దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన సంస్థ అంటూ కాంగ్రెస్‌ను కీర్తించేవాళ్లు ఇకనైనా కళ్లు తెరవాలి. అసలు కాంగ్రెస్‌ పార్టీయే స్వాతంత్య్రం, స్వాతంత్య్ర పోరాటంతో వచ్చిన జాతీయ సమైక్యత, గాంధీజీ, నెహ్రూ వంటి పదాలకు నీళ్లు వదలడం కూడా ధర్మం. అప్పుడే ఆ పార్టీ నిజాయతీ ఏమిటో దేశానికి తెలుస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్‌ పోరాటం లక్ష్యం దేశం మొత్తానికి స్వాతంత్య్రం. ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ విభజన తేవడం కాదు. రెండు భౌగోళిక ప్రాంతాల విభజన కృతకమన్నదే నాటి కాంగ్రెస్‌ విస్పష్ట విధానం. చిరకాలం పాటు జిన్నా విభజనవాదాన్ని అడ్డుకున్న కాంగ్రెస్‌ ఉత్తర, దక్షిణ భారత వాదాన్ని ఎలా సమర్థిస్తుంది? ఇప్పుడు ఈ అభిప్రాయాలూ, విలువలూ కాంగ్రెస్‌లో లేవు. ఓట్లు తెచ్చుకోవడానికి మాత్రమే గాంధీ`నెహ్రూ పేర్లను కాంగ్రెస్‌ గౌరవిస్తున్నది. లేకపోతే చాలామంది స్వాతంత్య్రం సమరయోధులని వదిలిపెట్టినట్టే ఆ రెండు పేర్లనీ కూడా కాలగర్భంలో కలిపేసేది.

స్వరాజ్య సమరస్ఫూర్తికి కాంగ్రెస్‌ ఏనాడో సుదూరంగా జరిగింది. ఇక దేశానికి స్వాతంత్య్రం తెచ్చినది కాంగ్రెస్‌ సంస్థ అన్నది కూడా అర్థసత్యం కాబట్టి ఆ కీర్తి ఇంకా తనకు దక్కాలని అనుకో కూడదు. ప్రస్తుత కాంగ్రెస్‌ పోకడను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎన్నికలలో విజయం దక్కకపోతే విభజన రాజకీయాలను ఆశ్రయించడమేనా? అధికారపీఠం సుదూరంగా ఉందని తెలిస్తే ఇక విధ్వంసక పోకడలను నమ్ముకోవడమేనా? ఇది ఏ రాజకీయ పార్టీ అయినా ఒక దేశం పట్ల అనుసరించవలసిన వైఖరే అవుతుందా?

2023 ఆఖరులో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ చేత చాలా విషయాలు మాట్లాడిరచాయి. అందులో ఉత్తర దక్షిణ భారతాలు అనే అంశం కూడా ఒకటి. ‘దక్షిణ భారతం, ఉత్తర భారతం మధ్య సరిహద్దు గీతకు మరింత స్పష్టత వచ్చింది’ ప్రవీణ్‌ చక్రవర్తి అనే కాంగ్రెస్‌ నాయకుడు ‘ఎక్స్‌’లో పెట్టిన వ్యాఖ్య ఇది (తరువాత ఉపసంహ రించుకున్నారు). సీఆర్‌ కేశవన్‌ అనే బీజేపీ నాయకుడు చక్రవర్తి రెండు పోస్టులు పెట్టి, చేసిన ఈ ఘనకార్యం గురించి దేశం దృష్టికి తీసుకువెళ్లారు. సనాతన ధర్మ నిర్మూలన చేయాలంటూ గొడవ తెచ్చి విఫలమైన కాంగ్రెస్‌, దాని మిత్రపక్షం డీఎంకే ఇప్పుడు మొత్తంగా ఉత్తర దక్షిణ వేర్పాటు గురించి మాట్లాడు తున్నాయని తమిళనాడుకు చెందిన ఆ బీజేపీ నేత వ్యాఖ్యానించడం సరైనదే. సనాతన ధర్మ నిర్మూలన నినాదం, కుల ఆధారిత జనాభా లెక్కలు ఇవన్నీ కూడా కాంగ్రెస్‌, దాని మిత్రుల కుట్రగానే చాలా మంది భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌కే చెందిన తహెసిన్‌ పూనావాలా వంటివారు ఇలాంటి నినాదాలు తెస్తే బెడిసికొడుతుందని హెచ్చరిస్తున్నారు. తహెసిన్‌ చాలా చక్కని మాటలు చెప్పారు. ‘మీరు ఉత్తర దక్షిణ భారతాలు అనే విషయం జోలికి పోవద్దు. బెడిసికొడుతుంది. అసలు కాంగ్రెస్‌ వారసత్వానికే చేటు చేస్తుంది. కాంగ్రెస్‌ అంటే ఈ గొప్ప దేశంలో జాతీయవాదాన్ని సమర్ధించే అత్యంత పురాతన పార్టీయే కాదు, మొట్టమొదటిది కూడా’ అని ఆయన గుర్తు చేశారు. ఇంకొక మంచిమాట కూడా ఆయన చెప్పారు. ‘సనాతన ధర్మ నిర్మూలన నినాదాన్ని ప్రజలు ఎలా అంగీకరించలేదో, ఉత్తర భారతం, దక్షిణ భారతం అన్న అభిప్రాయాన్ని కూడా వారు గౌరవించరు’. కొందరు బుర్ర తక్కువ జర్నలిస్టులు కూడా ఆ ఎన్నికల ఫలితాలలో ఉత్తర, దక్షిణ భారతాల అంశం తీసుకువచ్చారు. పరంజోయ్‌ గుహ ఠాకూర్‌ అలాంటివారిలో ఒకరు. ‘ఈ ఎన్నికలలో హిందుత్వ సంకీర్ణమే గెలిచింది. కాంగ్రెస్‌ చెప్పే సౌమ్య హిందుత్వం విఫలమైంది. ఆ విధంగా ఉత్తర`దక్షిణ భారత విభజన పదునెక్కింది’ అన్నాడతడు. మరొక పత్రికా రచయిత ఎంకే వేణు కూడా ఇలాంటి అభిప్రాయమే చెప్పారు. ఇలాంటి చెత్త అభిప్రాయాలు వ్యక్తం చేసినవారంతా తలబొప్పి కట్టేటట్లు జనం చేత చీవాట్లు తినవలసి వచ్చింది. ‘ఉత్తర భారతం లేదు. దక్షిణ భారతం లేదు. తూర్పు, పశ్చిమ భారతాలు కూడా లేవు. ఉన్నది ఒక్కటే భారత్‌. భారతీయులు నివశించే భారత్‌ ఒక్కటే’ అన్నారు మరొక పత్రికా రచయిత సావియో రోడ్రిగ్స్‌. ఒకవేళ బీజేపీ నెగ్గింది కాబట్టి ఉత్తర భారతదేశాన్ని వేరుగా చూడాలని అనుకుంటున్న అజ్ఞానులకు యశ్వంత్‌ దేశ్‌ముఖ్‌ అనే రాజకీయ విశ్లేషకుడు మంచి సమాధానం ఇచ్చారు. గత ఏడాది కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ‘2024 లోక్‌సభ ఎన్నికలలో కర్ణాటకలో బీజేపీ ఘనవిజయం సాధిస్తుంది. అప్పుడేమంటారు?’ అన్నారాయన. అలాగే ఉత్తర భారతం అంటూ, కాంగ్రెస్‌ను అక్కడే పరిమితం చేయదలుచుకున్నవారి కళ్లు తెరిపిస్తూ దేశ్‌ముఖ్‌ మరొక విషయం కూడా చెప్పారు. వచ్చే ఎన్నికలలో కేరళలో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీయే అన్నారాయన. ఇలాంటి వాదనలు వింటున్న ఈ తరుణంలో లోక్‌సభలో వాస్తవాలు ఏమిటి? దక్షిణాది నుంచి కాంగ్రెస్‌ కంటే బీజేపీకే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. కర్ణాటక నుంచి 25, తెలంగాణ నుంచి 4 స్థానాలు అంటే 29 స్థానాలు బీజేపీవే. సాగరికా ఘోష్‌ అనే మరొక కుహనా మేధావి విశ్లేషణ మరీ హాస్యాస్పదం. పుదుచ్చేరి మినహా దక్షిణాది బీజేపీ ముక్త్‌ దక్షిణ భారత్‌ట! హిమాచల్‌ మినహా ఉత్తరాది కాంగ్రెస్‌ ముక్త్‌ ఉత్తర భారతదేశమట. 2024 ఎన్నికలలో ఈ విభజన మరింత పెరుగుతుందట.

ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం.. ఇవి వేర్వేరు అన్న భావన దగ్గరకు భారతీయులను క్రమంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ, ఈ పార్టీ అనుంగు మిత్రపక్షం ద్రవిడ మున్నేట్ర కళగం కంకణం కట్టుకున్నాయని చెప్పక తప్పదు. జర్నలిస్టుల పేరుతో, ఉదారవాదులుగా చలామణి అవుతున్న వీటి తోకలు, జర్నలిస్టులు కూడా ఈ వ్యర్థ ప్రయత్నానికి కొమ్ము కాస్తున్నాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ వారసత్వం తమదేనని పదే పదే చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ తన మూలాలు ఏక భారత్‌ భావనలోనే ఉన్నాయన్న సంగతిని తుంగలో తొక్కుతూ ఉంటే, దాని మిత్రపక్షం ఇంతకాలం భయపడి దాచిపెట్టుకున్న ప్రత్యేక తమిళస్థాన్‌ వాదాన్ని ఇప్పుడు తెంపరితనంతో ముందుకు తెస్తున్నది. ఇందుకు కారణం ఒక్కటే. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్‌ పార్టీకి నామరూపాలు లేకుండా పోవడం. తమిళనాడులో కూడా జాతీయవాద భావాలు పదునెక్కుతూ ఉండడం, ఫలితంగా ద్రవిడవాదం కాలగర్భం వైపు శరవేగంగా కదలడం రెండవది. కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేసి, కాంగ్రెస్‌ విముక్త భారత్‌ కోసం తపిస్తున్న బీజేపీ ఉత్తర భారతంలో చాలావరకు తన నినాదాన్ని నిజం చేసేసింది. ఇప్పుడు తమిళనాడులో దాదాపు వందేళ్ల నుంచి వేళ్లూనుకుని ఉన్న ద్రవిడ వాద మూలాలను పెకలించడానికి బీజేపీయే సంసిద్ధమవుతున్నది. ఈ తరుణంలో ఆ రెండు పార్టీలు కలసి జమిలిగా ఉత్తర భారత, దక్షిణ భారత విభజన నినాదంతో ముందుకు నడిచే ప్రయత్నం చేస్తున్నాయి. తమ రాజకీయ మనుగడకు ఆ విధంగా కొనసాగింపునివ్వాలని ఉవ్విళ్లూరు తున్నాయి. చిత్రంగా ఇది రెండు కుటుంబాల రాజకీయ అస్తిత్వానికి సంబంధించిన బాధ. వారసత్వ రాజకీయాలను కాపాడేందుకు కొందరు పడుతున్న ఆరాటం. వాటి కోసం అవి ఉత్తర దక్షిణ వేర్పాటు నినాదాన్ని అస్త్రంగా వాడుకోవడం ఎంత దౌర్భాగ్యం? ఎంత దేశద్రోహం? ఇంతకంటే ఘోర దౌర్భాగ్యం ఇంకొకటి ఉంది. ఈ పార్టీ నాయకులే బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. మోదీ చేసినదేమిటి? తమిళ చరిత్రకు ప్రతీక అనదగిన సెంగోల్‌ను పార్లమెంట్‌లో ప్రతిష్ఠించారు. కేరళీయుల చరిత్ర ఉత్తుంగ శిఖరం ఆది శంకరాచార్యుల శిలా విగ్రహాన్ని హిమాలయాలలో పునఃప్రతిష్ఠించారు. నిన్నగాక మొన్న లక్షద్వీప్‌కు మహా వైభవం తీసుకురావడానికి యోజన చేస్తున్నట్టు చెప్పారు. వరదలతో, వర్షాలతో మునిగిపోతున్న కేరళకు వైద్య బృందం సహా వెళ్లి బాధితుల పట్ల తన సంఫీుభావం ప్రకటించి వచ్చారు. వారంతా తమిళులనో, మలయాళీలనో ఆయన చూడలేదు. వారిని భారతీయ సంస్కృతికి మూల విరాట్టులుగా చూశారు. లేదంటే సాటి భారతీయులుగా చూశారు.


కాశీ తమిళ సంగమం

నిత్య జీవితంలో, పూజలో భారతీయులు దేశం మొత్తాన్ని స్మరించుకుంటారు. గంగా, యమున, గోదావరి, కావేరి వంటి నదులను తలుచుకుంటారు. వారు చేసే స్నానంలో ఈ నదీజలాలన్నీ ఉన్నాయని కల్పన చేసుకుంటూ మంత్రాలు చదువుకుంటారు. సౌరాష్ట్రలోని సోమనాథం నుంచి సేతువు దగ్గరి రామేశం వరకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవన్నీ భారతీయులకీ, ప్రధానంగా హిందువులకీ ఆరాధనీయ స్థలాలే. దర్శనీయ క్షేత్రాలే. అంటే ఒక ఆధ్యాత్మిక ఏకత్వం ఈ దేశంలో గొప్ప నిజం. ఈ తాత్వికతలో ఈనాడు మనం చూడవల సింది ఐక్య భారతదేశం. దీనిని అనుసరిస్తున్నదే మోదీ ప్రభుత్వం. ‘ఏక్‌ భారత్‌`శ్రేష్ఠ భారత్‌’ అన్నది నరేంద్ర మోదీ నినాదం. ఇది ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నుంచి పుట్టిన నినాదమే. అలాగే 2020 కొత్త విద్యావిధానానికి మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించినది కూడా. ఈ క్రమంలోనే  ఉత్తర భారతదేశానికీ, దక్షిణ భారతావనికీ యుగాలుగా ఉన్న ఆధ్యాత్మిక తాత్విక బంధాన్ని గుర్తు చేయడానికి తలపెట్టిన కార్యక్రమమే కాశీ`తమిళ సంగమం. దీనిని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఐఐటీ మద్రాస్‌, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం కలసి నిర్వహిస్తున్నాయి. ఏటా నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంగమానికి హాజరయ్యే వారికి భారత రైల్వే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది. నవంబర్‌ 19, 2020న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని స్వయంగా ప్రారంభించారు. అయితే దీనికి హిందూ వ్యతిరేక డీఎంకే ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మద్దతు ఇవ్వడం లేదు. కానీ తమిళనాడుకు చెందిన చాలామంది విద్యావంతులు, పండితుల నుంచి మాత్రం మంచి ఆదరణ లభించింది.

భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఉపన్యాసాలు ఇచ్చే వారు ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారతాల ప్రస్తావన తీసుకురావడం ఆధునిక భారతదేశ చరిత్రలోనే విషాదం. కొన్ని యుగాలుగా కలసి ఉన్న ఇన్ని వైవిధ్యాలు రెండు మూడు ఎన్నికలలో కొన్ని రాజకీయ పార్టీల ఓటమితో ఈ దేశం నుంచి కనుమరుగు కావాలా? నిజానికి ఆధునిక కాలంలో ఈ వైవిధ్యం మరింత బలపడాలి. అదే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తున్నది.

తమిళనాడు, వారణాసి చరిత్రలో కనిపించే రెండు అత్యున్నత విద్యాకేంద్రాలు. అందుకే వీటిని కలుపుతూ కాశీ`తమిళ సంగమం కార్యక్రమం ఏర్పాటయింది. మొదటి సంగమం నవంబర్‌ 16 నుంచి డిసెంబర్‌ 16 వరకు కాశీలో జరిగింది. తమిళనాడులోని 12 రాష్ట్రాల నుంచి 2500మంది పాల్గొన్నారు. వారంతా వారణాసి, ప్రయాగ, అయోధ్య వంటి చుట్టుపక్కల ప్రదేశాలను కూడా సందర్శించారు.


దశాబ్దకాలంలో గణనీయమైన విజయాలు సాధించి మూడోసారి కూడా మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలాముందే పలు సర్వేలు మోత మోగించడం, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ తాజాగా అనూహ్య విజయం సాధించడం విపక్షాలను, ప్రధానంగా కాంగ్రెస్‌ను బెంబేలెత్తిస్తున్నది. ఆ క్రమంలో కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న విమర్శలు జాతిని విస్తుపోయేటట్టు చేస్తున్నాయి. అలాగే మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ల వాచాలత్వం కూడా ప్రమాదకరంగా పరిణమించింది. పదేళ్ల మోదీ నాయకత్వంలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నదే వారి ప్రధాన ఆరోపణ. ఇక్కడే ఒక ప్రశ్న. జవాహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ వీళ్లంతా ఉత్తర భారతదేశం నుంచే ప్రధానంగా గెలిచారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి, పీవీ నరసింహారావు (మహారాష్ట్ర), మన్మోహన్‌సింగ్‌ (అస్సాం) కూడా దక్షిణ భారతదేశం నుంచి నెగ్గినవారు కాదని గుర్తుందా? అయినా ఇప్పుడు చిక్కబడిన ఉత్తర దక్షిణ రేఖకు మేం అవతల ఉన్న దక్షిణాదికే చెందుతామని కాంగ్రెస్‌ ఎలా వాదిస్తుంది? ఇందిర ఒకసారి చిక్‌మగళూరు (కర్ణాటక), మెదక్‌ (తెలంగాణ) నుంచి పోటీ చేసి గెలిచారు. దాదాపు నలభయ్‌ ఏళ్లు దేశాన్నీ, కాంగ్రెస్‌ పార్టీనీ ఏలారు. కాబట్టి ఉత్తర భారతదేశం లేదా మొత్తం భారతదేశం వెనుకబడిపోయిందేమిటని ప్రశ్నించవలసింది ఎవరిని? ఒక్క కర్ణాటకలో విజయాన్ని, తెలంగాణలో తాజా విజయాన్ని చూసుకుని కాంగ్రెస్‌ దక్షిణ భారతం వేరు అన్న వేర్పాటువాద కుక్కతోక పట్టుకుని అధికార పీఠం దగ్గరకి ఈదాలని ఆశపడుతోంది. కాబట్టి ఇటీవలి ఎన్నికల చరిత్ర ప్రకారం ఉత్తర భారత దేశంలో ఆ పార్టీకి ఇప్పటికీ ఉన్న 40 శాతం ఓట్లను ఆ పార్టీ కాలదన్నాలని అనుకుంటున్నదా? అన్నది విశ్లేషకుల ప్రశ్న. బీజేపీని ఉత్తర భారతదేశపు పార్టీ అని చెప్పడం ఎంత అవివేకమో ఆ పార్టీ ప్రముఖు లకు కూడా తెలియడం లేదు. దక్షిణ భారతదేశంలో అసలు బీజేపీ ఉనికే లేదనడం కొందరు చెత్త కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు, కమ్యూనిస్టులు చేసే వాదన మాత్రమే. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు చాలు, బీజేపీ విమర్శకులంతా ఎంతగా ఉష్ట్రపక్షి మాదిరిగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 6.98 శాతం ఓట్లు సాధించింది. 2023 ఎన్నికలలో ఆ ఓటింగ్‌ను 13.90 శాతానికి పెంచుకుంది. ఇప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసినట్టే చెప్పాలి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ అత్యంత నిరాశాజనకమైన ఫలితాలను ఇచ్చింది. బీజేపీ కర్ణాటకలో చిరకాలం అధికారంలో ఉంది. తమిళ నాడులో పొత్తులతోనే అయినా కొన్ని సీట్లు గెలిచింది. కేరళలో ఇప్పుడిప్పుడు కొన్నిచోట్ల బీజేపీ పట్ల మొగ్గు కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బలహీనంగానే ఉన్నా, ఒకప్పుడు ఇక్కడ నుంచి లోక్‌సభకు బీజేపీ నుంచి అభ్యర్థులు వెళ్లారు.

బీజేపీ వ్యతిరేకత ఆధారంగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, వీళ్ల తైనాతీలు చేస్తున్న వాదనలో గుడ్డి ద్వేషమే ఉంది. బీజేపీ ఉత్తరాదికి పరిమితమైన పార్టీ కాదని చెప్పడానికి ఇవాళ కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. ఈశాన్య భారత్‌లో ఇప్పుడు ఆధిక్యం చూపుతున్న పార్టీ బీజేపీయే. మిజోరంలో కూడా ఆ పార్టీ విజృంభించింది. సైహా, పలాక్‌ అసెంబ్లీ స్థానాల స్వరూప స్వభావాలు, అక్కడ బీజేపీ సాధించిన విజయం భారతదేశానికీ, విపక్షాలకూ పెద్ద పాఠమే చెప్పగలవు. సైహాలో 90.1 శాతం అక్షరాస్యులు. 97.1 శాతం క్రైస్తవులు. పలాక్‌ నియోజకవర్గంలో 93.6 శాతం అక్షరాస్యులు. 98.2 శాతం క్రైస్తవులు. ఈ రెండు నియోజకవర్గాలలోను బీజేపీయే గెలిచింది. ఈ వాస్తవాలన్నీ ఉన్నా బీజేపీని ఉత్తరాదివారి పార్టీ, అగ్రకులాల వారి పార్టీ అని పాడిరదే పాడడం చాలామంది మానడం లేదు. ఇంతటి అజ్ఞానం ప్రదర్శిస్తున్నవారిలో కేవలం రాజకీయ ప్రయోజనాలే కీలకంగా ఉండే నాయకులే కాదు, స్వయం ప్రకటిత మేధావులు కూడా చాలా మందే ఉన్నారని అర్ధమవుతుంది. ఈశాన్యం, పశ్చిమ బెంగాల్‌, జమ్ముకశ్మీర్‌లలో కూడా బీజేపీ ఉనికి తక్కువని ఎవరూ అనలేరు. మరొక వాస్తవం కూడా తెలియాలి. బీజేపీని 1980లో స్థాపించారు. కర్ణాటక అసెంబ్లీకి 1983లో జరిగిన ఎన్నికలలోనే ఈ పార్టీ 18 స్థానాలు గెలిచింది. ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి. హిందీ భాష మాట్లాడే ప్రాంతాల పార్టీగా, కౌబెల్ట్‌ పార్టీగా, బనియాల పార్టీగా, ఔత్తరాహుల పార్టీగా బీజేపీని ఎంత చిన్నచూపు చూడాలన్నా సాధ్యం కాదు. ఆ పార్టీ నిర్మాణంలోనే ఒక సమున్నత సిద్ధాంతం ఉంది. అదే భారతీయ ఐక్యత. ఈ సిద్ధాంతం ముందు ఉత్తర భారతం, దక్షిణ భారతం వంటి పునాది లేని వాదనలు నిలబడవు.


పార్లమెంట్‌కు తమిళ సెంగోల్‌

నూతన పార్లమెంటు భవన ప్రారంభ సమయంలో ‘సెంగోల్‌’ను లోక్‌సభ స్పీకర్‌ ఆసనం పక్కన ఉంచుతామంటూ భారత ప్రభుత్వం ప్రకటించినప్పుడు పలు పార్టీలకు చెందిన నాయకులు దానిని ఎంతగా రాజకీయం చేశారో మనందరం చూశాం. ధర్మానికి పర్యాయ తమిళ పదమైన ‘సెమ్మెయ్‌’ నుంచి పుట్టిన ‘సెంగోల’్‌ అన్నది ఒక చారిత్రిక రాజదండం. బ్రిటిష్‌ పాలకుల నుంచి భారతీయులకు అధికారం మారిన సందర్భంగా ఆగస్టు 1947లో తమిళనాడుకు చెందిన ‘ఆధీనం’ దానిని తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు అందించడం, దానికి సంబంధించిన ఫోటోలు ఈ సందర్భంగానే బయిటకు వచ్చాయి. నిజానికి, దీని గురించి ప్రజలు మర్చిపోయారు. ఈ విషయాలు బయిటకు వచ్చిన తర్వాతే అలహాబాద్‌ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచిన సెంగోల్‌ను ఢల్లీికి తరలించారు.

తమిళ రాజులు ఈ రాజదండాలను సుపరిపాలన, న్యాయానికి సంకేతంగా ఉంచుకు నేవారంటూ తమిళ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ రాజవేలు వెల్లడిరచారు. దీని చరిత్ర తమిళనాడులోని చోళ వంశంనాటి కాలానిది. ఒక చక్రవర్తి నుంచి మరొక చక్రవర్తికి అధికారాన్ని బదిలీ చేస్తున్నప్పుడు దీనిని అందించేవారు.

తమిళ ప్రాచీన రచన, ‘తిరుక్కురల్‌’ సెంగోల్‌ ప్రాముఖ్యతను ప్రశంసిస్తుంది. ‘సెంగోనమెయ్‌’ అన్న శీర్షికతో ఒక అధ్యాయమంతా దీనిని గురించి చర్చిందని ఎస్‌ రాజవేలు వివరించారు. అంతేకాదు, తమిళ ఇతిహాసమైన ‘శిల్పతికారం’ కూడా సెంగోల్‌ ప్రాముఖ్యతను వివరిస్తుంది. సెంగోల్‌ను పార్లమెంట్‌ భవనంలో ప్రతిష్ఠించడం భారత ఐక్యత కోసమేనని ఇప్పటికైనా కుహనా రాజకీయనాయకులు గుర్తిస్తారా?


ఇలాంటి సందర్భంలోనే ఒక వాస్తవం దేశానికి అర్థమై ఉండాలి. భారతీయ జనతా పార్టీకి, అంతకు ముందు భారతీయ జనసంఫ్‌ుకీ ప్రజలు ఓట్లు వేశారంటే అది చెప్పిన భారతీయతను బట్టే. అది చెప్పిన ఆధ్యాత్మిక ఏకాత్మతతో భారతీయ జనత మమేకం కావడం వల్లనే. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పూర్తిగా పాదుకొనక పూర్వమే బీజేపీని భారతదేశం ఆదరించింది. మనం ఇంకా కోల్పోవడం కాదు, కోల్పోయినదేమిటో గ్రహించా లంటూ ఆ పార్టీ చెప్పే సిద్ధాంతం కారణంగానే ఆ పార్టీ ప్రజలకు దగ్గరయింది. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు విఫలమయ్యారు.

భారతదేశంలో లోపించినది రాజకీయ ఐక్యత అన్న వాదన కొట్టి పారవేయ లేనిది. కానీ సాంస్కృతిక ఏకత్వం ఎవరూ కాదనలేనిదే. రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని, పదవీ రాజకీయాల కోసమే పనిచేస్తున్న కొందరు, ఎన్నికల వేళలోనే హంగామా చేసే చాలామంది మరచిపోతున్న విషయం, బీజేపీ రాజకీయ ఏకత్వాన్ని సాధించడంలో చాలా ముందడుగు వేసింది. ఉన్న సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేయడానికి చరిత్రలో ఎన్నడూ జరగనంత కృషి కూడా చేస్తున్నది. జగద్గురువు ఆది శంకరుల తత్వాన్నీ, దేశ సమైక్యతలో ఆయన దృష్టినీ బీజేపీ దేశంలో ఇంతగా ప్రచారం చేయడం వెనుక ఉన్నది ఉత్తర దక్షిణ భారతాల మధ్య వైరుధ్యం ఏనాడూ లేదని చాటడానికే. స్వామి వివేకానంద, సుబ్రహ్మణ్య భారతిలను తరచు గుర్తు చేయడం కూడా ఆ ఉద్దేశంతోనే. 2013 నాటి పెను వర్షాలలో కనుమరుగైన ఆదిశంకరుల ప్రతిమను నరేంద్ర మోదీ తిరిగి ప్రతిష్ఠించారో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు తెలుసుకోవడం చాలా అవసరం. కాశీ`తమిళ సంగమ కార్యక్రమం, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో తమిళ భాష అధ్యయనానికి పీఠం ఏర్పాటు దేశ ఐక్యతా సందేశాన్ని చాటడానికే. నాటి కన్నడ తత్త్వవేత్త, గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుని విగ్రహాన్ని లాంబెత్‌ (లండన్‌)లో మోదీ ఆవిష్కరించడం కూడా మహనీయులు ఎక్కడ పుట్టినా, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు అయినా యావద్భారÛతావనికి ఆరాధనీయులేనని చెప్పడానికే. కవిగా బసవేశ్వరుని సేవలను కూడా మోదీ ప్రశంసిస్తూ ఉంటారు. అలాగే తమిళ మహాకవి తిరుక్కురల్‌ రచనలను కూడా మోదీ ప్రస్తావిస్తూ ఉంటారు. నాగరికతలకు సంబంధించిన వివాదాల గురించి ప్రస్తావించినప్పుడు మోదీ తిరుక్కురల్‌ రచనలను ప్రస్తావిస్తారు. ఐక్యరాజ్య సమితిలో ఇచ్చిన ఉపన్యాసంలో కూడా ఆయన తిరుక్కురల్‌ రచనలను ఉటంకించారంటే దేశంలోని అన్ని భాషలకు గౌరవం ఉందన్న విషయాన్ని తెలియచెప్పడానికే.

చాలాచిత్రంగా, మోదీ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చాలామంది కుహనా మేధావులు, ఉదారవాదులు దేశాన్ని మధ్యయుగాలకు తీసుకువెళ్లే ప్రయత్నంగా చిత్రించడం చూస్తున్నాం. వర్తమాన కాలాన్ని సరిచేసే శక్తి మన గతానికి ఉంటుంది. చరిత్రకు ఆ శక్తి ఉన్నట్టే, నాగరికతకూ, సంస్కృతికీ కూడా ఆ శక్తి ఉంటుందన్న ఇంగిత జ్ఞానం ప్రతిపక్షాలకు లేదు. కారణం` పదవీ రాజకీయాలు. ఎన్నికల రాజకీయాలు కూడా. ఇక బుజ్జగింపు పేరుతో సాగుతున్న సెక్యులర్‌ రాజకీయాలు ఈ పార్టీలను సర్వ భ్రష్టం చేశాయి. చాలాసార్లు వీటికి దేశం మీద ఉన్న గౌరవమర్యాదలను శంకించవలసిన పరిస్థితి.

ఇంత ప్రచారం చేస్తున్నా, ఉత్తర భారత పౌరులుగాని, దక్షిణ భారత పౌరులుగాని మూకుమ్మడిగా ఘర్షణలకు దిగిన వాతావరణం లేదు. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు పూర్తిగా రాజకీయ పార్టీల సృష్టి. అందులో సామాన్య ప్రజల ప్రమేయం కనిపించదు. తమ పార్టీ ఉనికికి భంగం వాటిల్లిందన్న అనుమానం వస్తే డీఎంకే హిందీ, హిందూ వ్యతిరేక నినాదం అందుకుంటుంది. ఆఖరికి పక్కనున్న కర్ణాటకను కూడా రాజకీయం కోసం ఉపయోగించుకునే లక్షణం ద్రవిడ పార్టీలకు ఉంది. కావేరీ జల వివాదం ఇప్పటికీ తెగడం లేదు. బ్రిటిష్‌ ఇండియా పాలనా కాలంలో వచ్చిన ఈ విభేదాలు, దూరాలు స్వతంత్ర భారతదేశంలో తగ్గిపోవాలి. కానీ అవి తగ్గకుండా కాంగ్రెస్‌ శతథా పాటు పడుతూనే ఉంది.

చారిత్రకంగా, నాగరికత పరంగా ఉత్తర భారతదేశం విదేశీ దండయాత్రలకు గురైన చరిత్ర కలిగి ఉంది. అవి ఉత్తర భారతదేశ చరిత్రను కొంత గాయపరిచాయి కూడా. అయినా ఉత్తర భారతదేశం చాలా సాధించింది. తనదైన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. సవాళ్లను ఎదుర్కొన్నది. ఆధ్యాత్మిక, విద్యా కేంద్రాలను కాపాడుకున్నది. వారణాసి, అయోధ్య, పాటలీపుత్ర, ఉజ్జయిని అలాంటివే. వంగదేశంలో పుట్టిన వివేకానందుడు కన్యాకుమారి వద్డ తపస్సు చేసి, దివ్యత్వం పొందారు. ఉత్తరయోగిగా ప్రసిద్దుడై, పుదుచ్చేరిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న అరవింద్‌ ఘోష్‌ కూడా వంగదేశీయుడే కదా! వీరందరి కంటే ఎంతో ముందే శంకర భగవత్పాదులు భారతభూమి నాలుగు మూలలా నాలుగు పీఠాలు, కంచిలో మరొక ముఖ్య మఠం స్థాపించారు. వీటి ఆంతర్యం గ్రహించవలసి ఉంటుంది. దీనినంతనీ ఆధ్యాత్మికవేత్తల వ్యవహారమంటూ గుర్తించడానికి నిరాకరిస్తే అదొక సామాజిక ద్రోహమే అవుతుంది. భారత స్వాతంత్య్ర పోరాటంలోని అంతస్సూత్రాన్ని అవమానించడమే అవుతుంది.

అధికారమే పరమావధిగా కాంగ్రెస్‌ పార్టీ మనుగడ సాగిస్తున్నది. ఒకే కుటుంబ పాలన ఇంకా ఈ దేశం మీద రుద్దాలన్నదే బీజేపీ వ్యతిరేకుల వ్యర్థ ప్రయత్నం. 2023 చివర జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయింది. దీనిని ప్రజా విజయంగా గౌరవించ కుండా అత్యంత హేయమైన రీతిలో గౌతమ్‌ ఆదానీ విజయంగా కాంగ్రెస్‌ అభివర్ణించింది. ఆదానీని అడ్డు పెట్టుకుని మోదీని అపఖ్యాతి పాలు చేయాలన్న ప్రతి ప్రయత్నం వ్యర్థమైంది. ఆఖరికి కోర్టులు కూడా ఆదానీ గురించి కాంగ్రెస్‌ చేస్తున్న వాదనలను అంగీకరించలేదు. అయినా ప్రజా విజయాన్నీ, అభిప్రాయాన్నీ కాంగ్రెస్‌ ఈ విధంగా అవమా నించింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమో, మోదీని అవమానించడమో ప్రజలు గ్రహించవలసి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక వాస్తవాన్ని గమనించడం దగ్గర కాంగ్రెస్‌ దారుణంగా విఫలమైంది. ఆదానీ వ్యవహారంలో అక్రమాలు లేవని కోర్టులు చెప్పాయి. అదే కాదు, ఆదానీ ఈ దేశం మొత్తం మీద అనేక సంస్థలు నడుపుతున్నారు. ఆయన పెట్టుబడులు అన్ని రాష్ట్రాలలోను ఉన్నాయి. కృష్ణపట్టణం (ఏపీ), కరైకాల్‌ నౌకాశ్రయం (పుదుచ్చేరి), కామరాజర్‌, కట్టుపల్లి నౌకాశ్రయాలు (తమిళనాడు), విజింజామ్‌ (కేరళ), వైజాగ్‌ టెర్మినల్‌లలో ఆయన పెట్టుబడులు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో ఎక్కువ చోట్ల కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండీ కూటమిలో సభ్యులదే పరిపాలన. అంటే కోర్టులు క్లీన్‌చిట్‌ ఇచ్చిన వ్యాపారవేత్త పెట్టుబడులను కూడా వీరు నిరాకరిస్తారా? ఆదానీతో ముడిపెట్టి బీజేపీ వ్యతిరేక ప్రచారం చేయడం ఒక్కటే కాదు. ఛత్తీస్‌గఢ్‌ ఫలితం విషయంలోనే కాంగ్రెస్‌ ఓటర్లను ఇంకా దారుణంగానే అవమానించింది. ఓటర్లు ఫాసిజాన్ని బుజ్జగిస్తున్నారని కూడా కాంగ్రెస్‌ నుంచి వ్యాఖ్యలు వినిపించాయి.

 తమిళనాడులో అన్నామలై (రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ) ద్రవిడవాదపు మంచుకోటను కరిగిస్తున్న మాట నిజం. అది కుటుంబ పార్టీ డీఎంకేకు దడ పుట్టిస్తున్న మాట కూడా నిజమే. అందులో భాగమే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న అత్యంత నీచపు వ్యాఖ్య. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ అక్కడ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్‌ ముస్లిం మతోన్మాద భాషతో తెలంగాణలోను అవే వ్యాఖ్యలను పలికారు. ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు అని సాక్షాత్తు పార్లమెంట్‌ సాక్షిగా కూసినవాడు కూడా డీఎంకే సభ్యుడే. కానీ ద్రవిడ రాజకీయంతో, సనాతన ధర్మ వ్యతిరేకతతో సాగుతున్న తమిళనాడులో గోవు పూజనీయం కాదా? సనాతన ధర్మం లేదా? హిందుధర్మం మీద కత్తి కట్టిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకలలో సనాతన ధర్మ ఆచరణ ఉనికే లేదని చెబుతారా? కానీ హిందువులు గొంతు విప్పరు. విప్పినా మీడియాకు పట్టదు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ సహా పెద్దలంతా ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని ఎప్పుడో నిరాకరించారు. ఆ వాస్తవాన్ని గమనించకుండా ఈ పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ మోదీ ఈ వాతావరణం నుంచి దేశాన్ని విముక్తం చేయాలని భావిస్తున్నారు. ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ నినాదం అందుకు సంబంధించినదే. ఇది మోదీ చేస్తున్నందువల్ల గొప్పది కాదు. ఎన్నికల రాజకీయం అసలే కాదు. భారత్‌ అంతా ఒక్కటే. ఉత్తర భారతం, దక్షిణ భారతం అన్న విభజనే ప్రమాదకర ప్రహసనం. దానిని రుజువు చేసిన వారు ఎవరైనా గౌరవనీయులే. ఐక్య భారత్‌ భ్రమ కాదు. అదొక చారిత్రక అవసరం. ఉత్తర దక్షిణ భారతాల ఆలోచన బయటపెడుతున్న వాళ్లు, 1947 నాటి విభజన ఆచరణలో ఎంత పెను ఉత్పాతం సృష్టించిందో గుర్తుకు తెచ్చుకోవడం అవసరం. కానీ ఈసారి అలాంటి పప్పులు ఉడకకపోవచ్చు. అది కూడా ఈ నయా వేర్పాటువాదులు గుర్తిస్తే మంచిది.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE