జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం
భారతీయ కుటుంబ వ్యవస్థలో బాలురకు ప్రాధాన్యమిచ్చే సంస్కృతి ఇప్పటికీ కొన్నిచోట్ల రాజ్యమేలుతుంది. బాలబాలికల మధ్య వివక్ష కనిపిస్తున్నది. వారి మధ్య సామాజిక ఆర్థిక అసమానతలు ఉన్నాయి. కుటుంబ సామాజిక ఆర్థిక స్థితిగతులు కుమారుణ్ణి ఆస్తిగా, కుమార్తెను బాధ్యతగా భావించే సంప్రదాయం కొనసాగుతోంది. కుమార్తెను ఆర్థిక భారంగా భావించే సామాజిక పరిస్థితి వారి పాలిట శాపంగా మారిందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. నేటికీ పుట్టబోయే బిడ్డ ఆడశిశువు అని తెలియగానే గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావానికి పాల్పడుతున్న ఘటనలు కూడా బయటపడుతున్నాయి.
1870లో బ్రిటిష్ ప్రభుత్వం ఆడశిశువు హత్యా నిరోధక చట్టం తెచ్చినప్పటికి అమలుకు నోచుకోలేదు. 2020 లో ఐరాస జనాభా నిధి సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం తల్లి కడుపులో పెరిగేది ఆడపిల్ల అని తెలిసిన మరుక్షణమే 4.58 కోట్లమంది బాలికలు హత్యకు గురైనారు. వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2009-2019 ఒక దశాబ్ద కాలంలో 90 లక్షల మంది పిల్లలు మరణించారు.
భ్రూణహత్యలు
ఆడపిల్లను మైనస్ గా భావించి మగ శిశువును ప్లస్ గా పరిగణించే మానసిక స్థితి సమాజంలో నెలకొనడం వల్ల పుట్టుకతోనే ఆడపిల్లల భ్రూణ హత్యాలకు బలై వివక్షతకుగురౌతున్నారు. 1970 వ దశాబ్దంలో మగ పిల్లవాడు పుట్టే వరకు ఆడపిల్లలను కనేవారు. జనాభా పెరుగుదల సమస్యగా మారడంతో గర్భస్రావం ఒక పరిష్కారంగా ముందుకు వచ్చింది.1990 దశాబ్దంలో ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ విధానాలు అందుబాటులోకి రావడం వల్ల భ్రూణహత్యలు ఎక్కువైనాయి. కేంద్ర ప్రభుత్వం గర్భస్థ శిశు లింగ నిర్దారణ పక్రియ నిషేధ చట్టాన్ని 1994లో ప్రవేశ పెట్టింది. 2004లో దానిని సవరిం చారు. అయినప్పటికి గర్భస్థ శిశు లింగ నిర్దారణ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. భ్రూణ హత్యలకు పాల్పడిన వారికి, వారిని ప్రోత్సహించిన వారికి రూ. 50 వేలు జరిమానా, జైలు శిక్ష విధించాలన్న నిబంధనలు పాటించకపోవడం శోచనీయం.
ఆడపిల్లల పట్ల నిర్లక్ష్యం
కుటుంబం నుండే ఆడపిల్ల పెంపకంలో నిర్లక్ష్యానికి వివక్షకు గురికావడం విచారకరం. కుటుంబం నుండి మొదలైన వివక్ష, నిర్లక్ష్యం, చిన్నచూపు బాలికల అభివృద్ధికి వారి సాంస్కృతిక సాంఘిక, ఆర్థిక, సామాజిక వికాసానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది. సమస్యల విషవలయంలో చిక్కుకుపోయిన ఆడపిల్లల అభివృద్ధి, సంక్షేమం ఆశించిన మేరకు జరుగలేదు. ఆడపిల్లలను కించ పరచడం సామాజిక రుగ్మతైంది. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వల్ల ఆడబిడ్డను పోషించే స్థోమత లేక బడుగు బలహీనవర్గాలు, గిరిజన, కొండజాతి ప్రజలు ఆడ శిశువులను విక్రయింస్తున్న దుర్ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. కష్టపడి పెంచి చదువులు చదివించి నప్పటికీ పెళ్లి సమయంలో వరుడికి కట్న కానుకలు ఇవ్వాల్సి వస్తుంది. వరకట్న దురాచార రద్దు కోసం చేసిన చట్టాలు అమలు కావడంలేదు. ఇంకా విషాదం- ఆడబిడ్డ అని తెలిస్తే గర్భస్రావం చేసే వైద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు, అల్పాదాయాలు ఆడపిల్లను కనటానికి కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం, ప్రభుత్వం నుండి తగిన చేయూత లభించక పోవడం వంటి కారణాలు ఆడశిశువుల హత్యలను ఆపలేక పోతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 110 మంది బాలురకు కేవలం 100 మంది బాలికలే ఉన్నారని సర్వేల్లో తేలింది.
చట్టాల విఫలం
ప్రపంచం ఎంత ఆధునికమైందని చెబుతున్నా, మహిళల మీద అత్యాచార ఘటనలు జరుగు తున్నాయి. మహిళల అక్రమ రవాణా, దాడులు పెరుగుతున్నాయి. బాలికలకు విద్య, వైద్యం, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, సామాజిక, భద్రత బాల్యవివాహాలు నుండి బాలికలకు విముక్తి కల్పించాలని ప్రవేశపెట్టిన అనేక చట్టాలు పథకాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. సమస్యలే ఆడపిల్లల ఆస్తులుగా, అవమానాలు, నిర్లక్ష్యం, అనారోగ్యం, వేతన వివక్ష వారికి ప్రధాన సమస్యలుగా పరిణమించాయి.
రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం 2015లో చేపట్టిన బేటీ బచావో బేటి పడావో పథకం ఆడపిల్లల అభివృద్ధికి వారి సాంఘిక ఆర్థిక వికాసం కోసం ప్రవేశపెట్టినదే. కానీ రాష్ట్ర ప్రభుత్వాల అమలులో నిర్లక్ష్యం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2015 ఏప్రిల్ నుండి జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేషనల్ గర్లస్ డెవలప్‌మెంట్ మిషన్ కార్యక్రమ రూపకల్పన జరిగింది. బాలికల సంరక్షణ కోసం షరతులతో కూడిన ధనలక్ష్మి పథకం, కిశోరి శక్తి యోజన, సుకన్య సమృద్ధి యోజన, పౌష్టికాహార పథకం తదితర పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది 1989వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించి, సభ్య దేశాలలో ఆడపిల్లల సామాజిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్నది.
స్త్రీలలో నిరక్షరాస్యత
జనాభాలో నేటికీ 20 కోట్లమంది మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. వీరిని అక్షరాస్యులను చేసినప్పుడు మాత్రమే మహిళా సాధికారత సాధ్యమవు తుంది. రోజురోజుకీ ఆడపిల్లల సంఖ్య తగ్గడం వల్ల క్షీణిస్తున్న స్త్రీ పురుష నిష్పత్తి ఇలాగే కొనసాగితే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. 2011లో స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో ఆరు సంవత్సరాలలోపు వయసు కలిగిన బాలికలు ప్రతి వెయ్యి మంది బాలురకు 914 మంది మాత్రమే ఉన్నారు. బాల్యవివాహాలు దేశంలో 26.5 శాతం. బలవంతపు బాల్యవివాహాలు ఇంకా జరుగు తున్నాయి. ప్రపంచంలో జరుగుతున్న 40 శాతం బాల్యవివాహాలు మన దేశంలో జరుగుతున్నాయని యూనిసెఫ్ వెల్లడించింది. మన దేశంలో జరుగుతున్న బలవంతపు బాల్య వివాహాలలో 40 శాతం పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకోవడం గమనార్హం.
బాలికలు – పేదరికం
బాలికలకు ఉన్నత విద్య సమస్యగా మారింది. నేటికీ 40 శాతం పైగా బాలికలు పదవ తరగతి కంటే ముందే బడి మానేస్తున్నారు. బడి మానుకొని గ్రామాలలో వ్యవసాయ రంగంలో, అసంఘటిత ప్రైవేట్ రంగంలో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. శ్రమ దోపిడీకి, లైంగిక వివక్షకు గురవుతూ తమ అమూల్యమైన బాల్యాన్ని పేదరికం, ఆకలిచావులు, అల్ప పౌష్ఠికాహారం వల్ల అనారోగ్యానికి గురౌతున్నా రని అనేక అధ్యయనాలల్లో తేలింది.
బాలికల సంరక్షణ చర్యలు
బాలికల సమగ్ర వికాసానికి సంరక్షణకు అవసరమయ్యే విధానాలను ప్రభుత్వం అమలు చేయాలి. బాలికల భద్రత, లింగ నిష్పత్తి, విద్య, వైద్యం, ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి. బాలికల అభివృద్ధే లక్ష్యంగా జాతీయ విద్యా విధానంలో పలు పథకాలు ప్రవేశపెట్టడం, బాలికలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం సమాన విద్యావకాశాల సాధనకు ప్రతేక నిధిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందనీయమైన చర్య. బాలికల హక్కులకు రక్షణ, భద్రతలను సామాజిక బాధ్యతగా గుర్తించాలి. మగపిల్లలతో పోటీపడేలా ప్రోత్సహిం చాలి. అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలి. ఆడపిల్లల అభివృద్ధిని దేశాభివృద్ధిగా భావించాలి. ఆడపిల్లలు మానవ వనరులుగా ఎదగడానికి, పురోగతికి తోడ్పడానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. బడుగు బలహీన వర్గాల్లో బాలికలకు ఉచిత విద్య వైద్యం అందించాలి.
బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా, అత్యాచారాలు, లైంగిక వివక్ష మొదలైన సమస్యల నుండి ఆడపిల్లలను సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. పౌరసమాజం యువజన సంస్థలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆడపిల్లల హక్కుల రక్షణకు పాటుపడాలి. ప్రభుత్వం బాలికలకు ఆధునాతన సాంకేతిక ఉన్నత విద్య, ఉపాధి కల్పన విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవాలి. బాలికలకు వృత్తి నైపుణ్య విద్యను అందించాలి. బాలికల సామాజిక ఆర్థిక స్థాయి పెంచే పథకాలను అమలు చేయాలి.
మహిళా సాధికారత
ప్రభుత్వం మహిళా సాధికారత సాధనకు ఉద్యమించాలి. శాస్త్ర సాంకేతిక, ‘పారిశ్రామిక, వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాలలో మహిళా వికాసానికి ప్రభుత్వం పెద్ద పీట వెయ్యాలి. బాలికలకు ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి ఇంటర్మీడియెట్ వరకు ఉచిత వొకేషనల్ విద్య అందించాలి. భ్రూణహత్యలకు దారితీసే పరిస్థితులపై పోరాడే చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. వరకట్న నిషేధ చట్టం1961 లైంగిక నేరాల నుండి ఆడ పిల్లలకు రక్షణ కల్పించే చట్టం – 2012ను సమర్థంగా అమలు చేయాలి. మగ పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులను ఆశా కార్యకర్తలు అంగన్ వాడి కార్యకర్తలు గుర్తించి గర్భస్రావం వల్ల కలిగే అనారోగ్యం నష్టాల పట్ల కౌన్సెలింగ్ ఇవ్వాలి. ప్రతి గ్రామంలో గ్రామసభ, తల్లుల సంఘాలు, మహిళా సంక్షేమ చట్టాలు భ్రూణహత్యలకు పాల్పడితే వేసే జరిమానాలు, శిక్షల పట్ల చర్చలు జరపాలి. అవగాహన చైతన్యం కలిగించాలి.
ఆడపిల్లలను పుట్టనిద్దాం, బతుకనిద్దాం, చదువనిద్దాం ఎదగనిద్దాం అన్న నినాదం విధాన మైనప్పుడే బాలికల సంక్షేమాభివృధి, భద్రత, సమగ్ర అభివృద్ధి సాధ్యం. అమ్మాయి లేనిదే అవని లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. అందువల్ల ఆడపిల్లలను రక్షించుదాం. అమ్మాయిలను ఆదరిద్దాం. బాలికల భవితకు బంగారు బాటలు వేద్దాం.
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం, కరీంనగర్