తెలంగాణలో సమగ్ర భూమి రికార్డుల యాజమాన్యం పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో లోపాలు, సమస్యలు క్రమంగా బయట పడుతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీరుతెన్నులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ప్రత్యేకంగా ఓ కమిటీనే నియమించింది.
వాస్తవానికి కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచే ధరణి పోర్టల్‌లోని సమస్యలు, లోపాలపై ఆక్షేపణలు లేవనెత్తింది. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ స్థానంలో మరో ఉత్తమమైన వ్యవస్థను తీసుకొస్తామని చెబుతూ వచ్చింది. ఆ హామీ మేరకు ధరణిని విశ్లేషిస్తూ పోతే పలు లోపాలు బయట పడుతున్నాయి. ఆ పోర్టల్ కారణంగా, భూ యాజమానులు… ముఖ్యంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందన్న అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తి చూపుతోంది. ఇందులో భాగంగానే పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, నిషేధిత జాబితాలోని అనేక భూములు ఆక్రమణలకు గురైనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ధరణిలో నమోదై, పాస్ పుస్తకాల్లో చూపిస్తున్న భూవిస్తీర్ణానికి.. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి చాలా తేడాలున్నట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది.
1956 నాటి సేత్వార్ ఆర్‌ఎస్‌ఆర్ రికార్డుతో పోల్చితే గడిచిన 60 ఏళ్లలో భూమి రికార్డుల్లో సుమారు 6 లక్షల 50 వేల ఎకరాలు ఎక్కువగా నమోదైనట్లు లెక్కలు చూపిస్తున్నాయి. దీంతో పాస్ పుస్తకాల్లో అధికంగా ఉన్న భూ విస్తీర్ణాన్ని సవరించాల్సి ఉందని అధికారులు అంటున్నారు.
నిషేధిత జాబితాలో నమోదు చేసి ఉన్న అనేక భూములు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆక్ర మణలకు గురైనట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది.రికార్డుల్లో నిషేధం పేరుతో ఉన్న భూములను అక్రమార్కులు, అధికారులు పట్టా భూమిగా మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వేల కోట్ల రూపాయల విలువైన అవినీతి జరిగినట్లు ఈ ప్రభుత్వం గుర్తించింది. ప్రత్యేకంగా ఏర్పాటైన ధరణి కమిటీ ఈ అన్ని అంశాలపైనా దృష్టి సారించింది. అనుమానిత భూముల వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అలాగే, అనుమానాస్పదంగా కనిపిస్తున్న లావాదేవీలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. భూములకు సంబంధించి ఎదురవు తున్న సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయికి వెళ్లాలని కమిటీ భావిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారం వెనక ఎవరున్నారు? వాళ్లకు సహకరించిన అధికారులు ఎవరన్న దానిపై ధరణిపై నియమించిన కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిషేధిత జాబితాలో ఉండి అన్యాక్రాంతమైన ఆయా భూముల వివరాలు అందజేయాలని అధికారులను సదరు కమిటీ ఆదేశించింది. కమిటీ కన్వీనర్, సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ చైర్మన్‌గా.. సభ్యులు, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, భూ పరిపాలన పూర్వ ప్రధాన కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, నల్సార్ యూనివర్సిటీకి చెందిన భూ చట్టాల నిపుణుడు సునీల్, మాజీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి సభ్యులుగా ధరణి వాస్తవ నిర్థారణ కమిటీని ఏర్పాటు చేశారు.
ధరణి పోర్టల్ అమలులోకి వచ్చాక ఏ రకమైన లావాదేవీలు జరిగాయి? నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా ధరణి పోర్టల్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు చెందేలా నిర్ణయాలు తీసుకున్నారా? అలాగే, అసైన్డ్ భూములను కూడా ఆ జాబితా నుంచి తొలగించారా? ప్రభుత్వ భూముల పరిస్థితి ఏంటి? అనే అంశాలపై ధరణి కమిటీ తొలి సమావేశంలో ఆరా తీశారు. ధరణి అమలులోకి వచ్చిన తర్వాత ఈ పోర్టల్ ద్వారా గత మూడేళ్లలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలన్నీ పరిశీలించాలని నిర్ణయించారు. ధరణికి సంబంధించిన పూర్తి లావాదేవీలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాస్తవానికి, ధరణి పోర్టల్ అమలులోకి రాకముందు రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం విక్రయించడానికి వీల్లేని భూములను 22 (ఏ) కింద నిషేధిత జాబితా (ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్- పీవోబీ)లో ఉంచారు. అయితే , అలా ప్రత్యేకించిన భూములు చాలాచోట్ల మాయమైనట్లు తాజా ప్రభుత్వం గుర్తించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 59 కింద అన్యాక్రాంతమైన కొన్ని భూములు కూడా ఈ జాబితాలోనివే అని ధరణి కమిటీ గుర్తించినట్లు సమాచారం.
ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్‌లోని నిషేధిత భూములను ధరణి పోర్టల్‌లోకి కూడా యథాతథంగా ఎక్కించారు. ఆ తర్వాత కొందరు అనుయాయులు, అయిన వారి కోసం ఆ నిషేధిత జాబితాలోని భూములను ధరణి పోర్టల్‌లో గుట్టుగా తొలగించారని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు జిల్లాల్లోని కలెక్టర్ల పనితీరుపై ఆరోపణలు బలంగా ఉన్నాయి.దాంతో, నిషేధిత జాబితా నుంచి మాయమైన భూముల చిట్టాను పరిశీలించాలని ధరణి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ జాబితాలోని భూములను ఎలా బదలాయించారు? దీని వెనక ఎవరెవరుండే అవకాశం ఉంది? ఈ తతంగానికి సహకరించిన అధికారులు ఎవరు? అనే అంశాలపై ధరణి కమిటీ సీరియస్‌గా దృష్టిపెట్టింది. అంతేకాదు.. ప్రభుత్వ, ఈనాం, అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి పెద్దఎత్తున తొలగించి పట్టా భూములుగా మార్చినట్లు కూడా గుర్తించి.. వాటిని ఎలా మార్చారని ఆరా తీస్తోంది. ఈనాం భూములకు ఓఆర్‌సీ సర్టిఫికెట్ లేకుండా వేల ఎకరాల భూములను కొనుగోలు చేసి పట్టా భూములుగా కొందరు మార్చుకున్న అంశంపైనా చర్చ జరుగుతోంది. 1955 తరువాత ఈనాందారుల నుంచి ఓఆర్‌సీ లేకుండా కొనుగోలు చేసిన ఈనాం భూములు చెల్లవని కోర్టు కూడా పేర్కొంది. అయినా.. ఈ లావాదేవీలు ఆగలేదు.
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు చెందిన వేల కోట్ల విలువైన ఈనాం, అసైన్డ్ భూములను ధరణి ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలు అన్నిటినీ పరిశీలించాలని ధరణి కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో ఇచ్చిన 8,05, 618 ఎకరాల ఈనాం భూమికి 92,250 మంది ఈనాందారులు ఉన్నట్లు 1966లో జాతీయ భూ సంస్కరణల అమలు కమిటీ పేర్కొంది. ఓఆర్‌సీ పొందకుండానే దాదాపు 6 లక్షల ఎకరాల ఈనాం భూములు చేతులు మారాయి. ఇందులో చాలా భూములు ధరణి వచ్చిన తర్వాతనే అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వం భావిస్తోంది.
అంతేకాదు.. ధరణిలో నమోదై, పాస్ పుస్తకాల్లో చూపుతున్న భూవిస్తీర్ణానికి.,క్షేత్రస్థాయిలోని భూమికి చాలా తేడాలున్నట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. 1956 నాటి సేత్వార్ (రీసర్వే సెటిల్‌మెంట్ రిజిస్ట- ఆర్‌ఎస్‌ఆర్) రికార్డుతో పోల్చితే గత 60 ఏళ్ల్లలో రికార్డుల్లో సుమారు 6 లక్షల 50వేల ఎకరాల భూమి ఎక్కువగా నమోదైనట్లు తెలిసింది. దీంతో పాస్ పుస్తకాల్లో అధికంగా ఉన్న విస్తీర్ణాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది రైతులు తమకు ఫీల్డ్‌లో ఉన్న భూమికి, పాస్ పుస్తకాల్లో నమోదైన విస్తీర్ణానికి సరిపోలడం లేదంటూ తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు పాస్ పుస్తకాల్లో భూమి ఎక్కువగా నమోదైన వారు మాత్రం తమకు రైతుబంధు లాంటి పథకాలు వస్తుండటంతో పాస్ పుస్తకాల్లోని విస్తీర్ణం తగ్గించుకునేందుకు ముందుకు రావడం లేదు.
గతంలో నల్గొండ జిల్లా పానగల్లును శాంపిల్ విలేజీగా తీసుకుని భూరికార్డులను కాగ్ బృందం పరిశీలించింది. సేత్వార్ రికార్డుకు, పహాణీలకు మధ్య 819.35 ఎకరాల భూమి తేడా ఉన్నట్లు గుర్తించింది. ఈ గ్రామ సేత్వార్ రికార్డు ప్రకారం 3,073 ఎకరాలు ఉండగా.. పహాణీల్లో మాత్రం 3,893.33 ఎకరాల భూమి నమోదైంది. రెవెన్యూ రికార్డుల్లో ఏటేటా రెవెన్యూ సిబ్బంది భూవిస్తీర్ణాన్ని బై నంబర్లతో పెంచుతూ పోవడంతోనే ఇలా పాస్ పుస్తకాల్లో విస్తీర్ణానికి మించి నమోదైనట్లు గుర్తించారు. ఇలా అనేక గ్రామాల్లో 10 నుంచి 20 శాతం భూమి అదనంగా నమోదైంది.
వీటితో పాటు.. రాష్ట్రంలో సాదాబైనామాతో పాటు, ఇతర కారణాలతో డిజిటలైజ్ చేయకపోవడం వల్ల ధరణి పోర్టల్‌లో పట్టా భూములు 18లక్షల 50 వేల ఎకరాల దాకా ఉన్నట్లు తేలింది. ఆయా భూములపై పట్టాదారు కాలమ్‌లో కొన్ని చోట్ల రైతుల పేర్లు కనిపిస్తున్నా, వివిధ కారణాలతో పాస్ పుస్తకాల జారీ పక్రియ నిలిపివేశారు. ఇందులో సాదాబైనామా కింద కొనుగోలు చేసిన భూములే ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్వోఆర్ యాక్ట్ ప్రకారం పాత సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించే మార్గం లేకుండా పోయింది. అందుకే ఈ చట్టానికి సవరణ చేస్తేనే పాస్ పుస్తకాలు జారీ చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భూరికార్డుల ప్రక్షాళనలో పాత పహాణీలు, పాస్ పుస్తకాల ఆధారంగా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేశారు. ఈ క్రమంలో సేత్వార్‌లో ఉన్న విస్తీర్ణానికి మించి పాస్ పుస్తకాల్లో భూవిస్తీర్ణం నమోదైంది. సేత్వార్ డేటాను కూడా ధరణి పోర్టల్‌లో గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా అప్‌డేట్ చేశారు. దీంతో సేత్వార్ రికార్డుకు, పాస్ పుస్తకాలకు మధ్య భూ విస్తీర్ణంలో తేడాలున్న వారు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్, ఇతర అప్‌డేషన్ కోసం అప్లై చేస్తే ఆర్‌ఎస్‌ఆర్ మిస్ మ్యాచ్ అని చూపిస్తోంది. దీంతో ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో పట్టా దారులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో నిజాం హయాంలోనే చివరిసారిగా 1940లో సమగ్ర భూసర్వే జరిగింది. ప్రతి 30 ఏళ్లకోసారి జరగాల్సిన రీసర్వే 80 ఏళ్లు దాటినా జరగలేదు. ఈ క్రమంలోనే కొందరు తమ వద్ద లేని భూమికీ హక్కులు పొందారు. రెవెన్యూ యంత్రాంగం చాలా చోట్ల తమ రికార్డుల్లో భూమిని పెంచేశారు. కొన్ని చోట్ల అమ్మిన భూమిని సంబంధిత రైతు ఖాతా నుంచి తొలగించకుండానే కొత్త సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆర్‌ఎస్‌ఆర్ మిస్ మ్యాచ్ ను సరిదిద్దాలంటే సమగ్ర భూసర్వేతోనే సాధ్యమవు తుందని రెవెన్యూ చట్టాల నిపుణులు అభిప్రాయపడు తున్నారు. సమగ్ర భూసర్వే నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. సీఎం హోదాలో చంద్రశేఖరరావు పలుమార్లు ప్రకటించినా ఇది అమల్లోకి రాలేదు. దీంతో హద్దుల సమస్యలు.. రికార్డుకు, ఫీల్డ్‌లో తేడాలు పెరిగిపోయాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ధరణి పోర్టల్ ద్వారా రైతులకు, ఇతర భూముల యజమానులకు ఎదు రవుతున్న సమస్యలను ధరణి కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆ పోర్టల్‌లో నమోదైన డాటా వివరాలు కావాలని అధికారులను కోరారు. అదే సమయంలో, ధరణిని సంస్కరించేందుకు చేప ట్టాల్సిన మార్గాలను అన్వేషించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి, ప్రజలు, బాధితులతో నేరుగా మాట్లాడాలని నిశ్చయించారు. అందరికీ అందు బాటులో ఉండేలా సీసీఎల్‌ఏలోనే కమిటీ కార్యా లయం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
ధరణిపై లోతుగా అధ్యయనం చేయడం, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, ఏయే సమస్యలు ఎక్కువగా ఉన్నాయో నమోదు చేసుకోవడం, ఎక్కువ సమస్యలున్న బాధితులు, గ్రామాలను గుర్తించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అనుమానాస్పద లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. ధరణి సమస్యలపై దశల వారీగా నివేదికలు ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
సుజాత గోపగోని,
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్