అధికారం శాశ్వతం కాదని తెలియనంత అమాయకులు కారు రాజకీయ నాయకులు. కానీ ఒక దశలో అధికార మత్తు వారిని ఈ వాస్తవం నుంచి కాస్త దూరంగా నెడుతుంది. అయితే ప్రజలు ఐదేళ్ల తరువాత ఓటుతో కిందకు లాగిపడేస్తారు. అప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు, వాటి నేతలకు జ్ఞానోదయం అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో జరిగింది ఇదే. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైఖరి మీద, అహంకారం మీద వారు ఆగ్రహించారు. అధికారాంతమందు ఆయన కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార సరళిని నాలుగు మాసాలు పాటు పరిశీలిద్దాం అని పార్టీ సమావేశంలో అన్నట్టు వార్త వచ్చింది. ఏమైనా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. కాంగ్రెస్‌పార్టీకి అధికారం కట్టబెట్టారు. మరోవైపు తాము గెలవడం పక్కనబెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడిరచేందుకు సర్వశక్తులూ ఒడ్డిన బీఆర్‌ఎస్‌కు ఓటర్లు తమదైన పాఠం నేర్పారు. ఫలితంగా బీజేపీకి చెందిన ముఖ్యనేతలు ఓటమి పాలైనప్పటికీ అసెంబ్లీలో బీజేపీ బలం రెట్టింపు కన్నా ఎక్కువయ్యింది. ఈ పరిణామం రాష్ట్ర ప్రజల చైతన్యానికి నిదర్శనం. అధికారమే పరమావధిగా భావించే వాళ్లకు చెంపపెట్టులా మారింది.

2023 తెలంగాణ ఎన్నికలు కొన్ని పార్టీల నాయకుల భ్రమలను పటాపంచలు చేశాయి. కమ్యూనిస్టులు తెలంగాణ గురించి, ఇక్కడి పోరాటాల గురించి మాట్లాడే హక్కు తమకు తప్ప వేరొకరికి ఉండదని గట్టిగా నమ్ముతారు. కానీ అది వట్టి భ్రమ అని ఈ ఎన్నికలలో ఓటర్లు తేల్చేశారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్న సీపీఐ తనకు కేటాయించిన ఒక్క స్థానం (కొత్తగూడెం) గెలుచుకుంది. 19 స్థానాలలో పోటీ చేసిన సీపీఎం ఒక్కచోట కూడా డిపాజిట్‌ దక్కించుకోలేకపోయింది. హిందూ వ్యతిరేక ముద్ర ప్రబలంగా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నాయకత్వంలో పోటీచేసిన బీఎస్పీ కూడా ఎక్కడా డిపాజిట్‌కు నోచుకోలేదు. అలాగే బీజేపీ ఇచ్చిన ఎనిమిది స్థానాలలోను జనసేన పార్టీ కంగు తినవలసి వచ్చింది. బీజేపీ బలహీన పడడం కాంగ్రెస్‌కు లాభించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలలో బీజేపీ తన బలాన్ని నిలుపుకోవడమో, పెంచుకోవడమో జరిగిందన్నది నిజం. లేకపోతే బీఆర్‌ఎస్‌ గౌరవ ప్రతిపక్ష స్థానం దక్కించుకుని ఉండేది కాదు. బీఆర్‌ఎస్‌ ప్రజాగ్రహం ఎంతటిది అంటే, కేవలం 11 మంది యాభయ్‌ శాతం ఓట్లతో గెలిచారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రమంతటా ఆసక్తికర చర్చ మొదలయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వాదన గెలిచింది? ఏ అంశం ప్రజల్లోకి బలంగా  వెళ్లింది? ఓటరు దేన్ని విశ్వసించాడు? దేనికి ప్రభావితుడయ్యాడు? అనే సందేహాలు అందరి మదినీ తొలుస్తున్నాయి. రాజకీయ పార్టీల విశ్లేషణ కూడా ఈ కోణంలోనే సాగుతోంది. అయితే, మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యామ్నాయమే అత్యావశ్యకమని ఓటర్లు భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పాలన కోరుతూ ప్రజలు తీర్పు ఇచ్చారు. ముఖ్యంగా యువ ఓటర్లు, కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్లు, నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇలా జనం మదిలో ఫిక్సయిన ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్‌ పార్టీ కొల్లగొట్టుకు పోయింది. పదేళ్లుగా కొనసాగిన బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న దాంతో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. ప్రధానంగా నిరుద్యోగులు, యువత మార్పునకు నాంది పలికారు. బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డింది. రైతుల, పింఛనర్ల ఓట్లను కాపాడుకోవడంలో బీఆర్‌ఎస్‌ గట్టి ప్రయత్నం చేసింది. కానీ, అర్బన్‌ ప్రాంతంలోని ఓటు బ్యాంక్‌ను మాత్రమే వాడుకోవడంలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. గ్రామీణ ప్రాంతంలో.. నిరుద్యోగ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు.

ఈసారి ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యమిచ్చే ప్రయత్నం చేశాయి. సంక్షేమ పథకాల హామీల్లో ప్రధాన  పార్టీలూ పోటీ పడ్డాయి. ఈ క్రమంలో సామాజిక సమీకరణలనూ తెర మీదకు తెచ్చాయి. ఇవి  ఓట్లు రాలుస్తాయని భావించాయి. అయితే ఈసారి ప్రజాక్షేత్రంలో పార్టీల ప్రచారం,  నినాదాలు ఒక స్థాయి వరకే పరిమితం కాలేదు. ఎన్నికల వేడి పెరిగే కొద్దీ కొత్త అంశాలను  అస్త్రాలుగా ఎంచుకున్నాయి. ఈవీఎంలు ఫలితాలు నిర్దేశించిన తర్వాత మాత్రం కొన్ని అంశాలే ఈసారి బలమైన ప్రభావం చూపాయనేది సుస్పష్టంగా అర్థమయ్యింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు తగ్గట్టే ఉన్నా కొన్ని నియోజకవర్గాలు, కొందరి ఫలితాలు మాత్రం ఊహించనివిగా మారాయి. కొందరు ఉద్దండులు ఓటమి పాలైతే, కొన్నిచోట్ల సామాన్యులు విజయం సాధించారు. కొందరైతే యథావిధిగా భారీ మెజార్టీ నమోదు చేశారు. 119 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాల్లో గెలుపొందింది. రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ 39 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 8 స్థానాలు కైవసం చేసుకుంటే మజ్లిస్‌ తన 7 స్థానాల్ని పదిలం చేసుకుంది. కాంగ్రెస్‌ పొత్తుతో సీపీఐ ఒక స్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ ఓటరు మార్పు కోరుకోవడంతో పదేళ్ల ఉద్యమపార్టీ పాలనకు బ్రేక్‌ పడిరది.

కుత్బుల్లాపూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి వివేకానంద్‌ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధిపై 85 వేల మెజార్టీతో గెలిచారు. తరువాత సిద్ధిపేట నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి హరీష్‌ రావు 82 వేల ఓట్లతో విజయం సాధించారు. కానీ ఇక్కడ గత ఎన్నికల కంటే ఆయన మెజారిటీ ఈసారి తగ్గిన వాస్తవాన్ని కూడా చూడాలి. ఇక మూడో స్థానంలో చాంద్రాయణ గుట్ట నుంచి ఎంఐఎం అభ్యర్ధి అక్బరుద్దీన్‌ ఒవైసీ 81 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కూకట్‌పల్లి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి  మాధవరం కృష్ణారావు 70 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఐదవ స్థానంలో ఎస్సీ రిజర్వ్డ్‌ నకిరేకల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధి వేముల వీరేశం 68 వేల ఓట్లతో గెలిచారు.

బీజేపీ హేమాహేమీలు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావులు ఓటమి పాలయ్యారు. జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లో అభ్యర్ధులు డిపాజిట్‌ కోల్పోయారు.  బీజేపీ హేమాహేమీలు ఓడినా… 8 స్థానాల్లో విజయం సాధించడం ఆ పార్టీకి ఉపశమనం ఇచ్చింది. అంతేకాదు.. బీజేపీ ఓట్ల శాతం కూడా గణనీయంగా పెరిగింది.

రెండు పర్యాయాలు పాలించిన బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌ అభివృద్ధి మంత్రంతో మూడోసారి అధికారమివ్వాలంటూ, హ్యాట్రిక్‌ విజయాన్ని అందించాలంటూ ఓటర్లను కోరింది. దీన్ని బలమైన నినాదంగా ఆ పార్టీ భావించింది. అటు.. కాంగ్రెస్‌ పార్టీ..‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది. ఒక్క అవకాశం ఇవ్వాలనే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థన.. బీఆర్‌ఎస్‌ నినాదం కన్నా ఎక్కువ ప్రభావం చూపినట్టు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సంప్రదాయ కాంగ్రెస్‌ నినాదాలకు విరుద్ధంగా అందరికీ అర్థమయ్యే భాషలో తీసుకెళ్లిన మార్పు కావాలనే నినాదం బలంగా పనిచేసిందంటున్నారు విశ్లేషకులు.

ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతం మినహా రాష్ట్రమంతటా బీఆర్‌ఎస్‌ ఈసారి ప్రతికూలతను చవి చూసింది. ఈ పరిణామం ఆ పార్టీ ముఖ్యనేతల్లో తీవ్ర కలకలం రేపింది. తిరుగులేదని భావించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీలతో పాగా వేసింది. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల్లో కొద్దిపాటి కొత్తదనాన్ని జొప్పించడం ఆ పార్టీకి కలిసివచ్చింది. మహిళలకు రూ. 2500, కౌలు రైతులు, రైతుకూలీలకు సహాయం కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో కనిపించిన కొత్త అంశాలు. ఇవి జనంలోకి బాగా చొచ్చుకెళ్లాయి. గ్రామీణ మహిళా ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టంగట్టడం చూస్తుంటే ఈ నినాదాలు ఆకట్టుకున్నాయనేది అర్థమవుతోంది.

ఇక, ఈసారి యువ ఓటర్లు, కొత్తగా ఓటుహక్కు పొందిన ఓటర్లు పోలింగ్‌కు పోటెత్తారు. ఓట్లేయడానికి బారులు తీరారు. అయితే, అధికార బీఆర్‌ఎస్‌కు కాకుండా.. గంపగుత్తగా కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఓటర్లు ఓట్లేశారు. ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్‌ హామీకి… జాబ్‌ క్యాలెండర్‌ను జోడిరచడం కూడా యువతలో మరింత నమ్మకాన్ని చేకూర్చింది. అధికార పార్టీ అవినీతి నినాదాన్ని బలంగా విన్పించే ప్రయత్నం చేసినా, బీఆర్‌ఎస్‌ బలమైన స్థానాలే కాదు.. కాంగ్రెస్‌ బలమైన స్థానాల్లోనూ  దీని ప్రభావం కనిపించలేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే అన్న రాజకీయ నినాదం కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీనివల్ల ప్రయోజనమూ పొందింది. కొన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్‌కు ఏకపక్షంగా మళ్లడం ఫలితాల్లో ఎన్నికల స్పష్టంగా కన్పిస్తోంది.

భారత రాష్ట్ర సమితి తన పదేళ్ల పాలనలో అభివృద్ధి అంటూ నినాదాన్ని తలకెత్తుకుంది. ఆ వాదననే నమ్ముకుంది. తాము రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలు.. కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టడం వంటి అంశాలనే ప్రచార ఆయుధంగా చేసుకుంది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌, పెన్షన్లను తమకే ప్రత్యేకమైనవిగా నినాదాలుగా మార్చింది. పాజిటివ్‌ మార్గంలోనే ఓటర్లను ప్రభావితం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసింది. ప్రతీ పథకంలోనూ మరింత పెంపును జోడిరచింది. ఇప్పుడు చెల్లిస్తున్న మొత్తాలను దశల వారీగా భారీగా పెంచుతామని ఎర వేసింది.

కానీ, రానురాను బీఆర్‌ఎస్‌ ప్రచార సరళి మార్చింది. పాజిటివ్‌ నుంచి కాంగ్రెస్‌పై విరుచుకుపడే నెగెటివ్‌ సరళిని ఎంచుకుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనించిన బీఆర్‌ఎస్‌ ఈ వ్యూహాన్ని అనివార్యంగా భావించింది. తమ ఎన్నికల ప్రసంగాల్లో సంక్షేమ పథకాల గురించి చెప్పడం మానేసి ప్రచార సరళిని మార్చేసింది. కాంగ్రెస్‌పైకి విమర్శల బాణం ఎక్కుపెట్టింది. మళ్లీ కాంగ్రెస్‌ వస్తే… కరెంట్‌ ఉండదు.. మత కలహాలు వస్తాయి… ముఖ్య మంత్రులు మారతారు… అభివృద్ధి కుంటు పడుతుందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్‌ దూకుడుకు ఈ వ్యూహం కళ్లెం వేస్తుందని భావించింది. కానీ, నెగెటివ్‌ ప్రచార సరళి అప్పటి వరకూ జరిగిన పాజిటివ్‌ ఓటింగ్‌ వేవ్‌ను డామినేట్‌ చేసిందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వల్ల నష్ట నివారణకు.. ముఖ్యమంత్రిగా తన వ్యక్తిగత ఇమేజ్‌తో ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్‌. కానీ, ప్రజాక్షేత్రాన్ని ఇవేవీ అందుకోలేకపోయాయి.

ఇక, భారతీయ జనతాపార్టీకి ఓట్లు, సీట్లూ రెండూ పెరిగాయి. ఒకరకంగా కింగ్‌మేకర్‌ పాత్ర పోషించే అవకాశం వస్తుందని భావించినప్పటికీ.. ఆశించదగిన స్థాయిలోనే సీట్లు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాల ప్రచారమే బీజేపీకి కలిసివచ్చిందంటున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా ఉన్నప్పటికీ.. ఓటర్లు ఈసారి బీజేపీకి భారీగానే ఓట్లు వేశారు. ఏడాది క్రితం ఊహించని స్థాయిలో ఊపు పెంచిన బీజేపీ ఎన్నికల సమయంలో కాస్త తగ్గినట్లు అయ్యింది. కానీ, ఆశా జనకమైన ఫలితాలనే అందుకుంది. ప్రధానంగా తాము అధికారంలోకి వస్తే బీసీలకే పెద్దపీట వేస్తామని బీజేపీ చెప్పింది. అంతేకాదు.. బీసీ నాయకు డినే ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించింది. జాతీయస్థాయి నేతలు కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగానే తీసుకెళ్లారు. అయితే, బీసీలుగా చెప్పుకునే బలమైన నేతలు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌ ఓటమి పాలయ్యారు.

అటు.. జాతీయస్థాయిలో చూస్తే.. ప్రధానంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఈశాన్య రాష్ట్రం మిజోరంను మినహాయిస్తే.. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో  కాంగ్రెస్‌ పార్టీ బోల్తాపడిరది. ఒక్క తెలంగాణలో మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ పార్టీకి కలిసివచ్చింది. అక్కడ భారతీయ జనతాపార్టీ ప్రభంజనం కనిపించింది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సంబరం

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారి గాంధీభవన్‌ పరిసరాలు కళకళలాడాయి. గత పదేళ్లుగా జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎప్పుడు ఎన్నికల ఫలితాలు  వచ్చినా గాంధీభవన్‌ బోసిపోతూ కనిపించేది. కానీ, ఇప్పుడు దానికి భిన్నంగా గాంధీభవన్‌లో హడావుడి నెలకొంది. ఫలితాలు అనుకూలంగా రావటంతో పార్టీ శ్రేణులు గాంధీభవన్‌ బాట పట్టాయి. నృత్యాలు చేస్తూ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనూ కేడర్‌ సంబురాలు చేసుకుంది.


ఉప ఎన్నిక తప్పించిన జెయింట్‌ కిల్లర్‌

అన్నింటికంటే ముఖ్య పరిణామం కామారెడ్డి నియోజకవవర్గం. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేవంత్‌ రెడ్డి ఇద్దరినీ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడిరచారు. వాళ్లిద్దరూ ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులు. వాళ్లిద్దరిపై కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనూహ్యవిజయం సాధించి జెయింట్‌ కిల్లర్‌గా నిలిచారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది… అనునిత్యం జనానికి అందుబాటులో ఉండే వెంకటరమణారెడ్డికి నియోజకవర్గంలో బలమైన కేడర్‌ ఉంది. ఆయనకు సేవాగుణం, స్థానికుడు అన్న సెంటిమెంట్‌ కలిసి వచ్చి, రెండు దిగ్గజాలను ఓడిరచారు. ఆయన్ని అభిమానంతో గెలిపించుకున్న కామారెడ్డి ఓటర్లు ఉపఎన్నిక అవసరాన్ని తప్పించారు.

ఇటు కేసీఆర్‌.. అటు రేవంత్‌ రెడ్డి .. కామారెడ్డి నియోజకవర్గానికి ఇద్దరూ కొత్త అభ్యర్థులే … పోటీ వీరిద్దరి మధ్యేనని అనుకున్నారంతా… ప్రచారమంతా వీరి చుట్టూనే సాగింది … కౌంటింగ్‌ సగం పూర్తయ్యే దాకా కూడా వారి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. అయితే ఉన్నట్టుండి ఆ ఇద్దరు దిగ్గజాల్ని వెనక్కి నెట్టి లీడ్‌లోకి వచ్చారు బీజేపీ అభ్యర్ధి. ఆ ఆధిక్యాన్ని చివరిదాకా నిలుపుకున్నారు. వారిపై విజయం సాధించి జెయింట్‌ కిల్లర్‌లా అవతరించారు. ఎవరూ ఊహించని రీతిలో కామారెడ్డిపై బీజేపీ జెండా ఎగరేశారు.

ఐదేండ్లుగా ప్రజల్లోనే ఉన్న వెంకట రమణారెడ్డి నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ వచ్చారు. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా నిరుడు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. మాస్టర్‌ ప్లాన్‌తో మున్సిపాలిటీలో విలీనమైన 9 గ్రామాల రైతులు నష్టపోతారని వ్యతిరేకించారు. విలువైన భూములను గ్రీన్‌ జోన్‌గా, ఇండస్ట్రీయల్‌ జోన్‌గా ప్రకటించడం, అవసరం లేని ఏరియాల్లో 100  ఫీట్ల రోడ్లకు ప్రతిపాదనలు వంటి వాటిని మాస్టర్‌ ప్లాన్‌లో పేర్కొనడంపై రైతుల్లో చైతన్యం తెచ్చి వారి పక్షాన ఉద్యమం నడిపారు. నెలరోజుల పాటు వివిధ రూపాల్లో సాగిన ఉద్యమం ఇతర ప్రతిపక్షాలను కదిలించింది పరిస్థితులు చేజారుతున్నాయని భావించిన ప్రభుత్వం దిగి వచ్చి మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు మున్సిపాలిటీలో తీర్మానం చేయించింది. అలా వెంకటరమణారెడ్డి రైతు జనానికి ఆప్తులయ్యారు.

డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ బకాయిలపైనా వెంకటరమణారెడ్డి పోరాటం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మహిళలతో కలిసి వరుసగా ఆయన ఆందోళనలు చేశారు. దాంతో డ్వాక్రా మహిళలకు సంబంధించి పావలా వడ్డీ బకాయిలపై కొంత ఫండ్స్‌ను సర్కారు విడుదల చేసింది. అంతకుముందు 2018లో కూడా డ్వాక్రా మహిళలపై పావలా వడ్డీ బకాయిలపై వెంకటరమణారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తన పోరాటాలతో మహిళలకు అన్న అయ్యారు.

ధరణితో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెంకటరమణారెడ్డి నాలుగు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. కామారెడ్డి టౌన్‌, నియోజకవర్గంలోని గ్రామాల్లో భూకబ్జాలు, ఆక్రమణలు, రియల్‌ ఎస్టేట్‌లో స్కీమ్‌ల పేరిట మోసాలపై ఆందోళనలు నిర్వహించారు. ప్రజా దర్బార్‌ చేపట్టి, పలువురు బాధితులకు మేలు జరిగేలా చేశారు. కామారెడ్డి టౌన్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్లను పంచాలంటూ ధర్ణాలు చేశారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందిస్తానని, ఆఫీసర్లు నిర్భయంగా తమ పని చేసుకోవచ్చని, వ్యాపారులు తమ బిజినెస్‌లు ఎలాంటి చందాలు ఇవ్వకుండా, ఎవరికీ భయకుండా చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు.

గతంలో కాంగ్రెస్‌ నుంచి జడ్పీ చైర్మన్‌గా మూడేండ్లు పదవిలో కొనసాగిన ఆయన అప్పుడు తీసుకున్న నిర్ణయాలు వివిధ వర్గాలను దగ్గర చేశాయి. టీచర్ల బదిలీలు, ఇసుక క్వారీలు, వైన్‌ షాపుల్లో అధిక రేట్లు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుని, పకడ్బందీగా అమలు చేయించారు. ఆ క్రమంలో గజ్వేల్‌తో పాటు, కామారెడ్డిలోనూ పోటీ చేస్తానని కేసీఆర్‌ అనూహ్యంగా ప్రకటించారు. దీంతో గజ్వేల్‌లో అభివృద్ధి పేరిట జరిగిన విధ్వంసం, రైతుల కష్టాలు, పునరావాసం లేక భూ నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా కామారెడ్డి ప్రజలకు చూపిస్తానంటూ ‘చలో గజ్వేల్‌’ ప్రోగ్రామ్‌ను వెంకటరమణారెడ్డి చేపట్టారు. అప్పుడు పోలీసులు ఆయనను ముందస్తు అరెస్టు చేయడం ప్రజల్లో సానుభూతి పెంచింది.

ఉప ఎన్నికను తప్పించిన కామారెడ్డి ఓటర్లు :

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ చివరి నిమిషంలో ఇక్కడ రేవంత్‌ రెడ్డిని పోటీలో దింపింది. అయినప్పటికీ వెంకటరమణారెడ్డి వెనకడుగు వేయలేదు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేశారు. కేసీఆర్‌, రేవంత్‌ నాన్‌లోకల్స్‌ అని, వారిలో ఎవరు గెలిచినా మళ్లీ వారిని కలవాలంటే మధ్యవర్తుల ద్వారా వెళ్లాల్సి ఉంటుందని, ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంటుందని వివరిస్తూ జనంలోకి వెళ్లారు.  కేసీఆర్‌  ఇక్కడి భూములపై కన్నేసి పోటీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు స్థానికుడైన తననే గెలిపించాలని కోరారు. దీంతో నియోజకవర్గంలో అప్పటికే ఎంతో గుడ్‌విల్‌ పెంచుకున్న వెంకటరమణారెడ్డికే ఓటర్లు పట్టంకట్టి ఉప ఎన్నికను తప్పించారు.

——————————————————

తెలంగాణ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేవంతరెడ్డిని ఓడిరచి తెలంగాణలో చరిత్ర సృష్టించి, మార్పు తీసుకురావడానికి కావలసిందల్లా కొంచెం ధైర్యం, ఆత్మవిశ్వాసం అని ప్రపంచానికి రుజువు చేశారు. నిశ్శబ్దంగా కష్టించి పని చేసి, కామారెడ్డి అసెంబ్లీలో ఎన్నికల యుద్ధంలో గెలిచిన మన బీజేపీి అభ్యర్ధి శ్రీకాటిపల్లి వెంకటరమణను ప్రెజెంట్‌ చేస్తున్నాను. నమస్కారాన్ని అందుకోండి రెడ్డిగారూ…

– ఖుష్బూ సుందర్‌, నటి, బీజేపీ నాయకురాలు

–  సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE