తెలుగు కథానికా సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉన్న తల్లావజ్ఘల పతంజలిశాస్త్రిని 2023 కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం వరించింది.ఆయన పర్యావరణవేత్త కూడా. ‘రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు’ పుస్తకానికి ఈ పురస్కారం అందిస్తున్నట్టు అకాడెమి కార్యదర్శి కె. శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రస్తుత కాకినాడ జిల్లా పిఠాపురంలో  1945లో పతంజలి శాస్త్రి జన్మించారు. కృత్తివాసతీర్థులు, మహాలక్ష్మి తల్లిదండ్రులు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పురావస్తుశాస్త్రంలో ఎమ్మే పట్టా తీసుకున్నాడు పతంజలి. పుణే డెక్కన్‌ ‌కళాశాలలో పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌కోనసీమ జిల్లాలోని అమలాపురం ఎస్‌కేబీఆర్‌ ‌కళాశాలలో పనిచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యోగం వదలి 35 ఏళ్ల నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. సమాంతర వాస్తవికతకు ఒక తాత్త్విక  కోణాన్ని ఆయన తన రచనలకు అద్దుతారని విమర్శకులు చెబుతారు. ఆయన కథలు చదవకుండా తెలుగు కథా సాహిత్యం చదివినట్టు కాదన్నంత కీర్తి సంపాదించుకున్నారు. గాథాసప్తశతిలోని 100 కథలను ‘అడవిపూలు’ పేరుతో అనువదించారు. కథలతో పాటు కవిత్వం, నాటకం, నవలా పక్రియలను కూడా చేపట్టారు. పతంజలికి అభినందనలు.

చాలా ఏళ్ల కిందట అంటే ఇరవై ఏళ్ల కిందట అయి ఉండొచ్చు. ఆంధప్రభ వారపత్రికలో ‘జెన్‌’ అనే శీర్షికతో ఒక కథ చదివాను.

‘జెన్‌’ అనే పదం పట్ల ఉన్న ఆసక్తే కాక రచయిత పట్ల ఉన్న ఆసక్తి కూడా దానికి కారణం. చదివేక రెండింటి పట్లా నా అభిమానం మరింత పెరిగింది.

అప్పటికే ఆయన రాసిన ‘హోరు’ నవల చదివి ఉన్నాను. ఆ నవలికతోనే నేను ఆయన అభిమానిగా మారేను. మా చినవీరభద్రుడు అప్పటికి రాజమండ్రిలో ఉండేవాడు

తనని ‘ఎవర్రా ఈయన!’ అని అడిగేను. ‘‘మన సాహితీవేదిక మిత్రుడే. నువు చాలాసార్లు చూసావు’’ అన్నాడు.

ఏమో! చూసేనేమో గానీ, ఈ హోరు నవల ఆయనను ప్రత్యేక వ్యక్తిని చేసింది నాకు. అలా తల్లావఝల పతంజలిశాస్త్రి గారు నాకు మిత్రు లయ్యారు అప్పటికి.

అదే ఆసక్తితో ఈ జెన్‌ ‌కథ-ఎప్పటికీ మర్చి పోనివ్వని కథ చదివాను.

త్రిపుర కథలు పుస్తకం నా దగ్గర రెండు కాపీలు ఉండేవి. మొదటి ముద్రణ పుస్తకం. ఒకటి ప్రయాణాల్లో, ఒకటి ఇంట్లో ఉన్నప్పుడూ చదువు కుంటూ ఉండేదాన్ని. మూడో పెగ్‌ ‌జిన్‌ అని రాస్తారు ఆయన. అదేమో గానీ ఆ కథల మత్తు అలాగే నెమ్మదిగా నరాల్లోకి ఎక్కేది. ఆ మత్తులోకి జిన్‌ ఏమో గానీ, జెన్‌ అన్న పదం చేరింది. వినడం వేరు. అది నరాలలోకి ప్రవహించడం వేరు.

ఇక దాని మీదనే పతంజలిశాస్త్రి గారి కథ.

కథంతా ప్రతీకాత్మకమే.

తండ్రి నాయుడుగారు. కొడుకూ కోడలూ దగ్గర ఉంటారు. కొడుకు కృష్ణకి తండ్రి మీద గౌరవం, కోడలికీ అభిమానమే. మరే అపోహలూ లేని కుటుంబం. కొడుక్కి హైదరాబాద్‌ ‌నగరంలో ఉద్యోగం. స్కూటర్‌ ‌వాడుతూ ఉంటాడు. కానీ అది అతని మాట విననట్టే ఉంటుంది. నాయుడి గారి భాషలో ‘‘అతనికీ రోడ్డుకీ ఇతర వాహనాలకీ సంబంధం ఉన్నట్టు కనిపించదు. వాహనాన్ని శిక్షిస్తూ వెళ్లిపోతాడు. స్కూటరు అతని శరీరానికి అతుక్కున్న ఇనపముక్కలా దాన్ని త్వరగా వదిలించుకోవాలనే ఆదుర్దాతో కనిపిస్తాడతను.’’

అతని చేతిలో అది మొరాయిస్తూనే ఉంటుంది. అతని విసుగూ చిరాకూ మరింతగా దాని మీద చూపెడతాడు. కిక్‌కి కదలకపోతే కాలితో ఒక్క తన్ను తంతూ ఉంటాడు.

అసలు పతంజలిశాస్త్రి గారు కథ మొదలు పెట్టడమే ఈ వాక్యాలతో మొదలు పెడతారు.

‘‘గేటు ముందర స్కూటరు భయంకరంగా పొరబోయి దగ్గుతోంది. కిక్‌ ‌కొట్టే కొద్దీ పొడి దగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున్న జాడలేదు.’’

ఈ వాక్యమే కథంతటినీ చెప్తుంది. యంత్రం బాధ నాయుడికి ఇలా వినిపించడంలోనే ఆయన ఏమిటో చెప్పేడు రచయిత.

కొడుకు దాన్ని బూతులు తిట్టి నాలుగు తన్నులు తన్నేక తండ్రి ఆగమని వచ్చి నిదానంగా చూసి సరిచేసి, ‘ఓవర్‌ ‌ఫ్లో అవుతోంది, చూసుకో! అని నిర్విచారంగా స్టార్ట్ ‌చేసి ఇస్తారు.

 కథంతా చెప్పేసినట్టే.

నాయుడుకి కోడలి దగ్గర కాస్త దగ్గరితనం. ఆమెకు డైనింగ్‌ ‌టేబుల్‌ ‌దగ్గర తన జ్ఞాపకాలు చెప్తూ ఉంటాడు. రోజూ ఇంచుమించు అలాంటివే. అయిదు వందల నలభైరెండోసారి వింటూ ఓపికగా నవ్వుకుంటుంది. నిజానికి పదహారోసారి నుంచే వినడం మానేసింది. కానీ ఆయన ఆమెతో మాటాడడు. తనకి తనే చెప్పుకుంటాడేమో!

 ఆయన కళ్లలో సముద్రం, అడవికొంగలూ కనిపిస్తాయి ఆమెకు. ఒకోసారి కళ్లజోడు పెట్టుకున్న కొంగలా కనిపిస్తారు ఆమెకు.

అదీ ఆయన తాదాత్మ్యం

నిత్యకృత్యాలయ్యాక ఆయన అమ్మతల్లి ముందు కూర్చుంటారు. ‘‘జానపదుల పూజారిలా నాయుడు గారు. భక్తిగా, ప్రేమగా, ఓపిగ్గా అమ్మతల్లిని సేవిస్తుంటారు.’’

అమ్మతల్లి పాత బ్రిటిష్‌ ‌మోడల్‌ ‌కారు. మిత్రుడు ‘‘అమ్మితే ఏమీరాదు, సరదా ఉంటే పట్టుకెళ్లి చూడు’’ అంటే తెచ్చుకున్నారు

రోజూ దాన్ని చక్కగా తుడిచి, లోపం వెతికి శ్రద్ధగా సరిచెయ్యబోయి ఐనా కుదరకపోయినా విసుగు ఎరగని దినచర్య.

ఇంజన్‌ ‌లోపలి పొగలు ఆర్పి మళ్లీ లోపం వెతకడానికి చిరునవ్వుతో సిద్ధమయ్యే మామగారు కోడలికి ఆశ్చర్యం.

ఆయన చిన్నస్థలం కొని కట్టిన ఇల్లు. పెంచుకున్న పూలమొక్కలు. గోడ బయట తురాయి మొక్క నాటారాయన. చైత్రం నుంచి అది కెంపులు పూస్తుంది. ఉదయం, సాయంత్రం నాయుడుగారు గోడవతల పూసిన ఎర్ర పూవుల్ని చూసి వస్తుంటారు. ఆయన్నలా చూసిచూసి కోడలు మావగారే అలా ఎర్రగా పూసివస్తారనుకుంటుంది. ఆయన నీళ్లు పోస్తున్నప్పుడు పూలతో మాట్టాడతారని కొడుకు నమ్మకం.

ఇలా నడుస్తుంది కథ.

కృష్ణ విసుగూ చిరాకులవల్ల భార్యాభర్తలు సయోధ్యగా ఉండలేకపోవడం అయనకు తెలుస్తూనే ఉంటుంది. కోడలి నెమ్మది తెలుసు.

అర్ధరాత్రి నల్లటి సముద్రాన్ని ఈదుకుని వచ్చి పెద్ద పెద్ద వందల తాబేళ్లు రహస్యంగా ఒడ్జున ఇసుక బొరియల్లో గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయే ఉదంతం ఆయన అనుభవంగా  కోడలికి చెప్తాడు. అవి గుడ్డు పెట్టినప్పుడు ఆ నిశ్శబ్దంలో టప్‌ ‌టప్‌మనే చప్పుడు కూడా విన్నానంటాడు. వేల గుడ్లలో కొన్ని మాత్రమే పిల్లలయి తిరిగి కొంతకాలానికి సముద్రంలోకి వెళ్లిపోతాయిట.

ఇలాంటి సృష్టి విచిత్రాల పట్ల ఆయనకు ఆరాధన అని కోడలికి తెలుసు. కానీ ఈ పాతబడి చెడిపోయిన వాహనాన్ని ఆయన ఎందుకు బావు చెయ్యరో అర్థం కాదు ఆమెకు. ఒక్కసారి కూడా ఆయన విసుక్కోవడం, చిరాకు పడడం చూడలేదామె. పైగా యంత్రాలు ఆయన నాడి తగలగానే ప్రాణంతో కట్టుకుని కెవ్వుమన్నట్టుంటాయట.

కొడుకు కూడా ‘‘ఎందుకు నాన్నా అది! పైసాకి కూడా పనికి రాదు. ఎందుకు బాగుచెయ్యడం!’’ అంటాడు

పైగా ‘‘ఆఫీస్‌ ‌నుంచి వస్తూనే వరండాలో మెషీన్‌ ‌కళేబరాన్ని చూశాడు కృష్ణ’’ అని రాస్తారు.

దానికి నాయుడు ‘‘లాభం గురించి కాదయ్యా! అసలు ట్రబుల్‌ ఏమిటో చూస్తున్నాను. రన్నింగులో పెడితే మంచిదని, పెర్ఫెక్ట్‌గా స్మూత్‌గా నడిపించాలని!’’

ఈ మాటల్లోంచి ఎంత లోతైన భావమేనా తోస్తుంది.

ఈ కథకి ‘జెన్‌’ అని పేరు పెట్టేరు శాస్త్రి గారు. కథని ఇంకా వివరించే దుర్మార్గానికి పూనుకోను

కానీ ‘జెన్‌’ ‌గురించి మరో రెండు మాటలు చెప్పాలని ప్రలోభం. ఎవరికి తెలియదని!!!?

కానీ చెప్పేనుగా ప్రలోభమని. ఈ సందర్భంలో అవసరమేమో అని కూడా అనిపించింది.

‘జెన్‌’ ‌బౌద్ధంలో జాపనీ పదమైన ‘సతోరీ’ అనేదానికి ఎంతో విలువ ఉంది. నిజానికి సతోరీ లేంది జెన్‌ ‌లేదు. సతోరీ అంటే మేధకు అందని ఒక మెరుపులాంటి అద్భుత జ్ఞానోదయం. ఒక పారదర్శక దృష్టి. దానికి అందని వస్తువుండదు. ఆలోచన ఉండదు. అనుభూతి ఉండదు.

 నీవు సతోరీని కలిగి ఉంటే ఒక్క గడ్డిపోచ మీద రాజ భవనాన్ని నిర్మించవచ్చు. కానీ నీవు సతోరీని కలిగి ఉండనప్పుడు ఒక్క గడ్డిపోచయే రాజ భవనాన్ని కనపడకుండా కప్పి వేస్తుంది.

అందరికీ తెలిసిన ఉదాహరణే. సరదాగా చూద్దాం!

ఒక సజీవమైన బాతు ఒక సీసాలో ఉంటుంది. ఆ సీసా మూతి సన్నగా ఉంటుంది. ఆ బాతుకు హాని కలగకుండా ఆ సీసాని పగల గొట్టకుండా ఆ బాతును సీసా నుండి బయటకు తేవాలి. ఇటువంటి అసాధ్యం సాధ్యం ఎట్లా అవుతుంది?

అదిగో ఆ బాతు బయటకు వచ్చేసింది అని గ్రహించడమే పరిష్కారం. ఈ సృష్టియే సాధ్యమై నప్పుడు, ఇక ఈ సృష్టిలోనిది ఏది సాధ్యం కాదు? క్రియతో సాధ్యం కానిది భావనతో సాధ్యం అవుతుంది. భావనతో సాధ్యమైనది ఒక నాటికి క్రియలో సాధ్యమౌతుంది.

ఇప్పటికీ ప్రకృతి శక్తులన్నింటినీ మనిషి ఎందుకు జయించలేకపోయినాడూ అంటే మనిషి కంటే ప్రకృతి ఎన్నో కోట్ల సంవత్సరాలు వయసులో పెద్దది. అది సంతరించుకున్న శక్తిని మనిషి పూర్తిగా సంతరించు కోలేడు. అంటాడు సంజీవ్‌ ‌దేవ్‌. ‌కాబట్టి బయటి ప్రకృతిని లోపలి ప్రకృతిని తెలుసుకోవాలంటే ప్రతీ పనీ ధ్యానంతో చెయ్యాలన్నది జెన్‌ ‌భావన.

నాయుడిగారి అమ్మతల్లి ఎప్పటికైనా ఆయన చేతులలో రిపేరింగ్‌ ‌పూర్తిచేసుకుని స్మూత్‌గా నడుస్తుంది సుమా అనిపించేలా పతంజలిశాస్త్రి ఆశ పెడతారు.

నేనూ అలాగే ఏ జిన్‌ ‌లోకో, జెన్‌ ‌లోకో ప్రయాణం చెయ్యాలని ఆశ పడుతూ ఉంటాను. అది వదలని ఆశ. దైనిందన జీవితంలోకి ధ్యానం తేవాలన్న ఆ దురాశ వదలదు.

 అర్ధరాత్రి సముద్రపు ఒడ్డునుంచి చూస్తే నక్షత్రాల్ని ఎవరో కడిగి పొదిగి నట్టు మిలమిల మంటాయట. ఆయన రాస్తారు.

ధ్యానం కూడా దైనందన అనుభవాలను అలా చేస్తుందేమో!

పతంజలిశాస్త్రి గారు నగిషీ పని బాగా తెలిసిన స్వర్ణకారుడు. అవార్డులు ఆయనకు ఎంతో ఆలస్యంగా ఇస్తారు. అయినా కొంపేమీ ములగదు.

మాలాంటి అభిమానులం మెండుగా ఆయన కథల కోసం కాచుకుని ఉంటాం. చాలుకదా!

– వాడ్రేవు వీరలక్ష్మిదేవి

About Author

By editor

Twitter
YOUTUBE