దేశంలో విద్యావ్యస్థపై మార్క్సిస్టుల పట్టును బద్దలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. చరిత్ర రచన, బోధన విషయంలో మార్క్సిస్టులు దేశానికి చేసిన ద్రోహం క్షమార్హం కానిది. దీనిని సరిదిద్దడానికి మొత్తంగా విధానంలోనే మార్పులు తేవాలని సంకల్పించి ‘నూతన విద్యావిధానాన్ని’  తెచ్చింది. ఇందులో భాగంగా, పాఠ్యాంశాల ఎంపిక కోసం నియమించిన సంఘం రామాయణ, మహాభారతాలను పాఠ్యాంశాలుగా చేర్చాలంటూ చేసిన సూచన సమాజంలోని కొన్ని వర్గాలకు ఆనందాన్ని ఇచ్చింది. ఇంకొన్ని వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ముఖ్యంగా, మార్క్సిస్టులు, మైనార్ట్గీలకు ఇది మింగుడుపడడం లేదు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మొగలుల చరిత్రకు సంబంధించిన కొన్ని అధ్యాయాలను తొలిగించడంతో ఉదారవాదులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. విద్యను కాషాయీక రిస్తున్నారంటూ మళ్లీ పాత పాట అందుకున్నారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మదరసాలలో ఇస్లామిక్‌ విద్యను బోధించరాదంటూ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ఈ మతపరమైన గ్రంథాలను పాఠ్యాంశాలుగా ఎలా ప్రవేశపెడతారంటూ మైనార్టీవర్గాల ప్రతినిధులు వాదనకు దిగుతున్నారు. దీనంతటికీ కారణం, మన చరిత్రను రచించి, మనకు బోధించిన తీరే.

మన రాజుల విశిష్టత మనకు తెలియదు…

మనపై దండ యాత్రలు చేసి, పరమతాలను ఇక్కడకు తీసుకువచ్చి, బలవం తంగా స్థానిక ప్రజలపై రుద్దిన రాజులను గొప్పవారిగా చిత్రీకరించి దశాబ్దాలుగా మార్క్సిస్ట్‌ చరిత్రకారులు చరిత్రను వక్రీకరిస్తూ వచ్చారు. దాడులకు పాల్పడిన ఇస్లామిక్‌ రాజులు ఎంత గొప్పవారో, వారి పాలన ఎంత గొప్పగా ఉండేదో  రాయడమే తప్ప, తమను తాము హిందువులుగా అభివర్ణించుకొని, సనాతన ధర్మాన్ని సుదూర తీరాలకు వ్యాపింపచేస్తూ కొన్ని వందల ఏళ్ల కాలం పాలించిన  చోళులు, పాండ్యులు వంటి వారి చరిత్రకు తగిన ప్రాధాన్యతనివ్వకుండా మన గొప్పతనమేమిటో మనకు తెలియకుండా చేశారు. పాండ్య, చోళ, చేర, శాతవా హన, కుషాణు… ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వంశాలు భారతదేశాన్ని సనాతన ధర్మానికి అనుగుణంగానే పాలించాయి. వీరంతా రాముడినీ, కృష్ణుడినీ, వేదోపనిషత్తులను ఆదర్శంగా తీసుకుని పాలన చేసినవారే. రామాయణం వివిధ రూపాలలో ప్రపంచంలోని పలు దేశాలలో కనిపిస్తుంది. ఇస్లామిక్‌ దేశం, మహ మ్మద్‌ జన్మించిన ప్రాంతంగా పరిగణించే సౌదీ అరేబియా ఇటీవలి కాలంలో యోగను, రామాయణాన్ని తమ విద్యా విధానంలో భాగంగా చేసేందుకు చర్యలు తీసుకుంది. అంతటి గొప్పతనం కలిగిన ప్రాచీన చారిత్రిక గ్రంథాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలన్న సూచనకే వ్యతిరేకత ఎదురైంది.

మన గ్రంథాలలోనే శాస్త్రీయ ఆధారాలు…

నిజానికి రామాయణ, మహాభారత గ్రంథాల చారిత్రికత, కాలం, వాస్తవికత గురించి ఎన్నో, ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అవి చరిత్ర అని రుజువు చేసే ఆధారాలు లభ్యమవుతున్నా, ‘మెకాలే పుత్రులు’ మాత్రం దానిని చరిత్రగా అంగీకరించేందుకు ససేమిరా అంటున్నారు. కనుక, ఈ క్రమంలో వీటికి సంబంధిం చిన పరిశోధనలను పరిశీలిస్తే మనకు కూడా కొన్ని సందేహాలు తీరిపోతాయి `

రాజ్యం, సమాజం, కుటుంబం… అందులో వ్యక్తి బాధ్యతలు, పోషించవలసిన పాత్రలు, అనుసరించ వలసిన విలువలు సహా జీవితానికి సంబంధించిన అనేక అంశాలను స్పృశిస్తూ, నాటి చరిత్రను నమోదు చేస్తూ రామాయణ, భారత గ్రం థాలను రచించారన్నది వాస్తవం. ముఖ్యంగా, ఇవి చరిత్రే అని చెప్పటానికి అందులోనే అనేక ఆధారాలు మనకు కనిపిస్తాయి. అందులో అత్యంత ముఖ్యమైనది ‘కాల గణన’… ప్రతి ముఖ్యమైన ఘట్టంలోనూ దాని తిథి, వార, నక్షత్రాలను, గ్రహణాల వంటి ఘటనలను కూడా ఈ గ్రంథాలలో పేర్కొనడంతో, అనేకమంది శాస్త్రవేత్తలు వీటి ఆధారంగానూ, అందులో వర్ణించిన ఖగోళ దృగ్విషయాల ఆధారంగానూ ఈ చరిత్ర ఏ కాలం నాటిదో నిర్ణయిస్తున్నారు.  నిజానికి మనం నేడు చూసే ఆకాశం, నక్షత్రాల దిక్కులు, స్థితి 9000 ఏళ్ల కింద ప్రాచీనులు చూసినదానికన్నా భిన్నమైంది. దీనిని ఆయనాంశం (ప్రెసెషన్‌) అంటారు, దీనిని అన్నిరకాల గణనల్లో కారకం చేయవలసి ఉంటుంది. పొరపాట్ల సంభావ్యతను తగ్గించేందుకు, ఖగోళశాస్త్రం సహా (అయోధ్యలో నాడు ఎన్ని గ్రహణాలు చోటు చేసుకున్నాయి) వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ధారణ చేస్తున్నారు.  ఇది కేవలం సాధారణ చరిత్రకారులు చేస్తున్న పని కాదు, ప్రతిదానికీ ఆధారాన్ని కోరే శాస్త్రవేత్తలు చేస్తున్న పని కావడంతో దానిని ఆమోదించవలసిందే.

అంతర్జాతీయ శాస్త్రవేత్తల జన్యు పరిశోధన

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో నివసించే గిరిజన తెగ రామసేవక్‌ కోల్‌ అన్నది దేశంలోనే అత్యంత ప్రాచీన తెగ. రామాయణంలో వర్ణించిన గుహుడనే రాజు సంతతే వీరని జన్యుపరమైన అధ్యయనాలు రుజువు చేశాయి. జన్యుశాస్త్రవేత్తలు, మానవశాస్త్రవేత్త, పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు 10,000 ఏళ్ళ కిందటి ఘటనలు, పాత్రలను క్రోడీకరిస్తూ వాల్మీకి మహర్షి చేసిన రచన కాల్పనికమైంది కాదని తేల్చేశారు. ఈ పాత్రల వెనుక ఉన్న రహస్యాన్ని ఎస్టోనియాకు చెందిన ఎస్టోనియన్‌ బయోసెంటర్‌లో ఆగ్ర జన్యుశాస్త్రవేత్త డా॥ గ్యానేశ్వర్‌ చౌబే నేతృత్వంలోని బృందం ఛేదించింది. మూడేళ్లు సాగిన ఈ పరిశోధనలో హైదరాబాదుకు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ,  ఢల్లీి యూనివర్సిటీ, ఖరగ్‌పూర్‌కు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ ఆన్‌ వేదాస్‌లు కూడా పాలుపంచు కుని, ఆధునిక పాలకులు షెడ్యుల్డు తెగలుగా వర్గీక రించిన భిల్లులు, గోండ్లు, కోలులు రామాయణంలో కనిపించే ఒక పాత్రకు నిజమైన వారసులని తెలుసుకున్నారు.

శాస్త్రవేత్తలు ఒక ప్రతిపాదన చేస్తూ పత్రాన్ని రచించినప్పుడు దానిని తోటి శాస్త్రవేత్తలు సమీక్షించిన (పీర్‌ రివ్యూ) తర్వాతే దానికి విశ్వసనీయత ఏర్పడు తుంది. ఆ రకంగా, ఈ బృందం రచించిన పత్రాన్ని సమీక్షించిన తర్వాత దీనిని విశ్వసనీ యత కలిగిన శాస్త్రీయ పోర్టల్‌ పయోస్‌ వన్‌ (ూశ్రీూూ ూచీజు)లో ప్రచురించారు. రామ, లక్ష్మణ, సీతలు గంగానదిని దాటేందుకు తోడ్పడిన నిషాద రాజు గుహుడే మీర్జాపూర్‌, వారణాసి, బందా, అలహబాద్‌లలో నివసించే కోలుల మూల పురుషుడని జన్యుపరమైన అధ్యయనాల ద్వారా నిరూపించారు. యుపి,  ఎంపి, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌వ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజనులే రాముడు, ఆయన సమకా లీనుల వారసులంటూ, డా॥ చౌబే  ది పయోనీర్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సమూహాలు లేక తెగలు దాదాపు 10వేల ఏళ్ల కింద నుంచి జన్యు పరమైన కొనసాగింపును నిర్వహిస్తూ వచ్చాయని తమ అధ్యయనాలు రుజువు చేశాయంటూ డా॥ చౌబే, ఢల్లీి యూనివర్సిటీకి చెందిన మానవశాస్త్రవేత్త ప్రొ॥ విఆర్‌ రావ్‌ వెల్లడిరచి, ఒకరకంగా ఆర్యుల దాడి సిద్ధాంతానికి ముగింపు వాక్యం పలికారు. బయిట నుంచి వచ్చి కలిసిన జన్యు లక్షణాలు ఏవీ ఈ తెగలలో కనిపించవంటూ వైదిక, రామాయణ అధ్యయనాలలో నిపుణులైన సరోజ్‌ బాలా (గ్రహ స్థితిగతుల ఆధారంగా రాముడి పుట్టిన తేదీని గణించడంతో ప్రాచుర్యం పొందిన) తెలిపారు. ఇలా కేవలం ఒక్క రామాయణానికి సంబంధించిన పరిశోధనలే కాదు, మహాభారతానికి సంబంధించి కూడా చేస్తూ, అది కూడా ప్రాచీన చరిత్రలో భాగమేనని రుజువు చేస్తూ వస్తున్నారు.

రామాయణ, భారతాలు, చరిత్ర అంటే వివాదమెందుకు?

ఇందుకు కారణం మన వలసవాద చైతన్యం లేదా స్పృహే అని చెప్పాలి. వలసవాదులు మనను  పాలిస్తున్న సమయంలోనూ, తర్వాత కూడా మన మేధో పరమైన చట్రాన్ని పూర్తిగా, శాశ్వతంగా మార్చివేసి మనను వదిలివెళ్లడంతో, మన సంస్కృతి, చరిత్ర గురించి వారు చెప్పిందే వాస్తవమనే భావనకు లోనవు తుంటాం. అంతేనా, దేశీయంగా మన సంస్కృతికి సంబంధించిన కథనాలను అభివృద్ధి చేసేటప్పుడు కూడా వారి దృక్పధం నుంచే ప్రతి విషయాన్నీ అంచనా వేస్తుంటాం. అందుకే, రొమిల్లా థాపర్‌ వంటి చరిత్రకారులు ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని సమర్ధిస్తూ, రామాయణాన్ని తక్కువ చేసి చూపారు.

వలసవాదులు భారతదేశాన్ని వదిలివెళ్లిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా పలు తరాలు ఈ దేశానికి సంబంధించిన వాస్తవ చరిత్ర ఏమిటన్నది తెలుసుకోలేకపోయాయి. రాముడిని, కృష్ణుడిని పూర్తిగా దేవుళ్లుగా భావించి వారిని పూజించడం తప్ప  ఆ పాత్రల చారిత్రిక ప్రాధాన్యం చూడలేకపోయాం. ఈ గ్రంథాలన్నీ కూడా మత పరిధిలోకి రావడం, వలసవాద కోణమే ప్రధానంగా ఉన్న పాఠ్యాంశాలను యువత చదవడంతో, వాటిలో ఉన్న భిన్న కోణాలను చూడటంలో విఫలమైంది. ముఖ్యంగా సనాతనమంటే మతమనే భావన పాశ్చా త్యులు ప్రచారం చేయడంతో మనం కూడా అదే భావనలో చిక్కుకున్నాం. మనది సనాతన ధర్మం, ధర్మమంటే ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడం తప్ప మరొకటి కాదు. కుల, వర్గ, మత బేధం లేకుండా అందరూ గౌరవించి, అనుసరించ వలసిన వైశ్విక స్థాయి అచారం లేదా నీతే ధర్మం. ఇదే ఈ రెండు గ్రంథాలలోనూ అంతర్లీనంగా ప్రవహించే సూత్రం.

సామాజిక, రాజకీయ, వ్యక్తిత్వ వికాసపరమైన అంశాలు రామాయణ, భారతాలలో పుష్కలంగా కనిపిస్తాయి. ఆదర్శపాలకుడు, నీతి నియమాలకు ప్రాధాన్యమిచ్చిన సమాజం మనకు త్రేతాయుగంలో కనిపిస్తే, మానవ వ్యక్తిత్వం, బలహీనతలు, యుద్ధ తంత్రం, చతురత, అంతిమంగా ధర్మానికే విజయం వంటి విషయాలన్నీ ద్వాపరయుగంలో కనిపిస్తాయి. ఈ రెండు యుగాలలోనూ ధర్మానిదే ప్రాధాన్యం. రాచరికం, పాలన, యుద్ధాలు, తంత్రాలు ఒక ఎత్తు అయితే, వ్యక్తిత్వాన్ని వికసింపచేసే భగవద్గీత దీనికి తలమానికం.

మనకన్నా పాశ్చాత్యులే మన జ్ఞానఖనిని ఎక్కువగా గుర్తించి, ఉపయోగించుకుంటున్నారన్న విషయం కొత్తదేం కాదు. వేదాలు జర్మనీ చేరి, అక్కడ అనువాదితమై వారి జ్ఞానఖనిగా మారాయి. ఉదారవాదులు దీనిని అంగీకరించరు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సంస్కృత పండితులను వారు ఎందుకు రప్పించుకున్నారో చెప్పరు. విద్యారంగం, చరిత్రపై మార్క్సిస్టులు పట్టు బిగించిన నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన ఏ వాదనను వారు ఎదగనివ్వలేదు. దీనిని భారతీయులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో భగవద్గీత, కౌటిల్యుని అర్థశాస్త్రం సహా మన గ్రంథాలను బోధస్తుండగా, ఇక్కడ మాత్రం వాటిని పెరటిమొక్కలుగానే  పరిగణిస్తున్నారు.

పాశ్చాత్య విలువల కారణంగా, నేడు ఆ సమాజాలలో ఏం జరుగుతున్నదో గమనించిన ప్రభుత్వం ప్రస్తుత, భవిష్యత్తు తరాలను కాపాడేందుకు సనాతన ధర్మ విలువలను విద్యలో ప్రవేశపెట్టాలను కుంటోంది. మనిషి జీవితంలో ప్రతి కోణాన్నీ ప్రభావితం చేస్తూ, ప్రతి అంశంలోనూ మార్గదర్శనం చేయగల సూత్రాలు మన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఉన్నాయి. పరమత సహనం  మొదలు, అతి సర్వత్ర వర్జయేత్‌, యతోధర్మః తతో జయః సహా ఎన్నో ధార్మిక అంశాలు మన జీవనవిధానంలో అంతర్లీనంగా ఉన్నప్పటికీ, వాటికి విలువనిచ్చి, ప్రాముఖ్యం తెలుసుకోవలసిన అవసరం నేటి తరానికి ఉన్నది.

సామాజిక సంబంధాలు, మానవ సంబంధాలూ నానాటికీ క్లిష్టంగా పరిణమిస్తూ, విలువను కోల్పోయి, ముందుగా వ్యక్తులకు, తర్వాత కుటుంబానికి, అంతిమంగా సమాజానికే ముప్పుగా పరిణమించే ప్రమాదం నుంచి భవిష్యత్‌ తరాలను తప్పించాలంటే వారికి సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలను, సరైన రీతిలో, సరైన నేపథ్యంలో బోధించడం అవసరం. ధర్మాచరణ, జ్ఞాన సముపార్జన, వివేకం, మంచి విషయాలతో అనుబంధం కలిగి ఉండటం అనేది నిస్సందేహంగా మనిషి ఆనందానికి కారణభూతమైనవనే మన గ్రంథాలు చెప్తాయి. ముఖ్యంగా, ఎదుటి మనిషిలో కూడా భగవంతుడిని చూడాలని, వ్యక్తి తనను తాను తెలుసుకోవాలని బోధించి, మార్గదర్శనం చేయడం ద్వారా నేడు విపరీతంగా, అరాచకంగా సమాజాన్ని సవాలు చేస్తున్న కుల, మత సమస్యలకు విరుగుడు లభ్యం అయ్యి, వసుధైవ కుటుంబక భావన ఆచరణలోకి వస్తుంది. ఇదే నిజమైన హైందవ… సనాతన సంస్కృతి!

డి. అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE