గుడిపాటి వెంకటచలం (చలం) ఆశ్రమానికి చేరిన మొదట రోజులలో ‘గోరా’ (గోపరాజు నారాయణరావు) కూడా అరుణాచలం వచ్చాడు. ఈయన ప్రముఖ నాస్తిక వాది. చలమూ, గోరా ఇద్దరూ ఒకరి ముఖం చూసుకున్నారు. ఇద్దరి ముఖలూ వెలవెలబోయాయి. గోరా శ్రీ రమణ మహర్షిని పరీక్షించే ఉద్దేశంతో అరుణాచలం చేరుకొన్నాడట. కానీ ఆయనకు ర•మణ భగవానుడి ఆశ్రమంలో ఏ లోపమూ కన్పించకపోవడంతో శ్రీ రమణాశ్రమం నుంచి వెంటనే నిష్క్రమించాడు.
మలయాళ ప్రాంతం నుంచి ఒకసారి వేద విద్వాంసులొకరు భగవాన్ శ్రీ రమణుల సన్నిధికి వచ్చారు. ఆ పండితుడు భగవన్ సన్నిధిలో శుక్ల యజుర్వేదం పఠించారు. ఆ ప్రాంతంలో అంతా కృష్ణ యజుర్వేదం మాత్రమే చలామణి అవుతుంది. శ్రీ భగవాన్ రమణులు ఆ వేద విద్వాంసుడితో ‘ద్రావిడవేదం మీరెప్పుడైనా పఠించారా? అని ప్రశ్నించారు. ‘నేను ఆ పేరే వినలేదు కదా?’ అని అ వేద విద్వాంసుడు విస్మితుడైనాడు. ‘మా సుందరేశయ్యర్ చదువుతాడు వినండి’ అని భగవాన్ ముసిముసిగా నవ్వుతూ అన్నారు. శ్రీ సుందరేశయ్యర్ వేదస్వరాలు సమకూర్చి గాన ఫణితలో దానిని విన్పించారు. మలయాళ ప్రాంతం నుంచి వచ్చినా ఆ వేద విద్వాంసుడు చాలా ఆహ్లాదించాడు. మువ్వురు వనితలు శ్రీ రమణ భగవాన్‌ను వారి అరుణాశ్రమంలో దర్శించే నిమిత్తం ఆశ్రమానికి వచ్చారు. ‘నేను గిరి ప్రదక్షిణం చేయగలనా’ అని ఎంతో ఆర్తితో ఆమె సందేహం వెలిబుచ్చగా రమణ భగవాన్ ఆమెవైపు కొన్ని క్షణాల పాటు పరీక్షగా పరిశీలనగా చూసి, నెమ్మదిగా అరుణగిరి ప్రదక్షిణం అభినయంతో ముఖాభినయంతో చూపించారు. ఎందుకైనా మంచిదని వారు తమతో ఒక చిన్నకారు కూడా తీసుకొనిపోయారు.
ఆ మువ్వురూ స్త్రీలు భగవాన్ అనుగ్రహంతో గిరి ప్రదక్షణం పూర్తి చేసుకొని రమణ భగవాన్ సన్నిధికి చేరుకున్నారు. ఆ స్థూల కాయురాలు కృతజ్ఞతను వెల్లడిస్తూ ‘నేను గిరిప్రదక్షిణం సఫలంగా నిర్వహించుకోగలిగాను. తక్కిన నా నేస్తురాండ్రిద్దరూ అరుణగిరి ప్రదక్షిణం చేయలేకపోయినారు. మధ్యలో మేము వెంట తీసుకొనిపోయిన కారు ఎక్కారు’ అని భగవాన్‌తో తన మురిపాన్ని ఆహ్లాదకరంగా నివేదించుకొన్నది. కొంతకాలానికి ఆ స్థూల కాయురాలు చాలా అందంగా రోజులా తయారైంది.
అక్కిరాజు రమాపతిరావు