రామాయణ మహాభారత ఇతిహాసాలు రెండూ విశ్వవిరాట్పురుషుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. భగవంతుడు స్వయంగా దివి నుండి భువికి దిగివచ్చి ఆచరించి చూపిన ధర్మమార్గాలు. రామాయణం ఏనాటిది? ఏ యుగానిది! భారతం ఎన్నివేల సంవత్స రాల నాటిది! ఈనాటికీ భారత రామాయణాలను స్పృశించక మనకి కాలం గడవదు కదా! కష్టాలు వచ్చినప్పుడు రాముడే అరణ్యవాసం చేసి నానా అవస్థలూ పడ్డాడు మనమెంత… ధర్మరాజు అంతటి వాడికే తిప్పలు తప్పలేదు… అనుకుంటూ కష్టాలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ మహాకావ్యాలు చెక్కు చెదరకుండా ప్రజల గుండెలలో ఆలోచనలలో, ఆచరణలలో ఉదాహరణలుగా, సూక్తులుగా మార్గదర్శకాలుగా, కథావస్తువులుగా, కావ్యాలుగా, నాటకాలుగా, శిల్పాలుగా అనేక రూపాలతో నిత్యనూతనంగా నిత్య దినచర్యలలో ఉదాహరణలుగా భారతీయ హృదయాన్ని తమ వెంటే తిప్పుకుంటు న్నాయంటే… మనసులను పులకింప చేస్తున్నాయంటే అవి కథలు మాత్రమే కావు. గాథలంతకంటే కావు. యుద్ధాలూ, స్వార్థాలూ కావు. రాజ్యాలూ రాచరికాలూ కావు. రాముడు సీత కోసం, పాండవులు అయిదు ఊళ్ల కోసం పడిన తాపత్రయాలు కావు. విశ్వకల్యాణ కారకాలు.
ఉపనిషత్తులు వేదాలు, దర్శనాలు, బోధ పరచుకోలేని సామాన్య ప్రజలకు దారిదీపాలు – రామాయణ, భారతేతిహాసాలు. ‘బలం విష్ణోర్వర్ధతాం’ రామాయణంలో రాముడు భారతంలో కృష్ణుడు. ఇద్దరూ అవతారమూర్తులే. ఈ రెండు ఇతిహాసాల్లో మానవ జనజీవనానికీ కుటుంబ వ్యవస్థకీ, సాంఘిక ఔన్నత్యానికీ దగ్గరగా వచ్చేది రామాయణం. రాముడు ధర్మమూర్తి. ధర్మాచరణ ప్రియుడు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’. ముఖ్యంగా కావ్య నాయకులు సద్గుణ సంపన్నులుగా ఉండటమే శ్రేయోదాయకం! నాయకుడు ఆదర్శమూర్తి అయితేనే ప్రజలకు ఆరాధ్యమూర్తి కాగలడు. బ్రహ్మ హరిహరాదులకే రూపము శ్రీరామనాయకత్వము. రాముడు సర్వారాధ్యుడు ఎందుకైనాడు? అరణ్యాలకు వెళ్లినందుకా? పక్కన లక్ష్మణుడు సాయంగా ఉండెను కదా! సతీమణి వెంట ఉండెను కదా! పద్నాలుగేళ్లకి తిరిగి రావచ్చును కదా! రావణుని వధించి భార్యను తిరిగి తెచ్చుకున్నందుకా? ఆ ఘోర రాక్షసుని తానొక్కడే సంహరించినాడా, వానర సైన్యం సాయపడెను కదా! వారధి కట్టి సునాయాసంగా లంకను చేరేందుకు నలుని వంటి కౌశలురు ఉన్నారు కదా? మరేమిటి? అనగా ఆ రాముడు ఒక్క వ్యక్తి కాదు, ఒక్క శక్తి కాదు. ప్రతి చరాచర జీవిలోను అంతర్గతంగా ప్రకాశిస్తున్న పరమాత్మ స్వరూపుడు. ఆకలికి అన్నం, హృదయార్తికి రామనామం. అనగా ఆత్మనామం రామం. ఆత్మ-రామం కలిస్తే ఆత్మారామం. ఆత్మే రాముడు. రాముడే ఆత్మ. ప్రతి ఆత్మలోనూ తానుండి ప్రతి హృదయానికీ ఆత్మకీ ఆనంద సంధాయకునిగా వెలిగే పరమాత్ముడే రాముడు.
దైవ స్మరణంవల్ల దైవగాథలను తెలుసుకోవడం వల్ల మహా ప్రయోజనం ఉంటుంది. మహాత్ముల చరిత్ర మనసు పెట్టి చదివితే పఠితలు కూడా ఆ చరిత్రలోకి చొచ్చుకుపోతారు. ఆ శక్తి కవి వాక్కుకీ, కవి శక్తికీ ఉంటుంది.హృదయ గవాక్షంలోకి చంద్ర కాంతి చొచ్చుకువచ్చి అజ్ఞానం నిర్మూలనమౌతుంది. ఇన్ని ఇన్ని మహా విషయాలు తెలియకపోయినా తరతరాల నుండీ అక్షరాలు కూడా నేర్వని పల్లెల్లోని నారీమణులు తన చిన్న బిడ్డల్లో రాముణ్ణి చూసుకుంటూ రామాలాలి మేఘశ్యామా లాలి అని జోలపాటలు పాడి కౌశల్యామాత అనుభ వించినంత ఆనందాన్ని తామూ అనుభవిస్తారు. ప్రతి తల్లీ రామజననియే. ప్రతి బిడ్డా రామ్‌ల్లాయే! లాల పోశాక నీటి చెంబుతో దిష్టి తీసి శ్రీరామరక్ష పెడుతుంది. గుక్కపట్టి ఏడుస్తుంటే ఆంజనేయ దండకమో, హనుమాన్‌చాలీసాయో చదివి విభూతిగాని సిందూరంగాని పెడుతుంది. అన్న దమ్ముళ్లు అన్యోన్యంగా ప్రేమగా రామలక్ష్మణుల వలె ఐకమత్యంతో మెలగాలని కోరుకుంటుంది. శ్రీరామచంద్రునిలా తన భర్త ఏకపత్నీ వ్రతుడై పరస్త్రీని కన్నెత్తి చూడరాదని వాంఛిస్తుంది. ప్రతి పెళ్లి శుభలేఖ మీద ‘‘జానక్యాః కమలాంజలిపుటే యా పద్మరాగాయితా’’ అని సీతారాముల తలంబ్రాల శోభ వెల్లి విరుస్తుంది. ఇక అన్నదమ్ములు కొట్టుకుంటుంటే వాలి సుగ్రీవుల్లా కొట్టుకుంటున్నారు అంటాము. విభీషణుడు శత్రుపక్షమైన రాముని చెంత చేరినందుకు ఇంటి గుట్టు లంకకు చేటు అంటాము. కుయుక్తులు పన్నే వారిని మంధర అంటాము. తొందరపాటువాళ్లని చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు అని హనుమంతునితో పోల్చుకుంటాము.
వాయుపుత్రుడైన ఆంజనేయుడు రామాయణా నికి ప్రాణతుల్యుడు. ఆంజనేయుడు లేకపోతే రామాయణం లేదు. రావణాసుర సంహారం జరగడం కష్టమయ్యేది. సీత జాడ తెలియకపోయేది. రామ సుగ్రీవ మైత్రి సంఘటిల్లేది కాదు. సముద్ర లంఘనం చేసి అశోకవనమంతా గావించి లంకా పట్టణ రాజ సౌధాలన్నిటినీ శోధించి అమ్మని కనుగొనలేక రాముని అష్టదిక్పాలకులనీ శరణు వేడుకుంటాడు ‘‘నమోస్తు రామాయ సలక్ష్మణాయ, వైచతస్యై జనకాత్మజాయ, నమోస్తు రుద్రేంద్రయామాని లేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః’’ అంటూ అనేక ప్రార్థనలు చేస్తాడు. ‘‘నపశ్యామి వైదేహేం సీతాం సర్వాంగ శోభనామ్’’ అని రామునికి ఎలా చెప్పను? ఆ మాట వింటూనే రాముడు విగత జీవుడౌతాడు. లక్ష్మణుడు అన్నని అనుసరిస్తే భరత శత్రుఘ్నులు కూడా అదే దారి పడతారు. ఇంతకన్నా నేను ఈ లంకలో ఉండిపోయి, నిప్పుల్లోనూ, నీళ్లల్లోనూ దూకి అంతం అయిపోతాను అనుకుంటూ సుగ్రీవాజ్ఞను తలచుకుంటాడు. సీతమ్మను కనుగొనాలి లేకపోతే మరణమే శరణ్యం అనుకుంటూ అటు సుగ్రీవుడు కూడా మరణిస్తే మొత్తం వానర వంశానికే నాశనం కలుగుతుంది అనుకుంటాడు. తన శక్తి ఎంతో తనకు తెలియని ఒక కపి చేత ఇతిహాసాన్ని ఇంత సాహసంతో నడిపించిన వాల్మీకి శక్తి, అంతర్దృష్టి ఇంతింత అనరానిది. ఆంజనేయుని వంటి ధీశాలి, మేధావి, నిర్భీతుడు అణువణువూ ప్రభు భక్తిని నింపుకున్నవాడు, పరాక్రమవంతుడు, సూక్ష్మగ్రాహి, ధర్మరక్షణాపరుడు. ఇన్ని మహాశక్తులున్నా మంచుకొండలా కరిగిపోయి పత్తి పువ్వులా మెత్తనై ఒదిగిపోయే శక్తిమాన్. హనుమంతుని వంటి పాత్ర మరే విశ్వసాహిత్యంలోనూ కనబడదు. పుడుతూనే సూర్యుని చెంతకు ఎగిరాడు. రావణాసురుడు ఆంజనేయుణ్ణి చూడగానే నేను ఇదివరకు కైలాసంలో నన్ను శపించిన నందీశ్వరుడా ఇతడు అని సంశయించాడు. ఆంజనేయుడు శివసుతుడు. రామదూత, భవిష్యత్ బ్రహ్మ. అనగా హరిహర విరించి స్వరూపుడు. త్రిమూర్త్యాత్మకుడు.
రామాయణమంతా మూడు కోణాల మధ్య ఇమిడిపోతుంది. ఒకటి రాముడు. రెండు సీత. మూడు రావణాసురుడు. ఈ మూడు కోణాలూ, పర్వతాకారంలో ఉంటే ఆ పర్వతాన్ని తన ఎడమ అరచేతితో ఎత్తి మోసినవాడు ఆంజనేయుడు. ఈయన ఆకాశంలో చేతిలో పర్వతాన్ని పట్టుకుని ఎగురుతున్న విగ్రహాలు సదా పూజలందుకుంటాయి. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారాయ అని పూజిస్తారు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే హిమాలయాల్లో ఉన్న సంజీవనీ పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని బ్రతికించిన ఘనత హనుమంతునిది. లక్ష్మణునే కాదు, సీతమ్మకు జీవితం మీద ఆశ కలిపించి రాముని ముద్రికను చూపించిన వాడు ఆంజనేయుడు. రాముడు తిరిగి రాలేదన్న వ్యధతో భరతుడు ప్రాణోత్క్రమణం చెయ్యకుండా సకాలంలో నంది గ్రామానికి వెళ్లి భరత శత్రుఘ్నుల ప్రాణాలు కాపాడతాడు. ఇందుమూలంగా ఇనకుల వంశాన్ని నిలబెట్టిన ఘనుడు హనుమానుడు. కాబట్టి ఆయన మోసే పర్వతం ఇన వంశకుల సౌభాగ్య కూటం! భావితరాలవారికి భక్త సామ్రాజ్యకూటం! ఆ పన్నులకు సౌభద్ర కూటం! భావితరాలవారికి భక్త సామ్రాజ్య కూటం! ఆ పన్నులకు సౌభద్ర కూటం! ఆర్త జనావళికి అభప్రదాన కూటం! రాముడికి ఆంజనేయశక్తి తెలుసు. ఆంజనేయునికి రాముడే తనకు సర్వస్వమని తెలుసు. జానకిని వెతకటానికి వానర సేనలు వేలకువేలు అనేక వైపులకు వెళుతుండగా రాముడు ఒక్క హనుమంతునికే తన ముద్రికను సీతకు గుర్తుగా చూపమని ఇస్తాడు. తన ఆశలు తన భవిష్యత్తు లోక సంక్షేమం ఆంజనేయుని ద్వారానే జరుగుతాయని రాముడు తెలుసుకున్నాడు. సీతమ్మ కూడా తన చూడామణిని ఆంజ నేయునికి ఇస్తూ హనుమా నువ్వే రాముని ఇక్కడకు తీసుకు రాగలవు. నీ సహకారంతోనే రాముడు రావణుని గెలవ గలడు. నువ్వు కార్యశూరుడివి అంటుంది.
‘త్వమస్మిన్ కార్యనిర్వోగే ప్రమాణం హరిసత్తమ
హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరోభవ’
సీతమ్మకి హనుమ అంటే అంతటి విశ్వాసం. ఇంక అన్నింటికంటే ఎక్కువగా త్రిజటా స్వప్నాన్ని గుర్తు చేసుకుంటాము. ఎవరికైనా పీడ కలగాలని భయంకరమైన దుస్వప్నంగాని వస్తే త్రిజటా స్వప్నం గుర్తు చేసుకోమంటాము. ఈ స్వపాన్ని గురించి తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే పీడ కలలు రాక తప్పవు. ఈ త్రిజట వృద్ధరాక్షసి కాని, కొందరనుకున్నట్లు విభీషణుని కుమార్తె కాదు. దుస్స్వప్నాలు వస్తే భయపడేవారు త్రిజట స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి.
రావణాసురుణ్ణి వివాహమాడడానికి తిరస్కరించి నందున ఘోర ఆకారం గల రాక్షస స్త్రీలందరూ జానకిని చుట్టుముట్టి నానా మాటలూ అని భయపెడతారు. ఇప్పుడే తినేద్దాం అంటూ వాళ్లంతా సీత మీదికి గుంపులాగా వస్తారు. అప్పుడే నిద్రలేచిన త్రిజట, మూర్ఖుల్లారా, దశరథుని కోడలూ జనకుని కుమార్తె అయిన సీతను తినడం కన్నా మీలో మీరే ఒకర్నొకరు చంపుకు తినండి. నాకిప్పుడు ఒక బ్రహ్మాండమైన కలవచ్చింది తెలుసా! వినండి నా కల! రాక్షసులంతా నాశనం అయిపోతారు! లక్ష్మణునితో కూడిన రాముడు తెల్లని సుందరమైన పూలమాలలు వేసుకుని తెల్లని పట్టు బట్టలు ధరించి ఈ సముద్ర మధ్యంలో ఉన్న తెల్లని పర్వతం మీద ఉన్నట్లు నాకు స్వప్నం వచ్చింది. ఆయన రాముడని నీకు తెలుసా? నువ్వు చూశావా? అన్నారంతా, భయంతో వణుకుతూ. నేను రాముణ్ణి ఎప్పుడూ చూడలేదు. కాని ఆయన రాముడని నాకు స్థిరంగా తెలుసు. నా ఆత్మ అలా చెబుతోంది. ఈ సీతమ్మ కూడా సూర్యుని కాంతితో వెలిగిపోతూ రాముణ్ణి చేరుకుంటోంది. సీత రాముని తప్ప మరొకరి చెంతకు ఎలా వెడుతుంది? మళ్లీ రాముడు నాలుగు దంతాలున్న మహా పర్వతం లాంటి ఏనుగును ఎక్కి వస్తున్నాడు. లక్ష్మణుడు వెంట ఉన్నాడు. జానకి పర్వతం లాంటి ఆ ఏనుగును అధిరోహించింది. వీళ్లంతా ఈ లంకపైన ఆకాశంలో విహరిస్తున్నారు. ఆ తరువాత తెల్లని వృషభములు కట్టిన రథంపై ఒక మారు, తెల్లటి అశ్వాలు కట్టిన రథంపై ఒక మారు సీతారామ లక్ష్మణులు కనుపించారు. వాళ్లంతా పుష్పక విమానం ఎక్కి ఉత్తరం వైపుగా వెళ్లిపోయారు.
ఇక లంకేశ్వరుడు, శరీరమంతా నూనె కారుతూ ఎర్రటి కళ్లతో తాగుతూ కిందపడి దొర్లుతూ జీవం లేనివాని వలె కనుపించాడు. ఆ గాడిదల రథంమీద వెడుతూ కూడా మన రాజు కనిపించాడు. ఇదే దృశ్యం చాలాసార్లు కనిపించింది.
రక్తం ఓడుతున్నట్లు ఎర్రని బట్టలు కట్టుకుని చింపిరి జుట్టు విరబోసుకుని పొడుగైన కోరలతో ఉన్న గంగాళాల వంటి నోళ్లు తెరిచి గుండెలు అదిరిపోయేలాగ పెద్దగా ధ్వని చేస్తూ పిడుగులు పడుతున్నట్లు నవ్వుతూ మన రాజు రావణుణ్ణి తాడుతో కట్టేసి బరబరా ఈడ్చుకుంటూ దుర్గంధంతో ముక్కులు బద్దలైపోతుండగా ఒక పెద్ద మురికి గుంటలో పడవేస్తుంటే చుట్టూ చేరిన మన రాక్షస గుంపు వెర్రిమొర్రిగా నానా అల్లరీ చేస్తూ ఆడుతోందిట! మన రాణి మండోదరి జుట్టు విరబోసుకుని గుండెలూ నెత్తీ బాదుకుంటూ ఏడుస్తోంది. ఇంతకు ముందు వరకు సీతమ్మను చంపుతామని అల్లరి చేస్తున్న రాక్షస స్త్రీలందరూ బొమ్మల్లాగ నిలబడిపోయారు. ఇప్పుడు సీత ఏడ్చిన ఏడ్పుకు వందరెట్లు మన లంకలోని ప్రతి గృహంలోని స్త్రీలు గోలుగోలు మని ఏడుస్తారు. అని త్రిజట తన కల చెప్పేసరికి అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం ఏర్పడింది. అటు తరువాత సేతువు నిర్మించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల గడిమి ద్రుంచి అల విభీషణుని లంకకు అధిపుచేరి భూమి సుతగూడి సాకేతపురము నందు రాజ్యసుఖము గైకొనెను రామ విభుడు(పోతన).
యుద్ధం అయిపోయింది. నిజానికి యుద్ధ కాండలో రామాయణ కావ్యం సుఖాంతం! పధ్నాలుగు సంవత్సరాలు తమ ముద్దుబిడ్డడు రామన్న తండ్రి అడవులపాలై అష్టకష్టాలననుభవిస్తుంటే ప్రజలు దుఃఖంతో తల్లడిల్లిపోయారు. ఏ ఇంటిలో పండగగాని శుభకార్యంగాని లేదు. ఇన్నాళ్లకి రాముడు అయోధ్యా ప్రవేశం చేస్తున్నాడు. భార్యతో తమ్ముళ్లతో, వానరమిత్రులతో, బంధువులతో. ఇక వారికే కాదు, సమస్త లోకాలకూ పండుగ. భూదేవికి జవసత్వాలు వచ్చాయి. మళ్లీ సంతోషంతో ఉప్పొంగి పోయి సస్యశ్యామలమైపోయింది. రుత్వికులు వేదవేత్తలు మహాధైర్యంతో గొంతులు చించుకుని పనసలు పాడుకుంటున్నారు. గోవులు మోరలెత్తి ఆనందంతో అంబా… గంతులు వేస్తున్నాయి. ముక్కోటి దేవతలు తామే రాక్షసుల నంతం చేసినంత ఆనందంతో అప్సర నాట్యాలతో ఆనందామృత సేచనాలతో మహాతృప్తులౌతున్నారు. నారద తుంబరుల కాలి యందెలు, చేత తంబురాలు నిర్విరామంగా మధర నామగానం చేస్తున్నాయి.
ఈ యుద్ధకాండాంతాన్నే వాల్మీకి మహర్షి రామాయణ కావ్యపఠన పారాయణ ఫలశృతిని విరచించారు. ‘సీతాయాశ్చరితం మహత్’ అని రామాయణానికి ఇంకొక పేరు. ఎందుకు రామాయ ణాన్ని చదవాలి? మండోదరి శోకంతో అంటుంది, రాముడు నారాయణుడే శ్రీ వత్సవక్షసుడు. శంఖ చక్రగదాధరుడు.
అటువంటి వాని భార్యను అపహరించి నీకు నువ్వే చేటు తెచ్చుకున్నావు. దేవతలను అష్టదిక్పాల కులను జయించి నీ సేవకులను చేసుకున్నావు. కానీ నీ సేవకులను నీ చెప్పుచేతలలో పెట్టుకోవలసిన నీ ఇంద్రియాలను నువ్వు జయించలేక వాటికి నువ్వు విధేయుడవై కామాతురుడవై జానకికి అపకారం చేశావు. సీతమ్మ ఎంతో ఓర్పు కలది. భూమికన్న ఓర్పు కలది. స్వయంగా లక్ష్మి. భర్త అంటే పంచ ప్రాణాలు. దిక్కులేకుండా జనశూన్యమైన వనంలో పెట్టి హింసించవు. ఆ పతివ్రత బాధ వ్యథ ఆక్రోశం ఆర్తి ఇవన్నీ నీకు శాపాలైనాయి. ఆ పతివ్రత తపస్సు చేతనే నువ్వు కాలిపోయావు. సముద్రం అవతలికి వెళ్లి నీ మృత్యువును నీవు తెచ్చుకున్నావు అని విలపిస్తుంది.
ఇలాగని సీతారాములు లక్ష్మీనారాయణు లనే బ్రహ్మ రహస్యాన్ని మండోదరి విప్పి చెప్పింది యుద్ధకాండలోనే. ఆంజనేయుడు రామనామ మహిమతోనే సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి సీతను కనుగొన్నాడు. అలాగే లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరికి ఒకరు తగ్గకుండా సౌరాస్త్రములు ఆగ్నేయా స్త్రములు మొదలైన క్రూరాస్త్రములు ప్రయోగిస్తూ అతి భయంకరమైన యుద్ధం చేస్తున్నపుడు ఆకసం నుండి సప్తర్షులు దేవతలు యక్ష గంధర్వులూ ఉత్కంఠతో చూస్తుండగా లక్ష్మణుడు, ‘‘ఓ బాణమా! రాముడు ధర్మాతుడైతే, సత్యసంధుడైతే, పౌరుషంలో అతనిని ఎదిరించగలవాడు ఎవడూ లేనట్లయితే ఈ ఇంద్రజిత్తును చంపు’’ అంటాడు. ఇదే అస్త్రమంత్రం – ఆ బాణం ఆ మాట విని ఇంద్రజిత్తును చంపివేసింది. రాముడు భరతుడు ఉన్న నంది గ్రామానికి వస్తాడని తెలిసి అయోధ్య ప్రజలందరూ చుట్టుపక్కల రాజ్యాల వారు గ్రామాల వారు వెళ్లారు. భరతుడు అన్నగారికి రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు. రామలక్ష్మణ జానకీ సమేతంగా తన మిత్రులైన జాంబవతాది వానర సైన్యాధ్యక్షులు విభీషణాది రాక్షస ప్రముఖులతో అయోధ్య ప్రవేశించాడు. మొత్తం పద్నాలుగు లోకాలవారు ఆ దృశ్యాన్ని చూడటానికి కళ్లార్పకుండా పరికిస్తున్నారు. అయోధ్యవాసులు; కౌసల్యానందవర్ధనా, మహాబాహో స్వాగతం స్వాగతం అని గొంతు చించుకుని అరిచారు.
సుషేణుడు తూర్పు సముద్రం నుంచి, ఋషభుడు దక్షిణ సముద్రం నుంచి,
గవయుడు పశ్చిమ సముద్రం నుంచి, నలుడు ఉత్తర సముద్రం నుంచి, సర్వరత్న మణమయ బంగారు కలశాలతో జలాన్ని తెచ్చారు. వసిష్ఠుడు వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు సుయజుడు గౌతముడు, విజయుడు మొదలైన మహర్షులు మంత్రాలు, శాంతి వేదాలు పఠిస్తున్నారు. కన్యలు, ముత్తయిదువలు, వృద్ధులు, యోధులు, మేధావులు, అమాత్యులు సైన్య ప్రముఖులు, అత్యంత ఆశ్చర్యానందాలతో వీక్షిస్తున్నారు. స్వస్తి వాచకాలూ తూర్యనాదాలూ ధ్వనిస్తున్నాయి.
‘‘రామం రత్నమయే పీఠే స సీతం సంన్య వేశయత్’’ వసిష్ఠుడు సీతా సమేతుడైన రాముని రత్నసింహాసనముపై కూర్చుండపెట్టాడు.
సముద్ర జలాలు, నదీ జలాలు, ఔషధీరసాలు మొదలైన పుణ్యజలాలను. కన్యలు ప్రేమ మీదుగా భక్తి ప్రపత్తులతో సీతారాములకు అభిషేకం చేశారు.
వృద్ధులకు పెద్దలకు పండితులకు పురప్రముఖు లకు వస్త్రాలు, ఆభరణాలు, అశ్వాలు, గోవులు మొదలైనవి బహూకరించి సంతృప్తి పరచాడు శ్రీరామ చంద్రుడు. సుగ్రీవుడికి సూర్యకిరణాల కన్న మిన్నగా ప్రకాశించే మణిమాణిక్యాలు గల బంగారుహారాన్ని, బాహు పురులను అంగదునికి, చంద్రకిరణాల వంటి ప్రకాశం గల బంగారు ముత్యాలహారాన్ని దివ్యమైన పట్టు పుట్టుములను సీతాదేవికి ఇచ్చాడు. ఈ హారాన్ని సీతమ్మ అంజనీ సుతునకు ఇచ్చింది. ఆ హారాన్ని ఆంజనేయుడు మెడలో వేసుకుని ఆనందపడ్డాడు. అలాగే మైందునికి ద్వివిదులకు విభషణునకు వారు ఏది కోరితే అది ఇచ్చి ఆనందపరిచాడు. అందరూ తృప్తిగా ఎవరి స్థలాలకు వారు వెళ్లారు.
‘రాజ్యం దశ సహస్రాని ప్రాప్యవర్షాణి రాఘవః
శతాశ్వమేధానాజహ్రే సదశ్వాన్ భూరిదక్షిణాన్’
శ్రీరాముడు పదివేల సంవత్సరాలు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. అత్యంత విలువైన దక్షిణలు, దానాలూ ఇస్తూ నూరు అశ్వమేధ యాగాలు చేశాడు.
శుభం
– ఇదీ రామాయణం. వాల్మీకి మహర్షి ప్రవచించిన ఫలశృతి.
ఇటువంటి ఘన చరిత్ర గల రామాయణం విన్నా చదివినా, రాసినా ఉత్సవాలు చేసినా పుత్రులు పౌత్రులతో ప్రజలు ఆనందంగా కలకాలం జీవిస్తారు. పంటలు బాగా పండుతాయి. రామాయణం వింటే దీర్ఘాయువు లభిస్తుంది. కష్టాలు తొలగుతాయి.
బంధుమిత్రులతో సఖ్యంగా వుంటూ సంతోషంగా ఉంటారు. విఘ్నాలు తొలగుతాయి. కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి కలుగుతుంది.
‘ఆయుష్యమారోగ్య కరం యశస్యం
సౌభ్రాతృకరం బుద్ధికరం- శుభంచ’
రామాయణాన్ని చదవండి-చదివించండి
– డా।। దిట్టకవి శ్యామలాదేవి,