వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
సువర్చలని ఇష్టపడే, ఆ పెళ్లి సంబంధానికి వెళ్లాడు. అతనంత అతనుగా అలా వెళ్లటం, మంచి ఉద్యోగంలో ఉండటం, ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషించింది.
పోతే చిన్న అడ్డొచ్చింది. సువర్చలకన్నా పెద్దది, అక్క భారతికి పెళ్లికాలేదు. పెద్దపిల్ల పెళ్లికాకుండా, చిన్నమ్మాయి పెళ్లి చెయ్యకూడదన్న సంప్రదాయం అమలులో ఉన్న రోజులవి. వాళ్ల పరిస్థితి ఏం బాగాలేదు. చాలా పేదరికం. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే శక్తి ఆ పెద్దాయనకిలేదు.
సువర్చలే నోరు తెరిచింది. ‘‘మీరు ఇలా రావటం మా అందరికీ ఎంతో సంతోషం. మా అదృష్టం. నా బదులు మా అక్కని చేసుకుంటే మాకెంతో మేలు చేసిన వారవుతారు. ఓసారి ఆలోచించండి’’ అంది బతిమాలుతున్నట్టు.
అవసరార్థమే సువర్చల మాట్లాడినా, చాలా తెలివిగా మాట్లాడింది అనిపించింది జగన్నాథానికి. ఒకరకంగా సువర్చల మాటలవల్లే భారతిని పెళ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాత సువర్చల పెళ్లి అయిందనిపించారు. అది అంతగా అనుకూల మైనది కాదు, సువర్చలకి తగినదికాదు. అతను సువర్చలకన్నా పాతికేళ్లు పెద్ద. ఏదో కొట్లో గుమాస్తా. పట్టుమని పదేళ్లేనా కాలేదు వాళ్లపెళ్లయి. అతను పోయాడన్న వార్త ఫోన్‌లో.
పెద్దదూరం కాదు. విజయవాడ నుంచి ఏలూరు వెళ్లాలి. గంటలో చేరిపోయారు జగన్నాథం, భారతి. ఇంకా అప్పటికి కార్యక్రమం ఏం మొదలుకాలేదు. ఎవరూ ఏం కదలటంలేదు.
కాసేపటికి విషయం అర్థమైంది. జగన్నాథానికి డబ్బుసమస్య. అతని వేపు వాళ్లు పదిమంది దాకా వచ్చారు.
సువర్చల వేపు జగన్నాథం, భారతే. తల్లీతండ్రీ సువర్చల పెళ్లయిన రెండేళ్ల లోపే పోయారు.
చివరికి వాళ్లల్లో ఓ పెద్దాయన అన్నాడు. ‘‘నాకు తెలిసిన బ్రాహ్మణ సంఘం ఒకటుంది. దిక్కులేని శవం అంటే వాళ్లే సాయం పడతారు’’ అని.
ఆడాళ్లు రకరకాల మాటలు మొదలెట్టారు. అనాథ ప్రేతంలా దహన సంస్కారమా? అని గొణుగుడు. సువర్చల ప్రాణం ఉన్న శవంలా ఉంది. అలా కనపడింది జగన్నాథానికి.
అంతే వెంటనే ‘‘అక్కర్లేదు. ఖర్చులు నేను పెట్టుకుంటాను. మనమే చేద్దాం’’ అన్నాడు.
జగన్నాథం అలా అన్నాక వాళ్లూ కదిలారు. కార్యక్రమం అయి శ్మశానం నుంచి మగవాళ్లు వెనక్కి వచ్చేటప్పటికి మూడున్నరైంది.
సాయంత్రంలోపు అమ్మలక్కల సంభాషణలో మరిన్ని మాటలు దొర్లాయి.
‘‘అతను ముందుకొచ్చాడు కాబట్టి దహనం సక్రమంగా జరిగింది’’ అందొకావిడ.
‘‘ఎందుకురాదు. మరదలి మీద చావని మోజు’’ అంది మరోపెద్దనోరావిడ.
ముందు సువర్చలనే జగన్నాథం చేసుకోవాలనుకున్నాడని, తను చెప్పబట్టే భారతిని చేసుకున్నాడని బంధువర్గంలో అందరికీ తెలుసు. ఆ రోజుల్లో అదో వింతవార్త.
పదమూడురోజులు గడిచిపోయి, కార్యక్రమాలు అయిపోయాయి. కానీ సువర్చల పరిస్థితి ఏమిటి? అన్నదే సమస్య.
ఆమె అత్తగారివేపు ఎవ్వరూ సువర్చలని తమ వెంట తీసుకెళ్లటానికి సిద్ధంగాలేరు. అదిస్పష్టంగా చెప్పేశారు.
వాళ్లలో సువర్చలని తీసుకెళ్లగలిగిన స్థోమత లేక కాదు. తమకెందుకీ తద్దినం అని.
ఇది వరకు రోజుల్లో అయితే ఓ సమిష్టి బాధ్యత ఓ ఆచారంలాగే ఉండేది. ఇలాంటి ఆడదున్నా, పసిపిల్లలున్నా, వాళ్ల పరిస్థితి ఏమిటని ఆలోచించి, ఓ పరిష్కారం చేసేవారు.
ఒకవేళ బంధువులు ముందుకు రాకపోతే ఊరిపెద్దలు ఆ పనికి పూనుకునేవారు. చర్చించి ఏదోదారి చూపేవారు.
ఈ రోజుల్లో ఎవరేనా పోతే, ఎలా తప్పించు కుందామా.. అని చూసేవాళ్లే ఎక్కువ.
ఎవరూ తీసికెళ్లకపోతే సువర్చలకి గడిచే అవకాశం లేదు. ఇంటి అద్దె కట్టగలిగే ఆదాయం కూడా లేదు.
ఇంత ఎక్కడేనా ఉద్యోగం చెయ్యాలి. ఉద్యోగం దొరకటం అది ఎలా ఉంటుందో, దాన్ని చెయ్య గలగటం అంత తెలిక్కాదు.
సువర్చలకి సంతానం లేదు. ఒక్క ప్రాణికోసం ఇన్ని గుంపితంపీలు.
‘‘ఏముంది, నాలుగిళ్లల్లో పని చేసుకు బతకటమే’’ అందొకావిడ.
‘‘సువర్చల పనిమనిషిగానా’’ అనుకున్నాడు జగన్నాథం. బ్రాహ్మణస్త్రీ, ఇంకా సంప్రదాయాను సారంగా బతుకుతున్నది. ఏ ఇంట్లోపడితే, ఆ ఇంట్లో పని చెయ్యలేదు.
మద్య, మాంసాలు అలవాటున్న ఇల్లయితే సువర్చల పనిచెయ్యలేదు.
‘‘ఏమిటక్కా మీ అనవసర ఆలోచనలు దాని పుట్టింటి వాళ్లున్నారుగా’’ అంది ఇందాకటి ఆవిడ.
అది తమని ఉద్దేశించి అంటున్న మాటేనని జగన్నాథానికి తెలుసు.
‘‘అవును. అభిమానం, ప్రేమ ఉన్న బావగారు న్నాడు. వదలమన్నా వదలడు. వెర్రివాడేంటి, ఈ అవకాశం వదిలెయ్యటానికి’’ అంది పెద్ద నోరావిడ.
జగన్నాథానికి చురుక్కుమంది మనసు. ‘అంటే ఏం చేసినా ఈ అపవాదు క్కూడా సిద్ధంగా ఉండాలన్నమాట’ అనుకున్నాడు.
పెద్దనోరావిడ అలా అనగానే మిగిలిన వాళ్ల నోళ్లులేచాయి.
‘‘కొంచంలో తప్పిపోయింది కానీ, అసలు సువర్చల జగన్నాథం పెళ్లాం లాంటిదే’’ అన్నారొకరు. ‘‘ఇప్పుడైతే ఏం పోయిందిలే’’ అంది ఇంకొకావిడ.
అంతా అమానుషంగా ఉంది జగన్నాథానికి. తమకి ఎలాగూ ఎవరూ లేరు. సువర్చల పోషణ భారమేం కాదు. అదీకాక అటువంటి స్థితిలో సువర్చలని ఎలా వదిలెయ్యటం.
అదేకాదు, సువర్చల మనస్థితి, తను అనుభవిస్తున్న అవమాన నరకం గురించి ఎవరూ పట్టించుకోటం లేదు అనుకున్నాడు.
చివరికి, ఇంక తట్టుకోలేక భార్య భారతిని పక్కకి తీసికెళ్లి సంప్రదించాడు.
‘‘నాకైతే సువర్చలని మనతో తీసికెళ్లటమే మానవత్వం అనిపిస్తోంది. నలుగురు అంటున్నవి విన్నావుగా. నువ్వు తట్టుకోగలవా’’ అనడిగాడు.
‘‘అది నాతోడబుట్టిందండీ, ఏ సుఖం ఎరగనిది. ఎవరేం అన్నా, ఏం జరిగినా, తీసికెళ్లిపోదాం’’ అంది భారతి దృఢంగా.
లోకనింద కొత్తదికాదు. అనాదిగా ఉన్నదే. దానికి దడిసి కొన్ని పనులు మానేస్తే మనుషులమే కాదు. జగన్నాథం మానుషానికి నిలబడ్డాడు. అతని సహధర్మచారిణిగా దన్నుగా నిలిచింది భారతి.
-వి. రాజరామమోహన రావు