ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో క్రమంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టి, అభివృద్ది కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవలే శ్రీనగర్‌లో జీ-20 అంతర్జాతీయ సదస్సు విజయ వంతంగా జరిగింది. దేశ విదేశాల నాయకులు, ప్రతినిధులు కూడా వచ్చారు. పర్యాటక రంగం క్రమంగా పూర్వ వైభవం పొందుతోంది. కశ్మీర్ ప్రజలకు విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగింది. మొదటి నుంచి జమ్ముకశ్మీర్‌లో అమలులోలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితులలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
త్వరలో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో కూడా ఎన్నికల నిర్వహణే తర్వాయి అన్న క్రమంలో ఇక్కడి ప్రశాంతతను చెడగొట్టే పనులు ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదులు తిరిగి పుంజు కునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ ఉనికిని చాటు కునేందుకు తరచూ భద్రతా దళాల మీద దాడులు చేస్తున్నారు. మన సైన్యం వీటిని ఎప్పటి కప్పుడు తిప్పి కొడుతూ ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇదే సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి తన కుటిల స్వభావాన్ని బయట పెట్టుకుంటోంది.
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండాలని చూస్తుంటారు.. తాజాగా మరోసారి తన దుర్బుద్ధిని బయట పెట్టుకున్నారు.
కశ్మీర్‌కు గాజాకు పోలికా?
భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా పరిష్కారానికి రాకపోతే కశ్మీర్ పరిస్థితి ‘గాజా’ లా మారుతుందని, కశ్మీర్ సమస్య పరిష్కారానికి చర్చలే సరైన పరిష్కారమని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కశ్మీర్‌కు ఒకవైపు పాకిస్థాన్, మరోవైపు చైనా ఉన్నాయని.. ఒకవేళ యుద్ధం జరిగితే తీవ్రంగా నష్టపోయేది కశ్మీర్ ప్రజలేనని అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలే క్షేమకరమని పేర్కొన్నారు. ‘మనం స్నేహితులను మార్చగలమేమో గానీ ఇరుగుపొరుగును మార్చలేం’ అని గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి అన్నారని ఫరూక్ అబ్దుల్లా గుర్తుచేశారు. పాకిస్థాన్‌కు త్వరలో నవాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇండియాతో చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారని, కానీ మనమే అందుకు సిద్ధంగా లేమన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతమైనట్లు కేంద్రం చెబుతున్నా.. అది ఇంకా అంతం కాలేదని వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అసలు జమ్ముకశ్మీర్‌కు, గాజాకు పోలిక ఏమిటి? ఈ రెండు సమస్యల స్వరూప స్వభావాలు వేరన్న విషయం బహిరంగ సత్యం.
నరకంగా మార్చింది ఎవరు?
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంపై ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఈ తీర్పును స్వాగతిస్తున్నాం అంటూనే దీనిపై తాము మరోసారి కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు 70 ఏండ్లు పట్టింది. ఏమో మరో 200 ఏండ్లలో అది మళ్లీ రావొచ్చేమో! అని కూడా వ్యాఖ్యానించి, కశ్మీర్‌ను రావణకాష్టంగా కొనసాగించడానికే తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు.
పూర్వపు జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంపై స్పందిస్తూ ‘కశ్మీర్‌ను నరకానికి వెళ్లనివ్వండి’ అని గతంలో అసహనాన్ని వ్యక్తం చేయడం వివాదానికి దారితీసింది. జమ్ము కశ్మీర్‌ని భూతల నరకంగా మార్చింది గతంలో ఆ రాష్ట్రాన్ని పాలించిన అబ్దుల్లాల కుటుంబమే అని బీజేపీ స్పష్టం చేసింది. పరివార్‌వాద్ రాజ్ (బంధుప్రీతి), పాకిస్తాన్ పరస్తీ (మద్దతు) పత్తర్ బాజీ (రాళ్లతో కొట్టడం) రాజకీయాలకు ముగింపు పలికిన 370 రద్దు చేయడం సహజంగానే వారికి నచ్చదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. జమ్ముకశ్మీర్ స్వర్గంగా ఉండేది. దాన్ని నరకంగా మార్చింది ఎవరు?
తండ్రిని మించిన ఘనుడు ఒమర్ అబ్దుల్లా. ఆర్టికల్ 370 రద్దును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు నిరాశ కలిగించిందని, న్యాయం కోసం సుదీర్ఘ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఈ తీర్పు జమ్మూ కశ్మీర్ ప్రజల పాలిట మరణశాసనం అంటారు పీడీపీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. రాష్ట్రంలో రాజకీయంగా పైచేయి సాధించడమే అజెండాగా పరస్పరం పోటీపడుతున్న నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీల వంటి పార్టీలూ తమదైన వాదనలతో కశ్మీర్ ప్రజల మనసుల్ని విషకలుషితం చేస్తున్నాయి.
వివాదాస్పద వ్యాఖ్యలు కొత్తేం కాదు
గతంలో అలీగఢ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ సమావేశంలో ఫరూక్ అబ్దుల్లా ఒక మతోన్మాదిలా మాట్లాడారని సీనియర్ పాత్రికేయుడు, దివంగత కులదీప్ నయ్యర్ ఒక వ్యాసంలో ప్రస్తావించారు. హిందూ ముస్లింలు ఒకే దేశంలో మనలేరని, వారికోసం రెండు వేర్వేరు రాజ్యాలు ఏర్పాటు చేయాల్సిందేనంటూ భారత్ విభజనకు ముందు ముస్లింలీగ్ నాయకుడు మహమ్మదాలీ జిన్నా చేసిన తరహా వ్యాఖ్యలను- ఫరూక్ ప్రసంగం గుర్తుకు తెచ్చిందని అయన అన్నారు. అలాగే శ్రీనగర్ నుంచి వెలువడే ఓ పత్రికలో ఫరూక్ అబ్దుల్లా రాసిన వ్యాసంలో.. భారత్‌పట్ల విషం కక్కారు. ‘కశ్మీర్ స్వాతంత్య్రం కోసం రాష్ట్ర యువత తుపాకులు చేతపట్టి ఉంటే తన తండ్రి షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఎంతగానో సంతోషించి ఉండేవార’ని ఆయన అందులో వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 370 విషయంలో కేంద్రం తన విధానాన్ని మార్చుకోకపోతే 2008 నాటి అమర్‌నాథ్ తరహా ఘటనలు పునరావృతమవుతాయని 2015 ప్రాంతంలో ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు.
ఫరూక్ అబ్దుల్లా తరచూ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఆయన నిబద్ధతపట్ల అనుమానాలు ముసురుకుంటున్నాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యసభ సభ్యుడిగా నియమితుడైన ఈ నాయకుడు ఒక రహస్య ఎజెండా ప్రకారం పని చేస్తుంటారనేది బహిరంగ రహస్యం.. పాకిస్తాన్ నాయకులతో, వేర్పాటువాద హురియత్ నాయకులతో కూడా ఆయనకు మంచి బంధం ఉంది.
ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కశ్మీర్‌లో జిహాద్ నిర్వహిస్తున్న ఉగ్రవాదులకు మద్దతుగా గతంలో ప్రతి శుక్రవారం కొన్ని అల్లరి మూకలు భద్రతా దళాలపై రాళ్లు రువ్వేవి.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి దన్నుగా నిలిచిన ఈ ముఠాల వారు భారత రాజ్యాంగం పట్ల విధేయతను, భారత జాతీయ సమైక్య సర్వ సత్తాక అధికారం పట్ల నిబద్ధతను, దేశ భౌగోళిక సమగ్రత పట్ల నిష్ఠను ప్రకటించడానికి బహిరంగంగానే నిరాకరించేవి.. ఈ చర్యలను అబ్దుల్లా ఎప్పుడూ ఖండించలేదు. పైగా వారికి బహిరంగంగా వత్తాసు పలికేవారు.
కశ్మీర్ సంక్షోభంలో అబ్దుల్లా కుటుంబ పాత్ర
జమ్ముకశ్మీర్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి, సమస్యలకు కారణం ఎవరు? అబ్దుల్లా కుటుంబమే సమస్యకు బీజం వేయడం నిజం కాదా? నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా అనేక ఏళ్ల పాటు కశ్మీర్ ముఖ్యమంత్రులుగా పని చేశారు. తాత, తండ్రి, ఇప్పుడు కొడుకు ఈ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 1947 నుంచి ఈ సంక్షోభాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు అది అంతం కావడం వారికి రుచించడం లేదు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జమ్మూ కశ్మీర్ విలీన సమయంలో జరిగిన కుట్రలు కుతంత్రాల్లో షేక్ అబ్దుల్లాదే కీలక పాత్ర. మన ప్రథమ ప్రధాని నెహ్రూకు ప్రియమిత్రులు ఆయన.. రాష్ట్రంలో మొదటి నుంచి రాజకీయ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఈయనే. ఇందుకు నెహ్రూతో పాటు తదుపరి ప్రధాని ఇందిరా గాంధీ కూడా సహకరించారు. షేక్ అబ్దుల్లా తన పార్టీ ముస్లిం కాన్ఫరెన్స్‌ను నేషనల్ కాన్ఫరెన్స్‌గా మార్చారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 సహా, అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు విజృంభించడం షేక్ అబ్దుల్లా హయంలోనే జరిగింది.
షేక్ అబ్దుల్లా తర్వాత ఆయన తనయుడు ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పగ్గాలు స్వీకరించారు. ఈయన కాలంలో వేర్పాటువాదం మరింత వెర్రితలలు వేసింది. కశ్మీర్ లోయలో మారణకాండ, పండిత్ కుటుంబాలపై అకృత్యాలు, వారిని లోయ నుంచి తరిమేయడం వరకూ ఫరూక్ అబ్దుల్లా సమయంలోనే జరిగాయి. ఆ తర్వాత రాష్ట్రంలో సుదీర్ఘంగా రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఈ సమయంలో దేశంలో ఉంచి కశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దడంతో కేంద్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన ఫరూక్ అబ్దుల్లా ఈ విషయాన్ని పక్కన పెట్టి విదేశాల్లో విలాసంగా గడిపారు.
ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్లా పాలనా పగ్గాలను తన కుమారునికి అప్పగించి పరోక్ష పెత్తనం చేస్తున్నారు. ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా కూడా జమ్ముకశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా పని చేశారు. భారత రాజ్యాంగానికి విధేయత చూపిస్తూ ఇక్కడి రాజకీయ వ్యవస్థలో భాగస్వామిగా ఉన్న పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్.. కానీ ఆ పార్టీ పరోక్షంగా వేర్పాటు వాదులను, పాకిస్తాన్ వాదనను సమర్ధిస్తుంటుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇటు నేషనల్ కాన్ఫరెన్స్‌కు, అటు పీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉనికిని చాటుకునేందుకు ఫరూక్ అబ్దుల్లా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మన రాజ్యాంగం పట్ల నిబద్ధతను ప్రకటించిన జమ్ముకశ్మీర్ భారత్‌లో భాగమన్న వాస్తవాన్ని అంగీకరించిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యాలు చేయడం ఏ మాత్రం క్షమార్హం కాదు.
క్రాంతి
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్