ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నేర శిక్షాస్మృతికి ఇంతకాలానికి విముక్తి లభించింది. 150 ఏళ్ళ క్రితం తయారైన ఈ చట్టాలను 2023లో తొలగించి బీజేపీ ప్రభుత్వం నేర చట్టాలకు కొత్త రూపునిచ్చింది. దీనితో భారతీయ చింతనతో కూడిన నేర స్మృతి అమలులోకి వచ్చినట్టయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా పార్లమెంట్‌ ఉభయసభల్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. మొత్తం నేర న్యాయవ్యవస్థలోనే సమూలమైన మార్పులకు ఈ చట్టాలు దోహదం చేస్తున్నాయి. అవి 1. 1860 నాటి ఐపీసీ చట్టం స్థానంలో ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత బిల్లు. 2. 1898 నాటి సీఆర్‌పీసీ చట్టం స్థానంలో ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక్‌ ‌సురక్ష సంహిత బిల్లు. 3.1872 నాటి ఎవిడెన్స్ ‌యాక్ట్ ‌స్థానంలో ప్రవేశపెట్టిన భారతీయ సాక్ష్య బిల్లు. పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆమోదం పొందగా, రాష్ట్రపతి డిసెంబర్‌ 25‌న సంతకంచేశారు. దీంతో ఈ కొత్తచట్టాలు అమల్లోకి వచ్చినట్లయింది. మైనర్ల మీద లైంగిక అత్యాచారానికీ, అత్యాచారం చేసి హత్య చేసిన కేసులలోను శిక్షను తీవ్రం చేశారు. ఈ కేసులో మైనర్‌ను చంపితే ఉరిశిక్షను ఎదుర్కొన్నవలసి ఉంటుంది. ఇలాంటి కేసులలో శిక్ష ఇంత తీవ్రంగా ఉండాలన్నదే చిరకాలంగా భారతీయ సమాజం కోరుతున్నది. నేరాలు చేసి తప్పించుకు తిరిగే అవకాశం ఇక ఉండదు.

డిసెంబర్‌ 12‌న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ మూడు బిల్లులక• డిసెంబర్‌ 20‌న ఆమోదం లభించింది. అదేవిధంగా రాజ్యసభ డిసెంబర్‌ 21‌న ఆమోదం తెలిపింది. భారతీయ న్యాయచట్టాల్లో ఈ బిల్లుల ద్వారా సమూల మార్పులు చేశారు. శిక్షించడం కంటే, సత్వర న్యాయం అందించడమే ఈ బిల్లుల ప్రధాన లక్ష్యమని అమిత్‌షా బిల్లులను ప్రవేశ పెట్టే సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లుల్లో రాజద్రోహం విషయంలో మార్పు చేశారు. భిన్నాభిప్రాయాలను అణచివేస్తున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజద్రోహాన్ని తొలగించారు. హింస నుంచి మహిళలు, చిన్నపిల్లల రక్షణకు కొత్త నిబంధనలు చేర్చారు. బాధితులకు తేలిగ్గా సత్వర న్యాయం సమకూరే విధంగా ఈ బిల్లులను ప్రభుత్వం రూపొందించింది. న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను ఈ బిల్లు మరింత బలోపేతం చేస్తుంది. కొత్త చట్టాల ప్రకారం డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ ‌సాక్ష్యాలను సైతం సాక్ష్యంగా పరిగణలోకి తీసుకుంటారు. వందేళ్ల వరకు ఈ చట్టాలు దేశ న్యాయ పక్రియలో ఉపయోగపడతాయి. నిజానికి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు 150 ఏళ్ల క్రితం నాటివి. 1833 చార్టర్‌ ‌చట్టం కింద, 1834లో మొట్టమొదటి లా కమిషన్‌ను ఈస్టిండియా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్రిటిష్‌ ఇం‌డియా ఆధ్వర్యంలో 1860లో అధికారిక ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ను (ఐపీసీ)ని రూపొందించారు. దేశంలో నేర న్యాయ చట్టం అమలుకు అవసరమైన విధివిధానాలను కోడ్‌ ఆఫ్‌ ‌క్రిమినల్‌ ‌ప్రొసీజర్‌ (‌సీఆర్‌పీసీ)లో పొందుపరిచారు. ఇండియన్‌ ఎవిడెన్స్ ‌యాక్ట్‌ను 1872లో ఇంపీరియల్‌ ‌లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌ అమల్లోకి తీసుకొచ్చింది. భారతీయ కోర్టుల్లో అనుమతించదగ్గ సాక్ష్యాలకు సంబంధించిన వివరాలు ఇందులో వివరించారు. పౌరుల భద్రత, హక్కుల పరిరక్షణకోసం రూపొందించిన ఈ చట్టాలు, విధివిధానాలు ముఖ్యంగా నేరగాళ్లను గుర్తించి విచారించి తగిన శిక్షలు విధించడం నేర న్యాయ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, శాసన సంస్థలు, ఫోరెన్సిక్‌ ‌వంటి అనుబంధ సంస్థలు ఇందులో భాగంగా ఉంటాయి.

కొత్తగా పార్లమెంట్‌ ఆమోదించిన మూడు న్యాయ సంస్కరణ బిల్లులు ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ క్రిమినల్‌ ‌చట్టాను సమూలంగా మార్చివేస్తున్నాయి. ఒక క్రిమినల్‌ ‌విచారణను 30-45 రోజుల్లోగా పూర్తి చేసి తీర్పునివ్వాలని నూతన నాగరిక సురక్షా సంహిత నిర్దేశిస్తున్నది. 258(1) ప్రకారం కేసుకు సంబంధించి వాదోపవాదాలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి సాధ్యమైనంత త్వరగా అంటే 30రోజుల్లోగా తీర్పు చెప్పాలి. అయితే తగిన కారణాలను లిఖితపూర్వకంగా చూపుతూ 45 రోజుల వరకు తీర్పు చెప్పే కాలాన్ని పొడిగించవచ్చు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న క్రిమినల్‌ ‌ప్రొసీజర్‌ ‌కోడ్‌ ‌ప్రకారం వాదోపవాదాలు ముగిసిన తర్వాత 30 రోజుల్లోగా తీర్పు చెప్పేందుకు న్యాయమూర్తి కృషి చేయాలి. అయితే ఇందుకు గరిష్ట కాలపరిమితి 60 రోజులుగా నిర్దేశించింది. దిగువ కోర్టులు తీర్పు చెప్పడానికి ఆరువారాల నుంచి రెండు నెలల వరకు కాలపరిమితి విధిస్తూ సుప్రీం కోర్టు 2001లో తీర్పు చెప్పింది. కోర్టులు పాటిస్తున్న దాఖలాలు లేవు. తీర్పులు చెప్పడంలో కొనసాగుతున్న తీవ్ర జాప్యం సామాన్యులకు న్యాయవ్యవస్థ పట్ల అపనమ్మకాన్ని పెంచుతుందని సుప్రీంకోర్టు, హైకోర్టులు పదేపదే పేర్కొంటున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు.

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)

‌భారతీయ న్యాయసంహితలో మొత్తం 19 అధ్యాయాలు, 356 సెక్షన్లు ఉన్నాయి. దీని నిర్మాణం ఇప్పటివరకు అమల్లో ఉన్న ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ ‌మాదిరిగానే ఉంటుంది.

శారీరక దాడులు: ఐపీసీలో పేర్కొన్న హత్య, ఆత్మహత్యకు పురికొల్పడం, తీవ్రంగా గాయపరచడం వంటి అంశాలను యథాతథంగా ఉంచారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, హత్య లేదా మూకదాడుల ద్వారా తీవ్రంగా గాయపరచడం వంటి కొత్త అంశాలను చేర్చారు. మూకదాడులకు పాల్పడితే గరిష్టంగా మరణశిక్ష విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ మూకదాడులు సమస్యగా మారాయి.

మహిళలపై లైంగిక నేరాలు: అత్యాచారం, ఇతరుల కష్టాలు, బాధలు చూసి ఆనందించే తత్వం, స్త్రీలలోని అణకువను అవహేళన చేయడం వంటి ఐపీసీ అంశాలను యథాతథంగా ఉంచారు. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని మేజర్‌గా పరిగణించే వయసును 16 నుంచి 18కి పెంచారు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకొని మోసగించి నట్లయితే పదేళ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చు.

ఆస్తులకు వ్యతిరేక నేరాలు: దొంగతనం, దోపిడీ, కన్నపు దొంగతనం, మోసం వంటి ఐపీసీలోని అంశాలను కూడా యథాతథంగా ఉంచారు. సైబర్‌, ఆర్థిక నేరాలను కొత్తగా చేర్చారు.

రాజ్యవ్యతిరేక నేరాలు: ఐపీసీలో పేర్కొన్న రాజద్రోహ నేరాన్ని తొలగించారు. దీని స్థానంలో భారత ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లజేసే నేరాలను చేర్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని సవాలుచేసే ఉగ్రవాదం, వేర్పాటువాదం, సాయుధ తిరుగుబాటులను ఇందులో స్పష్టంగా నిర్వచించారు. అంతకు ముందు వీటిని వివిధ చట్టాల కింద పేర్కొనేవారు. వాక్‌స్వాతంత్య్రానికి, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణకు అడ్డంకిగా ఉన్న వలసవాద కాలంనాటి దేశద్రోహ చట్టాన్ని తొలగించారు.

భారతీయ సాక్ష్య అభినియం

ఇండియన్‌ ఎవిడెన్స్ ‌యాక్ట్ (1872)‌స్థానంలో పార్లమెంట్‌ ఆమోదించిన భారతీయ సాక్ష్య అభినియం-2023 లేదా బీఎస్‌ఏలో మొత్తం 170 సెక్షన్‌లు ఉన్నాయి. అదే ఇండియన్‌ ఎవిడెన్స్ ‌యాక్ట్‌లో ఇవి 167 మాత్రమే ఉండేవి. ఇందులోని 23 సెక్షన్‌లకు మార్పులు చేశారు. ఐదు సెక్షన్లను తొలగించగా మరో సెక్షన్‌ను కలిపారు.

  • ఎలక్ట్రానిక్‌ ‌సాక్ష్యాన్ని భద్రపరచే ఉపకరణాన్ని ఇది నిర్వచించింది. ఎలక్ట్రానిక్‌ ‌సాక్ష్యాన్ని పరి గణనలోకి తీసుకోవడానికి కావలసిన అభి లక్షణాలను ఇందులో వివరించారు. డిజిటల్‌ ‌సమాచారాన్ని మార్పు చేయకుండా, దుర్విని ఓయోగం కాకుండా ఉండేందుకు ఇవి ఉపకరిస్తాయి.
  • డీఎన్‌ఏకు సంబంధించిన సాక్ష్యాలను అనుమ తించడంలో పాటించాల్సిన నిబంధనలు ఇందులో పొందుపరచారు. ఇది జీవసంబంధ సాక్ష్యంలోని విశ్వసనీయత, కచ్చితత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
  • వైద్య సలహా, చేతిరాత విశ్లేషణ వంటి అంశాల్లో నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. కేసుకు సంబంధించిన పరిస్థితులు లేదా వాస్తవాలను నిర్ధారించడం దీని ఉద్దేశం.
  • నిరపరాధి భావన అనేది నేర న్యాయవ్యవస్థలో ప్రాథమిక సూత్రం. అంటే నేరాభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తిని నేరం రుజువయ్యేవరకు నిరపరాధిగానే పరిగణిస్తారు.

భారతీయ నాగరిక్‌ ‌సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌)

‌భారతీయ నాగరిక్‌ ‌సురక్షా సంహిత బిల్లు -2023, చట్టాన్ని మరింత ఏకీకృతం, సరళీకృతం చేసింది. ముఖ్యంగా సీఆర్‌పీసీలోని చాలా నిబంధన లను తొలగించడమో లేక సవరించడమో జరిగింది. ఇందులో మొత్తం 38 చాప్టర్లు, 533 సెక్షన్లు ఉన్నాయి. పాత చట్టంలోని 160 సెక్షన్లలో మార్పులు చేయగా, 9 కొత్త సెక్షన్లను చేర్చి, మరో 9 సెక్షన్లు తొలగించారు. నిందితుడి హక్కులను మరింత బలోపేతం చేశారు. ముఖ్యంగా న్యాయవాదిని నియమించుకునే హక్కు, మౌనంగా ఉండే హక్కు, న్యాయబద్ధమైన విచారణ హక్కు కల్పించారు.

నేర న్యాయచట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి బీఎన్‌ఎస్‌ఎస్‌ ‌దోహదం చేస్తుంది. ముఖ్యంగా అనవసర ఆలస్యాలను నిరోధించడం, విధి విధానాలను క్రమబద్ధీకరించడం ద్వారా చట్టం బలోపేతానికి దోహద పడుతుంది.

చేసిన మార్పులు

  • చాలా కేసుల్లో ఏ విధమైన వారంట్‌ ‌లేకుండా నిందితుడిని పోలీసులు అరెస్ట్ ‌చేసే అవకాశం ఇది కల్పిస్తోంది.
  • పోలీసులు బెయిల్‌ను వ్యతిరేకించడం కష్టమవు తుంది. చాలా కేసుల్లో నిందితులకు బెయిల్‌ ‌వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • నేర విచారణలో పోలీసులకు మరిన్ని అధికారాలు దఖలు పడతాయి. నిర్దేశిత కాలంలో కేసు దర్యాప్తు పూర్తిచేయాలి కనుక వారికి ఈ వెసులుబాటు అవసరం.
  • కోర్టులు నిర్దేశిత కాలంలో కేసు విచారణ జరిపి తీర్పులు వెలువరించాలి.
  • విచారణలు, అప్పీళ్లు, వాంగ్మూలాల నమోదు వంటి అంశాల్లో సాంకేతి కత వినియోగానికి ఇది వీలు కల్పిస్తుంది. అంతేకాదు విచారణను వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా చేపట్టేందుకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది. లైంగిక హింస కేసుల్లో బాధితుల వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్‌ ‌రూపంలో నమోదు చేయడం తప్పనిసరి. దీనివల్ల సాక్ష్యాన్ని భద్రపరచడమే కాకుండా, తారుమారుచేసే అవకాశాలను ఇది నిరోధిస్తుంది.
  • ఒక ఫిర్యాదుకు సంబంధించిన స్థితి ఏ దశలో ఉన్నదీ 90రోజుల్లో పోలీసులు తప్పనిసరిగా వివరించాలి. దీనివల్ల బాధ్యత, జవాబుదారీ తనం పెరుగుతాయి.
  • సీఆర్‌పీసీలోని 41ఎ సెక్షన్‌ను ఇందులో సెక్షన్‌-35‌గా పేర్కొన్నారు. దీని ప్రకారం, నిందితుడి వయసు 60ఏళ్లు దాటినా లేక మూడు సంవత్సరాలలోపు జైలుశిక్ష పడే కేసుల్లో పోలీసులు అరెస్ట్ ‌చేయాలంటే ముందుగా డీఎస్‌పీ ర్యాంకు అధికారినుంచి అనుమతి పొందాలి.
  • ఏడేళ్లు లేదా అంతకు మించి శిక్షపడే కేసును ఉపసంహరించుకునే ముందు పోలీసులు బాధితులను తప్పనిసరిగా సంప్రదించాలి. తద్వారా న్యాయ నిరాకరణ లేదా రాజీపడే అవకాశానికి తావుండదు.
  • నేరగాళ్లు తప్పించుకొని తిరుగుతున్న కేసుల్లో, కోర్డులు వారి పరోక్షంలో కేసును విచారించి శిక్షలు విధించవచ్చు. తద్వారా నేరగాడిని న్యాయచట్టం నుంచి తప్పించుకోకుండా చూడవచ్చునన్నదే దీని ప్రధాన ఉద్దేశం.
  • ఈ-మెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ ‌రికార్డుల ఆధారంగా మేజిస్ట్రేట్లు గుర్తించదగిన నేరాలను నమోదు చేయవచ్చు. సాక్ష్యాల సేకరణకు, వాటిని సరిచూడటానికి ఇది వీలు కల్పిస్తుంది.
  • మరణశిక్ష పడిన కేసుల్లో క్షమాభిక్ష కోసం గవర్నర్‌కు 30 రోజుల్లోగా, రాష్ట్రపతికి 60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ఏ కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు.

ఈ బిల్లుల ప్రకారం విధించే శిక్షలు ఈవిధంగా ఉన్నాయి

  • యాక్సిడెంట్‌ ‌చేసి పారిపోతే పదేళ్ల జైలు, అదే యాక్సిడెంట్‌కు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళితే శిక్షలో సగానికి తగ్గింపు.
  • మూకదాడికి పాల్పడితే ఏడేళ్ల జైలు, ఉరిశిక్ష
  • మైనర్‌పై అత్యాచారం చేస్తే జీవితకాలం జైలు శిక్ష. ఒకవేళ మైనర్‌ ‌చనిపోతే నిందితులకు ఉరిశిక్ష.
  • దేశద్రోహానికి జీవితకాల శిక్ష నుంచి ఏడేళ్ళకు మార్పు.
  • నేరంచేసి విదేశాలకు పారిపోయినవారు 90 రోజుల్లోగాలొంగిపోవాలి. లేదంటే వారి తరపున ప్రభుత్వ న్యాయవాదిని నియమించి తీర్పును ప్రకటిస్తారు. అటువంటి నేరగాళ్లను విదేశాల నుంచి రప్పించి ఉరిశిక్ష విధిస్తారు.
  • మహిళలకు ఈ-ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసుకునే అవకాశం.
  • అరెస్టయిన వ్యక్తి కుటుంబీకులకు సమాచారం ఇవ్వాలి. దర్యాప్తు,సోదాలను వీడియోగ్రఫీ చేయాలి.
  • ఎవరైనా ఎక్కడి నుంచైనా జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేయవచ్చు. 24 గంటల్లో దాన్ని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు మార్చుకోవచ్చు.
  • నిరాధారంగా అరెస్ట్ ‌చేసి పోలీస్‌స్టేషన్‌లో ఉంచడానికి వీల్లేదు.
  • అరెస్టయినవారి వివరాలు కుటుంబ సభ్యులకు తెలిపేందుకు, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒక అధికారి నియామకం.
  • ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను వేలం వేసి, ఆ సొమ్ములు ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తారు.
  • నేరం సందర్భంగా పట్టుకున్న వాహనాలను 30 రోజుల్లో కోర్టుద్వారా అమ్మేస్తారు.
  • ఏడేళ్ల జైలుశిక్ష పడే కేసుల్లో, ఫోరెన్సిక్‌ ‌టీమ్‌ ‌దర్యాప్తు తప్పనిసరి.

ఎఫ్‌ఐఆర్‌, ‌చార్జ్‌షీటు, విచారణకు సంబంధించిన నిబంధనలు

  • సీఆర్‌పీసీ చార్జ్‌షీటు దాఖలు చేయడానికి ఎటువంటి కాలావధిని పేర్కొనలేదు. అయితే బీఎన్‌ఎస్‌ఎస్‌ ఇం‌దుకు కాలావధిని నిర్దేశిస్తుంది. సాధారణ ఉల్లంఘనలకు మూడురోజుల్లోగా చార్జ్‌షీటు లాంఛనంగా దాఖలు చేయాలి. మూడు నుంచి ఏడేళ్లు శిక్షపడే నేరాలకు సంబంధించిన దర్యాప్తు 14 రోజుల్లోగా పూర్తి చేయాలి. అప్పటికి తెలిసిన అంశాల ఆధారంగా ఫిర్యాదును నమోదు చేయాలి.
  • 90 రోజుల్లోగా మొదటి చార్జ్‌షీటును దాఖలు చేసే సమయానికి, మిగిలిన దర్యాప్తును పూర్తి చేయాలి.
  • చార్జ్‌షీటు విచారణార్హమైనదా కాదా అన్న అంశాన్ని మేజిస్ట్రేట్‌ 14 ‌రోజుల్లోగా నిర్ణయిం చాలి.
  • లైంగిక దాడికి గురైన బాధితుల నివేదికలను నిర్ణీత కాలావధిలోగా పంపాలి.
  • ఆరోపణలు రాసేందుకు, డిస్చార్జ్ ‌పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకునేందుకు, డిస్చార్జ్ ‌కోసం దరఖాస్తును దాఖలు చేసేందుకు కాలావధులను నిర్ణయించారు.
  • కేసు విచారణకు నిందితుడు 90 రోజుల్లోగా హాజరు కాకపోతే, అతని పరోక్షంలోనే విచారణ జరుపవచ్చు.
  • మొట్టమొదట నేరానికి పాల్పడినవారు, వారి శిక్షాకాలంలో 1/3వంతు కాలం విచారణ ఖైదీగా కొనసాగితే విడుదల కావచ్చు. ఇతర సందర్భాల్లో శిక్షాకాలంలో సగం పూర్తిచేయాల్సి ఉంటుంది.
  • నేర నిర్ధారణ జరిగిన వారు మాత్రమే క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బయటి పార్టీలు లేదా ఎన్‌జీవోలు అటువంటి పిటిషన్లను దాఖలు చేయరాదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 30రోజుల్లోగా ఈ దరఖాస్తు చేసుకోవాలి. ఎలక్ట్రానిక్‌ ‌పద్ధతిలో ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా లైంగికదాడుల కేసుల్లో పోలీస్‌ ‌స్టేషన్లకు రావడానికి విముఖత చూపే మహిళలకు ఈ-ఎఫ్‌ఐఆర్‌ ఉపయోగకారి.
  • నేరం జరిగిన ప్రదేశాలను ఫోరెన్సిక్‌ ‌టీమ్‌ ‌సభ్యులు సందర్శించాలి. ఫోరెన్సిక్‌ ‌సాక్షాల వల్ల నేరనిర్ధారణ మరింత కచ్చితంగా జరుగుతుంది.
  • గరిష్టంగా మూడేళ్ల శిక్ష పడే కేసుల్లో శీఘ్ర విచారణ జరుపుతారు. గ తంలో ఇది రెండేళ్లుగా ఉండేది.
  • గతంలో మొత్తం 19 కేసుల్లో పరారీలో ఉన్న అపరాధుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగేది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్యను 120కి పెంచారు.

నేర న్యాయవ్యవస్థలో సమస్యలు

నేషనల్‌ ‌జ్యుడిసియల్‌ ‌డేటా గ్రిడ్‌ ‌ప్రకారం ప్రస్తుతం దేశంలోని వివిధ కోర్టులో 4.7కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల సత్వర న్యాయం అందకపోవడం, విచారణ వేగం హక్కు ఉల్లంఘన, ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగిల్లడం జరుగుతోంది. నేర న్యాయవ్యవస్థ ప్రస్తుతం మానవ వనరులు, నిధులు వంటి మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటున్నది. న్యాయమూర్తులు, పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్లు, పోలీసులు, ఫోరెన్సిక్‌ ‌నిపుణులు, న్యాయపరమైన మద్దతు ఇచ్చే లాయర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2023, ఫిబ్రవరి నాటికి 135 మిలియన్‌ ‌జనాభా కలిగిన దేశంలో, ప్రతి మిలియన్‌ (‌పది లక్షలు)కు 21 న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. హైకోర్టుల్లో 400 ఖాళీలున్నాయి. దిగువ స్థాయి కోర్టుల్లో 35% పోస్టులు ఇంకా భర్తీకాలేదు. విచారణాసంస్థలు వృత్తిపరంగా నాణ్యమైన, నిష్పక్షపాత విచారణ జరపడంలో విఫలమవు తున్నాయి. రాజకీయ, మరేఇతర ప్రమేయాల కారణంగా విచారణలో బాధ్యతారాహిత్యం కొనసాగు తోంది. నిందితులు, సాక్షులు, బాధితుల పట్ల నేర న్యాయవ్యవస్థ చాలా సందర్భాల్లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కస్టడీ మరణాలు, హింస, చట్ట విరుద్ధంగా నిర్బంధిం చడం, బలవంతంగా నేరాలను ఒప్పించడం, అనుచిత విచారణ, కఠినశిక్షలు వంటి ఆరోపణలను నేర న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్నది.

కాలం చెల్లిన చట్టాలు, విధానాలు

1860 ప్రాంతంలో నాటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, విధానాలే ఇప్పటికీ అమలవుతున్నాయి. ఇవి పాతబడిపోవడమే కాదు, ఇప్పటికాలానికి ఎంతమాత్రం తగినవి కావు. సైబర్‌ ‌నేరాలు, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మూకహింస వంటి నేరాలకు ఈ చట్టాల్లో ఏ విధమైన శిక్షలు లేవు. పోలీసులు-ప్రజల మధ్య సంబంధాలు ఎంతమాత్రం సంతృప్తికరంగా లేవని రెండో ఏఆర్‌సీ స్పష్టం చేసింది. అవినీతి, అసమర్థత, స్పందన లేనితనం నిండివున్న పోలీసులను కలవడానికి ప్రజల్లో సుముఖత వ్యక్తం కావడంలేదు.

వివిధ కమిటీల సిఫారసులు

రాజకీయ నాయకులు, నేరగాళ్లు, బ్యూరోక్రాట్లు, సంఘ విద్రోహశక్తుల మధ్య అనైతిక సంబంధాలు నెలకొన్న నేపథ్యంలో, అ సమస్యను పరిష్కరిం చేందుకు, అన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరించే ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఓహ్రా కమిటీ (1993) సిఫారసు చేసింది. నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పుల కోసం మలిమాథ్‌ ‌కమిటీ (2003) కొన్ని సిఫారసులు చేసింది. ‘‘సామాజిక సంక్షేమ నేరాలు’’ పేరుతో కొత్తతరహా నేరాలను ప్రవేశపెట్టాలి. కొద్దిపాటి జరిమానాలు, సామాజిక సేవ వంటి శిక్షలు విధించేందుకు ఇది అవసరం. ప్రస్తుత ‘ప్రతిస్పర్థి వ్యవస్థ’ స్థానంలో ‘మిశ్రమవ్యవస్థ’ను తీసుకురావాలి. అంటే సాక్ష్యాధారాల సేకరణ, సాక్షుల విచారణలో న్యాయమూర్తులు కూడా చురుగ్గా పాలుపంచుకునేలా చేయాలి. నేర నిరూపణకు ప్రస్తుతం ఉన్న ప్రామాణిక రుజువు స్థాయిని తగ్గించాలి. అంటే ‘‘ఎటువంటి అనుమానాలకు తావులేకుండా’’ అనే దాని నుంచి ‘‘స్పష్టమైన, నమ్మదగిన సాక్ష్యం’’ అనే స్థాయికి మార్పు చేయాలి. సీనియర్‌ ‌పోలీసు అధికారి ఎదుట నేరాంగీకారాన్ని సాక్ష్యంగా పరిగణించవచ్చు. ఇవన్నీ ఈ కమిటీ చేసిన సిఫారసులు. నేర న్యాయంపై ఒక జాతీయ ముసాయిదాను రూపొందించేందుకు మాధవ్‌ ‌మీనన్‌ ‌కమిటీ (2007) ఏర్పాటైంది. నేరన్యాయంలోని ప్రతి దశలో మానవహక్కులు, మానవ మర్యాదకు ఎటువంటి భంగం వాటిల్ల కూడదు. శిక్షించడం కంటే, నేరం వల్ల కలిగిన హానిని ఏ విధంగా సరిచేయాలన్నదానిపై దృష్టి కేంద్రీక రించాలి. పోలీసు, న్యాయవ్యవస్థ, ప్రాసిక్యూషన్‌ ‌వంటి సంస్థల మధ్య మరింత సమన్వయం అవసరమని తన సిఫారసుల్లో కమిటీ స్పష్టం చేసింది. ఎన్‌.‌కె. సింగ్‌, ‌ప్రకాశ్‌ ‌సింగ్‌ అనే ఇద్దరు మాజీ పోలీసు అధికార్లు పోలీసు సంస్కరణలు అవసరమని పేర్కొంటూ, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సర్వోచ్ఛ న్యాయస్థానం 2006లో పోలీసు సంస్కరణలపై ఏడు నిర్దేశాలను జారీ చేసింది. అవి వరుసగా పోలీసుల పనితీరును మూల్యాంకనం చేసి తగిన విధానాల రూపకల్పనకు ఒక రాష్ట్రస్థాయి సెక్యూరిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట కాలపరిమితితో డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌నియామకం జరగాలి. దర్యాప్తును చట్టాన్ని వేరుచేయాలి. దీనివల్ల దర్యాప్తు వేగం పుంజుకోవడమే కాదు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. అధికార దుర్వినియోగం, ప్రవర్తన సరిగ్గా లేని పోలీసులపై విచారణ జరిపేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పోలీసు ఫిర్యాదు ప్రాథికార సంస్థను ఏర్పాటు చేయాలి.

నూతన సంస్కరణల ప్రాముఖ్యత

ఇప్పటివరకు అత్యంత సంక్లిష్టంగా, కాలం చెల్లిన నేర చట్టాలను ఆధునికీకరించి మరింత సరళీకృతం చేయడం కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణల ప్రధాన లక్ష్యం. ఇప్పటివరకు తీవ్రమైనదిగా పరిగణించిన ఐపీసీ 124ఎ సెక్షన్‌ను తొలగించారు. ముఖ్యంగా ప్రభుత్వ విమర్శకులు, అసమ్మతివాదులపై దీన్ని ప్రయోగించారన్న విమర్శ ఉంది. కొత్తగా ఉగ్రవాదం, అవినీతి, మూకదాడులు, వ్యవస్థీకృత నేరాలు వంటివాటిని చేర్చారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాలు ఈ నేరాలను సమగ్రంగా నిర్వచించలేదు. మహిళలతో పాటు పురుషులు, ట్రాన్స్‌జెండర్లను కూడా లైంగిక నేరాల్లో బాధితులుగా చేర్చడం ద్వారా లింగతాటస్థ్యాన్ని పాటించినట్లయింది. ఎలక్ట్రానిక్‌, ‌ఫోరెన్సిక్‌ ‌సాక్ష్యాలను దర్యాప్తు, విచారణ, తీర్పు చెప్పే సమయాల్లో మరింత ఎక్కువగా ఉపయోగించడానికి వీలవుతుంది. నేరం జరిగిన ప్రదేశంతో సంబంధం లేకుండా పౌరులు ఏ పోలీస్‌ ‌స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు కలుగుతుంది. పౌరుల రాజ్యాంగ హక్కులకు ఈ సంస్కరణలు మరింత రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా జీవించే హక్కు, స్వేచ్ఛ, మర్యాద, గోప్యత, పారదర్శక విచారణకు ఈ సంస్కర ణలు వీలుకల్పిస్తాయి.

విస్తృత చర్చకు స్థానం లేదు

ఈ బిల్లుల ముసాయిదాను క్రిమినల్‌ ‌లా రీఫార్మస్ ‌కమిటీ-2020 రూపొందించింది. ఈ కమిటీలో న్యాయవ్యవస్థ, బార్‌, ‌పౌరసమాజం, ఉపాంత వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ బిల్లు ముసాయిదాకు సంబంధించి విస్తృత చర్చ జరగలేదు. కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షులు, బాధితులు, భాగస్వాములపై మానవహక్కుల ఉల్లంఘన జరిగే అవకాశాలున్నాయి. ఉదాహరణకు భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) ‌బిల్లులో ‘‘భారత సమగ్రత, ఐక్యత, సార్వభౌమాధికారానికి ప్రమాదం వాటిల్లినప్పుడు’’ అనే నేరాన్ని సెక్షన్‌-150 ‌కింద చేర్చారు. ఐపీసీలోని 124ఎ సెక్షన్‌లో పేర్కొన్న ‘‘రాజద్రోహం’’ కింద వివరించిన నేరాలను ఇవి సరిపోలి ఉండటం గమనార్హం. వాక్‌స్వాతంత్య్రాన్ని దెబ్బతీయడానికి ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని ప్రతిపక్షాల ఆరోపణ. అదేవిధంగా భారతీయ సాక్ష్య బిల్లు (బీఎస్‌బీ)- 2023లో ‘‘ఒక పోలీసు అధికారి ఎదుట నేరాంగీ కారాన్ని సాక్ష్యంగా పరిగణించవచ్చు’’ అని సెక్షన్‌ 27ఎలో పేర్కొన్నారు. దీనివల్ల కస్టడీ హింస మరింత పెరిగి ఇది దుర్వినియోగం అయ్యే అవకాశాలు న్నాయి.

భారతీయ నాగరిక్‌ ‌సురక్ష సంహిత బిల్లు- 2023, పోలీసులు అరెస్ట్ ‌చేయడానికి విపరీతమైన అధికారాలు కల్పిస్తోంది. న్యాయవ్యవస్థ పర్యవేక్షణ లేదా మరే ఇతర పరిరక్షణలు లేకుండానే పోలీసులు తనిఖీలు, స్వాధీనం, నిర్బంధించడం వంటి చర్యలకు పూనుకోవచ్చు. బిల్లులో పేర్కొన్న అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న విమర్శలున్నాయి. ఉదాహరణకు నేర నిర్ధారణకు రుజువుగా బీఎస్‌పీ సరికొత్త ప్రమాణాన్ని పేర్కొంది. ‘‘ఏవిధమైన అనుమానాలకు తావులేని విధంగా’’ స్థానంలో ‘‘స్పష్టమైన, విశ్వసించదగ్గ సాక్ష్యం’’ అనే పదాలను బిల్లులో చేర్చారు. అయితే వీటికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. ‘‘సామాజిక సంక్షేమ నేరాలు’’ పేరుతో సరికొత్త నేరాలను బిఎన్‌ఎస్‌ఎస్‌లో చేర్చారు. అయితే ఈ కేటగిరీలోకి ఏఏ నేరాలు వస్తాయన్నది వివరించలేదు. వీటన్నింటికి సమాధానాలు కేవలం విస్తృత చర్చ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఏదైనా ఒక వ్యవస్థలో మార్పు తీసుకొని రావాలంటే పారదర్శకమైన చర్చ అత్యంత అవసరం. అది జరగక పోవడమే ఇక్కడ ప్రధాన లోపమని అంగీకరించాలి. ఈ నేపథ్యంలో పోలీసులకు తగినంత శిక్షణలేమి, ఆరకొర సదుపాయాలున్న ఇళ్లు వంటి సమస్యలకు ఇప్పటికీ పరిష్కారంలేదు. పోలీస్‌ ‌స్టేషన్లలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం, సర్వసాధారణ విషయం. నూతన చట్టాల నేపథ్యంలో పోలీసు సిబ్బందిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. భవిష్యత్తులో నేర న్యాయ చట్టాల రూపకల్పనకు, ప్రస్తుత బిల్లులు సంభావ్య ఆధారాన్నిస్తాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

-జమలాపురపు విఠల్‌రావు,

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE