సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  మార్గశిర శుద్ధ చతుర్దశి – 25  డిసెంబర్‌ 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఉన్న రాష్ట్రాలు కూడా చేజారి పోవడంతో కాంగ్రెస్‌కు దిక్కు తోచడం లేదు. 2024 సాధారణ ఎన్నికలలోను బీజేపీదే హవా అంటూ ఇప్పుడే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సర్వేలతో కాంగ్రెస్‌తో పాటు, మిగిలిన ఇండీ కూటమికీ  ఊపిరి సలపడం లేదు. దీని ఫలితమే పార్లమెంట్‌లో గందరగోళం.  భారత పార్లమెంట్‌ చరిత్రలో, ఒకే సమావేశాలలో 92 మంది సభ్యులు సస్పెండ్‌ కావడం ఇదే మొదటిసారి అన్న వార్త విన్నాక ఎన్నో ప్రశ్నలు తలెత్తడం సహజం. ఒకింత బాధ కూడా కలుగుతుంది. డిసెంబర్‌ 18న ఒకేరోజు 78 మంది సభ్యులు ఉభయ సభల నుంచి సస్పెండయ్యారు. చాలాచిత్రంగా లోక్‌సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది సస్పెన్షన్‌కి గురి కావడం తీవ్రంగా ఆలోచించేటట్టు చేస్తుంది. సస్పెన్షన్లు లోక్‌సభ కంటే పెద్దల సభలో ఎక్కువగా ఉండడం అవాంఛనీయం.

పార్లమెంట్‌ చూసిన డిసెంబర్‌ 13 నాటి భద్రతా వైఫల్యం ఎవరికైనా ఆవేదన కలిగిస్తుంది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశం మొత్తం విచారం వ్యక్తం చేసింది. కానీ ప్రతిపక్షాల వైఖరి పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం కంటే, వాటి సమీప భవిష్యత్తు మీద బెంగనే ఎక్కువ ప్రతిబింబిస్తున్నది.  హోంమంత్రి సమాధానం, రాజీనామా నినాదాలతో సభ్యులు గందరగోళం సృష్టించారు. ఇందులో నిజాయితీ ఎంత? హేతుబద్ధత ఎంత అన్నదే ఇప్పుడు ప్రశ్న. సస్పెన్షన్‌కు గురైన  సభ్యుల సంఖ్యను బట్టి తమ ఉనికికి బీజేపీయే అతి పెద్ద ముప్పు అని భావిస్తున్న పార్టీల నిర్వాకమే ఇదంతా అన్న నిర్ధారణకు రాక తప్పదు. ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు, సభా కార్యకలాపాలకు అడ్డు తగలడం వంటి కారణాలతోనే వీరందరినీ లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ సస్పెండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సభ్యులు కె.జయకుమార్‌, విజయ్‌ వసంత్‌, అబ్దుల్‌ ఖాలిక్‌ స్పీకర్‌ పోడియం ఎక్కి నినాదాలు చేశారు. వీరి వ్యవహారం సభా హక్కుల కమిటీకి నివేదించవలసి వచ్చింది. ప్లకార్డుల ప్రదర్శనను  పరిహరించాలని అన్ని పార్టీలు కలసి తీసుకున్న నిర్ణయం. అయినా ఆ ఏకాభిప్రాయాన్ని కూడా విపక్షాలు మరచిపోయాయి. లోక్‌సభ నుంచి సస్పెండైన వారిలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి, ఉపనేత గౌరవ్‌ గొగొయ్‌ కూడా ఉన్నారు. డీఎంకే సభ్యులు పది మంది, తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు తొమ్మిది మంది, కాంగ్రెస్‌ సభ్యులు 8 మంది సస్పెండయిన వారిలో ఉన్నారు. ఈ తీవ్ర గందరగోళం నడుమనే తపాలా, టెలీ కమ్యూనికేషన్ల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుంది.

డీఎంకే గందరగోళం వెనుక ఉద్దేశం ఏమిటో గ్రహించడం పెద్ద కష్టం కాదు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి పెరుగుతున్న ఆదరణ, డీఎంకే తిరోగమనం సుస్పష్టం. మమతా బెనర్జీ బీజేపీని ఆగర్భ శత్రువుగానే పరిగణిస్తారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా వామపక్షాలు, కాంగ్రెస్‌తో కూడా పశ్చిమ బెంగాల్‌లో పొత్తు సాధ్యమేనని ప్రకటించారంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు మించిన అస్తిత్వ బాధ కాంగ్రెస్‌ను పట్టి పీడిస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లలో అధికారం కోల్పోయి, హిందీ భాషా ప్రాంతాలలోనే పెద్ద లోటును ఆ పార్టీ ఎదుర్కొంటున్నది. ఈ మూడు పార్టీలు తమ దుగ్ధను పార్లమెంట్‌ వేదికగా ఈ విధంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

పార్లమెంట్‌లో సస్పెన్షన్‌లు కొత్త కాదు. మార్చి 15, 1989లో 63 మంది ఎంపీలను ఒక దఫా సమావేశాలలో సస్పెండ్‌ చేసిన చరిత్ర ఉంది. నాటి ప్రధాని ఇందిర హత్య కేసుపై జస్టిస్‌ ఠక్కర్‌ కమిటీ నివేదిక సభకు సమర్పించిన సందర్భంలో ఈ పరిణామం జరిగింది. 2015లో కూడా, అంటే నరేంద్ర మోదీ మొదటి ప్రభుత్వంలో వెల్‌లోకి దూసుకువచ్చి, ప్లకార్డులు ప్రదర్శించనందుకు గాను 25 మంది సభ్యులను నాటి స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌  సస్పెండ్‌ చేశారు.

కొందరు సభ్యుల వ్యవహార సరళి పార్లమెంట్‌ మర్యాదకు పూర్తి భంగకరంగా మారిందని ఎవరైనా అంగీకరించవలసి ఉంటుంది. టీఎంసీ సభ్యుడు (రాజ్యసభ) డెరీక్‌ ఓబరిన్‌ సరళి ఇందుకు ఉదాహరణ. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌. ఆ కాలంలో ధన్‌ఖడ్‌ అక్కడి ప్రాంతీయ పార్టీ తృణమూల్‌తో నిత్యం సంఘర్షించవలసి వచ్చింది. డెరీక్‌ సరళిలో అందుకు ప్రతీకారం తీర్చుకునే ధోరణే కనిపిస్తున్నది. రాజ్యాంగబద్ధంకాని వ్యాఖ్యలను కూడా సభలో వినిపించే ప్రయత్నం చేస్తున్న సభ్యులను నివారించే ప్రయత్నం కూడా వాక్‌ స్వాతంత్య్రాన్ని నిరోధించే చర్యగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ఆఖరికి భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుల మీద కూడా ప్రతికూల వ్యాఖ్యలు చేయడానికి భారత అత్యున్నత చట్టసభను వేదికగా చేసుకునే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి మేలు చేసేది కాదు. కశ్మీర్‌పై చర్చ వేళ జాతులకు స్వయం నిర్ణయాధికారం ఉంటుందంటూ ఈవీ రామస్వామి నాయకర్‌ చేసిన వ్యాఖ్యలను డీఎంకే సభ్యుడు సభలో ప్రస్తావించడానికి చేసిన ప్రయత్నం దారుణం. ఆ వ్యాఖ్యలను నిరోధించడానికి రాజ్యసభ చైర్మన్‌ ఎంతో కష్టపడవలసి వచ్చింది. పార్లమెంట్‌లో మెజారిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్నీ, కోర్టు సమర్ధించిన దానినీ బాహాటంగా విమర్శించడం ఏమి మర్యాద?

పార్లమెంట్‌ నిర్వహణకు ఒక్క నిమిషానికి అయ్యే ఖర్చు రూ. 2 లక్షలు.  కానీ ప్రజా సమస్యల ప్రస్తావన పేరుతో సభా కార్యకలాపాలకు అడ్డుతగలడమే ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న పని. ఇంతకీ పార్లమెంట్‌కు పొగ పెట్టే పనిలో దుందుడుకుగా వ్యవహరించిన వారి జాతకాలు నెమ్మదిగా బయటపడడం, కాంగ్రెస్‌తోను, రైతుల ధర్ణాతోను సంబంధం ఉన్నవారి పని అని తేలడం విపక్షాలను కంగారు పెడుతున్నట్టే ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE