మూడోసారీ మోదీ సర్కారే అన్న మాట ఏనాడో రూఢి అయింది. తాజాగా సర్వేలన్నీ ఘోషించాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ‌పార్టీకి దిక్కుతోచని స్థితి. కొన్ని విపక్షాలని ఏకతాటి మీదకు తెచ్చి ఐ.ఎన్‌.‌డీ.ఐ.ఏ. కూటమిని ఏర్పాటు చేసినా ప్రధాని అభ్యర్థి ఎవరో తేలడంలేదు. సీట్లు పంపకంలోనూ గందరగోళమే. ఈ పరిస్థితుల్లో కులగణన అనే తేనెతుట్టెను బిహార్‌ ‌ప్రభుత్వం కదిపింది. విపక్ష కూటమి నుంచి ఇదొక ఆఖరి తుంటరియత్నం. సమాజాన్ని కులపరంగా విభజిస్తే హిందువుల ఓట్లు చీలి, బీజేపీ కుంగుతుందని విపక్షాల అంచనా. కానీ అది మొదటికే మోసమని అవి గ్రహించలేపోతున్నాయి. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కాంగ్రెస్‌ ‌పార్టీ హామీ కూడా ఇచ్చింది. చిత్రంగా తాను  అధికారంలో ఉన్న కర్ణాటకలోనే కులగణన వ్యవహారం  బెడిసికొట్టే సూచనలు కనిపించాయి.

జనగణనలో కులగణన కోసం ఇప్పటికే బిహార్‌, ‌మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా, జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రులు అసెంబ్లీలలో తీర్మానాలు చేసి, కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచారు. కేసీఆర్‌ ‌ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో బీసీ కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం తెస్తామని ప్రకటించారు. గతంలో ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ కూడా తీర్మానాలు చేసింది. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ ‌యాదవ్‌, ‌సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌బీఎస్పీ అధినేత మాయావతి సహా మిగిలిన జాతీయ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా ఉన్నాయి. అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ‌సంతుష్టీకరణ రాజకీయాలు సాగించింది. ఏ వర్గానికీ ప్రయోజనం కలగలేదు. పైగా అపోహలు పెరిగాయి. కులాలను అడ్డు పెట్టుకొని హిందూ సమాజాన్ని మరింత చీల్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టి కాంగ్రెస్‌ ‌ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. తాము సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పుడు చేయని కుల గణనను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేసి తీరాలంటున్నది. ఇందులో రాజకీయ స్వార్ధాన్ని అర్థం చేసుకోవచ్చు.

బిహార్‌ ‌కులగణన, విమర్శలు

కుల గణనలో బిహార్‌ ‌ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉంది. రెండు మూడేళ్లు చేసిన కులగణన సర్వేను నివేదికను ఆ మధ్య రాష్ట్ర అభివృద్ధి కమిషనర్‌ ‌వివేక్‌ ‌సింగ్‌ ‌విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర జనాభా దాదాపు 13.07 కోట్లు. వీరిలో అత్యంత వెనుబడిన తరగతుల (ఈబీసీ) వారు 36 శాతం. ఇతర వెనుకబడిన తరగతుల (ఓఈసీ) వారి వాటా 27.13 శాతం. కులాల వారీగా ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికం. మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతం. ఎస్సీ జనాభా 19.7 శాతం, ఎస్టీ జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్‌ ‌కేటగిరీ 15.5 శాతం.

అయితే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో బిహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ ‌గత ఏడాది జూన్‌లో కులగణన చేపట్టనున్నట్టు ప్రకటించారు. 2023, జనవరిలో కులాల వారీ లెక్కల సేకరణ ప్రారంభమైంది. 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ పక్రియను పూర్తిచేశారు. కులగణనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని న్యాయస్థానం కొట్టివేస్తూ సర్వేకు అనుమ తించింది. దీంతో విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.

బిహార్‌ ‌కులగణన ఆధారంగా ఓబీసీ రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్లు వినిపించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆ రిజర్వేషన్లు 27 శాతం. సర్వే ప్రకారం బిహార్‌లో మూడింట రెండొంతుల జనాభా వెనుబడిన తరగతులకు చెందినవారని తేలింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నివేదిక వెల్లడైంది. దాంతో ఎన్నికల ప్రచారంలో ఈ అంశం అన్ని పార్టీలకు కీలకం కానుంది. కులగణన నివేదికను ఆర్జేడీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌స్వాగతించారు. ఈ గణాంకాలు అభివృద్ధి విధానాలను రూపొందించడంలో దేశానికి మార్గదర్శకంగా నిలిచి, వెనుకబడిన, పేద ప్రజలకు నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడానికి తోడ్పడుతాయని అన్నారు. ఈ సర్వేతో కులాల శాతం మాత్రమే బయటకు రాలేదని, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు సైతం తెలిశాయని ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌ అన్నారు. కులగణన సర్వే నివేదిక బయటకు రాగానే బిహార్‌లో ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో, రాష్ట్రంలో అన్ని రిజర్వేషన్లు కలిపి 75 శాతానికి చేరతాయి.

యాదవులు, ముస్లింలకే పెద్దపీట

బిహార్‌ ‌ప్రభుత్వ సర్వే కంటి తుడుపు చర్య అని కేంద్రమంత్రి గిరిరాజ్‌ ‌సింగ్‌ ‌విమర్శించారు. తాజాగా వెల్లడైన గణాంకాల పట్ల ప్రజల్లో ఎన్నో సందేహాలున్నా యని చెప్పారు. ఈ సర్వే నితీశ్‌, ‌బీజేపీ ప్రభుత్వ హయాంలోనే మొదలయింది. అంటే బీజేపీ మద్దతు కూడా ఉంది. ఈ కులగణనలో యాదవులు, ముస్లింల గణాంకాలు వాస్తవాలు కావనే విమర్శలు వచ్చాయి. బిహార్‌ ‌ప్రభుత్వం ఆ వర్గాలను అధిక సంఖ్యాకులుగా చూపించాలని కోరుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ఆరోపించారు.

దేశవ్యాప్తంగా బీసీ కేటగిరీలో వందల కులాలు ఉన్నాయి. చిన్నకులాలకు చెందిన ప్రజలు సామాజిక, ఆర్థిక తదితర కారణాలతో వారికి కేటాయించిన ఉద్యోగ, రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోలేరు. ఎందుకంటే మళ్లీ ఆధిపత్య బీసీ కులాలే ప్రయోజనాలు పొందుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఆరు బీసీ కులాలవారికే అన్ని పదవులు దక్కుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే కొన్ని ఆధిపత్య బీసీ కులాల నాయకులే బీసీలకు కేటాయించిన అన్ని స్థానాలను కైవసం చేసుకుంటున్న పరిస్థితి. దీంతో బీసీల్లోనే ఉన్న అణగారిన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

8 శాతం జనాభాకు, 70 మంది ఎమ్మెల్యేలు

1977 నుంచి ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌లోని యాదవులు వంటి ఆధిపత్య బీసీ కులాలు ఎక్కువ లబ్ధి పొందుతున్నాయనేది వాస్తవం. బిహార్‌ ‌జనాభాలో యాదవులు 8 శాతం. కానీ, శాసనసభలో ఆ వర్గం నుంచి 70 మంది ఉన్నారు. ఇది 26 శాతానికి సమానం. ఇది న్యాయమని ఎవరూ అనలేరు. చిన్న కులాలవారు కేంద్రీకృతం కాక పోవడంతో ఆ వర్గం నుంచి ఎమ్మెల్యేలను చేయడం అసాధ్యం. అయితే యాదవులు ఇతర ఆధిపత్య బీసీలే కుల గణనకు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగినప్పుడు బీసీలలోని అణగారిన వర్గాలు తమను అత్యంత వెనుకబడిన తరగతులుగా వర్గీకరించాలని, ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ ‌చేయవచ్చు. ఒకటి నిజం. బీసీ, ఎస్సీ, ఎస్టీలలోని ఆధిపత్య వర్గాలను కులగణన బహిర్గతం చేస్తుంది. అందుకే ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోని అనేక చిన్న పార్టీలు వెనుకబడిన కులాలు, షెడ్యూల్‌ ‌కులాలను వర్గీకరించాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. చిన్న కులాల మద్దతు ఉన్న పార్టీలు తమ వర్గాల ఓట్లను సమీకరించుకుని పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను పొందు తున్నాయి. కులగణన రికార్డుల్లో తప్పులు ఉంటాయ నేది వాస్తవం. ప్రతివారు తమ కుల జనాభా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు చూపించాలనుకుంటారు. ప్రస్తుతం కులగణన దేశవ్యాప్తంగా కచ్చితంగా నిర్వహిస్తే బీసీ వర్గాల్లో విభజన వచ్చే అవకాశం ఉంది. కాగా, ఎస్సీలలోనే మాదిగలు తమను మాలల నుంచి వేరు చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వర్గీకరణ ద్వారా మాత్రమే అట్టడుగున ఉన్న బీసీల అభివృద్ధికి బాటలు వేయాల్సి ఉంటుంది.

రాహుల్‌ ‌వాదన

ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ కులగణన అంశాన్ని ప్రధానంగా వాడుకున్నారు. అన్ని రుగ్మతలకు కులగణనను ‘ఎక్స్ ‌రే’ అంటూ అభివర్ణించారు. ఛత్తీస్‌ ‌గఢ్‌లో అయితే ‘అధికారంలోకి రాగానే రెండు గంటల్లో కుల గణన చేపడతాం’ అని ప్రకటించారు. వాస్తవం ఏమిటంటే, కుల గణనపై ఇండియా కూటమిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేపట్టలేదని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో కులగణన వంకతో హిందువులను విభజించేందుకు, తద్వారా దేశాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ కుట్ర చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణ. ‘కుల గణన చేపట్టి జనాభా ఆధారంగా వనరులను పంచాలనడంలో కాంగ్రెస్‌ ఉద్దేశం ఏమిటి? తద్వారా ముస్లింలు, మైనారిటీల హక్కులను తగ్గించాలను కుంటోందా? దేశంలో ఎవరి జనాభా ఎక్కువగా ఉంది? అత్యధిక జనాభాగా ఉన్న హిందువులే ముందుకొచ్చి హక్కులన్నీ తమకే కావాలని డిమాండ్‌ ‌చేయాలా? కాంగ్రెస్‌ ఆశిస్తున్నదేమిటి?’ అని ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార సభల్లో తన విధానాన్ని స్పష్టం చేశారు.

కర్ణాటక చిక్కుముడి

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో పరిస్థితి ఇది. దేశవ్యాప్తంగా కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించాలని డిమాండ్‌ ‌చేస్తూ తాము అధికారంలో ఉన్న కర్ణాటకలో చేపట్టక పోవడంతో సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత మొదలైంది. 2017 లోనే కులాల లెక్కలు సేకరించినా, నివేదికను ఇప్పటికీ బహిర్గతం చేయలేక సతమత మవుతోంది. ఇందుకు కారణం రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిర్ణయాత్మక శక్తులుగా ఉన్న రెండు ప్రధాన కులాలు లింగాయత్‌లు, వొక్కలిగలు ఈ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేయడమే. ఓబీసీ వర్గానికి చెందిన సిద్ధరామయ్య నివేదికను విడుదల చేయడానికి సుముఖంగా ఉంటే.. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్‌ ‌వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరేళ్లుగా కోల్డ్ ‌స్టోరేజిలో ఉన్న ఈ నివేదిక వెలుగు చూస్తుందా, లేదా అన్నది ప్రశ్నార్థకమైంది. నిజానికి నివేదిక లీకైంది. నివేదికలో లింగాయత్‌లు, వొక్కలిగ వంటి ప్రధాన వర్గాల సంఖ్య తగ్గిందని తేలింది. దీంతో సర్వే శాస్త్రీయంగా జరగలేదని ఈ వర్గాలు ఆరోపిస్తున్నాయి. లింగాయత్‌ ‌వర్గంపై చిన్నప్పరెడ్డి కమిషన్‌ ‌కులగణన నిర్వహిం చింది. దాని ప్రకారం లింగాయత్‌లు రాష్ట్ర జనాభాలో 17 శాతం. 2017 నాటి సర్వేలో ఆ సంఖ్య 14 శాతంగా ఉంది. అందుకే సర్వే శాస్త్రీయంగా జరగలేదని ఆరోపిస్తున్నారు.  వొక్కలిగలవీ ఇలాంటి అభ్యంతరాలే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈ రెండు వర్గాలు లేఖలు రాశాయి. ఆ లేఖపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ‌కూడా సంతకం చేయడం గమనార్హం. ఆరేళ్ల క్రితమే సిద్ధం చేసిన నివేదికను ఇప్పటికైనా బయటపెట్టకపోతే ఆ పార్టీ చేస్తున్న డిమాండ్‌కు అర్థం ఉండదు. ఇస్తున్న హామీపై జనానికి నమ్మకం ఏర్పడదు. అందుకే ఈ నివేదికను బహిర్గతం చేయక తప్పని పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. కానీ ఈ నివేదికను విడుదల చేస్తే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎదురుదెబ్బలు తినక తప్పదు.

తమ రాష్ట్రంలో ఓబీసీ కులగణన నివేదిక విడుదలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు కొందరు మంత్రులు అడ్డుపడుతున్నారని ఇటీవల స్వయానా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే రాజ్యసభలో వాపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఓబీసీ కులగణనకు డిమాండ్‌ ‌చేస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీ, కర్ణాటకలో ఆ నివేదికను ఎందుకు విడుదల చేయడం లేదని రాజ్యసభలో ఖర్గేను ఉద్దేశించి బీజేపీ సభ్యుడు సుశీల్‌కుమార్‌ ‌మోదీ నిలదీశారు. దీనిపై స్పందించిన ఖర్గే, ‘అక్కడ అతను(డీకే) వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మీరూ (బీజేపీ) వ్యతిరేకిస్తున్నారు. దీనిని బట్టి అగ్రవర్ణాల వారంతా అంతర్గతంగా ఐక్యంగా ఉన్నారు’ అని పరోక్షంగా శివకుమార్‌ ‌చర్యను తప్పుపట్టారు.

కాగా ఖర్గే వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌ ‌కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్రంలో ఓబీసీ కులగణన శాస్త్రీయంగా జరగలేదనే తాము తిరిగి కులగణనకు డిమాండ్‌ ‌చేస్తున్నట్టు ఆయన బాహాటంగానే ఖర్గే వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. అయితే కులగణన కేంద్రం బాధ్యత అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి గుర్తు చేశారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌ ‌రాజకీయాలు జాతీయ స్థాయిలో బజారున పడటంతో ఆ పార్టీకి కక్కలేక మింగలేని పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ‌నాయకులు కులగణన హామీ ఇచ్చారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే  కులగణన నిర్వహిస్తామని, బీసీ కులాల లెక్కలు తీస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో బీసీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వెంటనే కులగణన చేపట్టాలని, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, బీసీ విద్యార్థులకు పూర్తి బోధన రుసుములను చెల్లించాలని ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ నాయకులు కోరారు. రిజర్వేషన్లు పెంచకుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్‌ ‌మాట్లాడుతూ, కులగణనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆంధప్రదేశ్‌లో కులాల వారీగా అధికారిక సర్వేకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వలంటీర్లతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ద్వారా ఈ సర్వే చేపడతారు. కులగణన అంశంలో బిహార్‌ ‌దారిలో ఒడిశా కూడా ముందడుగు వేస్తోంది. ఒడిశాలో ఇప్పటికే ఓబీసీ జాబితాను నవీన్‌ ‌పట్నాయక్‌ ‌నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఆ జాబితాను ఎప్పుడు విడుదల చేయాలా..? అని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వెనకబడిన ఐదు ముస్లిం వర్గాలపై సర్వే చేయను న్నట్లు అసోం ఇప్పటికే ప్రకటించింది. సోషియో-ఎకానమిక్‌ ‌సర్వే నిర్వహించి, దాని ఆధారంగా వారి అభివృద్ధికి పాటుపడనున్నట్లు స్పష్టం చేసింది.

వివాహాలలో…

ప్రస్తుతం మన సమాజంలో కులాంతర వివాహాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి జన్మించిన పిల్లల సంఖ్యను కులగణన వెల్లడించదు. కాబట్టి, ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతి ప్రకారం కులాంతరం వివాహం చేసుకున్నవారికి పుట్టిన బిడ్డ తన తల్లిదండ్రుల తక్కువ కులాన్ని క్లెయిమ్‌ ‌చేయవచ్చు. ఇదేవిధంగా ఇక ముందు జరిగితే రిజర్వుడు కులాల సంఖ్య త్వరలోనే మరింత పెరుగుతుంది. ఎందుకంటే రిజర్వేషను కోరుకునే ఏ కుమారుడు లేదా కుమార్తె అయినా తల్లిదండ్రుల ఉన్నత కులాన్ని క్లెయిమ్‌ ‌చేయరు.

ఉదాహరణకు ఒక అగ్రవర్ణ కులానికి చెందిన మహిళ షెడ్యూల్‌ ‌కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే.. వారికి పుట్టిన సంతానం రిజర్వేషన్ల ఫలాలు పొందటానికి షెడ్యూల్‌ ‌క్యాస్ట్ ‌కావాలని కోరుకుంటారు.

– క్రాంతి దేవ్‌ ‌మిత

 (కులగణన చరిత్ర, ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయం.. వచ్చేవారం)

About Author

By editor

Twitter
YOUTUBE