ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల మధ్య సమీకరణాలు శరవేగంతో మారుతున్న క్రమం మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నది. నిన్నటివరకూ ఏకఛత్రాధిపత్యంతో ప్రపంచానికి సుద్దులు చెప్పిన అమెరికాకు, ఇప్పుడు స్వంత ఇంటిని దిద్దుకోవలసిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచంలో కొత్త శక్తులు బలపడుతున్నాయి. ఉత్సాహంతో పరుగులు తీస్తున్నాయి. అందులో ముందు వరుసలో ఉన్నది భారతదేశమే. సర్వతోముఖాభివృద్ధిని సాధించాలనే సంకల్పంతో మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యాలకు ఎన్ని ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయో, అన్ని మన్ననలూ అందుతున్నాయి.
తమ ప్రయోజనాలకు దేశాలు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు, భౌగోళిక ఆర్ధిక రంగంలో సహకరించుకోవడానికి క్రమంగా విస్తరిస్తున్న బహుళ ధ్రువ ప్రపంచం నూతన మార్గాలను తెరుస్తున్నదన్న విశ్లేషకుల అభిప్రాయంలో నిజం లేకపోలేదు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ అని చెప్పే దక్షిణ ధ్రువంలోని దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. కేవలం డాలర్ మాత్రమే రిజర్వ్ కరెన్సీగా ఉండటాన్ని వారు అభ్యంతరపెడుతున్నారు. ఈ క్రమంలోనే వారు గత ఏడాది జరిగిన బ్రిక్స్ సదస్సులో వ్యవసాయ ఆన్‌లైన్ వ్యాపార వ్యవస్థను ప్రవేశపెట్టాలన్న చర్చతో పాటుగా కొత్త సభ్యులను చేర్చుకోవడం, నూతన చెల్లింపుల విధానం గురించి ప్రస్తావనకు తెచ్చారు. బ్రిక్స్ కరెన్సీ గురించి వారు చేసిన ప్రకటనలో ఇవి లేకపోయినప్పటికీ, ఇవన్నీ కూడా 2024లో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు సన్నద్ధ చర్యలుగా భావించాలి. ఈ క్రమంలోనే రానున్న ఏడాది సదస్సును నిర్వహించవలసిన బ్రెజిల్ తాము నిర్వహించలేమంటూ చేతులెత్తయ్యడంతో, ఆ బాధ్యత ప్రస్తుతం రష్యా తీసుకున్నది. ఈ నేపథ్యంలో నూతన ప్రపంచ క్రమాన్ని గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ చేస్తున్న ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. అక్కడ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయనే విషయం అవగతమవుతోంది.
అమెరికాతో సంబంధాలలో ఏర్పడిన ఇబ్బందిని ఈ నేపథ్యంలోనే ప్రస్తావించు కోవచ్చు. భారత్ వృద్ధి చెందుతున్న వేగం అమెరికాను అసహనానికి లోను చేస్తున్నదన్న వాస్తవాన్ని కాదనలేం. నిన్నటి వరకూ ప్రతిదేశంపైనా పెత్తనం చేసిన అమెరికా, నేడు వెన్నెముకతో వ్యవహరిస్తున్న భారత్ తీరును సహించలేక పోతున్నది. కొందరు విశ్లేషకుల ప్రకారం నిజ్జర్ వ్యవహారాన్ని అంతర్జాతీయంగా వెలుగులోకి తెచ్చేందుకు కెనడాను రెచ్చగొట్టింది అమెరికాయే. ఈ విషయంలో కెనడాకు ఎటువంటి మద్దతు లభించకపోవడమే కాదు, 41మంది దౌత్య సిబ్బందిని భారత్ వెనక్కి పంపడంతో పాశ్చాత్యదేశాలన్నీ కూడా కంగుతిన్నాయి. ఇది ఒకప్పటి భారతదేశం కాదనే విషయాన్ని తెలుసుకున్నాయి. ఆ తర్వాతే, అమెరికా స్వయంగా రంగంలోకి దిగి ఖలిస్తానీ నాయకుడు పన్నుపై హత్యాయత్నానికి భారత్ నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపణలను చేసి, ఆధారాలంటూ ఏవో చూపింది. అయితే, తమ దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించే తీవ్రవాది ఎవరు? అది పాకిస్తాన్ అయినా, అగ్రదేశ మైనా పెంచి పోషించినా, మద్దతు ఇచ్చినా సహించేదే లేదన్న వైఖరినే భారత్ అనుసరిస్తోంది. ఈ క్రమంలోనే గణతంత్ర వేడుకలకు బైడెన్ ముఖ్య అతిథిగా రావాలంటూ మౌఖికంగా భారత్ ఇచ్చిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకుని, ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాకరోన్‌ను అధికారికంగా ఆహ్వానించి, తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా ఎస్ 400 గురించి అభ్యంతరాలు లేవనెత్తిన సమయంలో ఎఫ్ 16, ఎఫ్ 18కి బదులుగా రఫేల్ ఒప్పందాన్ని ఫ్రాన్స్‌తో చేసుకుని భారత్ తన స్వతంత్ర విధానాన్ని చాటుకుంది. రష్యాతో సంబంధాల గురించి అమెరికా ఎప్పుడు అభ్యంతరాలు లేవనెత్తినా, వెంటనే ఫ్రాన్స్‌తో సంబంధాలను పెంచుకోవడం జరుగుతున్నది. ప్రస్తుతం కేవలం రష్యాతోనే కాక ఫ్రాన్స్, యుకె, యుఎస్‌లతో సంబంధాలను పెంపొందించు కునేందుకు భారత్ వెనుకాడడం లేదు.
భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ డిసెంబర్ 25 నుంచి రష్యా ఐదు రోజుల పర్యటనను కూడా ఈ నేపథ్యంలోనే చూడాల్సి ఉంటుంది. మరే దేశంతో లేనంతగా రష్యాతో ప్రజల మధ్య సంబంధాలను ముందెన్నడూ లేని స్థాయిలో పెంపొందించడం ఒక లక్ష్యంగా చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం యుఎఈతో ఉన్నంత సన్నిహిత ప్రాంతంగా (రెసిప్రొకేటింగ్ టెరిటరీ) రష్యాను పరిగణించి, సంబంధాలను పెంచుకునేందుకు భారత్ ప్రయత్ని స్తోందని విశ్లేషకులు అంటున్నారు. అంటే, అక్కడ న్యాయస్థానాలో తీర్పులను ఇక్కడి న్యాయ స్థానాల్లోనూ, ఇక్కడివి అక్కడ పరిగణిస్తారు. అలాగే, విద్యాసంబంధ అర్హతల విషయంలో కూడా. ఇందుకు కారణం లేకపోలేదు. రష్యా వనరుల విషయంలో అత్యంత సుసంపన్నమైన దేశం. అందుకే, ఆయుధాల విషయంలో కాక ఇతర వనరుల విషయంలో రష్యాతో వ్యాపారవాణిజ్యాలను సాగించాలని భారత్ భావిస్తోంది.
నూతన ప్రపంచ క్రమం ఏర్పడిన సందర్భంలో వనరులు, ఉత్పత్తులు అన్నవి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోనున్నాయి. ఇందులో రష్యా అత్యంత సుసంపన్నం కనుక దానితో సన్నిహిత సంబంధాలు మనకు అవసరం. దీని కారణంగా మాస్కో కీలకమైన నూతన మార్కెట్లతో లావాదేవీలు జరిపే అవకాశాన్ని ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే, స్వదేశీ ప్రయోజనాల కోసం యుఎస్, ఐరోపాలు వదిలివెళ్లిన వ్యాపారాలను అందిపుచ్చుకోవలసిందిగా భారత్‌ను కోరుతోంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం చైనాతో ఎంతో సన్నిహిత సంబంధాలను నెరుపుతున్నా, రష్యా ఈ అవకాశాన్ని భారత్‌కు మాత్రమే ఇవ్వడం.
ఈ పర్యటనలో భాగంగా, వచ్చే ఏడాది జరుగనున్న భారత్- రష్యా సదస్సు కోసం ముందస్తు చర్చలు జరుగుతున్నాయి. ప్రజల మధ్య సంబంధా లను పెంచడం, రష్యాలో వ్యాపారం చేసుకునేందుకు ద్వారాలను పూర్తిగా తెరవడం వంటి ప్రకటనలు సదస్సు అనంతరం వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా రష్యాతో రక్షణయేతర రంగాలలో వాణిజ్యం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. రక్షణ రంగంలో వ్యాపారాలు ప్రధానంగా ఫ్రాన్స్, ఇతర పాశ్చాత్య దేశాలతో పెరిగే అవకాశముంది. ఇందుకు కారణం, ఉక్రెయిన్‌తో యుద్ధంతో రష్యా తన ఆయుధాగారాన్ని పెద్ద ఎత్తున ఖాళీ చేసుకుంటోంది. అందువల్ల ప్రస్తుతం రక్షణ రంగంలోకన్నా రక్షణయేతర రంగంలో వ్యాపారమే ఇరు దేశాలకూ లాభదాయకం కానుంది. లాభాల విషయం పక్కన పెడితే, చైనాను అదుపు చేయడంలో ఇరు దేశాలూ కూడా విజయవంతం అవుతాయి. అంతేకాదు, చైనా ఒకవేళ బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకుంటుంటే, తమతో కలిసి కూర్చొని దానికోసం చర్చించాలన్న సంకేతాలు కూడా దీనికారణంగా వెడతాయని జియోపొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. బహుళ ధ్రువ ఆసియాకు చైనా సిద్ధంగా లేకపోతే, బహుళ ధ్రువ ప్రపంచం అనేది చైనాకు లభ్యం కాదన్నది ఒక సందేశం. ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలైన భారత్, చైనాలు బహుళ ధ్రువ ఆసియాకు పునాదులు వేసి, నిర్మించకపోతే, బహుళ ధ్రువ ప్రపంచాన్ని నిర్మించడం కూడా సాధ్యం కాదు. లేదంటే, పాశ్చాత్య దేశాల ఆధిపత్యంలోనే సాగవలసి ఉంటుంది. ఇందుకోసం కలిసి కూర్చొని తమ ప్రభావ ప్రాంతాలు ఏవో స్పష్టంగా సరిహద్దులు గీసుకుంటే, ఆసియా ప్రాంతాన్ని సుసంపన్నం చేయవచ్చు.
పాత ప్రపంచ క్రమం విచ్ఛిన్నమవుతున్న విషయం పాశ్చాత్య దేశాలలోని పరిస్థితులను గమనిస్తే అవగతమయిపోతుంది. ముఖ్యంగా, అమెరికాలోని గ్లోబలిస్టులు, పాకిస్తాన్ సైన్యం, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు కూడా క్రమంగా బలహీనపడుతున్న వైనం కనిపిస్తున్నది. బాలాకోట్ దాడి అనంతరం పాక్ సైన్యం ప్రతిక్రియకు దిగకుండా ఊరుకోవడం కూడా వారి మధ్య బలహీనపడుతున్న సంబంధాలకు సంకేతం. ఇక, చైనాలో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా జిన్‌పింగ్ ఆధీనం లోకి వచ్చి, ఆయన పార్టీగానే మారిపోయింది. అమెరికా ప్రోద్బలంతో తాము జనాభాను కట్టడి చేసేందుకు పాటించిన ఒక జంటకు ఒకే బిడ్డ ఉండాలన్న నిబంధన కారణంగా ఇప్పుడు ఆ దేశంలో వృద్ధులు ఎక్కువ, యువత తక్కువ అయిపోయారు. అంతేకాదు, దాదాపు ఐదు దశాబ్దాల ఉత్పత్తి సమ్రాట్టుగా ఉన్నా ఆర్జించిన లాభాలు అరకొర. ఈ విషయాన్ని జిన్‌పింగ్ ప్రస్తుతం గుర్తించారు. అందుకే పిల్లలను కనమని జంటలను ప్రోత్స హిస్తున్నారు, అంతర్గత వినిమయాన్ని పెంచుకోవా లంటున్నారు, పండుగలు జరుపుకోమంటున్నారు, ఆలయాలను తెరిచి సందర్శనలు చేసుకోమంటూ చెప్తున్నారు. సాంస్కృతిక విప్లవం పేరుతో చైనాలో విధ్వంసమైన ఆలయాలను పునరుద్ధరించే పనిలో చైనా పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తే అది కమ్యూనిస్టు పార్టీగా మిగిలిలేదన్న విషయం అవగతమవుతున్నది. ఇప్పుడు చైనా పూర్తిగా ఎగుమతుల నమూనాను తిరస్కరిస్తోంది. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, ఇరుగుపొరుగు దేశాలలోకి చొచ్చుకుపోయి ఆక్రమించుకోవడమనే బలహీనత చైనాకు బాగా ఉంది. ఈ నేపథ్యంలో రష్యా, భారత్ సన్నిహిత సంబంధాలు చైనాను నిలవరించేందుకు ఉపయోగపడగలవు.
ఈ క్రమంలోనే తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాడమిర్ పుతిన్ భారత ప్రధాని మోదీని పొగడ్తల వర్షంలో ముంచెత్తడాన్ని చూడవలసి ఉంటుంది. ‘‘ఎంత ఒత్తిడి వచ్చినా, నదురూ బెదురూ లేకుండా భారత జాతీయ ప్రయోజనాలను కాపాడుతున్న ప్రధాని మోదీ, ఇరు దేశాల మధ్య అభివృద్ధి చెందుతున్న సంబంధాలకు ప్రధాన పూచీదారు’’ అంటూ పుతిన్ అభివర్ణించారు. మాస్కోలో డిసెంబర్ 7-8వ తేదీలలో నిర్వహించిన ‘రష్యా కాలింగ్! ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం!’లో ప్రసంగిస్తూ, ‘భారత దేశానికి, భారత జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే నిర్ణయాలు, చర్యలు, కార్యకలాపాలు చేపట్టమని ఎవరైనా బెదిరించి, ఒత్తిడి చేసినా మోదీ భయపడటాన్ని నేను ఊహించలేను’’ అని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్నేహ పూర్వకం కాని దేశాల నుంచి మోదీపై ఉన్న ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలనని పుతిన్ అనడం వెనుక ఉన్న మర్మం, 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని ఆయన ప్రకటించడమే.
భారత్, రష్యా మధ్య స్నేహసంబంధాలు పాతవే అయినప్పటికీ, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై ఆంక్షలు విధించకపోవడమే కాక, వారి నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం అన్నది రష్యాకు ఎంతో మేలు చేసింది. వారి నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేయడాన్ని పాశ్చాత్య దేశాలనేకం వ్యతిరేకించినా, తమ దేశ ప్రయోజనాల కోసం, తమ ప్రజల బాగోగుల కోసం కొనే తీరుతామంటూ భారత్ స్పష్టీకరించి, దానిని కొనసాగించడంవల్ల అమెరికా ఊహించినట్టుగా ఆర్ధికంగా రష్యా కుప్పకూలలేదు. ఒకవైపు భారత్, మరోవైపు చైనాతో స్నేహాన్ని సమతులం చేసుకుంటూ పుతిన్ ముందుకు సాగుతున్నారు.
స్వల్ప వివాదం?
అయితే, ఇటీవలి కాలంలో రష్యా, భారత్‌ల మధ్య సంబంధాలు కొంత ఉద్రిక్తతకు లోనైన మాట వాస్తవం. రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌ను చెల్లింపులు చైనా కరెన్సీ యువాన్‌లో చేయమని కోరడం, అందుకు భారత్ నిరాకరించడం జరిగాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురుకు దిర్హాంలు, డాలర్లు, రూపాయిల మారకంలో భారత్ చెల్లిస్తూ వస్తోంది. కాగా, అమెరికా చమురు ధరలను 60 డాలర్లకు మించ కూడదని నియంత్రించడంతో తాము ముందుగా నిర్ణయించు కున్న ధరల ప్రకారం చెల్లించేందుకు భారత్ రూపాయిలను కూడా వినియోగిస్తోంది. ఆసియా ఖండంలో బలీయమైన శక్తులుగా ఎదిగేందుకు భారత్, చైనాలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. పైగా రెండు దేశాల మధ్య నలుగుతున్న సరిహద్దు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అందుకే, రష్యా చమురుకు యువాన్‌లో చెల్లించేందుకు అంగీకరించక పోవడమే కాదు, మీరు చమురు ఇవ్వకపోతే తాము వెనిజులా సహా వేరే దేశాల నుంచి తెచ్చుకుంటామని స్పష్టం చేయడంతో రష్యాకు ఒంటి మీద స్పృహ వచ్చినట్టు అయింది. అందుకే ఈ పొగడ్తలు అని విశ్లేషకులు అంటున్నారు.
కోల్డ్‌వార్ సమయంలోని దేశాల మధ్య సమీకరణాలు ఉద్రిక్తతతో నిండి ఉండేవి. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో పట్టుకోసం రష్యా, అమెరికాలు పోటీపడి మరీ ఈ ప్రాంతంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఒకరకంగా శత్రుత్వాన్ని పెంచి పోషించాయనే చెప్పాలి. సోవియట్ యూనియన్ ఉన్న సమయంలో భారత్‌కు, రష్యాకు పోలికలు ఉన్నాయని భావించే వారు. ఇరుదేశాలలోనూ ప్రభుత్వ రంగ సంస్థలు, సోషలిజంతో ప్రభావితమైన ఆర్ధిక వ్యవస్థ వంటి పోలికలతో పాటుగా కావలసినప్పుడు సోవియట్ ఆర్ధిక సహాయం ఉండేది. ఆ కాలంలో సోవియట్ యూనియన్, భారత్ ఒక జట్టుగా ఉండగా, యునైటెడ్ స్టేట్స్-పాకిస్తాన్-చైనా మిత్రదేశాలు అయ్యాయి. అటు భారత్‌ను, ఇటు రష్యాను అదుపులో ఉంచాలన్న అమెరికా ఆరాటం కారణం గానే వ్యూహాత్మక భౌగోళిక ప్రదేశంలో ఉన్న పాక్‌ను అమెరికా దత్తత తీసుకుంది. ఇటు భారత్‌లోనూ, అటు అప్ఘాన్‌లోనూ చిచ్చు పెట్టేందుకు పాకిస్తాన్‌కు తోడ్పడింది. అయితే, సోవియట్ యూనియన్ పతనానంతరం నుంచి ఆసియా ప్రాంతంలో సమీకరణలు మారడం ప్రారంభమైంది. తర్వాతి కాలంలో యునైటెడ్ స్టేట్స్‌కు కూడా భారత్ దగ్గర కావడం మొదలు కాగా, రష్యా చైనా దిశగా జరగడం ప్రారంభమైంది. ఏది ఏమైనా, భారత్, రష్యాలు తమ మధ్య సంబంధాలను బాగుచేసుకోలేనంతగా చెడగొట్టుకోలేదు. ఆ విషయం తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐదు రోజుల పర్యటన చేస్తున్న విషయం ద్వారానే అవగతమవుతుంది.
మోదీ స్వతంత్ర విధానం
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ సంబంధాలలో వచ్చిన మలుపు అనూహ్యమైంది. భారత్ ప్రయోజనాల ఎదుట ఏదీ ముఖ్యం కాదనే సంకల్పం, పట్టుదలతో మోదీ వ్యూహం సాగింది. ఆ కారణంగానే నేడు భారత్ అటు రష్యాతోనూ, ఇటు యునైటెడ్ స్టేట్స్ తోనూ సమానంగా సంబంధాలను కొనసాగిస్తోంది. రష్యాతో సంప్రదాయంగా వస్తున్న ఆయుధాల వ్యాపారం తగ్గించుకొని, అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడమే కాదు, దేశీయంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు శ్రీకారం చుట్టింది. ఇందుకు రష్యా పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడానికి కారణం, దానికి కూడా భారత్ ప్రాధాన్యత తెలియడమే. చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా దానిని పూర్తిగా రష్యా నమ్మలేదు. భారత్‌తో అటువంటి సమస్యలు
లేకపోవడం, దాని ఆర్ధిక ఎదుగుదల, దశాబ్దాలుగా స్నేహసంబంధాలను కలిగి ఉండటం వంటి కారణాల వల్ల మన దేశం పట్ల రష్యా ఆసక్తి కనపరుస్తోంది.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన అనంతరం, ఆర్ధిక ఆంక్షల పేరుతో యుఎస్, ఐరోపా దేశాలు తమ వ్యాపారాలను వదిలివేసి వెళ్లిపోయాయి. ఇప్పుడు భారతీయ కంపెనీలు ఆ వ్యాపారాలను చేపడితే బాగుంటుందనే ఆసక్తిని రష్యా చూపుతోంది. వచ్చే ఏడాది జూన్ నెలలో నిర్వహించనున్న సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం (ఎస్‌పిఐఇఎఫ్)లో పాల్గొని, ఒప్పందాలు కుదుర్చుకుని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలో చోటు సంపాదించుకోవలసిందిగా కూడా వారు కోరుతున్నారు. తమ ప్రభుత్వాల ఒత్తిడి కారణంగా అనేక ఐరోపా, అమెరికా కంపెనీలు రష్యాను వదిలివెళ్లాయి. అవి భర్తీ చేయకుండా వదిలేసిన వినూత్న రంగాలు రష్యా ఆర్ధిక వ్యవస్థలో అనేకం ఉన్నాయని, ఎస్‌పిఐఇఎఫ్ డైరెక్టర్, రాస్‌కాంగ్రెస్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ అలెక్సీ వాల్కోవ్ పేర్కొన్నారు.
మొత్తం మీద, నూతన ప్రపంచ క్రమానికి పునాదులు వేయడానికి ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఇందుకు 2024లో భారత్, అమెరికా, రష్యా, పాకిస్తాన్‌లలో జరుగనున్న ఎన్నికలు కీలకం కానున్నాయి. పాక్‌లో భారత్‌కు అనుకూలుడైన నవాజ్ షరీఫ్, రష్యాలో పుతిన్, అమెరికాలో బైడెన్ సహా ఎవరు వచ్చినా భారత్‌లో మాత్రం మోదీ వచ్చినప్పుడే ఈ పక్రియ వేగాన్ని పుంజు కుంటుందన్నది వాస్తవం.
-డి. అరుణ