స్వర్ణపతకాలూ 1982లో వచ్చినవే. మళ్లీ ఇన్నేళ్లకి టీమ్‌ ‌స్పిరిట్‌ని విను వీధి పతాకంగా ఎగురవేసింది దివ్యకృతి. అనూష్‌, ‌హృదయ్‌, ‌సుదీప్తలతో కలిసి, గుర్రపు స్వారీని ఫలప్రదం చేసిందామె. అప్పట్లోనే ప్రధాని మోదీ అన్నట్లు, ‘దివ్యాకృతి టీమ్‌ది అద్భుత ప్రదర్శన!

ఆమెది అసాధారణ నిపుణత్వం. అసామాన్య ప్రవీణతత్వం. బృందంలో జతకూడితే – ఎంతెంతో పోరాటపటిమ. డ్రెస్సేజ్‌ అనేది ఫ్రెంచి పదబంధం. సుశిక్షిత అని స్థూలమైన అర్థం. ఆ రీత్యా దివ్యాకృతి మహత్తర, బృహత్తర సుశిక్షణపరురాలు. తన గుర్రానికి ముందస్తు సూచనలివ్వడం, పరిపూర్ణంగా అదుపులోకి తెచ్చుకోవడం ద్వారా పాయింట్లు సంపాదించడం – అదీ ఆ క్రీడాకారిణి అందించిన శిక్షణ సామర్థ్యం. తానుగా ఫలప్రదం చేయగలిగిన సమన్వయ కార్యక్రమం. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత్‌ ‌మళ్లీ కీర్తి కిరీటం పొందిందంటే, అంతా ప్రధానంగా దివ్య నిర్వహణ చాతుర్యమే! ఈక్వెస్ట్రియన్‌ అథ్లెట్లందరికీ తనే తలమానికం.

దివ్య జీవితమంతా అవార్డుల పరంపరలే! విమెన్‌ ‌సమ్మిట్‌ ‌పురస్కారం గత అక్టోరులోనే లభించింది. సవాయి జైపూర్‌ అవార్డునీ అప్పట్లనే పొందింది. పదేళ్ల కిందట జూనియర్స్ ‌విభాగంలో పోలోకి సంబంధించి, నేషనల్‌ ‌ఛాంప్‌ ‌కాగలిగింది. మరు సంవత్సరం సైతం అదే రీతిన విజేతగా నిలిచింది. దేశ రాజధాని నగరంలో జూనియర్స్ ‌స్థాయిలో కూడా శభాష్‌ అనిపించుకుంది. కోల్‌కతాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ, జూనియర్స్ ‌విభాగాన మెరుపులు మెరిపించిందీమె. బెంగళూరులో సైతం ఛాంపియన్‌షిప్‌ ‌తన ఖాతాలోకి చేరుకుంది. ఇంటర్నేషనల్‌ ‌డ్రెస్సేజ్‌ ‌పోటీల్లో గతంలోనూ విజయబావుటా ఎగురవేసి, శంఖం పూరించిందామె.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నిరుడే ఆమెకు పురస్మృతిని ప్రకటించింది.

‘ఉదయించిన సూర్యునిలా

ప్రతి మనిషీ కదలాలి!

నినదించిన దుందుభిలా

ప్రతీ హృదయం పలకాలి!

పదవే పదవే

పదవే పంచ కల్యాణి’

పాట మనలో కొందరికైనా గుర్తుండే ఉంటుంది. ఇది సినీ గీతిక. గుర్రం, హయం, తురగం, అశ్వం- ఏ పేరు ఉన్నా ఒకటే.

‘పంచకల్యాణి’ అనేది ఉత్తమ జాతి అశ్వం.

‘అశ్విక క్రీడ’ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఇక దివ్యకృతి వేరే! 2023లో ఆమెను గుర్తించి గౌరవించి ‘అర్జున’ను బహూకరించింది కేంద్రం.

‘అర్జున’ పురస్కృతి – ఆటల్లో అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శనకు లభించే గౌరవం. అత్యున్నత క్రీడా పురస్కారం. మహాభారతంలో అర్జునుడు ఎంత దీక్షాదక్షత గలవాడో మనందరికీ విదితమే. అందుకనే, ఆ పేరుమీదనే అవార్డు ప్రకటన!

కృషి, అంకిత భావం

చిత్తశుద్ధి, లక్ష్య సిద్ధి

ఏకాగ్రత, తదేక దృష్టి

నాయకత్వం, క్రీడాస్ఫూర్తి

క్రమశిక్షణ, దృఢవర్తన

వీటన్నింటి సమాహారమే ‘అర్జున’ ప్రదానోత్సవ అంతరార్థం.

ప్రభుత్వ గుర్తింపు కలిగిన అన్ని క్రీడా సమాఖ్యల, సంస్థల నుంచి నామినేషన్లు కోరతారు. ఫెడరేషన్లు, అసోసియేషన్లు, కంట్రోల్‌ ‌బోర్డులు, అనేకానేక ప్రభుత్వాల నుంచీ ప్రతిపాదనలు స్వీకరిస్తారు. వాటి నుంచీ అర్జున బహూకృతికి ఎంపిక. భారీ మొత్తంలో నగదు పారితోషికం, అర్జునుడి విగ్రహం, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారు పురస్కార విజేతను! ఈ అన్నింటి దృష్ట్యా, దివ్యకృతి సింగ్‌కు అద్భుత సత్కారమే ఏర్పాటైంది.

-జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE