‌భారతీయ నారినేను

భాగ్య సుధాధారను

లలిత నవోషస్సు వోలె విలసిల్లిన బాలను

కాలచక్ర గమనములో

వేవేగము సాగిపోతి

నాగరక పథమ్మది యని

సాగిపోతి నెచ్చటికో

గగనాంగణ యొక్క మహత్‌

‌కాంతి కలితమై వెలిగెను

అవనీ స్థలి నవ చైత

న్యాంకితమై విలసిల్లెను

భారతీయ భావి భాగ్య

భానుదీప్తినైతి నేను

భారతీయ నారి నేను

భాగ్యసుధా ధారను..’

ఆ నారి – సుచేత, పుణె (మహారాష్ట్ర) ప్రాంతీయ. ఆసియా ఖండంలోనే ఎంతో పెద్దదైన గోబీ ఎడారిని ఫలప్రదంగా దాటిన సాహస మహిళామణి. ఎడారిలో సాహసయానం సాగించిన ప్రథమ భారతీయగా రికార్డు సృష్టించారు.

చేతనే అంటే చైతన్యం, పరిజ్ఞానం, సూక్ష్మ దర్శనం. మన దేశ సాహసికురాలు సుచేతా కడేత్కర్‌లో మరో ప్రత్యేకతా ఉంది. మిన్ను విరిగి మీద పడినా చెక్కు చెదరనంత అత్యంత దృఢమైన పట్టుదల.

స్వస్థలమైన పుణెనగరం చరిత్ర ప్రసిద్ధం. పలు శాస్త్రాల, కళల ప్రవీణులు జన్మించిన ప్రదేశం. గాంధీ చిత్రంలో కస్తూరీ బాగా నటనలో జీవించిన రోహిణీ హట్టంగడిది ఆ ప్రాంతమే. విఖ్యాత హిందుస్థానీ గాయనీ లలామ ప్రభాఆత్రేదీ ఆ ప్రదేశమే. పాశ్చాత్య వైద్యంలో పట్టా సాధించిన మొదటి భారతీయ వైద్యురాలు ఆనందీబాయిది కూడా అదే పుణె నగరం. ఆ రాష్ట్రం మొత్తం మీద రెండో పెద్ద ప్రాంతమూ అదే. ప్రధానంగా మరాఠీయుల సాంస్కృతిక రాజధాని, సంస్కృతితో పాటు విద్యారంగంలోనూ సాటిలేని మేటి.

అంతటి పేరొందిన ప్రాంతాన పుట్టిన సుచేతకు చిన్నప్పటి ‘ఎడారి ప్రాంతంలో సాహసయాత్ర’ చేయాలన్న ప్రత్యేక అభిలాష ఉండేది. అది అమెతో పాటు అదీ పెరుగుతూ వచ్చింది.

ఎక్కడా నీటిచుక్క ఉండదు. చెట్టూ చేమా అసలే కనిపించవు. ఉండేదంతా ఇసుక. భూభాగం అంతా. అదే! ఇసుకతిన్నెల ఎడారులు కొన్ని. మంచు నిండిన ఎడారి ప్రదేశాలు మరికొన్ని.

ఇసుక ఎడారుల్లో ముందుగా చెప్పాల్సిన పేరు – సహారా. ఆఫ్రికా ప్రాంతంలోనిది. అక్కడంతా నిస్సార నేల, ఎటు చూస్తే అటు పరుచుకున్న పొడి వాతావరణం. మనుగడ అనేది ఎవరికైనా అక్కడ క్లిష్టతరం. ‘గ్రేట్‌ ఇం‌డియన్‌ ‌డెసర్ట్’‌గా పేరున్న థార్‌ ‌గురించీ మనకు తెలిసిందే. నాలుగైదు రాష్ట్రాలకు విస్తరించి ఉందది. ఇప్పుడు మనం తెలుసు కోవాల్సింది గోబీ ఎడారి గురించి!

పేరు మాదిరే గోబీ…. తీరు విలక్షణంగా ఉంటుంది. గోబీ పర్యావరణమే విభిన్నం. చలి భయంకరం. ఎండాకాలంలో ఎండలు భగ్గుమంటుం టాయి. జనవరి నెలలో పరిస్థితి ఊహాతీతం. సమస్తం చిత్తడి నేల. వర్షం అన్న మాటే ఉండదక్కడ. కఠినాతికఠినంగా ఉండే భూభాగం. ఇసుక తుఫానులు పరిపాటి. జనసాంద్రతను వేరే చెప్పాలా? చాలా చాలా తక్కువ. అందునా మంగోలియా దేశం కదా అది! నాలుగోవంతుపైగా ఎడారే! వేలాది కిలోమీటర్ల విస్తీర్ణం. వైరుధ్య జీవనశైలి. ఆ దిబ్బల్లో ప్రయాణించడం ఎవరి ప్రాణాలతో వారు చెలగాటం ఆడుకోవడమే. అదిగో… అటువంటిచోట పయనించారు సుచేత.

ఎడారి అన్వేషణ లక్ష్యంగా ఉన్న తాను ముందుగా డెవన్‌పోర్ట్‌ను సంప్రదించారు ఐర్లండ్‌వాసి. ఆ సాహసి నుంచీ సుచేత ఎంతో కఠినతర శిక్షణానుభవం గడించారు.

మొత్తం పదహారు వందల కిలోమీటర్లకు పైగా దూరం. ఆ దూరాన్ని రెండు నెలల్లో అధిగమించా లన్నది లక్ష్యం కాగా,పదిరోజుల ముందుగానే లక్ష్యం చేరుకున్నారు. 13 మంది సభ్యుల బృందం. మార్గ మాధ్యంలో కొంతమంది అనారోగ్య పీడితులౌ, ఆ దారి నుంచి వైదొలగి తిరిగి వెళ్లిపోయారు. ఇంకొంతమంది గాయాలబారిన పడి తల్లడిల్లుతూ, యాత్ర మధ్యలోనే వెనక్కి మళ్లారు. సుచేత మాత్రం ధీరనారీమణిగా ముందుకే కొనసాగారు. గోబీ ఎడారిని జయప్రదంగా దాటగలిగారు. ఆ తర్వాత పత్రికలవారితో మాట్లాడుతూ…

‘నడవటం / ప్రయాణించడమంటే ప్రాణాలకు తెగించడమే! సాహసం అనేది అక్కడి పరిస్థితుల్లో చిన్న మాట. మహా పరాక్రమం అనే చెప్పాలి. తెగువ అనంతంగా ఉంటే తప్ప, ఆ యాత్ర చేయలేం. మా బృందం కొంగోరీన్‌ ఉత్తర ప్రాంతం నుంచి బయల్దే రింది. ఇంతా అంతా అసలేనంత గట్టి పట్టుదలత ముందుకు సాగాను నేను. రోజూ సగటున పాతిక కిలోమీటర్లకు పైగా నడక. పగలేమో ఎండ మండు తుండేది. రాత్రిళ్లు తీవ్రత చంపేసేది.గోబీలో ఇసుక తుపానులు సరేసరి. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చిపడతాయో ఎవరికీ తెలియదు.’

విలేకరి : అన్ని అడ్డంకులున్న మాట!

సుచేత : అన్నీ అడ్డంకులే. ఏ మాత్రం అదరలేదు, వెరవలేదు, బెదురన్నది అసలే లేదు. అన్నింటినీ తట్టుకున్నాం. మా గురు (డెవన్‌పోర్ట్) ఇచ్చిన ముందస్తు ప్రత్యేక శిక్షణ ఎన్నో విధాలుగా ఉపయోగ పడింది.అనారోగ్య పీడ నాకూ తప్ప లేదు. త్వరగా తేరుకున్నానంటే, అందుకు మా బృంద బలమే కారణం. ధైర్య సాహసాలతో ఏదైనా సాధించగలం కదా.

(ఇప్పుడు ఆమె వయసు యాభైకి అయిదేళ్లలోపే. సాహసయాత్ర చేసినప్పుడు మూడున్నర దశాబ్దాల ప్రాయం. ఇప్పటికీ మనకు అనిపించేదేమిటంటే….

మూర్తి దాల్చిన పౌరుషమో! అఖండ

మైన ఆత్మవిశ్వాస మహానదమ్మొ

సాహసోత్సాహ సత్య తేజస్సు నీవు!

విశ్వసౌభాత్రి, భారత వీరపుత్రి!)

సాహసిక యాత్ర చేపట్టిన సంవత్సరం 2011. ఇప్పటికి పుష్కరం. సుచేతకు మరో ప్రధాన ఆశయముంది. భూటాన్‌ ‌ప్రాంతం మొదలు పాకిస్థాన్‌ ‌ప్రదేశం వరకు విస్తృతి చెంది ఉన్న హిమాలయాలను అధిగమించడం! మన దేశంతో పాటు పాకిస్థాన్‌, ‌చైనా, నేపా తదితర దేశాల భౌగోళిక విస్తారంతో ముడివడి ఉంది హిమాలయం. ట్రెక్కింగ్‌కి ప్రసిద్ధి చెందింది. ఖుంబు ప్రదేశం. ఎవరెస్ట్‌కు నైరుతి దిశలో ఇక్కడ కనిపిస్తుంటుంది. పర్వత ఆరోహణకు అనువైన కాలం ఏప్రిల్‌కి ముందు, లేదా అక్టోబర్‌ ‌తర్వాత. రుతుపవనాల స్థితిని అనుసరించి ఇది ఉంటుంది. అస్థిర వర్షపాతం, వరదల బెడద, ఉష్ణోగ్రతల పెరుగుదల, తరచుగా కొండ చరియలు విరిగిపడు తుండటం – పర్వత ఆరోహకులకు మరెన్నో సమస్యలు. అవన్నీ సాహస యాత్రికుల మీద ప్రభావం చూపుతూనే ఉంటాయి. వాతావరణ మార్పు చేర్పులను సమర్థంగా తట్టుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రయాణం కొనసాగించాల్సి ఉంది. గాయాలు/ వ్యాధులు పట్టి పీడిస్తున్నా జంక కుండా ముందుకే అడుగులు చేవేయాల్సిన అవసరముంది. సమస్తం కార్యాచరణ ప్రణాళిక అమలుపైనే ఆధారపడి ఉంటుంది.

వీటన్నింటి నేపథ్యంలో సుచేత లక్ష్య సాధన సంక్లిష్టమే అయినా, ఆమె ఉడుం పట్టు అంతకంటే చాలాచాలా గొప్పది. ఉత్సాహాన్ని సొంతం చేసుకోవడంలో ఆమె సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ‘గోయింగ్‌ ఈస్ట్’‌లో తన సాహసిక ప్రవృత్తి నేటికీ ఎందరెందరినో ప్రభావతిం చేస్తూనే వస్తోంది. తాను యోగా ఉపధ్యాయిని. ఆ శాస్త్రంలో మాస్టర్స్ ‌డిగ్రీ చేసినవారు. మాతృభాషతో పాటు సంస్కృతంలోనూ నిపుణురాలు. సాహసక్రీడలంటే అనురక్తి. బ్రహ్మముహూర్త సాధన వంటి మేటి పక్రియల్లో ఆరితేరిన పడతి.

మరింత విభిన్నత ఏమిటంటే – ఆమె పుణెలోనే చరిత్ర పీజీ చేశారు. పత్రికారంగంలోనూ కొంతకాలం విధులు నిర్వర్తించారు. ఐటీ ప్రొఫెషనల్‌గా కూడా ఉద్యోగ బాధ్యత వహించారు. సాహసయాత్రలో భాగంగా ట్రెక్కింగ్‌, ‌సైక్లింగ్‌, ‌నదీ ప్రాంతాలు దాటడం,ఎడారి నడకల మీద ఎంతెంతో మక్కువ పెంచుక్నురు. 2008 లోనే మౌంట్‌ ఎవరెస్ట్ ‌బేస్‌ ‌క్యాంప్‌ ‌శిక్షణ అందుకున్నారు సుచేత కడేత్కర్‌. ‌సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో సైతం ట్రెక్కింగ్‌ ‌కొనసాగించారామె.

యాత్ర సందర్భాల్లో పలు ఊహించని పరిణామాలు. ఒకసారి ఫ్లూ వ్యాధి దాపురించింది. మరోసారి – తన లగేజీ మోస్తున్న ఒంటె దాడికి దిగింది. ఇంకో పర్యాయం – ఇసుక తుఫానులు మీద పడ్డాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆ అన్నింటినీ ఎదిరించి నిలిచారు. అందుకే పురస్కారాలెన్నో తనను వరించి వచ్చాయి. ప్రభుత్వం యువసాహసికురాలిగా గుర్తించి గౌరవించింది . లిమ్కా బుక్‌ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రికార్డుల్లో తన పేరు చోటు సంపాదించుకుంది. స్ఫూర్తిదాయక మహిళగా సంభావించి ఎన్నెన్నో సంస్థలు పురస్కార ప్రదానం చేశాయి వీటన్నిటినీ ప్రస్తావిస్తే, బదులుగా చిరునవ్వు చిందిస్తారు సుచేత. ఆ నవ్వులో సగర్వం, మహదానందం!

– జంధ్యాల శరత్‌బాబు

(సీనియర్‌ ‌జర్నలిస్ట్)

About Author

By editor

Twitter
YOUTUBE