‘‘‌నేను మీకు వేఁడి  దాఁకు

నట్లుగాఁ జరింప నస్మత్కులీనుల

కధిక దుఃఖకారినైతిగాని’’ (ఆశ్రమ 1-33)

వేడియైన దాకనీవి చల్లనిపాలన యాత నిదియును. అందువలననే అట్టిరాజు తమను విడిపోవుచుండ కన్నతండ్రిని కోల్పోవుచున్నట్లు ‘సర్వజనులు నశ్రునిహిత దృష్టులగుచు గద్గదిక  నెలుంగెడఁలగ, నారి్త నేడ్చిరి’ కాని కోరిన యనుజ్ఞ లభింపలేదు. వారును అనుమతించినగాని, తానేమియు జేయలేడు. వారిని మరింత వేడికొనినాడు.

‘ … మోడ్పుకే లౌదలఁ

గదియించి మిమ్ము వేడెఁద గృపాఢ్యు

లార యనుమతి చేయుడు’…అనివాడు. కఠిన శిలయైనను కరిగెడి వేడి కోలుగదా యిది! ప్రజలు ఉత్తరీయంబులు వదనవివిహితంబులుగా జేసిరి; అతని కోరిక మన్నించిరి. వారు అతనియందును, అతని తనూజుని యందును ఎగ్గు లేదన్నారు.

‘‘… మీ మహాన్వయంబున మహీ

విభులయం దొప్పమి వెదకి యైన

గానము మము మీరు గన్నట్టి ప్రజల నె

ట్లట్ల రక్షించితి రాదరమున

వినుము దర్యోధనుండు చేసిన యనర్హ

మొక్కటియు లేదు.’’ (ఆశ్ర. 1-98) అనినారు. ప్రజలను అందరు రాజుల వలెనే వారును పాలించిరి.

‘ధాత్రి శంతనుఁడు విచిత్రవీర్యుఁడు బాండు

రాజు నెట్టు లట్ల రాజ రాజు

 ప్రజకు సంతసముగఁ బాలించె నీయందు

 నతనియందుఁ గలదె యెగ్గు’ (అశ్ర. 1-100)

దుష్టులుగా  పేరెన్నికగన్న ధృతరాష్ట్ర, దుర్యోధనులును ప్రజకు వేడిదాకునట్లు పాలింపలేదు. కనుకనే వారన్నను ప్రజకు విరోధములేదు. అంతియగాదు. అనురాగమేయున్నది. ఇక సర్వ సద్గుణ సుశోభితులగు నితరరాజులయెడ వారికెట్టి పితృభావముండునో ఊహింపనగును.

దుర్యోధనుడును ప్రజలను ప్రీతులుగా నొనర్చుటకే ప్రయత్నించెను. ప్రజాసమ్మతిని పడయుటకు బహువిధముల ప్రయత్నముకావించి, పాండవుల నుండి ప్రజల దృష్టిని మరల్చి, వారిని తన కనుకూలురుగా మార్చుకొనుటకే యాతని ప్రయాసమంతయు

‘… తొల్లి పాండురాజు రాజై

గుణంబులం బ్రజానురాగంబు

పడయుటం జేసి యెల్లవారును

ధర్మరాజు రాజ్యం వలతురు.

దాని నెరిగియె కాదె యేను

నిత్యదాన సమ్మానంబులం బ్రకృతి

జనంబులకు సంతోషంబు

సేయుచునుండుదు.’’ (ఆది- 6-128)..

అని తండ్రితో చెప్పెను. పాండవులు అరణ్యమునను విరాటనగరంబునను ఉన్న పదమూడేండ్లును దుర్యోధనుడు దుర్వ్యయము చేసి కోశమును శూన్యము గావించెను. మహా సైన్యమును ఒక •దానిని గూర్చి కొనుటకు తప్పక వ్యయమయ్యెను.  ‘మాతోడి యీసునం జేసి పెక్కండ్రు మ్రుక్కడి మూకలనుం గూడబెట్టి భూమియు భండారంబునుం బాడుసేసె

(అశ్వ. 1.14 )అని ధర్మజుడు చెప్పినాడు.

 అంతియగాదు,  ప్రజలను ప్రీతులుగా చేసికొనుటకు అతడు తప్పక అధిక వ్యయము చేసియుండును. అట్టి వ్యయమును చేయుట అతని స్వభావానుకూలమైనదే. బహుశః ఒక్క యూహ అతని కుదయించి యుండును. పాండవుల కంటె తానే వారిని ఎక్కువ వాత్సల్యముతో పాలించునని వారికి తోపించుటకు ఇంతకంటే మార్గము లేదు. వారిని గాదని పాలించుట తనకు సాధ్యపడదు.

యౌవరాజ్యాభిషేకానంతరము, పాండవులకు హస్తినాపురము నుండి ఉద్వాసన చెప్పుటకే  ధృతరాష్ట్రాదులు ప్రయత్నించిరి. మంచి మాటలతో సాగనంపి, ప్రజలను మంచి చేసికొని, తమపాలన స్థిరపడిన తర్వాత వారు తిరిగి వచ్చినను తమకు ప్రమాదములేదు.

– ‌డా।। చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి

‘జాగృతి’ 19-07-1965 సంచిక నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE