ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రముఖులంతా అనుయాయుల మీద గాఢమైన ముద్ర  వేస్తారు. అది కూడా చిరకాలం ఉండిపోయే ముద్ర. వారి వ్యక్తిత్వాలు, ఆచరణ, జీవితం ఆదర్శనీయంగా ఉండడమే ఇందుకు కారణం. కృ.సూర్యనారాయణ రావుగారి జీవితం కూడా అలాంటిదే. ఆయన జీవిత చరిత్ర ‘ఎత్తరి, నేర్పరి, కూర్పరి: మన సూరూజీ’. కృష్ణప్రసాద్‌ ‌బది కన్నడ మూలానికి (ఉత్తుంగ) ఇది సింగిరెడ్డి బ్రహ్మానందరెడ్డి తెలుగు అనువాదం. ఈ పుస్తకంలో ఏడు అధ్యాయాలు ఉన్నాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశ వ్యాప్తంగా బలపడిందంటే అందుకు కారణం ఆయా ప్రాంతాలలో దైవ సంకల్పం అన్న రీతిలో బాధ్యతలు స్వీకరించిన కొందరు వ్యక్తులే. అలాంటి వారిలో సూర్యనారాయణరావుజీ ఒకరు. కర్ణాటక ప్రాంతం నుంచి ఆయన వచ్చారు. సూరూజీ తమిళనాడులో ప్రచారక్‌గా ఎక్కువకాలం పనిచేశారు. గురూజీ నుంచి డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌వరకు అందరితో కలసి పనిచేసిన సూరూజీ ‘పరిపూర్ణత విషయంలో లేశమాత్రపు రాజీ లేదు’ అనేవారు. 1946 నుంచి 2016 వరకు ఆయన సంఘం కోసం పనిచేశారు. ఇంతటి దీర్ఘకాలం, మహోన్నత సేవ అందించినవారు సంఘంలోనూ తక్కువే. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎదుర్కొన్న మూడు నిషేధాల అనుభవం ఎలాంటిదో తెలిసినవారాయన. తన డెబ్బయ్‌ ఐదో ఏట సంఘ పెద్దలకు లేఖ రాసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ లేఖలో ఆయన రాసిన వాక్యాలే ఆయన ఎంతటి ఆశావాదో (ఐదో అధ్యాయం) అర్ధమవుతుంది. వయసు వచ్చిదంటే సహచరులకు భారం కావాలని అర్థంకాదు, కొత్తతరం వారికి అవకాశాలు ఇవ్వాలి అని రాశారు. పైగా కొత్తతరం వారు మనకంటే సృజనశీలురని రాయడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. అలాంటి వారి కార్యశైలిని పరిచయం చేయడమే ఈ పుస్తకం ఉద్దేశం.

1924లో జన్మించిన సూర్యనారాయణ రావుజీకి ఆ పేరు పెట్టడం వెనుక ఉన్న గాథ చదివిన తరువాత దేహం పులకిస్తుంది. సూర్యనారాయణరావుజీ తండ్రి కృష్ణప్పగారు. వారి పినతండ్రి పేరు సూర్యనారాయణరావు. ఆ పేరే పెట్టారు. ఈయన కాశీలో ఇచ్ఛామరణం పొందారు. ఈ పుస్తకం చదువుతుంటే ఒక జీవిత చరిత్ర చదువుతున్న అనుభూతి కంటే, ఒక జీవితం సృజనాత్మక రచనగా మన ముందుకు వచ్చిందనిపిస్తుంది. సూరూజీ జీవితంలోని ఘట్టాలతోనే, వాటిని యథాతథంగా అక్షరబద్ధం చేయడం ద్వారానే వారి జీవితాన్ని మనకు సుబోధకం చేశారని అనిపిస్తుంది. రెండో అధ్యాయంలో వివేకానంద సభలు ఇందుకు ఒక ఉదాహరణ.

సూరూజీ మీద వివేకానందుల ప్రభావం అపారమనిపిస్తుంది. ఆఖరి అధ్యాయం (‘సూర్య’కిరణాలు)లో శివమొగ్గలో సూరూజీ 1978లో ఇచ్చిన ఉపన్యాసం ప్రచురించారు. అది చదవడం ఒక మంచి అనుభూతి. అంతకు ముందు కూడా కర్ణాటకలో జరిగిన సభలో, ఒక హిందువు మతం మారాడంటే, ఒక శత్రువు తయారయ్యడనే అర్ధం అన్న వివేకవాణి సూరూజీ నోట విన్న రామకృష్ణ మఠం పెద్ద కూడా పరవశించిపోయిన ఉదంతం కనిపిస్తుంది. ఈ పుస్తకంలోని ప్రతి వాక్యం ప్రేరణాత్మకమే. అందుకు కారణం సూరూజీ జీవిత ఔన్నత్యం. దానికి ఉన్న భిన్నత్వం. ఆయన చింతనలోని వైవిధ్యం కూడా కారణమే. కాబట్టి ఈ పుస్తకం ప్రతివారు చదవాలి.

ఎత్తరి, నేర్పరి, కూర్పరి:

మన సూరూజీ

కన్నడ మూలం: కృష్ణప్రసాద్‌ ‌బది,

అను: హైందవి

ప్రతులకు: సాహిత్య నికేతన్‌, ‌హైదరాబాద్‌ – ‌విజయవాడ.

వెల: రూ.200, పేజీలు 190    

-సమీక్ష : కల్హణ

About Author

By editor

Twitter
YOUTUBE