‘భారత్‌ మాకు మిత్రదేశం. ఇరుగుపొరుగు దేశాలయిన భారత్‌-బంగ్లాదేశ్‌ కలిసి ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాయి. 1971, 75లలో భారత్‌ మాకు అండగా ఉంది. నాకు, సోదరికి, కుటుంబ సభ్యులకు ఆశ్రయం ఇచ్చింది.  భారత్‌తో మాకు అద్భుత సంబంధాలు ఉన్నాయి’. (ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం షేక్‌ హసీనా వ్యాఖ్య)

బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో అధికార అవామీ లీగ్‌ పార్టీ మూడిరట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుని మరోసారి విజయం సాధించింది. 76 ఏళ్ల షేక్‌ హసీనా మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. బంగ్లాదేశ్‌ పార్లమెంటు 300 సీట్లలో 299 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అవామీ లీగ్‌ 223 సీట్లను కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతి పక్షమైన జతియా 11 సీట్లు గెలుచుకుంది. బంగ్లాదేశ్‌ కల్యాణ్‌ పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలుపొందింది. 62 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అలాగే జతియా సమాజ్‌ తాంత్రిక్‌ దళ్‌, వర్కర్‌ పార్టీ ఆఫ్‌ బంగ్లాదేశ్‌ ఒక్కో స్థానం వంతున గెలుచుకున్నాయి. గోపాల్‌ గంజ్‌ 3 నుంచి పోటీ చేసిన అవామీ లీగ్‌ అధినేత ప్రధాని హసీనా 2,49,965ఓట్లను సాధించారు. తన సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ సుప్రీంపార్టీకి చెందిన నిజాముద్దీన్‌ లష్కర్‌కు కేవలం 469 ఓట్లు లభించాయి. 1986 నుంచి ఈ స్థానంలో షేక్‌ హసీనా ఎనిమిదోసారి గెలవటం గమనార్హం.

హసీనా 2009 నుంచి ప్రధానిగా కొనసాగు తున్నారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మొత్తంగా ఆమె ప్రధాని కావటం ఇది ఐదోసారి. బంగ్లా చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించబోతున్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లా దేశ్‌ నేషనలిస్టు పార్టీతో పాటు మరో 15 పార్టీలు ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. కేవలం 41.8 శాతం పోలింగ్‌ నమోదైంది. 2018 ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదయ్యింది.

నరేంద్ర మోదీ, షేక్‌ హసీనా ఇద్దరు భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ‘సోనాలి అధ్యాయ్‌’ లేదా ఒక స్వర్ణ అధ్యాయం అని పేర్కొంటారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు పొరుగు దేశాల మధ్య వేర్వేరు రంగాల్లో సహకారం పెరుగుతూ వస్తోంది. వాణిజ్యం నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం వరకూ అనుసంధానం, శక్తి సరఫరా వరకూ ఉన్నాయి. బంగ్లాదేశ్‌ భారతదేశానికి చాలా కీలకమైనది. భారతదేశం ‘నైబర్‌ హుడ్‌ ఫస్ట్‌ పాలసీ’కి అది కేంద్రంగా ఉంది. అలాగే భారతదేశం, ఆగ్నేయాసియాల మధ్య సంబంధాలను సుస్థిరం చేయటానికి మోదీ ప్రభుత్వం ఉద్దేశించిన ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’కి బంగ్లాదేశ్‌ కీలకం. అది కాకుండా ఈశాన్య ప్రాంత భద్రత, ఆగ్నేయాసియాకు వంతెన, కమ్యూనికేషన్‌, సముద్రజలాలను భద్రపరచటం, తీవ్రవాదంపై పోరాటం, దృఢమైన చైనాను సమ తుల్యం చేయటం వంటి అంశాలలో భౌగోళికంగా బంగ్లాదేశ్‌ భారత్‌కు ముఖ్య భాగస్వామి అవుతుంది.

బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా ప్రకటించిన నాటి నుంచి నేటి వరకూ రెండు దేశాల మధ్య సంబంధాలు ఒకే రకంగా లేవు. అవి ఉత్థాన పతనాలతో సాగాయి. మార్చి 26, 1971న బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. పాకిస్తాన్‌నుంచి అది విముక్తి పొందేందుకు దాదాపు 9 నెలలు పట్టింది. డిసెంబరు 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం ముగిసింది. దాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించి దౌత్య సంబంధా లను ఏర్పరచుకున్న తొలిదేశం భారత్‌. బంగ్లాదేశ్‌ యుద్ధంలో భారతదేశం పాత్ర ముఖ్యమైంది. 1972లో భారత్‌, బంగ్లాదేశ్‌లు స్నేహ, సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. 1997లో దీని గడువు ముగిసింది. కొత్త దేశం నేత ముజిబూర్‌ రెహ్మాన్‌ సోషలిజం, లౌకికవాదం ఆదర్శభావాలను సమర్థించారు. భారత్‌తో సత్సంబంధాలు ఉండాలని ఆశించారు. 1975లో ముజిబూర్‌ రెహ్మన్‌ తిరుగు బాటుదారుల చేతిలో హత్యకు గురయ్యారు. దీనితో ఆయన కుమార్తెలు షేక్‌ హసీనా, రిహానా తమ కుటుంబ సభ్యులతో కలిసి 1991 వరకూ భారత్‌లో ఆశ్రయం పొందారు. సైన్యం, పౌర సమాజంలోని వివాదాలు, యూఎస్‌, పాకిస్తాన్‌, సౌదీ అరేబియా, చైనాల మద్దతుతో తిరుగుబాటు వచ్చింది. జనరల్‌ జియ-ఉర్‌-రెహ్మాన్‌ బంగ్లాదేశ్‌ ముస్లిం గుర్తింపును నొక్కి చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇస్లాం మతం రాష్ట్ర మతంగా ప్రకటించారు. దీనితో భారతదేశంతో ఢాకా సంబంధాల్లో మార్పువచ్చింది. మిత్రదేశ స్థానాన్ని అది కోల్పోయింది. ఈ సమయంలో పాకిస్తాన్‌ వంటి ఇస్లాం శక్తులతోనూ, అమెరికా, చైనా వంటి పెద్ద దేశాలతో సంబంధాలు మెరుగు పడ్డాయి. 1970ల్లో వచ్చిన తుపాను,కరవు, అంతర్గత అంశాలు బంగ్లాదేశ్‌ను విదేశీ సాయంపై ఆధారపడేలా చేశాయి. 1990 నాటికి బంగ్లాదేశ్‌ విదేశాంగ విధానంలో విదేశీ సాయం అనేది ప్రముఖంగా ఉండిపోయింది. భారత్‌ వివిధ రకాల సాయం అందించినా, బంగ్లాదేశ్‌ ప్రముఖ దాతల సూచికలో లేదు. సౌదీ అరేబియా లాంటి దేశాలు అందించే సాయం ఇస్లామిక్‌ కారణాలతో ముడిపడి ఉండేవి. ముజీబ్‌ అనంతరం పాలకులకు ఇస్లాం ప్రాథమిక జాతీయ గుర్తింపుగా, సమీకరణ శక్తిగా మారింది.

పాకిస్తాన్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌తో బంగ్లాదేశ్‌ సంబంధాలు పునరుద్ధ రించు కుంది. భారతదేశంతో క్షీణించిన సంబంధాల పునరుద్ధరణకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ దశలో ఫరక్కా బ్యారేజీ వివాదం సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌ సరిహద్దుకు 11 మైళ్ల దూరంలో పశ్చిమబెంగాల్‌ లోని పరక్కాలో గంగానదిపై భారత్‌ ఆనకట్ట నిర్మించింది. 1976-77లో ఆ దేశంతో అధికారిక ఒప్పందం లేకుండానే డ్యామ్‌ నిర్మించటం ప్రారంభిం చింది. హుగ్లీ నదిని సిల్ట్‌ చేయడానికి, ఓడరేవును వినియోగించటానికి బ్యారేజీ అవసరం అని భావించింది. దీనితో గంగానదిలో న్యాయమైన వాటా కోసం బంగ్లాదేశ్‌ భారత్‌ను డిమాండ్‌ చేసింది. జియా-ఉర్‌-రెహ్మాన్‌ సార్క్‌ (సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీజనల్‌ కోఆపరేషన్‌) ఆలోచనను ప్రతిపాదించారు. దక్షిణా సియాలోని చిన్నదేశాల న్నింటిని ఏకం చేయాలని ప్రతిపాదించారు. 1981లో జియా-ఉర్‌-రెహ్మాన్‌ హత్య, మరో తిరుగుబాటు కారణంగా ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. జియాఉర్‌ రహ్మన్‌ హత్యానంతరం బంగ్లాదేశ్‌ వ్యవసాయ సమాజం నుంచి తయారీ కేంద్రంగా మారటం ప్రారంభించింది. భారతదేశంలో విదేశీ అప్పులు పేరుకు పోవటం, చెల్లింపుల బ్యాలెన్స్‌ సంక్షోభానికి దారితీసింది. దీనితో రెండు దేశాలకు సార్క్‌ అనేది ప్రయోజనకరమైన ఆలోచనగా మారింది. 1985లో సార్క్‌ 8 సభ్యదేశాలతో ఉనికి లోకి వచ్చింది. ఇండో బంగ్లా సంబంధాలలో సాను కూలమైన మార్పు వచ్చింది. 1991లో బంగ్లాదేశ్‌ బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి తిరిగి వచ్చింది. బంగ్లాదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలు న్నాయి. బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌ పీ), అవామీ లీగ్‌ (ఏఎల్‌). బెంగాలీ జాతీయవాదం, ఇస్లామిక్‌ గుర్తింపును ప్రవచించే ఖలీదా జియా (జియా-ఉర్‌-రెహ్మాన్‌ భార్య) బీఎన్‌ పీకి నాయకత్వం వహించేవారు. ఈమె భారత దేశంవైపు మొగ్గు చూపేవారు కాదు. మరో వైపు అవామీ లీగ్‌కు చెందిన షేక్‌ హసీనా(ముజిబుర్‌ రెహ్మన్‌ కుమార్తె) భారత్‌తో సానుకూల సంబంధాలు కలిగి ఉన్నారు. అవామీ లీగ్‌ ఉన్నప్పుడల్లా భారత్‌, బంగ్లా సంబంధాలు తరచూ మెరుగుపడుతూ వచ్చాయి. 1991లో బీఎన్‌పీ అధికారంలోకి వస్తే, 1996-2001 మధ్య షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలోనే గంగానదిపై నీటి పంపిణీపై ఒప్పందం కుదిరింది. దేశం ఆర్థికంగా సాయం చేయటానికి బంగ్లాదేశ్‌కు భారతదేశం సుంకం రాయితీలను ఇచ్చింది. 2001-2006 మధ్య సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిరది. బీఎన్పీ-జేఈఎల్‌ (జమాయితీ ఇస్లామీ) నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయింది. ఇది ఉల్ఫా (యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అసోసియేషన్‌) వంటి సంస్థలకు ఆశ్రయం కల్పించటమే కాదు, బంగ్లాదేశ్‌ వెలుపల అనేక భారత వ్యతిరేకశక్తులకు ప్రోత్సాహాన్ని అందించింది. లెట్‌, హుల్జీ వంటి తీవ్రవాద గ్రూపులు బంగ్లాలో స్థావరాలను ఏర్పరచుకున్నాయి. అల్‌ కాయిదా, దాని మిత్రపక్షాలు భారత వ్యతిరేక జిహాద్‌కు బంగ్లా తన గడ్డమీద మద్దతు ఇచ్చింది. దీనితో ఈ కాలంలో సంబంధాలు క్షీణించాయి. 2009లో తిరిగి అవామీలీగ్‌ అధికారంలో రావటం, 2014, 2019లో దానివరస విజయాలతో భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాల్లో కొత్త దశ ప్రారంభ మైంది. అప్పటి నుంచి ఇండో-బంగ్లా సంబంధాల్లో స్థిరమైన మెరుగుదల ఉంది. ఈ దశలో రెండు దేశాలు పొరుగుదేశాల నుంచి వృద్ధి, ఆర్థిక సంబంధాల్లో భాగస్వాములుగా మారాయి.

యూపీఏ2 హయంలో రెండు దేశాల భూ సరిహద్దు ఒప్పందం, తీస్తా నీటి భాగస్వామ్య ఒప్పందానికి అంగీకరించాయి. అయితే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఈ ఒప్పందాన్ని సమర్థించలేక పోయాయి. మిలిటెంట్లు, తీవ్రవాద గ్రూపులను ఎదుర్కోవటంలో భారత్‌, బంగ్లాలు సమన్వయంతో పని చేశాయి. 2013లో నేరస్తుల అప్పగింత ఒప్పందంపై సంతకం చేసి, బంగ్లాదేశ్‌ అనేక మంది ఉగ్రవాదులను భారత్‌ కు పంపింది.

2015లో ఇరుదేశాల మధ్య భూసరిహద్దు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య అనేక వివాదాలను పరిష్కరించుకునేందుకు దోహదం చేసింది. రాడ్‌ క్లిఫ్‌ ఒప్పందం ప్రకారం, బంగ్లాదేశ్‌ (15వేల హెక్టార్లు) వైపున భారత్‌ 111 ఎన్‌ క్లేవ్‌లను కలిగి ఉండగా, బంగ్లాదేశ్‌ భారత వైపును (ఏడు వేల హెక్టార్లు) 55 ఎన్‌ క్లేవ్‌ లను కలిగి ఉంది. ఈ సమస్య 100వ రాజ్యాంగ సవరణ (2015) ద్వారా పరిష్కరించారు. ఇరువైపులా శంకుస్థాపనలు జరిగాయి. పౌరులకు వారి జాతీయతను నిలుపుకోవటానికి లేదా కొత్తదనాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడిరది.

మోదీ ప్రభుత్వ హయాంలో భారత్‌, బంగ్లా సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. బంగ్లాదేశ్‌ దక్షిణాసియాలో భారత్‌కు అతి పెద్ద భాగస్వామి అయితే, భారతదేశం బంగ్లాదేశ్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2023 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం 14.22 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. భారతదేశం 2011 నుంచి సౌత్‌ ఏషియన్‌ ఫ్రీ ట్రేడ్‌ ఏరియా (సాప్టా) కింద పొగాకు, ఆల్కహాల్‌ మినహా అన్ని వస్తువులపై బంగ్లాదేశ్‌కు డ్యూటీ ఫ్రీ యాక్సెస్‌ను అందించింది.

ఏప్రిల్‌ 2023లో, దైపాక్షిక వాణిజ్య లావా దేవీలలో కొంత భాగాన్ని వారి సొంత కరెన్సీలలో సెటిల్‌ చేయటానికి రెండు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంపొందించేందుకు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకం చేసేందుకు రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి. దీనితో రెండు దేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. రెండు దేశాల మధ్య భారీ వాణిజ్య అసమానత, నాన్‌ టారిఫ్‌ అడ్డంకుల సమస్య, వస్తు వులు సజావుగా రాకపోకలకు మౌలిక సదుపాయాలు లోపించటం వంటి కొన్ని సమస్యలు ఉన్నాయి.

భారత్‌, బంగ్లాదేశ్‌ ఇంధన రంగంలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ భారతదేశం నుంచి 116 ఎంవి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. సరిహద్దులో విద్యుత్‌ వాణిజ్యంలో ద్వైపాక్షిక సహకారాన్ని అందించటానికి సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను అందించటానికి జాయింట్‌ వర్కింగ్‌ గ్రూపు (జెడబ్ల్యుజి), జాయింట్‌ స్టీరింగ్‌ కమిటీ (జెఎస్‌ సీ) ఏర్పాటయింది. భారత్‌ బంగ్లాదేశ్‌ సంబంధాల్లో పర్యాటకం ఒక పెద్ద అంశం. ముఖ్యంగా మెడికల్‌ టూరిజం. బంగ్లాదేశ్‌ నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు వైద్య చికిత్స కోసం భారత దేశానికి వస్తారు. భారతదేశంలో అంతర్జాతీయ వైద్యా విద్యార్థులలో 35 శాతం మంది కంటే ఎక్కువ బంగ్లాదేశ్‌కు చెందినవారు. భారతదేశం, బంగ్లాలు సార్క్‌, బిమ్‌స్టిక్‌, అయోరా (ఐఓఆర్‌ఏ-ఇండియన్‌ ఓషన్‌ రిమ్‌ అసోసియేషన్‌) వంటి సంస్థల్లో భాగస్వాములు. కొవిడ్‌ సమయంలో దక్షిణాసియా ప్రాంతంలో ప్రపంచ మహమ్మారి ప్రభావాలను ఎదుర్కోవటానికి సార్క్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయటంలో రెండు దేశాలు సంఫీుభావం తెలిపాయి. ప్రపంచ వేదికలపైన కూడా సంఫీుభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ వేసే బిడ్‌కు బంగ్లాదేశ్‌ మద్దతు ఇస్తుంది. అలాగే ఎడీజీలను సాధించటంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.

ఇకపోతే కనెక్టివిటీ.. రెండు దేశాలను కలుపుతూ హల్దాబారి-చిలాహుతి రైలు లింక్‌ 2020 నుంచి పనిచేస్తోంది. అంతకు ముందు మైత్రీ ఎక్స్‌ ప్రెస్‌, మిథాలీ ఎక్స్‌ప్రెస్‌ వంటివి రెండు దేశాల మధ్య నడుస్తున్నాయి. కొల్‌కతా-ఢాకా బస్సు (1999), ఢాకా-అగర్తాలా బస్సు (2001) రెండు దేశాల మధ్య ప్రధాన రహదారి లింకు. భారతదేశం ఈశాన్య ప్రాంతాలకు బంగ్లాదేశ్‌ ఓడ రేవులను ఉపయోగిస్తుంది. బంగ్లాదేశ్‌ కూడా ఓడరేవుల ద్వారా వచ్చే ట్రాఫిక్‌ వల్ల ప్రయోజనం పొందుతుంది.

బంగ్లాతో కొన్ని చిక్కు సమస్యలు

2009 నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ సంబంధాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఈ స్నేహపూర్వక సంబంధాలకు సవాలుగా నిలిచే సమస్యలు కొన్ని ఉన్నాయి. వీటిలో భూమి, సరిహద్దుల విభజన, భారత వ్యతిరేక తిరుగుబాటు ముఠాలకు ఆశ్రయం, అక్రమ వలసలు, నీటి భాగస్వామ్యం, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వాణిజ్య సమతుల్యత, రవాణా హక్కులు, చైనా అంశం ప్రధానమైనవి.

బంగ్లాదేశ్‌ నుంచి శరణార్ధులతో పాటు ఆర్థిక వలసదారులతో సహా పెద్ద సంఖ్యలో జనం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఇది భారత్‌లో, ముఖ్యంగా బంగ్లా సరిహద్దులో ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న సమూహాల వనరులు, భద్రత, సంస్కృతికి హాని చేస్తోంది. అసోంలో నేషనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ సిటిజన్‌ షిఫ్‌ (ఎన్‌ఆర్‌సీ) నిర్వహించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు బంగ్లాదేశ్‌ లో ఆందోళనకు దారితీసింది. రొహింగ్యా సమస్యను మరింత జటిలం చేసింది. సరిహద్దు దాటి డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, మానవ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వీటిని అరికట్టటానికి జాయింట్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు, స్మార్ట్‌ సరిహద్దు నిర్వహణ అమలు చేయటం, డిజిటల్‌ కనెక్టివిటీ కారిడార్‌ను ఏర్పాటు చేయటం వంటి కొన్ని చర్యలు చేపట్టాలి. అలాగే తీస్తా నీటి వివాదం భారతదేశం – బంగ్లాదేశ్‌ సత్సంబంధాలకు అవరోధంగా ఉంది. తీస్తా హిమాలయంలో పుట్టి, సిక్కిం, పశ్చిమబెంగాల్‌ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోని బ్రహ్మపుత్ర (జమున)లో కలుస్తుంది. బంగ్లాదేశ్‌ 1996 గంగా జలాల ఒప్పందం ప్రకారం నదీజలాల సమాన పంపిణీ కోరగా, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ ఒప్పందాల కారణంగా పరిష్కారం కాలేదు. తీస్తాతో బాటు ఫెని, బరాక్‌ నదిపై కూడా చర్చలు సాగుతున్నాయి. షేక్‌ హసీనా మరోమారు బాధ్యతలు చేపడుతూండంతో ఈ సమస్యలన్నీ కొలిక్కివచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  • డాక్టర్‌ పార్థసారథి చిరువోలు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE