2024 జనవరి 4న ఉన్నత న్యాయస్థానం తన కింది న్యాయస్థానం ఇచ్చిన ఒకానొక తీర్పును పునఃపరిశీలించబోతున్నది. గౌరవనీయులు న్యాయ మూర్తులు అభయ్ ఎస్ ఓ.కా, పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం, కోల్‌కత్తా హైకోర్టు అటు మైనర్, ఇటు మేజరు కాని యువతీయువకుల లైంగిక సంబంధం గురించి ఇచ్చిన తీర్పును సమీక్షించడానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నది.
సదరు హైకోర్టు న్యాయమూర్తి దోషిని విడుదల చేస్తూ, నైతిక విలువల గురించి ప్రస్తావించడం అప్రస్తుతంగా, అనవసరంగా పైకోర్టు భావించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురయింది. రాజ్యాంగ సూత్రం 21 ప్రకారం హైకోర్టు, యవ్వన దశలోని యువత రాజ్యాంగ హక్కును ఉల్లంఘించిందని, స్థానిక న్యాయ స్థానం లైంగిక నేరానికి విధించిన శిక్షను రద్దు చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం కన్నెర్ర చేసింది.
ఒక విధంగా హైకోర్టు తీర్పు మెచ్చుకోదగ్గదిగానే పామర దృష్టికి కనిపిస్తున్నది. శీల పరిరక్షణ గురించి చేసిన వ్యాఖ్యానం పక్కనపెడితే, తెలిసీ తెలియని వయసులో ఆ యువతీ యువకులు చేసిన తప్పును విశాల దృక్పథంతో మన్నించి అంతకుముందు కింది న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. చిత్రం ఏమిటంటే, ఏలినవారి న్యాయస్థానం ఒకవైపు హక్కుల పరిరక్షణ అంటూ, మరోవైపు మానవతా దృక్పథంతో హైకోర్టు చేసిన నిర్ణయాన్ని అభిశం సించడం. ఇది కూచుంటే తప్పు, నిలబడితే తప్పు అన్నట్టుగా, దానం చేసిన కోడలిని అత్తగారు తప్పు పట్టి తన ఆధిక్యతను ప్రకటించే ధోరణికి ఉదాహరణగా అనిపిస్తుంది.
నిజానికి, కోల్‌కతా న్యాయస్థానం కేవలం చట్టప్రకారం తు.చ. తప్పకుండా ప్రవర్తించడానికి బదులు, యువత భవితను కూలదోయకుండా, నాలుగు మంచి మాటలు చెప్పడం సముచితం, సమంజసం. నేరస్తులను శిక్షించడం కన్నా, వారిలో పరివర్తన కలిగే అవకాశం కల్పించడం సామాజిక బాధ్యత. సామాజిక స్పృహతో న్యాయ పరిశీలన సామాజిక ఆరోగ్యానికి, అభ్యుదయానికి, ఎంతగానో ఉపయోగపడుతుంది.
పోస్కో చట్టం కింద యవ్వన దశలో ఉన్న యువతను కఠినంగా శిక్షించడం ఎంతవరకు సమర్థనీయం అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టు హక్కుకూ, ధన, రుణ కోణాలున్నాయి. ఒకరి హక్కు మరొకరికి ఆటంకం కాని, కష్టం కాని, కలిగించకూడదని, న్యాయ శాస్త్రజ్ఞులు హద్దులు, సరిహద్దులు నిర్ణయించారు. రాజ్యాంగంలో కొన్ని దర్శక సూత్రాలను పొందు పరిచారు. ఏ విషయంలోనైనా పారదర్శకతకు ప్రథమ తాంబూలం ఉండాలి. ప్రజలు చైతన్య వంతులుగా తమ బాధ్యతలను తెలుసుకుని, చట్టానికి కట్టుబడినప్పుడే సమాజం ఆదర్శప్రాయంగా, సుఖశాంతులతో తులతూగుతుంది.
‘‘నీకు నీ చేతి కర్రను నీ ఇష్ట ప్రకారం ఆడించే హక్కు ఉన్నది. కాని, ఆ స్వేచ్ఛ అవతలి వ్యక్తి ముక్కుకు ప్రమాదకరంగా కూడదు’’ అంటాడు న్యాయవేత్త లార్డ్ యాక్టన్. కోల్‌కతా తీర్పులో చేసిన నైతిక ఉపదేశం, ప్రతి తండ్రి మనసులో కోరుకుంటు న్నదే. బడిలో ఉపాధ్యాయుడు, జీవితంలో ఆచార్యుడు అదే పని చేస్తాడు. ‘బుద్ధి చెప్పువాడు గుద్దితే నేరుమా?’ అంటున్నది వేమన్న వేదం. లోకాలన్నీ క్షేమంగా, జనమంతా సుఖంగా ఉండాలని వేదం చెబుతున్నది. అక్టోబర్ 18, 2023న కోల్‌కతా హైకోర్టు తీర్పు 30.3 సూత్రం ప్రకారం గర్హనీయం అంటూ ఇలా చెప్పిందంటే, తప్పకుండా ఆలోచించవలసిందే.
‘యువతరం చీకటి నుంచి మరింత చీకట్లోకి తమ జీవితాన్ని తరలించడం మాకు అంగీకారం కాదు. యువతరం నూతన యవ్వన దశలో పరస్పరం ఆకర్షితమై స్నేహం చేయడం సహజం. లైంగిక సంబంధం పెట్టుకోవడం అనుచితం. బాధ్యతా రాహిత్యం, ప్రతి యువతికి తన శరీరాన్ని, ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని, కాపాడుకోవలసిన హక్కు ఉన్నది. ఒక శీలవతిగా ఎదగవలసిన బాధ్యత ఉన్నది. లైంగిక ఆకర్షణను రెండు నిమిషాల ఆనందానికి, అతీతంగా, తనను తాను నియంత్రించు కోకపోవడంవల్ల, తనదైన వ్యక్తి స్వాతంత్య్రాన్ని, శారీరక గోప్యత సంరక్షణను విడిచిపెట్టినందు వల్ల సమాజం దృష్టిలో చులకన అవుతుంది.’
వ్యక్తిత్వపు వికాసానికి లైంగిక అవరోధాల్ని ఆమె విశిష్టంగా భావించి, అధిగమించాలని ఆశించడం తప్పేమి కాదు. భార్యాభర్తల మధ్య కూడా ఏకపక్షంగా లైంగిక చర్య నిషిద్ధంగా భావించే ఈ నవ సమాజంలో, అవివాహిత శీల పవిత్రతను ఆకాంక్షించడంలో తప్పేమిటో అర్థం కావడం లేదు. శరీరం, మనసు, చైతన్యం- ఈ మూడింటి సంయోగమే మానవుడు. ఈ మూడు ఒకటి కన్నా మరొకటి పరిపూర్ణత్వం సాధించడానికి ఉపయోగ పడతాయి. ఆత్మసాక్షిగా, శారీరక, మానసిక, పరిణతి సాధించడానికి పాటుపడడమే మానవత్వానికి గీటురాయి. సూక్తులు, ఛలోక్తులు, నీతులు, నియమాలు ఆ దిశగా సాగడానికి పనికి వచ్చే పరికరాలు. ఎవరు చెప్పినా వినదగినవే!
-నిరామయ