ఇందూరు పూర్వ విభాగ్‌ ‌కార్యవాహగా పాతికేళ్లు అవిశ్రాంతంగా శ్రమించిన మల్లారెడ్డిగారి మాణిక్‌రెడ్డి డిసెంబర్‌ 6‌న మరణించారు. సంగారెడ్డి జిల్లా కంది దగ్గర శివనాపురం ఆయన స్వగ్రామం. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మాణిక్‌ ‌రెడ్డి ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. మాణిక్‌రెడ్డి ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా (ఇప్పటి సంగారెడ్డి, మెదక్‌, ‌సిద్ధిపేట జిల్లాలు) కార్యవాహగా, ఇందూరు విభాగ్‌ ‌కార్యవాహగా (ఇప్పటి మెదక్‌, ఇం‌దూరు విభాగ్‌లు) చాలాకాలం పనిచేశారు. నిరంతరం పర్య టిస్తూ జిల్లాలో, విభాగ్‌లో సంఘ కార్యాన్ని ఎంతగానో విస్తరింపజేశారు. ప్రత్యక్షంగా శాఖల పర్యటన చేస్తూ స్వయంసేవకులతో, వారి కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. కార్యకర్తలతో ఆత్మీ యంగా ఉంటూ సంఘకార్య పనిలో మార్గదర్శనం చేసేవారు. వ్యక్తిగత, కుటుంబ జీవితంలో సమస్యలకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. కార్యకర్తలకు వారొక కుటుంబ పెద్దదిక్కుగా ఉండేవారు. ఇప్పుడు మెదక్‌, ఇం‌దూరు విభాగ్‌లలో వారి మార్గదర్శనంలో ఎదిగిన కార్యకర్తలెందరో ఉన్నారు.

సుమారు 25 సంవత్సరాలపాటు (2005 సంవత్సరం వరకు) విభాగ్‌ ‌కార్యవాహగా ఉన్నారు. ఒక్కొక్కసారి శనివారం సాయంత్రం సంగారెడ్డి నుండి బయలుదేరి రాత్రంత ప్రయాణించి ఆదిలాబాద్‌కి తెల్లవారు ఝామున చేరుకొని ప్రభాత్‌ ‌శాఖలో ఉండేవారు. ఆ విధంగా ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాతో పాటు, సుదూర ప్రాంతమైన ఆదిలాబాద్‌, ఇం‌దూరు జిల్లాల్లో కూడా క్రమం తప్పకుండా పర్యటన చేసేవారు. సోమవారం కార్యక్షేత్రం నుండి నేరుగా పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరేవారు. నిరంతరం సంఘ కార్యంలో నిమగ్నమైయున్నప్పటికి ఉపాధ్యాయునిగా పాఠశాల విధిపట్ల ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా నిబద్ధతతో ఉండేవారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా వారంటే ఎంతో గౌరవముండేది. వారి సహచర్యంవల్ల ఎందరో ఉపాధ్యాయులు సంఘకార్యంలోకి వచ్చారు.

అతి సాధారణ జీవనం, ఉన్నతమైన ఆలోచనలు, విలువలు, వ్యక్త్తిత్వం కలిగిన మాణిక్‌రెడ్డి పనిలో ఎదురయ్యే సమస్యలకు చాలా సులభమైన పరిష్కారాలు తెలిపేవారు. సంఘ కార్యంపట్ల నిష్ట, నిబద్ధత, అనుకొన్నది సాధించాలనే పట్టుదల ఉండేది. ‘‘సంఘ కార్యం సమాజ కార్యం, పరమేశ్వరుని కార్యం. ఇది మన ఇంటి పనికాదు. దీనిలో ఒక్కొక్కసారి విఫలమైనా మనం డీలా పడిపోవద్దు, వెనుకంజ వేయవద్దు, చేస్తూ పోవాలి’’ అనేవారు. సంఘ పనిలో వారు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా వారు అధైర్యపడలేదు, వెనుకడుగు వేయలేదు.

మాణిక్‌రెడ్డిగారు సమాజంలోని అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు కలిగి వారిని సంఘ కార్యానికి చేరువ చేసేవారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో వారికి సన్నిహిత సంబంధాలుండేవి. సంఘ కార్యానికి అవసరమైనప్పుడు వారు తమ సహాయ సహకారాలు అందించేవారు.

1997 రోడ్డు ప్రమాదంలో కాలు విరిగినపుడు విశ్రాంతి తీసుకోకుండా నిత్యం పర్యటన చేశారు. శాఖకు వెళ్లేవారు. కంటి ఆపరేషన్‌ ‌విజయవంతం కాలేనందువల్ల కొంతవరకు కంటిచూపు తగ్గి ఇంటికే పరిమితమైనా తనను చూడటానికి వచ్చిన స్వయంసేవకులతో, కార్యకర్తలతో సంఘ కార్యం గురించి ముచ్చటించేవారు. ఆదర్శమైన సంఘ కార్యకర్త, ధన్యజీవి మాణిక్‌రెడ్డి.

About Author

By editor

Twitter
YOUTUBE