‘అంతరంగముల కాహ్లాదంబు చేకూర్చి

మెదడుకు మేత మేపెదను నేను

పదునొనర్చి కుదిర్చి పాడిపంటల నిచ్చి

కుక్షి నింపెడి రక్షకుండ వీపు

వైతాళికుండనై చైతన్యదాతనై

విశ్వసౌహృదము నేర్పింతు నేను

ఉత్తమాహార సంపత్తికి కృషిచేసి

సకల మానవసేవ సలిపెదీవు

కరుణమూర్తి నేను, కష్టజీవివి నీవు

మాటనేను, పసిడి మూట వీవు’

అంటుంది ‘కవి`కష్టజీవి’ బంధం. అది ఎంత ప్రగాఢమో దేశ్‌పాండే కుటుంబానికి ఆసాంతమూ తెలుసు. అక్షరాన్ని నమ్ముకుని ఒకరు, పంట పొలంతో మమేకత్వాన్ని పెంచుకుని మరొకరు. కలంతో రాస్తూ ఒకరైతే, హలంతో దున్నుతూ వేరొకరు. ఇద్దరిదీ శ్రమ స్వభావమే! పుస్తకం, భూమి ` ఈ రెండిరటి విలువ అనుపమానమని నిరూపించినవారే ఉభయులూ. అటువంటి బుద్ధి,  శ్రమజీవుల తత్వాన్ని అణువణువునా నింపుకొన్న కుటుంబం నుంచి వచ్చినవారే నిర్మలా దేశ్‌పాండే. శాంతితత్వానికి జీవితాంతమూ కట్టువడిన ఆమెను తలచుకోవడమంటే ` ఒక నిబద్ధతా రూపాన్ని మన కళ్లముందుకు తెచ్చుకోవడమే. సామాజిక శాంతి, క్రాంతి లక్ష్యాలుగా జీవితమంతటినీ గడిపిన ఆ వనితా శిరోమణి పద్మవిభూషణురాలు.

‘ధర్మచక్ర జయపతాక ధరించి పురోగమించు / వీర సైన్య విక్రమాంక

విస్ఫారకులై రండీ / అఖండమీ  భరతజాతి అజేయమని చాట

రండి / రండీ యువజనులారా! రారండీ ప్రజలారా!’ అనే నేతల

పిలుపుతో భారత స్వాతంత్య్ర సమరం కొనసాగుతున్న రోజులవి.

‘నీ యసమాన విశ్రుత వినిర్మల ధర్మగుణంబు ఆత్మ జా

తీయత మూర్తి దాల్చిన సుధీమణి జేయగ, సార్వభౌము డా

ప్యాయత గౌరవమ్మిడ, ప్రపంచ చరిత్ర అపూర్వమౌ అభి

ప్రాయము వెల్లడిరచినది ` భారత సాత్విక శక్తివా!’

అంటూ గాంధీయతను ప్రస్తుతించిన సందర్భమూ అదే. గాంధీజీతో పాటు జాతీయోద్యమంలో ముందు నిలిచిన మేటి, సమాజ సంస్కర్త వినోబాభావే. పల్లెజీవుల కష్టనష్టాలకు తల్లడిల్లిన మనస్వి. వారి కడుపు నిండేలా భూమిని సేకరించి, సమీకరించి, పంచిపెట్టిన తపస్వి. ఆ భూదానోద్యమ స్ఫూర్తి సమస్తం నిర్మలా దేశ్‌పాండేలో ప్రస్ఫుటమైంది. ఆమెది మహారాష్ట్రలోని నాగపుర్‌ ప్రాంతం.  అక్కడేకాక ఎక్కడికి వెళ్లినా, ఏ బాధ్యత చేపట్టినా, ఎటువంటి కార్యక్రమంలో పాల్గొన్నా భూదాన ప్రాధాన్యతనే విపులీకరించేవారు.

తన తండ్రి మరాఠీ సాహితీవేత్త కావడంతో, ఆ కళాత్మక ప్రతిభ ఆమెలోనూ అభివ్యక్తమైంది. ఎనిమిది పదులలోపు జీవితకాలంలో పరిపూర్తిగా ఆశయాలకే అంకితమైన మూర్తిమత్వం.

నిర్మల మాతృమూర్తి విమల. ధార్మిక భావనలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. తండ్రి ` ఆధునికతనీ మూర్తీభవించినవారు. వారిద్దరి నుంచీ ఆ విలక్షణతలను పుణికిపుచ్చుకున్న నిర్మలా దేశ్‌పాండే కార్యాచరణను తనదైన తీరును అనుసరించారు. ఆమె చదువంతా స్వస్థలం నాగపూర్‌లోనే ప్రాథమికంగా కొన సాగింది.

విశ్వవిద్యాలయ చదువులూ అక్కడే. గ్రామీణ వికాసం గురించి ప్రత్యేకంగా పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఆ సమయంలోనే సార్వత్రిక ప్రగతి గురించిన విస్పష్ట అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. పర్యవసానంగా సామాజిక క్షేత్రంలో విస్తృత పర్యటనలు సాగించారు నిర్మల. ఆదర్శనీయులు వినోబాజీ వెంట వందల మైళ్ల ప్రయాణం చేశారు. అది అసాధారణ పాదయాత్ర. మరెవ్వరికీ  సాధ్యం కానంత విస్తృత క్రియ.

‘శాంత రసావతారము, ప్రసన్న /గుణాకర మద్భుతాత్మ, మా/శాంత యశో విశాలము `మహా / మహిమాలయ మత్యపూర్వ భా/స్వంతము` లోకపావనము, సత్య / దయాలీనమైన మూర్తి వృ /త్తాంతము గోచరించెను…’ అనేంత అనుభూతి. వినోబాలో అంతటి యశో విశాలతను దర్శించారామె. ఊరూరా యాత్రల ద్వారా వందలాది ఎకరాల సమీకరణకు తానూ ఉద్యమించారు. ఆయా భూములను నిరుపేదల పరం చేయడంలో ఎంతో సేవానిరతి కనబరిచారు.

దానగుణమే అన్నింటికన్నా మిన్న. ఎవరికివారు తమకు ఉన్నదానిలో ఎంతో కొంత ఇతరులకు ఇవ్వాలని అనుకోవడమే ఒక గుణ సంపన్నత. సంపదను పోగు చేసుకోవడంలో ఆనందం ఉండదు. పంచి ఇవ్వడంలోనే ఆత్మసంతృప్తి లభిస్తుందన్న వాస్తవాన్ని ఊరూరా ప్రచారం చేయడం ఆ మహిళా దీపిక ప్రధాన బాధ్యతగా దీపించింది. వినోబాజీని అనుసరిస్తూ తాను సాగించిన నడక, చేసిన ప్రసంగాలు, అందించిన సందేశాలు, చేపట్టిన ఆచరణలు ఎందరెం దరినో ఆకట్టుకున్నాయి. ఆ రోజుల్లో నిర్మలా దేశ్‌పాండేను కావ్యనాయికగా వర్గించేలా చేశాయి అవన్నీ.

ఏ జాతికైనా నైతిక బలమే మూలాధారం. అదే ఉన్నతిని అందిస్తుంది. అవరోధాలను అధిగమించేలా చేస్తుంది. సమాజం మొత్తాన్నీ నమ్మారామె. దేశభక్తి భావం, వితరణ స్వభావం, ఆధ్యాత్మికత, భిన్నత్వంలో ఏకత్వం వంటి అంశాలనూ క్రోడీకరించి తన భూదానోద్యమ పథంలో ప్రత్యేకించి యువతకు ఉద్బోధించేవారు. ఇదంతా అనేక సత్ఫలితాలనిచ్చింది.

మానవతా లతాసుమము మంచితనమ్ము, విచక్షణాత్మ వి

జ్ఞానము తత్పరీమళము – శాంతి సుధామధురైన సూక్తితత్‌

సూన మరందమంచు మనసుల్‌ పులకించు వినూత్న భావసం

ధానము చేసినావు నవతాప్రియ! నూత్నయుగ ప్రవక్తవై!

అనేలా వినోబాభావేతో పయనం ఎంతో ఉత్తమ పరిణామాలకు మూల కారణమై నిలిచింది. దీనితోపాటు సామాజిక సామరస్యం అనే కోణంలోనూ నిర్మలా దేశ్‌పాండే తనవంతు కృషిని కొనసాగించారు. అవసర సందర్భాల్లో శాంతియాత్రలు నిర్వహించి, ప్రజానీకంలో నవీన దృక్పథాలు కలిగించి, పెంచి పోషించారు. ఇందుకు పర్యటనలతో పాటు రచనల మార్గాన్నీ తనకు తానుగా ఎంచుకున్నారు.

గురుదేవ వినోబా వారి జీవన చరితను సవివరంగా పొందు పరుస్తూ కావ్యాన్ని రచించారు. ఇదంతా కూడా మరాఠీకి మాత్రమే పరిమితం కాకుండాÑ అనంతర కాలాన గుజరాతీ హిందీ  తదితర భాషలకూ విస్తరించింది. వినోబా తత్వం పరివ్యాప్తమవడంలో ఆమె కృషి ఎంతగానో వినియోగపడిరది. ఆంగ్ల భాషలోనూ అనువాదితమైంది.

కేవలం సిద్ధాంతాలతో ఏదీ ఒరిగిపడదు. ఆచరణ తప్పనిసరిగా వెల్లి విరియాలి. క్రియాశీలతకు పర్యాయంగా నిలిచిన నిర్మల సామాజిక సేవారంగంలో మున్ముందుకు దూసుకువెళ్లారు.

ఆలోచనలకు కార్యరూపమిచ్చి మరింత ప్రాచుర్యం కల్పించడానికి శతవిధాలా పరిశ్రమించారు. రచయిత్రిగా, కార్యదీక్షపరురాలిగా తనవంతు సేవలను ముమ్మరంగా అందించినపుడు ఎటువంటి అడ్డంకులనూ ఖాతరు చేయలేదు. సంఘంలో సామరస్యం పెంపొందడానికి కలం, గళం… ఈ రెండే మూల సాధనాలని బలంగా విశ్వసించిన వ్యక్తి ఆమె. జీవిత పర్యంతమూ శాంతి, సేవా భావాలను ప్రబోధిస్తూ ఉన్నారు. సేవ, క్రాంతి, సమభావం ధ్యేయాలుగా వచన, పద్య రచనలనేకం చేయడమే కాకుండా ఆయా భావాల విస్తృతికి పర్యటన రంగాన్నీ ఆలంబనగా చేసుకున్నారు.

‘వసుధైక కుటుంబం వాంఛనీయమే అందరికీ

అసలైన మానవత్వమంటే అభిమానమే ప్రతీ ఒక్కరికీ

అయితే ఈ అసలులో దాగి ఉన్న సిసలైన అర్థం

పూర్తిగా తెలిసేది ఎందరికి? చేరేది ఏ దరికి?

ఇటువంటి భావ సంచలనాలతో నిర్మలాజీ ఒక ప్రత్యేక ముద్ర వేయగలిగారు. లక్ష్య సాధనలో అలుపూ సొలుపూ ఎరుగని ధీర. జీవితమంతటినీ సేవకు అంకితం చేసిన తాను వివాహం చేసుకోలేదు. ప్రజలే తన కుటుంబం అనుకున్నారు. కార్యక్షేత్రమే గృహంగా భావించి రోజులో ఇరవై నాలుగు గంటలనీ సేవాప్రక్రియకే కేటాయంచారు కాబట్టే, ప్రజాదరణను అనంతంగా సంపాదించుకోగలిగారు. కేంద్రంలోని పెద్దల సభకు  రెండుసార్లు  నామినేట్‌ అయ్యారు.

అఖిల భారత సర్వసేవా సంఘం ఆనాడు భావ, జ్ఞాన, దానధారల పేరిట పుస్తక ప్రచురణలు చేపట్టింది. సర్వోదయ సాహిత్య ప్రచార సమితి అంటూ వరస రచనలను దేశమంతటా వెలువరించింది. ఆధ్యాత్మిక కర్మయోగం అనేది వాటిల్లో కీలక అంశం. ధర్మచక్ర ప్రవర్తనంగా దాన్ని అభివర్ణించింది సమితి.

గీతా ప్రవచనం, మన ఐక్యత వంటివి వినోబా గ్రంథాల్లో కొన్ని. వాటి ఆచరణీయ తను తేటతెల్లం చేయడమే నిర్మలా దేశ్‌పాండే అందించిన గురుదక్షిణ. స్వాతంత్య్ర అనంతర భారతంలో సైతం నిఖార్సయిన సమాజవాదిగా నిలిచి, తన జీవితయాత్ర ముగిసేవరకూ అదే నిబద్ధతను కనబరచారు ఆ వనితారత్నం.

ప్రధానంగా యువతరానికి ఆమె ఉద్బోధించింది క్రియపరత్వాన్ని, రాజీ అన్నదే తెలియని ఆచరణ పథాన్ని. ఎనిమిది పదుల వయసులో  ఢల్లీిలో అంతిమ శ్వాస విడిచేవరకూ ఆ మహనీయ అంటిపెట్టుకుంది సమాచరణ మార్గాన్ని మాత్రమే. విభూషణురాలిగా పేరును, తీరును సార్థకం చేసుకున్నారు.

‘నాలోని ప్రభాకరునిలా ప్రకాశించు

నాలో లోపలి ధ్రువతారలా మార్గం చూపించు

నా మదిలో మేఘంలా మెల్లగా వర్షించు

శీతల స్పర్శలా, సాదర పరామర్శలా అవతరించు’

సరిగ్గా ఇదే, ఈ భావాంతరంగమే నిర్మలా దేశ్‌పాండే అందించిన ప్రబోధ సారాంశం. ఆ కారణంగానే ఇప్పటికీ ఆ మహిళామణి ఎందరెందరి హృదయ మందరాల్లనో సుప్రతిష్ఠితులయ్యారుÑ సర్వోదయ మాధుర్యాన్ని ఈనాటికీ పంచి పెడుతున్నారు మనందరికీ.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE