జనవరి 26 గణతంత్ర దినోత్సవం
భారతమాత జన్మనిచ్చిన మేధావులలో ఒకరు డా।। బీఆర్ ఆంబేడ్కర్. ఆయన రాజకీయ, సామాజిక భావనలు నాడు భారతదేశంలో సంచలనం రేకెత్తించాయి. ఏకీభావాన్ని కూడగట్టలేకపోయినా రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర మహత్తరమైనది. నాడు సమాజానికి దూరంగా ఉన్న దళితులు విదేశీ క్రైస్తవ మిషనరీల కౌగిలిలోకి వెడుతున్న సమయంలో ఆయన తన వర్గాన్ని వారి వలలో చిక్కనివ్వలేదు. తన జీవిత చరమాంకంలో హిందూత్వం కన్నా బౌద్ధం మేలైనదన్న అభిప్రాయంతో ఆయన దానిని స్వీకరించినప్పటికీ, హిందూ సమాజం ఆయనను స్వీకరించింది. సమసమాజాన్ని కోరుకున్న దార్శనికుడిగా గౌరవించింది.
ఆదర్శ సమాజం ఎప్పుడూ చలనశీలంగా, ఒక అంగంలో జరుగుతున్న మార్పు గురించి ఇతర అంగాలకు తెలిపేందుకు పలు మార్గాలతో నిండి ఉం డాలి. ఒక ఆదర్శ సమాజం పలు ప్రయోజనాల గురించి పూర్తి చైతన్యంతో అందరికీ తెలపాలి, వాటిని పంచుకోవాలన్నది డా।। బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచన. అందుకు అనుగుణంగానే ఆయన బడుగు బలహీనవర్గాలు సహా ఎవరి ప్రయోజనాలను విస్మరించకుండా రాజ్యాంగాన్ని రూపొందించారు. స్వతంత్ర భారతదేశంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న ఆయన కుల, జాతి వివక్షలకు తావులేని, చట్టం ముందు ఒకరే భావనను ముందుకు తీసుకువెళ్లారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వానికి ఒక రూపం కాదని, అది సౌభ్రాతృ త్వానికి మరొక పేరన్నది ఆయన భావన. అది ప్రాథమికంగా తన తోటివారి పట్ల గౌరవ మర్యాదలతో కూడిన వైఖరి అని ఆయన అంటారు.
అందుకే ఒక నిర్మాణాత్మక సంఘ సంస్కర్తగా, న్యాయ కోవిదుడిగా ఆయన తన కాలంలో చేసిన వాదనలు, ఉపన్యాసాలు నేటికీ ప్రాసంగికతను కలిగి ఉం డటమే కాదు, ప్రతి రాజకీయ నాయకుడి ఆలోచనను మలుస్తున్నాయి. ‘‘నన్ను అడిగితే, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంపై ఆధారపడిన సమాజమే ఆదర్శ మైనది’’ అంటూ ఆయన కులనిర్మూలన గ్రంథంలో రాసిన మాటలు హిందూ జీవన విధానం ప్రతిపాదించినవాటికన్నా భిన్నమైనవి కానప్పటికీ, మధ్య యుగాలలో ఘటనల కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల కొత్తగా అనిపిస్తాయి. వాస్తవానికి, నేడు వెనుకబడిన వర్గాలుగా చెప్తున్న సమాజం నుంచి వచ్చిన వాల్మీకి నుంచి వేమన వరకు మహనీ యులుగా గుర్తించి, గౌరవించి, ఆదరించిన సమాజం ఇది. ఆ విషయాన్నే డా।। అంబేడ్కర్ భారతీయ సమాజానికి కాసింత కటువుగానే గుర్తు చేశారని చెప్పాలి. భారతదేశం స్వాతంత్య్రం సాధించిన అనంతరం కేవలం తొమ్మిది సంవత్సరాలే జీవించిన డా।। అంబేడ్కర్ ఆధునిక భారతదేశ చరిత్రపై చెరగని ముద్ర వేశారన్నది సుస్పష్టం. ఆయన మధ్యప్రదేశ్‌లోని మావ్ మిలిటరీ కంటోన్మెం ట్‌లో ఒక మహర్ కుటుంబంలో ఏప్రిల్ 14, 1891న జన్మించారు, డిసెంబర్ 6, 1956న మరణించారు. భారత రాజ్యాంగ సభ చైర్మన్‌గా రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర అవిస్మరణీయమైంది. ‘‘కులాలు అనేవి మొదటగా దేశ వ్యతిరేకమైనవి, ఎందుకంటే అవి సామాజిక జీవితంలో వేర్పాటుకు కారణం అవుతాయి. అవి దేశ వ్యతిరేకమైనవి, ఎందుకంటే, ఒక కులానికి మరొక కులానికి మధ్య అసూయను, విద్వేషాన్ని సృష్టిస్తాయి. మనం వాస్తవ రూపంలో ఒక జాతిగా మారాలని భావిస్తే మనం ఇటువంటి కష్టాలన్నింటినీ అధిగమించాలి. జాతి ఉన్నప్పుడు మాత్రమే సౌభ్రాతృత్వమనేది వాస్తవ రూపం దాల్చగలదు. సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ లేకుండా లోతైన మెరుగులు ఉండవు,’’ ఇవి రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ఒక రోజు ముందు, అంటే నవంబర్ 25, 1949న రాజ్యాంగ సభలో ఇచ్చిన ఆఖరి ఉపన్యాసంలో డా।। అంబేడ్కర్ చెప్పిన మాటలు ఇవి. ఎంత మాత్రం సత్యదూరమైనవి కానివి.
ఏ దేశానికైనా రాజ్యాంగం రచించడమన్నది సులువైన పని కాదు. ముఖ్యంగా వందలాది కులాలు, జాతులు, మతాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఉన్న భారత్ వంటి దేశాల్లో ఇది మరింత కష్టం. కనుక, ప్రపంచ రాజ్యాంగాలపై మంచి పట్టు, అద్భుతమైన రాజకీయ పరిజ్ఞానం, గతాన్ని అధ్యయనం చేసి, వర్తమానాన్ని విశ్లేషించి, భవిష్యత్తును దర్శించగల ఒక గొప్ప తాత్వికత అవసరం. అంతేకాదు, వివిధ నాగరికతలు, సమాజాలు, సంస్కృతుల మధ్య ఉన్న బేధాల గురించి అవగాహన కలిగి ఉండటం, ప్రపంచ చరిత్ర, ప్రజాస్వామ్యం, అరాచక•త్వం సామ్రాజ్యవాదం గురించి లోతైన అవగాహన, వివిధ పాలనలు, వాటి శాఖల గురించి పరిజ్ఞానం కలిగి ఉండటం అవసరం. అన్ని దేశాల సామాజిక వ్యవస్థల పట్ల, చట్టాల పట్ల లోతైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే రాజ్యాంగానికి రూపకల్పన చేయగలరని, అటువంటి వ్యక్తి డా।। బీఆర్ అంబేడ్కరేనని నాడు పలువురి నాయకుల మన్ననలు అందుకున్న వ్యక్తి ఆయన. అంటే ప్రభుత్వానికీ, అది పాలించే ప్రజలకు మధ్య ఉండే సామాజిక ఒప్పందమే రాజ్యాంగం. ఒక దేశంలో ప్రభుత్వ చ్రలో అంతర్లీనంగా ఉండే ప్రాథమిక సూత్రావళి అని కూడా చెప్పవచ్చు. కనుక, రాజ్యాంగం కలిగిన దేశంలో ప్రతి వ్యక్తినీ అతడి హోదా, స్థాయితో సంబంధం లేకుండా సమానంగా పరిగణించడమే కాదు ఉన్నతమైన చట్టానికి కట్టుబడి ఉండాలనే భావన ఉంటుంది. ‘‘మనం దేశాన్ని అత్యంత నిజాయతీతో నడపకపోతే, అది భారతదేశానికి మరొక మరణం అవుతుంది. అంతేకాదు, ఒక జాతిగా మనం మన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది,’’ అంటూ ఆయన రాజ్యాంగ సభ చైర్మన్‌గా చేసిన తొలి ఉపన్యాసంలో అన్న మాటలు నిత్య సత్యాలన్నది కాదనలేం. సమాజంలోని ఏ వర్గాన్నీ విస్మరించకుండా ఆయన కల్పించిన హక్కులే నేటి భారతదేశ ప్రగతికి సోపానులుగా మారాయన్నది వాస్తవం.
జాగృతి డెస్క్