యవనదాస్యంలో మగ్గుతూ హిందూసమాజం నైతికమైన అథః పతనాన్ని చెందినప్పుడు సంత్‌ ‌శిరోమణి శ్రీ ఏకనాథ్‌ ‌వాల్మీకి రామాయణం ఆధారంగానే భావార్థ రామాయణాన్ని ప్రజల భాషలో రచించారు. పతనం చెందుతూన్న సమాజం  దశను మార్చడానికీ, ఆత్మ గౌరవయుతమైన జీవనాన్ని నిర్మించడానికి ఆయనకు రామాయణం తప్ప మరో ఉన్నతాదర్శం దొరకలేదు. పథభ్రష్టమైన సమాజ ఉద్ధరణ  చేయగలిగిన సాత్విక మార్గాన్ని చూపడానికి  గోస్వామి తులసీదాసు ఉత్తర భారతంలో సరిగా ఇట్టి ప్రయత్నమే  చేశారు. తులసీదాసు రచించిన  రామచరితమానసం వేదస్థాయికి చేరింది. రామచరితమానసమనే పునీతధార సకల కల్మషాలను కడిగివేసింది. దాని పుణ్య ప్రభావం వల్ల జాతీయ భావన నేటి వరకు జీవించగలిగి ఉంది. మహారాష్ట్రంలో సమర్థ రామదాస స్వామి కూడ వాల్మీకి రచన ఆధారంగా ధర్మప్రేమ, జాతీయత, స్వరాజ్య సంస్థాపనలతో కూడిన ఉదాత్తమైన ధ్యేయవాదాన్ని నిర్మించారు. ఏకపత్నీవ్రతుడు, కోదండధారి, కర్తవ్యపాలనలో అత్యుత్తమమైన ఆదర్శానికి ప్రతీకము, అమరవినాశకుడు, ధర్మసంస్థాపకుడు అయిన మర్యాదా పురుషోత్తముడు భగవాన్‌ ‌రామచంద్రుడు తప్ప అట్టి పతన స్థితిలో ఉన్న జాతీయ జీవనానికి మరో ఆలంబనం ఏది ఉండగలదు?

రాజారామ్‌, ‌శివాజీలలో శ్రీరాముని ఆదర్శం

కేవలం స్వరాజ్యాన్ని స్థాపించినంత మాత్రాన సమాజం ఆదర్శోన్ముఖం కాజాలదు. తపస్వత్వాన్ని గుర్తించే మహత్తరమైన జీవన దృష్టివల్ల ప్రభావితమైన, సూత్రబద్ధమైన రాష్ట్ర నిర్మాణం ద్వారానే అది సాధ్యమవుతుంది. రామరాజ్య ఆదర్శం రూపంలో అట్టి రాష్ట్రజీవనం ప్రాచీన భారతవర్షంలో నిర్మితమైంది. రామాయణం ఆ జీవనాన్ని చిత్రిస్తోంది. నేటికీ దానిలో ఆ శక్తి ఉన్నది.

రాజ్యంపై హక్కు అన్నగారిది కనుక రాజ్యాన్ని స్వీకరించకుండా అన్నగారి పాదుకలను భక్తితో పూజించిన రాజర్షి భరతుని ఉదాహరణ   మహారాష్ట్ర చరిత్రలో తిరిగి ప్రతిబింబించింది. బాల ఛత్రపతిని ఔరంగజేబు ఖైదు చేయగా సింహాసనంపై అతని హక్కును గౌరవించి, అతని తరపున రాజ్యం చేసిన ఛత్రపతి రాజారామ్‌ ఉదయించారు. స్త్రీలను అందరినీ మాతలుగా భావించిన ప్రభు రామచంద్రుని ఆదర్శం తిరిగి ఛత్రపతి శివాజీలో ప్రకటితమయింది. శత్రుపక్షం మహిళను మంగళ అలంకారాలతో సగౌరవంగా పంపించాడు  శివాజీ.

ఇలా రామయణం చేత ప్రభావితమై భారతీయ జీవనం ఉన్నతిని పొందింది. మానవులందరికీ ఒక దీప స్తంభంవలె మార్గదర్శకమయింది. ఈ సామర్థ్యం నిస్సంశయంగా రామాయణంలో నిహితమై ఉంది.

భారత్‌ ‌నేడు కూడ ప్రపంచానికి మార్గదర్శనం చేయగలదని నేటి మన నాయకులు చెబుతున్నారు. తమ శాస్త్రీయ పరిశోధనల ద్వారా సామర్థ్యాన్ని సంపాదించిన  ప్రపంచ దేశాలకు తమ స్త్రీల శీల సంరక్షణలను సైతం చేయలేనిదీ, తన బలహీనతల వల్ల పౌర జీవనం విధ్వంసమై సముద్రమేఖల అయిన తమ మాతృభూమిని పదవీ వ్యామోహానికి అహుతి చేసి భారతజాతి ఏమి ఇవ్వగలుగుతుంది? ఏ విషయంలో దారి చూపించగలుగుతుంది? తమ ఇష్టానిష్టాలపై ప్రపంచ  భవిష్యత్తు ఆధారమయ్యేటట్లు చేసిన రష్యా, అమెరికా కొరకు ఇవ్వడానికి భారత్‌   ‌ప్రాచీనమైన కోశంలో ఎట్టి నిధి నేటికీ సురక్షితంగా ఉంది? భారతీయ జీవనం  ఉదాత్తమైన ఆదర్శాలను  ప్రకటించే ఈ రామాయణమే ఆ నిధి.

– బాలశాస్త్రి హరదాస్‌

‘‌జాగృతి’ 04.05.1964 సంచిక నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE