– అరుణ

 ఆ 41 మంది కార్మికులు ఉత్తర కాశీలోని ఆ సొరంగంలో  17 రోజులు ఉండిపోయారు. అంతా క్షేమంగా బయట పడాలని వారి కుటుంబ సభ్యులతో పాటు భారతీయులంతా ప్రార్థనలు చేశారు. మొక్కులు మొక్కారు. నిజంగానే వారంతా నిరపాయంగా బయటపడ్డారు. ఇది చంద్రయాన్‌, సూర్యయాన్‌ ప్రయోగాల కంటే తక్కువగా ప్రజలు భావించలేదు. హిమాలయాలలో చార్‌ధామ్‌ యాత్రికుల సౌకర్యం కోసం నిర్మిస్తున్న సిల్క్‌యారా సొరంగం కుప్పకూలడంతో కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వారిని పట్టుదలతో ప్రభుత్వం రక్షించింది. ఇది భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. విదేశాలు కూడా ఈ ఆపరేషన్‌కు  విస్తుపోతూ ప్రశంసలు కురిపించాయి.  

ఏ ఒక్క ప్రాణాన్నీ ఈ ఘటనలో బలిపెట్ట కూడదన్న ప్రభుత్వ పట్టుదల, సైన్యం, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ వంటి సంస్థల సిబ్బంది, ఆర్నాల్డ్‌ డిక్స్‌ వంటి సొరంగ నిపుణులు అంతిమంగా, బొరియలు తవ్వేవారు కలిసి చేసిన కృషి ఫలితమే ఈ విజయం. సొరంగం కుప్పకూలినప్పటి నుంచే ప్రభుత్వ పెద్దలు, అధికారులు అప్రమత్తమయ్యి, వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించడమే కాదు, అప్పటి వరకూ వారు మానసికంగా, భౌతికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఆహారాన్ని, మందులను పంపుతూ, తాము వారి కోసం ఎదురుచూస్తున్నామని, అక్కడే ఉన్నామనే సందేశాన్ని పదే పదే పంపుతూ వారి మానసిక స్థయిర్యాన్ని నిలుపుకునేందుకు సూచనలు చేస్తూ వారు నిరాశలోకి జారిపోకుండా కాపాడుకుంటూ వచ్చారు. నవంబర్‌ 12వ తేదీన సొరంగ మార్గంలో ఒకవైపుగా మట్టి, శిథిలాలు పడటంతో 41మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు.

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నత నాయకత్వంలో ఎలా ఆలోచించి, సమన్వయంతో పని చేస్తుందో ఈ ఉదంతం రుజువు చేసింది. వాస్తవానికి గతంలో, అంటే  కేదార్‌నాథ్‌ వద్ద జరిగిన క్లౌడ్‌ బరస్ట్‌ సమయంలో కూడా నాటి కాంగ్రెస్‌ సర్కారు సమర్ధవంతంగా స్పందించక పోవడంతో అది భారీ జననష్టానికి దారి తీసిన విషయం అందరికీ గుర్తే. ఆ తర్వాత కూడా వారిని వారి మానాన వారు వదిలేశారు. మానవతప్పిదం వల్ల జరిగిన ఈ ఘటనను ప్రకృతి విపత్తుగా అభివర్ణిస్తూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం నుంచి తప్పించుకుంది. కానీ ప్రస్తుత ఘటనలో నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధిపతిగా మోదీ ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన తీరును, ఒక్క ప్రాణం కూడా పోకుండా అందరినీ బయిటకు తీసుకువచ్చే విధంగా ఆపరేషన్‌ను నడిపిన తీరును ఎవరూ వేలెత్తి చూపలేరు.

వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సహకార, సమన్వయాలు, కేంద్రం పాత్ర అన్నవే అంతర్జాతీయ మన్ననలు అందుకోవడానికి కారణమయ్యాయి. ఈ 16 నుంచి 17 రోజుల్లో చిన్న చిన్న సాంకేతిక లోటు పాట్లు, సవాళ్లతో కూడిన హిమాలయ భూభాగం, అనుకోని అత్యవసర పరిస్థితుల కారణంగాఈ ఆపరేషన్‌ అత్యంత క్లిష్టమైన, సవాళ్లతో కూడినది అయినప్పటికీ విజయవంతమైనది. ఈ విజయానికి ప్రమాదాలను అంచనా వేసి, ఆ లక్ష్యం పట్ల నిబద్ధత, దయ ఉం డాలి. ఇవన్నీ ప్రధాని మోదీ బృందంలో ఉండటం వల్లే ఇది సాధ్యమైంది.

జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్‌) కింద నవయుగ ఇంజినీరింగ్‌ కనస్ట్రక్షన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఇసిఎల్‌) సొరంగ నిర్మాణాన్ని చేపట్టింది. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌లో ప్రతి అంగుళం పవిత్రమైనదే. అయితే, ఎన్‌ఇసిఎల్‌ ఇంజినీర్‌ ఒకరు నిర్మాణానికి ముందు అక్కడ ఉన్న ఆలయాన్ని తొలిగించారని, అందుకే ఇలా జరిగిందని స్థానికులు విశ్వసించారు. ఆ మాటలను విన్న అంతర్జాతీయ నిపుణుడు ప్రొఫెసర్‌ ఆర్నాల్డ్‌ డిక్స్‌ అక్కడికక్కడ ఒక చిన్న ఆలయం వంటిదాన్ని ఏర్పాటు చేయడమే కాదు, పూజలు కూడా నిర్వహించి పనిలోకి దిగారు.

ఆపరేషన్‌ విజయవంతం అయిన తర్వాత ప్రొఫెసర్‌ ఆర్నాల్డ్‌ డిక్స్‌ తిరిగి ఆ ఆలయానికి వెళ్లి, పూజలు నిర్వహించి, కృతజ్ఞతలు చెప్పుకొని  వచ్చారు. తర్వాత చెప్పిన మాటలను దేశంలోని హిందువులంతా వినడమే కాదు, అవగతం చేసుకుని, గర్వించాలి.  ఇంజినీరు, సొరంగాల నిర్మాణ నిపుడు అయిన డిక్స్‌కు భారతదేశ మూలాల పట్ల ఉన్న పరిజ్ఞానం దేశంలో సగంమందికి పైగా లేదనడం అతిశయోక్తి కాదు. ‘‘నేను ఇక్కడకు వచ్చే ముందే ఈ ప్రదేశం హిందూ ప్రజలకు అత్యంత పవిత్రమైనదని నాకు తెలుసు. అంతేకాదు, ఈ సొరంగాన్ని ఇక్కడ గల పవిత్ర ఆలయాలను యాత్రికులు సందర్శించేందుకు నిర్మిస్తున్నారని కూడా తెలుసు. ఈ మిషన్‌కు ఒక ఐతిహాసిక కోణం ఉంది… ఇది హిమాలయ పర్వతం..’’ అంటూ ఆయన ఎఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం ఆయనకు ఈ ప్రాంతం పట్ల గౌరవాన్నే కాదు, హిందువులకు భావాల పట్ల సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

‘ఆపరేషన్‌ జిందగీ’

ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్‌ జిందగీని చేపట్టి, వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. తొలుత 41 ఎంఎంల పైపును శిథిలాల ద్వారా పంపాలన్న వారు భావించినప్పటికీ, భద్రతా కారణాల వల్ల వారు బహుళ రక్షణ ప్రత్యామ్నా యలన్నింటినీ కలిపి ఈ ఆపరేషన్‌ను నడిపించారు. దాదాపు 8.5 మీటర్ల ఎత్తు 2 కిమీల పొడవున సొరంగంలో ఉన్న శ్రామికులకు విద్యుత్‌, నీటి సరఫరాలకు తక్షణ చర్యలు తీసుకున్నారు. ఒఎన్‌జిసి, సత్లజ్‌ జల్‌ విద్యుత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎస్‌జెవిఎన్‌ఎల్‌), రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌విఎన్‌ఎల్‌) , నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు కార్యాచరణ సామర్ధ్యానికి అవసరమైనప్పుడు తమ సేవలను  నిర్దిష్ట బాధ్యతలను అప్పగించారు. సున్నితమైన ఆ భూభాగంపై యంత్రాలు కూడా వెంట వెంటనే మొరాయించడం ప్రారంభించాయి. యంత్రాలు పని చేసే వేగమే తక్కువగా ఉండటంతో రక్షక దళాలకు దిక్కు తోచనట్టు అయింది. అయితే, థాయ్‌లాండ్‌లోని థామ్‌ లాంగ్‌లో 2018లో ఒక గుహలో చిక్కుకుపోయిన విద్యార్ధులను కాపాడిన బృందాన్ని వారు సంప్రదించారు.

మొదటి యంత్రం విఫలం కావడంతో ఢల్లీి నుంచి ఆగర్‌ అమర్చిన మరొక మెషీన్‌ను నవంబర్‌ 16న పంపగా, మరురోజే విచ్చుకుంటున్న శబ్దాలు వినిపించడంతో డ్రిల్లింగ్‌ పనిని నిలిపివేశారు. ఈ ఆపరేషన్‌ సందర్భంగా మూడు పైప్‌లను డ్రిల్లింగ్‌ చేశారు. ఒకటి ఆక్సిజన్‌ పంపేందుకు, ఒకటి ఆహారాన్ని పంపేందుకు, మరొక 15 సెం.మీ. వెడల్పులో ఉన్న పైపును వేడి ఆహారాన్ని, ఎండోస్కోపిక్‌ కెమెరాను పంపేందుకు చేశారు. నవంబర్‌ 19న బార్డర్‌ రోడ్స ఆర్గనైజేషన్‌ (బిఆర్‌ఒ) సొరంగంపై ఉన్న చిన్న కొండ మీద 1.15 కిలోమీటర్ల రోడ్డును నిర్మించింది. శ్రామికులను కాపాడేందుకు నిలువుగా తొలచాలని ప్రణాళి కలు రూపొందిస్తుండడంతో బిఆర్‌ఒ తక్షణం స్పందించి, పని పూర్తి చేసింది.

సంపీడన వాయువుతో కూడిన 4 ఇంచీల గొట్టం ద్వారా ఒకవారం పాటు ఆహారాన్ని పంపారు. నవంబర్‌ 20వ తేదీన రక్షణ బృందం ఘన పదార్ధాలను పంపేందుకు ఆరు ఇంచీల పెద్ద పైప్‌ను ఏర్పాటు చేసింది. అంతకుముందు పైపు ద్వారా జీడిపప్పు, బాదం తదితరాలను పంపుతుండేవారు. కొత్త పైపు ద్వారా వేడి చపాతీ, కూర, పళ్లు వంటివి పంపడం ప్రారంభించారు. తాడు కట్టిన ఒక ప్రత్యేక ట్రేలో ఈ ఆహారాన్ని పెట్టి పంపుతుండేవారు.

చివర్లో ఆగర్‌ మెషీన్‌ ఎలా తోడ్పడిరది?

ఆగర్‌ బిట్‌ అని పిలిచే పదునైన బ్లేడు కలిగిన ఆగర్‌ మిషన్‌, లోపలికి వెళ్లే సమయంలో రంథ్రాన్ని సృష్టిస్తుంది. అది పాడయ్యే సమయానికి అది 55 మీటర్ల లోతు తొలచడాన్ని పూర్తి చేసింది. ఇదే రక్షణలో కీలకమైంది.

అమెరికాకు చెందిన ఆగర్‌ 600` 1200, హైపవర్‌ హారిజాంటల్‌ డ్రిల్లింగ్‌ను ఉపయోగించారు. దానిని  యుఎస్‌ కంపెనీ అయిన అమెరికన్‌ ఆగర్స్‌ తయారు చేసింది. ఈ యంత్రాలు తొలిచేటప్పుడు బయిటకు వచ్చే దుమ్ము ధూళిని ఆగరే  వదిలించుకునేలా దానికి రూపకల్పన చేశారు. దీనితో తొలిచే సమయంలో వచ్చే దుమ్ము పైకి వచ్చేలా దీని డిజైన్‌ ఉంటుంది. ఒక మీటర్‌ తొలిచేందుకు ఈ యంత్రం ఒక గంట తీసుకోగా, పైపులను ఏర్పాటు చేసేందుకు నాలుగైదు గంటలు పట్టింది. సిల్క్‌ యారాలో ఆరడుగుల పొడవైన 900 ఎంఎం, 800 ఎంఎం పైపులను ఆగర్‌ మెషీన్‌ను ఉపయోగించి జొప్పించగా, సొరంగాన్ని తయారు చేసేందుకు రెండు పైపులను అతికించారు.

తొలిచడం పూర్తి చేసిన తర్వాత శిథిలాలలో నుంచి సొరంగాన్ని సృష్టించేందుకై వెడల్పైన పైపులను తోసినట్టు అధికారులు తెలిపారు. ఇది పూర్తి అయిన తర్వాత ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం ఒకటి ఆక్సిజన్‌ కిట్లను ధరించి, చక్రాలు ఉన్న స్ట్రెచర్ల ద్వారా పాకుతూ తాడు, వర్కర్ల కోసం ఆక్సిజన్‌ కిట్లను తీసుకొని వెళ్ళారు.  తర్వాత వైద్యులను, పారామెడికల్‌ సిబ్బందినీ కూడా చక్రాల స్ట్రెచర్లపై లోపలికి పంపినప్పుడు వారు చిక్కుకుపోయిన కార్మికులకు వైద్య పరీక్షలు చేశారు. వారందరికీ, ఆ సొరంగంలాంటి పైపులో నుంచి ఎలా బయిటకు రావాలనే దానిపై అందరు కార్మికులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. స్ట్రెచర్లకు రెండు వైపులా తాడు కట్టారు. ఒకరి తర్వాత ఒకరిగా వారిని బయిటకు రప్పించాలని, చివరిగా ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది బయటకు రావాలనే ప్రణాళిక సిద్ధమైంది. ఈ మొత్తం ఆపరేషన్‌కు మూడు గంటలు పడుతుందని అంచనా వేశారు.

చివర్లో బొరియలు తవ్వేవారు ఎలా తోడ్పడ్డారు?

యంత్రాలు పదే పదే విఫలం అవుతుండడంతో అంతిమంగా సంప్రదా యంగా బొరియలు చేసేవారిని కూడా పిలిపించి ప్రయత్నం చేద్దామనుకున్న అధికారులు, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బుందేల్‌ఖండ్‌ నుంచి బొరియలు తవ్వేవారిని పిలిపించారు. యంత్రాలకన్నా వారే మనుషుల పనే మెరుగైనదని వారు నిరూపించారు. ముగ్గురు బొరియలు తీసేవారు శిథిలాల కుప్ప దిశగా పాక్కుంటూ వెళ్ళేందుకు పైప్‌లోకి ప్రవేశించారు. ఒక వ్యక్తి తవ్వగా, రెండవ వ్యక్తి ఆ మట్టిని ట్రాలీలో పోయగా, మూడవ వ్యక్తి ఆ ట్రాలీని ఒక ఇరుసులో ఉంచుతారు, దానిని బయిటకు లాగుతారు. సగటున వారు గంటకు 0.9 మీటర్ల లోతు తవ్వగలిగారు. గంటకు ముగ్గురు చొప్పున ఈ బొరియలు తవ్వేవారిని మారుస్తూ వచ్చినట్టు అధికారులు తెలిపారు. మరు రోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికి వారు 12 – 13 మీటర్ల లోతుకు తవ్వగలిగారు. మొత్తం మీద యుపి, ఎంపీకి చెందిన 12 మందిని ఉపయోగించారు.

ఈ 17 రోజుల ఆపరేషన్‌లో సుమారు 652మంది ప్రభుత్వ సిబ్బంది పని చేశారు. వీరిలో 189మంది పోలీసు శాఖకు చెందినవారు కాగా, 106మంది ఆరోగ్య విభాగం, 77మంది ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసులు, 62మంది నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ నుంచి, 38 మంది ఎస్‌డి ఆర్‌ఎఫ్‌, 46మంది జల సంస్థాన్‌ ఉత్తరకాశీకి చెందిన వారు కాగా, 32 మంది విద్యుత్‌ విభాగం, 38మంది బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన వారు ఉన్నారు.

బాధితులు మొత్తాన్ని బయిటకు తీసుకువచ్చిన తర్వాత వారికి ఫస్ట్‌ ఎయిడ్‌ చేసేందుకు, వారి పరిస్థితిని బట్టి ఆసుపత్రులకు చేర్చేందుకు అంబులెన్స్‌ల నుంచి హెలికాప్టర్ల వరకూ ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. బయిటకు వచ్చిన ప్రతి ఒక్క బాధితుడినీ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి, కేంద్ర హైవేల సహాయ మంత్రి జనరల్‌ వి.కె. సింగ్‌లు ఆలింగనం చేసుకొని, వారికి తామున్నామనే హామీ ఇచ్చారు. బయిటకు వచ్చిన వారికి తమకోసం ఇంతమంది పని చేస్తున్నారని, తాము వంటరివారం కాదనే భావన కలిగించడం ద్వారా వారు మానసిక సమస్యలలోకి జారుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

వాస్తవంగా చెప్పాలంటే విపత్తుల నిర్వహణ సామర్ధ్యం అనేది అందరికీ  ఉండదు. ఇటువంటి సమయాల్లో ఏది సరైనది అని కాక ఫలితాల ఆధారంగా నిర్ణయాలు జరగాలి. 41మంది జీవితాలు డోలాయమానంగా ఉన్న సమయంలో మోదీ ఫలితం కోసం పని చేశారు. మొదటి నుంచీ ప్రతి శ్రామికుని జీవితాన్ని కాపాడితీరాలన్న స్పష్టమైన లక్ష్యం ఆయనకు ఉంది. ఆయన సంకల్పం ఈ విషయంలో స్థిరంగా ఉంది. అనుకోని సంక్షోభం ఎదురైనప్పుడు ఆయన సరైన ఫలితాలనివ్వగల సరైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు.

About Author

By editor

Twitter
YOUTUBE