డిసెంబర్‌ 23 వైకుంఠ ఏకాదశి

సూర్యుడు ఉత్తరాయనంలోకి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. పురాణగాథను బట్టి దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి)నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహా విష్ణువు, కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) నాడు మేల్కొని మార్గశిర శుద్ధ ఏకాదశి (ముక్కోటి/వైకుంఠ) నాడు సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి సమేతంగా గరుడ వాహనరూఢుడై ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. ఈ దర్శనం ద్వారా ‘మోక్షం’ సిద్ధిస్తుందనే విశ్వాసంతో ‘ఈఏకాదశిని ‘మోక్షోత్సవ’ దివసమనీ వ్యవహరిస్తారు. మహర్షులు, దేవతా, పితృగణాలు ఆనాడు వైకుంఠనాథుడి దర్శనం కోసం వేచి ఉంటారని ప్రతీతి.

‘మాసానాం మార్గ శీర్షోహం’ అన్నాడు జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో ఉత్తమం, శ్రేష్ఠమైనదని అర్థం. ఈ మాసంలోనే వచ్చే శుద్ధ ఏకాదశికీ అంతే ప్రాధాన్యం, ప్రత్యేకతలు ఉన్నాయి. నెలకు రెండు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు, అధికమాసంలో మరో రెండు వస్తాయి. ప్రతి ఏకాదశిని పవిత్రమైనదిగా భావిస్తారు. వీటన్నిటిలో వైకుంఠ ఏకాదశి భిన్నమైనది. అన్ని ఏకాదశులను చంద్రమానం ప్రకారం గణిస్తే ఈ ఒక్కదానిని మాత్రం సౌరమానంతో గణిస్తారు.

పురాణగాథను బట్టి దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు, కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) నాడు మేల్కొని మార్గశిర శుద్ధ ఏకాదశి (ముక్కోటి/వైకుంఠ) నాడు సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి సమేతంగా గరుడా వాహనరూఢుడై ఉత్తరద్వార దర్శనమిస్తాడు. ఈ దర్శనం ద్వారా ‘మోక్షం’ సిద్ధిస్తుంది కనుక ఈ ఏకాదశిని ‘మోక్షోత్సవ’ దివసమనీ వ్యవహరిస్తారు. ‘ముక్కోటి’ అంటే మూడు కోట్లని సాధారణ అర్థంగా చెబుతారు. కానీ,వేదాంతసారం ప్రకారం, మనిషి జాగ్రత్‌, స్వప్న,సుషుప్తి అనే మూడు అవస్థలు కలిగి ఉంటాడని, వాటి అంచును ‘కోటి’ అని వ్యవహ రిస్తారని, ఆ మూడంచులను దాటించి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది కనుక ఇది ‘ముక్కోటి’ ఏకాదశిగా వ్యవహారంలోకి వచ్చిందని పెద్దలు చెప్పారు.

ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఇద్దరు అశ్వనీదేవతలు… మొత్తం 33 మంది సృష్టి నిర్వాహకులు కాగా, దానికి యజమాని, పర్యవేక్షణాధిపతి శ్రీమహావిష్ణువు అని వేదం చెబుతోంది. ఆయనకు వారంతా తమ విన్నపాలను నివేదించి, కైంకర్యాలు సమర్పించేందుకు ముక్కోటి నాడు తరలి వస్తారని, వారు చేరే దారికి వైకుంఠ ద్వారమని పేరని చెబుతారు. ఈ ద్వారం నుంచి విష్ణువును సేవించుకున్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

‘లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః

యేషామిందీవర శ్యామో హృదయస్తో జనార్దనః’

మంగళకరుడైన విష్ణు భగవానుడు హృదయా లలో కొలువుదీరిన వారికి లాభం, జయం సిద్ధిస్తాయని పెద్ద మాట. హైందవ సంప్రదాయంలో ఏకాదశిని పరమ పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు.

దక్షిణాయనంలో దేహత్యాగం చేసిన జీవులు ఇదే రోజున స్వర్గారోహణ చేస్తారనే విశ్వాసం కారణంగా ఈ తిథి ‘స్వర్గ ద్వారం’గా ప్రసిద్ధమైంది. భద్రాతి రాజు సుకేతు దంపతులు ముక్కోటి ఏకాదశి వ్రతం ఆచరించి పుత్రసంతతిని పొందినందున దీనికి ‘పుత్రద ఏకాదశి’ అనే పేరు వచ్చిందట. ఈ తిథికి ‘హరివాసం, వైకుంఠ దినం’ అనీ పేరు. ‘కుంఠం’ అంటే లోపించడం అని అర్థం. అది లేని స్థితి వైకుంఠం. ఏకాదశి అంటే పదకొండు. అవి అయిదేసి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు. ఈ ఏకాదంశాల ఏకత్వమే పరిపూర్ణస్థితి. అలాంటి పూర్ణత్వానికి వైకుంఠమని పేరు. ఈ తిథి నాడు చేసే పూజాదికాల వల్ల కుటుంబ శ్రేయస్సు కలగడంతో పాటు పితృదేవతలకు పుణ్యఫలం దక్కుతుందని విశ్వాసం. పూర్వం విఖాసనుడు అనే రాజు పర్వత మహర్షి హితవు ప్రకారం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, పితృదేవతలకు నరకలోకం నుంచి స్వర్గలోక ప్రాప్తి కలిగించాడట.

ఒక మన్వంతరంలో ‘వికుంఠ’ అనే పుణ్యస్త్రీకి శ్రీమహావిష్ణువు పుత్రుడిగా జన్మించినందున ఆయనకు ‘వైకుంఠుడు’ అనే పేరు స్థిరపడిరదని అమరకోశం పేర్కొంటోంది. ‘వికుంఠులు’ అంటే పరమాత్మతో ఎలాంటి ఎబాటులేకుండా శాశ్వతానుబంధం కలిగినవారని అర్థంగా చెబుతారు.

కృతయుగంలో చంద్రావతి నగర ఏలిక మురాసురుడి దాష్టీకాలను భరించలేని దేవతలు శ్రీహరికి మొరపెట్టుకున్నారు. ఆ అసురుడి అంతానికి దేవదేవుడు సంకల్పించగా, ఆ సంకల్పం నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపం మురాసురుడిని కంటి చూపుతోనే మట్టు పెట్టింది. అందుకు సంతసించిన హరి ఆమెకు ‘ఏకాదశి’ అని నామకరణం చేసి, వరం అనుగ్రహించాడు. ‘ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ నియమబద్ధంగా వ్రతం పాటించి అర్చనాదులు నిర్వహించే వారి పాపలు తొలగిపోయేలా వరం ప్రసాదించు’ అని కోరుకుందట. నాటి నుంచి ఏకాదశి వ్రత విధానం ఆచరణలోకి వచ్చిందని ఆధ్మాతిక వేత్తలు చెబుతారు. ఇక్కడ ‘ఉపవాసం’ అంటే నిరాహారంగా ఉండడం అని అర్థ విపరిణామం చెందింది కానీ, ‘ఆహారాన్ని త్యజించి భగవంతుడికి చేరువుగా ఉండడం, హరి సంకీర్తనలో లీనం కావడమే ఉపవాస శబ్దభావం. అన్నపానీయాలను అదుపులో ఉంచడం వల్ల ఇది సాధ్యపడుతుందని చెబుతారు. ఇతర సమయాలలో ఎలా ఉన్నా ఈ ఒక్కరోజైనా ఉపవాసం పాటించాలన్నది పెద్దల భావన. ఉపవాసం వెనుకు ఆరోగ్య రహస్యమూ ఉందని వైద్య నిపుణులు చెబుతారు.

మురాసుర సంహారం కోసం విష్ణువు వైకుంఠం నుంచి తరలి వచ్చిన తిథి కనుక ‘వైకుంఠ ఏకాదశి’ అనే మరో పురాణ కథనం. తన అరచేయి తాకిన వెంటనే భస్మమై పోవాలని బ్రహ్మ నుంచి వరం పొందిన మురాసురుడు వైకుంఠనాథుడిపై యుద్ధం ప్రకటించాడు. ‘నీతో యుద్ధం ఆహ్వానింపదగినదే. అయితే యుద్ధ భయంతో నీ గుండె వేగంగా కొట్టుకుంటుందేమి?’అన్న శ్రీహరి ప్రశ్నకు, ‘అదేమి లేదంటూ’నే చేతిని గుండెపై వేసుకున్న మురాసురుడు (భస్మాసరు వృత్తాంతం లాంటిదే) అంతమయ్యాడు.

 శ్రీరంగం క్షేత్ర పురాణం ప్రకారం, మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ గురించి తపస్సు చేసి శ్రీరంగనాథుడి ప్రతిమను పొందగా, దానిని శ్రీరాముడి విభీషణుడికి కానుకగా అందించాడు. శ్రీరామ పట్టాభిషేకానంతరం లంకకు తిరుగు ప్రయాణమప్పుడు శ్రీరామ వియోగ దుఃఖంలో ఉన్న ఆయనకు రాముడు తనకు గుర్తుగా రంగనాథ విగ్రహాన్ని అనుగ్రహించాడు. ఆ మూర్తితో బయలుదేరిన విభీషణుడు ఉభయ కావేరుల మధ్యకు చేరే సరికి సంధ్యావందనం సమయమైంది. ఆయన విగ్రహాన్ని కింద ఉంచి నదికి వెళ్లి సంధ్యావందనం ఆచరించి వచ్చేసరికి ఆ విగ్రహం ప్రతిష్టితమైంది. లంకలో వేంచేయవలసిన మూర్తి ఇక్కడే ఆగిపోవడంపై ఆవేదన చెందిన ఆయనను ఆ ప్రాంత పాలకుడు ధర్మచోళుడు ఓదార్చి, విగ్రహం ఉన్న చోటనే ఆలయాన్ని నిర్మించాడు.

స్వస్థత చెందిన విభీషణుడు, తన లంకారాజ్యం ఉన్న దక్షిణ దిక్కుకు తిరగాలని చేసిన విన్నపాన్ని స్వామి మన్నించాడని ప్రతీతి. దక్షిణాభిóముఖుడైన స్వామిని ఉత్తర ద్వారం నుంచి సేవిస్తే సద్యోముక్తి లభిస్తుందని వైష్ణవ ఆగమాలు చెబుతున్నాయి. అందుకు శ్రీరంగంలోని రంగనాథ దర్శనాన్ని ఉదాహరణగా చెబుతారు.

ఆ క్షేత్రంలో ఈ రోజు (ఏకాదశి) నుంచి 21 రోజులు పగలు(పగల్‌ పాథ్‌), రాత్రి (ఇరుల్‌ పాథ్‌) అని రెండుగా విభ జించి విష్ణునామ సంస్మరణాత్మక దర్శనభాగ్యం కలిగిస్తారు. ‘ఉత్తర ద్వార మాసీనం/ ఖగస్థం రఘునాయకమ్‌/యః పశ్త్యతి స భద్రాద్రౌ యాతివై పరమాం గతిమ్‌’ (భద్రాద్రిలో గరుడా రూఢుడైన శ్రీసీతారామచంద్రస్వామిని ఏకాదశినాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి సకల భోగాలు, విష్ణు సాయుజ్యం లభిస్తుంది’ అని స్థల పురాణం.

విశ్వమానవ వికాశ గ్రంథం భగవద్గీత ఆవిష్కృత మైనది ఈ తిథినాడే కావడం మరో విశిష్టత. దేవాసురులు జరిపిన క్షీరసాగర మథనంలో హాలాహలం, అమృతం పుట్టింది ముక్కోటి నాడేనని ఐతిహ్యం. కురుకుల పితామహుడు భీష్ముడు తండ్రి శంతనుడు ప్రసాదించిన ‘స్వచ్ఛంద మరణం’ వరంతో ఉత్తరాయణం ప్రవేశించిన తరువాతనే దేహత్యాగం చేశాడు. దక్షిణాయనంలో మొదలైన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాహతుడైన ఆయన అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షించాడు. ఈ మధ్యకాలం ధర్మరాజాదులకు విష్ణు సహస్రనామం ఉపదేశించారు.

తిరుమలలో

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏకాదశికి ముందువచ్చే మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారదర్శనం తరువాత మరునాడు తిరుమల స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. తిరుమలలో ఏటా నాలుగు సందర్భాలలో పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు స్నానం చేయిస్తారు. వాటిలో వైకుంఠ ఏకాదశి సందర్భం ఒకటి. ఆనాడు సకల పుణ్య తీర్థాలు సూక్ష్మ రూపంలో స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని, సకల దేవతలు అక్కడ ఆవహిస్తారని పెద్దల మాట. అందుకే చక్రస్నానానికి అంతటి విశిష్టత.

నిత్యం ఉత్తరద్వార దర్శనం కలిగిస్తున్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల. ద్వారక మహర్షి అనే ఉత్తరాభి ముఖంగా చేసిన తపస్సు కారణంగా స్వామి దక్షిణాభి ముఖంగా వెలిశాడని స్థల పురాణం. వైకుంఠ ప్రాప్తికి హేతువైన ఉత్తర ద్వార దర్శనం భాగ్యం ముక్కోటి ఏకాదశి నాడె లభ్యమవుతుండగా అక్కడ అనునిత్యం కలుగుతోంది.

శ్రీమహావిష్ణువు అలంకార, సామగానలోల ప్రియుడు. వైకుంఠ ఏకాదశి నాడు ఆలయంలో కానీ, ఇంటి వద్ద కానీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాలలతో అలంకరిస్తారు. పూజకు ప్రధానంగా తామరపూవులు, తులసి వినియోగిస్తారు. పాయసం లాంటి మధుర పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. అష్టాక్షరీతో పాటు స్తోత్రాలు మననం చేస్తారు. ఇలా అర్చన, జపం,ధ్యాన సాధానాల ద్వారా వైకుంఠపతి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు.

‘మంగళం భగవాన్‌ విష్ణుః మంగళం గరుడధ్వజా

మంగళం కమలాకాంతమ్‌ త్రైలోక్యం మంగళమ్‌ కురు’

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE