విజ్ఞాన సముపార్జన. అదొక నిత్యనిరంతర కృషి. అందునా మన దేశంలో అది మరింత పరిజ్ఞాన విరాజితం.
‘ఆరోగ్య సమంచితమై అమృతవృష్టి కురియించెను / కల్యాణ గుణాంకితమై కళావైభవము నించెను’ అని ఏనాడో పలికింది ‘జయభారతి’ కర్త స్వరం.
‘వివిధ రూప విద్యోన్నతి విశిష్టమై వెలయగవలె వైద్య విద్య జనసేవా భావమ్ము వహియింపగవలె’
ఇదీ సర్వత్రా అభిమతం. ప్రత్యేకించి వైద్యానికి భారతదేశంలో తొలినుంచీ సమున్నత స్థానమే. వైద్యం ఓ అద్భుతశాస్త్రం. వైద్యులకు ‘నాచురల్ ఫిలాసఫర్స్’ అని పేరు. విజ్ఞానంతో పాటు సాంకేతికత వారి తీరు. సిద్ధాంతాలతో కొందరు, ప్రయోగాలతో మరికొంత మంది తమ వంతు సేవా సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్నారు. వ్యాధుల నిరోధ, నివారణల కోసం వారిది అవిశ్రాంత సేవ; అదొక్కటే వారిదైన మేలిమి దోవ.
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్). ఇదే ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. వైద్యశాస్త్రమంతటికీ పేరొందిన సమున్నత ప్రభుత్వ వ్యవస్థ, ప్రతిష్ఠాత్మక సంస్థ. సర్వస్వతంత్రం.
ఆరున్నర దశాబ్దాల పైగా చరిత్ర నిండిన దీనికి పలు ప్రాంతాల్లో దీటైన నిర్వహణలు. వైద్య సంబంధ ప్రచురణలూ అసంఖ్యాకం. ఆ ముద్రణలన్నింటి సంపాదక బృందం ఛైర్‌పర్సన్‌లలో ఒకరు ఇందిరానాథ్. అంతపెద్ద సంస్థాపరంగా, అధ్యక్షురాలి హోదాలోనూ ఎంతగానో పరిశ్రమించారు. ఆమె తెలుగు వనితామణి. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక మీద కళకళలాడిన వైద్య నిపుణి. కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కార స్వీకర్త. జనవరి తొలి పక్షంలోనే తన పుట్టినరోజు సుసందర్భం.
ఇందిరానాథ్‌ది గుంటూరు ప్రాంతం. ఉన్నత విద్యాభ్యాసమంతా దేశ రాజధాని నగరంలో సాగింది. ఆమె ఎమ్‌బీబీఎస్ అయిందీ, ఎమ్‌డీ పట్టాను సాధించిందీ ఎయిమ్స్‌లోనే! తను చదువుకున్న చోటనే, ఆ సంస్థ ప్రచురించే వాటి ఎడిటర్స్ బోర్డులోనే స్థానం సంపాదించడం అన్నింటికంటే విలక్షణం. మొదటి నుంచీ ఉన్న వైద్యవిజ్ఞానాభిరుచి, అందరికీ వైద్య సేవలందించాలన్న సేవానిరతి కలిసి ఆమెను అనతికాలంలోనే విదేశాలకు చేర్చింది. అక్కడే పరమోన్నత పట్టా స్వీకరణ.
అటు తర్వాత కూడా వైద్య సంబంధ డిగ్రీలెన్నింటినో సొంతం చేసుకున్నారు ఇందిర. ప్రతిభాశాలి, ప్రయోగశాలి అంటే తానే!
ఇక భరింపజాలనీ భయంకరబాధ
చావో బ్రతుకో యొసగి ప్రోవుమయ్య
నీ పదాల సర్వార్పణమంటి
సర్వ శుభ విధాయీ!
అని మొరపెట్టుకునేవారి ఆర్తి ముందుగా ఇందిరానాథ చెవిని సోకింది, ‘అద్భుత ఔషధంబు ఆయురారోగ్యద/మఖిల శుభకరమ్ము, ఆర్తిహరము…’ అంటూ ముందుకు వచ్చేలా చేసింది. ఆరోగ్యమే ఏకైక భాగ్యం. అందులోనే సుఖమైనా, సంతోషమైనా. కష్టమో నష్టమో కలిగిందంటే, జీవితమంతా దుర్భరంగా మారుతుంది. సంక్లిష్ట పరిస్థితి అన్ని ఆశలనీ చెల్లాచెదరు చేసేస్తుంది. చర్మనికి, నాడీ సంబంధమైన వాటికి వ్యాధి సోకిందంటే సమస్తమూ సంక్లిష్టమే! బహుళ ఔషధ చికిత్సలు ఎంతగానో అవసరమవుతాయి.
వ్యాధి తీవ్రతను గుర్తించి, గమనించి, నిరోధించేందుకు ఎంత చేయాలో అంతా చేసేందుకు తీవ్రంగా పరిశ్రమించారు ఇందిర. శ్రమించారు. శ్రమలో అందరినీ మించారు. పూర్వ రంగంలో లండన్‌కి చేరుకున్నారు. అక్కడి వివిధ వైద్యశాలల్లో, కళాశాలల్లో పరిశోధనలెన్నింటినో కొనసాగించారు. వైద్యురాలిగా, పరిశోధక శాస్త్రవేత్తగా, పాలన నిర్వహణ ఉన్నతాధికారిణిగానూ అపార పాటవాన్ని కనబరిచారు. విదేశాల నుంచి స్వదేశానికి తిరిగొచ్చి, ఎయిమ్స్‌నే సందర్శించారు. ఆ సంస్థలోనే జీవ సాంకేతిక విజ్ఞాన బోధనకు ఆచార్యవర్యులయ్యారు. ఇదే కదా ఈ పరిజ్ఞాన సంపన్నతే కదా…. వైద్యరంగమంతటికీ ఒకానొక మూలాధారం!
సామాజిక ఉపకారం
బయోటెక్నాలజీ విభాగాలు అనేకం. వాటి సంపూర్ణ అధ్యయనానికే జీవితం అంకితం చేశారామె. మానవ శరీరపరంగా వ్యాపించే కంతులను సూక్ష్మ వీక్షణంతో పరిశీలించడానికి ఎంతో సమయం కేటాయించారు. ఏ వ్యాధికైనా నివారణ కన్నా, ముందుచూపు ద్వారా నిరోధం మిన్న. అందుకు అసలు మూలాలేమిటో తెలుసుకోవాలన్నదే తన గట్టి పట్టుదల. మునుపు ఒక పరిశోధక సంస్థలో నిర్వహించిన ప్రొఫెసర్ పదవీ ఆమెకు ఎన్నో విధాలుగా ఉపకరించింది. వ్యాధి నిరోధక పక్రియను విస్తారం చేయడంలో ఆ శాస్త్రకారిణి సాగించిన ప్రయోగాల పరంపరలు లెక్కలేనన్ని. అవన్నీ సత్ఫలితాలనే ఇచ్చాయి, ఇస్తున్నాయి. పరిశోధనలకే పెద్ద పీటవేసే ఆమె ఆ విధానాన్ని అన్ని విధాలా విస్తృతపరిచారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. శాస్త్రీయతను విస్తరిస్తున్న మహా సంస్థ. పత్రికల, ప్రత్యేక రచనల ముద్రణలు తరచుగా జరుగుతుంటాయి. సదస్సులు, కార్యశాలలు, చర్చావేదికలు అనేక అంశాల మీద ఏర్పాటవుతూనే ఉంటాయి. శోధనా ప్రతిభను గుర్తించి గౌరవించడం ప్రధాన ధ్యేయం. స్థూలంగా విద్య, శాస్త్రీయత, సృజనాత్మకతలకు అపార గౌరవాదరాలు. ఈ సంస్థ నుంచే ఇందిర ఫెలోషిప్ అందుకున్నారు. అదే రీతిగా మరో వ్యవస్థగా కాలేజీ ఆఫ్ అలర్జీ అండ్ అప్లయిడ్ ఇమ్యునాజీ ఉంది. ఇందులోనూ పరిశోధన బాధ్యతలకు ఎంపికైన ఇందిరానాథ్ తన ప్రత్యేకతను ప్రస్ఫుటపరిచారు. ఒక్క రీసెర్చి అనే కాదు పరిపాలన, నిర్వహణ రంగాల్లో సైతం తానేమిటో నిరూపించుకున్నారు.
ఏ పదవిని చేపట్టినా పూర్తిస్థాయి న్యాయం చేయడం తనకు అలవాటు. ఇండియన్ ఇమ్యునాలజీ సొసైటీలో ఉన్నారు. జాతీయ స్థాయినే అసోసియేషన్ ఆఫ్ మైక్రో బయాలజిస్ట్‌ల పరంగా కీలక విధులు నిర్వర్తించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కూడా నిర్వాహకత్వం స్వీకరించారు. తనదైన పనితీరు ద్వారా సంస్థాగత పురోగతికీ దోహదకారి అయ్యారు. మరికొన్ని వైద్యసేవల సంస్థల్లో జీవిత కాల సభ్యత్వం తీసుకున్నారు. ఎంత సహయతత్వం నిండినా ఈ సృష్టిలో పరమోన్నత తత్వం ఒకటుందని తన ప్రగాఢ విశ్వాసం. ఈ భావనలనే అక్షరబద్ధం చేసి, క్రోడీకరించి, అవగతం చేసుకుంటే…
‘కణకణమందు నీ యునికి గంటి,
సుమధ్య సువర్ణ కింకిణీ
క్వణనములందు నీ మధురగానము వింటి;
విశాల సృష్టిలో అనువణువందు
నీ మహిమ లారసికొంటి
ప్రగాఢ భక్తితో ప్రణతులోనర్చుచుంటి
నను చాయకుమంటి దయాపయోనిధీ!’
అనే స్తుతి పద్యం గుర్తురాక మానదు. మనల్ని, శక్తి యుక్తుల్ని మించిన తేజం ఒకటి ఉంటుందని నమ్మేవారున్నారు. ఆ మహనీయతకు పర్యాయపరంగా ‘శాస్త్రీయత’ నూ పరిగణించవచ్చు.
సమన్వయ నిపుణత
వ్యక్తి, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకున్నారు ఆ మహిళా శాస్త్రజ్ఞురాలు. తన మాదిరే వైద్యం, ప్రయోగాలు, పరిశోధనలు, ఉత్తమ ఫలితాలను ఇష్టపడే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడారు. పలు బాధ్యతల రీత్యా వివిధ దేశాలకు వెళ్లాల్సి వచ్చినా; స్వదేశం, ఇక్కడి వాతావరణమంటేనే ఎక్కువ మక్కువ. అధ్యయనాన్ని పరిపూర్తిగా నిత్యకృత్యం చేసుకున్నారు. శోధన ఫలితాన్ని ప్రజానీకానికి చేర్చే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సహకారం అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన ఏడున్నర దశాబ్దాల కిందట రూపుదిద్దుకొన్న విఖ్యాత వ్యవస్థ అది. నూతన రీతిన వైద్య సదుపాయాల పరికల్పనే మూలధ్యేయం. ప్రాణాంతక అంటువ్యాధుల నివారణకు అంకితమైన బృందాలెన్నో అందులో ఉన్నాయి. ముఖ్యంగా కుష్టు వ్యాధి వంటివి ఇప్పటికీ ప్రజల్ని పీడిస్తున్నాయి. దాన్ని కనుగొని చికిత్స అందించటం ఇప్పుడు సులభతరంగా మారిందంటే; వైద్య పరిశోధకుల సేవలెన్నో నేపథ్యంగా ఉన్నాయనేది వాస్తవం. ఆ రీత్యా చూసినప్పుడు నాడు ఇందిరానాథ్ వంటివారు ఆరంభించి కొనసాగిస్తూ వచ్చిన ప్రయోగాలే చాలా మటుకు కారణం. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ తన మార్గదర్శక, ప్రోత్సాహక వ్యవస్థ అని పలుమార్లు ఆమె ప్రస్తావించారు కూడా. సదస్సుల నిర్వహణలో సైతం ఆమె అందెవేసిన చెయ్యి. వివిధ సందర్భాల్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్) సౌజన్యంతో కార్యశాలలను ఏర్పాటు చేశారు. సీనియర్ శాస్త్రవేత్తల దర్శకత్వం, యువ పరిశోధకుల ఉత్సాహం కలగలిస్తే వైద్యరంగం వర్ధిల్లుతుందని ప్రసంగ వ్యాసాల్లో ప్రస్ఫుటపరిచారు. ఇందిరకు అదే కౌన్సిల్ నుంచి పురస్కృతి లభించింది. అనేక ఫౌండేషన్ల నుంచీ అవార్డులు ఏరి కోరి వరించాయి. ఎన్ని బహూకృతులు వచ్చినా అవన్నీ తన బాధ్యతలను మరింత పెంచాయని చెప్పిన వినయశీలి. దశాబ్దాల తరబడి, యువతరానికి శిక్షణనిచ్చారు. మేటి శాస్త్రకారిణిగా ప్రత్యేక పురస్కారం సొంతం చేసుకున్నారామె.
అన్నీ చేతల్లో…
ప్రకృతిని, పర్యావరణాన్నీ ప్రేమించే ఇందిరానాథ్ స్వస్థలంలో; పని చేసిన సంస్థల ప్రాంగణాల్లో సైతం మొక్కలెన్నింటినో పెంచారు. వృక్ష సంరక్షణ ప్రాధాన్యాన్ని చాటి చెప్పడానికి అనేక ప్రదేశాల్లో పర్యాటించారు. పైగా విభిన్న క్రీడాంశాల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉంది తనకు. భారతీయత, సామాజిక విలువలు, ఆచార సంప్రదాయాలను సమాదరిస్తూ వివిధ దేశాల్లో ఎన్నో ఉపన్యాసాలిచ్చారు. తాను చెప్పిన ఆదర్శాలను ఆచరణకు తెచ్చి, స్ఫూర్తిమంతంగా నిలిచే మూర్తిమత్వం ఆమెది. అటువంటి వ్యక్తిత్వాలే ఏ రంగంలోనైనా దేశ ఖ్యాతిని ప్రవర్ధితం చేస్తాయి. చేస్తూనే ఉంటాయి. శాస్త్రీయత, సేవాతత్వాల కలనేత ఆ వనిత.
-జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్