– కె.ఎ. మునిసురేష్ పిళ్లె
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన
‘‘ఆ పదివేలల్లో నాకేం మిగల్తాది సార్.. అంతా ఎమ్మెల్యే గారికి చదివింపులే. ఆ పైన నా సంగతి తమరే గమనించుకోవాల..’’ అతను చాలా ప్రొఫెషనల్గా అన్నాడు.
ఒక్కొక్కడికీ పదివేలు అంటే గుండె కాస్త కలుక్కుమంది మాకు. కానీ దిగుల్లేదు. వీఐపీ బ్రేక్ దర్శనం అంటున్నాడు కదా! ఆ మాత్రం పెట్టొచ్చునేమో అని ఒక గుంజాటన. సాఫ్ట్వేర్లో ఒక పూట భోజనానికి మూడు వేలు కూడా ఖర్చు పెట్టగలి గేంత సంపాదిస్తున్నాం, రూపాయల్లో. ఇక డాలర్లలో సంపాదించడానికి యూఎస్ వీసా కోసం వెళ్లే ముందు ఓసారి పెద్దాయన ఆశీస్సులు తీసుకుందాం అని వొచ్చాం. అంత పెద్ద రిజల్ట్ ఆశిస్తున్నప్పుడు.. ఆ మాత్రం పెట్టుబడి పెద్ద ఇబ్బంది కాదు. కానీ అడగ్గానే ఇచ్చేస్తే మనకు బలిసింది అనుకుంటాడని, ‘‘అసలే ముగ్గురం ఉన్నాం. కాస్త ఇంకో మాట చెప్పు బాసూ..’’ అని ఒక మాట వదిలాను నేను.
‘‘ఈ బేరాలన్నీ ఇందాకటి రోజుల్లో సార్. ఇప్పుడు టీటీడీనే ఒక రేటు లెటరు మీద సిఫారసు! అక్కడ పెట్టడానికి సిద్ధపడ్డ డబ్బుని, ఇక్కడ ఇవ్వడానికి మీకు నొప్పయితే ఎలాసార్.. అసలు శ్రీవాణి వొచ్చాక, ఎమ్మెల్యేగారు పది గట్టు దిగడం లేదు’’ వాడు పట్టు విడవలేదు. చివరికి ఒప్పుకున్నాం. వాడు చాలా జాగ్రత్త పరుడు. కాల్‌లో వివరాలేమీ చెప్పడు. నేరుగా వచ్చిన తర్వాతే ఇదంతా చెప్పాడు. ముప్ఫయివేల డబ్బు పుచ్చుకుని వెళ్లి ఓ గంటలో సిఫారసు ఉత్తరం పట్టుకొచ్చాడు. ఎమ్మెల్యేగారిది. ప్రభుత్వం వారి రాజముద్ర కూడా ఉంది.. కించిత్ గర్వంగా, బోలెడంత సిగ్గుగా! ‘వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని’ చాలా స్పష్టంగా రాసి ఉంది అందులో! దాన్ని మాకు ప్రత్యేకంగా చూపించాడు. కాకపోతే, మా ముగ్గురి పేర్లతో పాటు మరో ముగ్గురి పేర్లున్నాయి. ‘‘మీరంతా కలిసి ఒకటే బ్యాచ్ అని చెప్పాలి సార్’’ అన్నాడు. ఒక రెండు వేల నోటు ఇచ్చాను. అర్జంటుగా వీటిని ఖర్చు పెట్టేయాలి. మా కోరిక తీర్చడానికి బదులుగా, దేవదేవుడికి సమర్పించ డానికి కూడా వాటినే కట్టలుగా పట్టుకొచ్చాం. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్టు చేసి లెక్కల్లో చిక్కుకునే బదులు.. హుండీలో వేస్తే సరి! సెప్టెంబరులోగా మార్చుకోవడం ఆయనకు పెద్ద ప్రయాస కాదు!
‘‘ఒక్కొక్కరికీ ఒక్కోటి ఇవ్వాలి సార్’’ అంటూ చిత్రంగా నవ్వాడు.
‘‘మహాప్రభో.. ఇవి దాచినవి, అచ్చేసినవి కాదు’’ అంటూ ఇంకో రెండు అయిదొందల నోట్లు అతడిచేతికందించి దణ్నం పెట్టాను. ‘‘నా దాకా వచ్చాక అందరికీ బేరమాడాలని అనిపిస్తుంది సార్’’ అంటూ కాస్త అసంతృప్తిని వ్యక్తంచేసి, జేఈవో ఆఫీసుకు నన్ను రమ్మన్నాడు. అక్కడ ఒక ఇంటర్వ్యూ అయిన తర్వాత, నన్ను మరోచోటకు తీసుకువెళ్లి కాటేజీ ఇప్పించి.. టికెట్లు కొనడానికని మరో పదిహేనొందలు తీసుకుని.. ‘‘ఇక మీరు ఎంజాయ్ చేయండి సార్, రాత్రి తొమ్మిదిలోగా టికెట్లు తెచ్చి చేతిలో పెడతా’’ అని సెలవు పుచ్చుకున్నాడు.
నా ఐఐటీ బుర్ర యమవేగంగా లెక్కలు కట్టింది. రోజుకు ఆరువేలు.. నెలకు లక్షా ఎనభై, అథమపక్షం లక్షన్నర! అదే ఎమ్మెల్యే గారికైతే అథమపక్షం నెలకు పదిహేను లక్షలు. కాస్త నిజమైన, డబ్బుపుట్టని సిఫారసులు కూడా ఉండగలవని అనుకున్నప్పటికీ.. ఏడాది తిరిగేసరికి ఎంతలేదన్నా కోటిన్నర. అయిదేళ్లకు కనీసం ఏడున్నర కోట్లు. ‘పర్లేదు.. ఎన్నికల ఖర్చుకి సరిపడా దేవదేవుడే దయపెట్టే స్తున్నాడు’ అనిపించింది నాకు! అందరినీ ఒకే గాటన కట్టేయలేం. దేవుడి పేరుమీద వంచనా, సంపాదనా వద్దనుకునేవాళ్లు కొందరుంటారు. కానీ.. ఇది సాక్షాత్తూ దేవుడు అనుగ్రహించిన అవకాశమే అని.. వెంకన్న అనుమతి, అనుగ్రహం లేకుండా ఎర్రని ఏగానీ కూడా చేయిమారదని.. ఆత్మవంచన చేసుకునే వాళ్లు, దండుకునే వాళ్లు కూడా ఉంటారు.
********************
లెటరు మీద చూసి వీఐపీ బ్రేక్ దర్శనం అంటే.. వీఐపీలు మాత్రమే ఉంటారని అనుకోవడం ఒక భ్రమ. వీఐపీలు వేరేగా ఉంటారు. వారి భృత్యులు, ప్రాపకం పొందగలిగిన వారు, వారి దళారీల ద్వారా కొనగలిగినవారు మాత్రమే ఆ వేళకు దర్శనం క్యూలైన్లలో ఉంటారు. ఎమ్మెల్యేగారి సిఫారసు ఉత్తరం మీద మన ఛాతీని ఉప్పొంగించేలాగా ‘వీఐపీ’ అనే పదం చూసుకుని మురిసిపోయాం. కానీ టికెటు మీద ‘బిగినింగ్ బ్రేక్’ అని ఉంది. సర్వదర్శనం ఒత్తిడిని స్మరణకు తెచ్చేలాగా వేలాదిగా జనం తొడతొక్కిడిగానే ప్రవహిస్తుండే క్యూలైనులోకి ప్రవేశించిన తర్వాత.. ఆ తేడా తెలిసొస్తుంది. పక్కన పక్కన తిరునామాలు వేయించుకుని ఉన్న అరవ కన్నడాది భక్తులను అనుమానాస్పదంగా పరామర్శిం చిన తర్వాత వారందరూ వీఐపీ హోదాను కొన్నవారే నని తెలిసొచ్చింది. కాపోతే వారు వెచ్చించిన ధర తెలిసి గుండె కలుక్కుమంది. వారి సిఫారసు బోర్డు మెంబరుదట. టికెటు ఒక్కింటికి అయిదువేలే పడిరదిట. ‘ఆహా మాకు దొరికిన వాడు ఎంచక్కని ఊర్థ్వపుండ్రాలతో ఎంత చక్కగా శఠగోపం పెట్టాడో కదా’ అనిపించింది. వెల్ల వేశాక, వెలయాలికి సెలవు చేశాక.. వెనక్కు తీయడం తరమేనా? ఆ వరుసలోనే వీడు కూడా. సర్లే.. ఎంతైనా దేవదేవుడి కొరకే కద! సమాధానపడిరది మనసు.
ముగ్గురం వచ్చాం, మిత్రులం! సుశాంత్, సుమంత్, నేను. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా గతంలో ఒకే ఆఫీసులో చేసేవాళ్లం. నిజానికి ఆ ఇద్దరి కంటె నేను చాలా పెద్దవాడిని. కానీ, అమెరికా వెళ్లగల రెక్కలు తొడుక్కోవాలనే కోర్కె.. మాకు మైత్రీసూత్రం అయింది. మొత్తానికి ఇప్పుడు ఆ కోర్కెలు ఫలించే రోజులొచ్చాయి. ఒకసారి పెద్దాయన దగ్గరకెళ్లి మొక్కి, ముడుపు చెల్లించి, డీల్ కుదుర్చుకుని అభయ ముద్రాంకితులమైతే.. ఆ తర్వాత వీసా అనే ముద్రకు ఇబ్బంది ఉండదని ఒక ఆశ. కైంకర్యానికి కట్టలుగానే సొమ్ములు తెచ్చాం. మాలో ఇద్దరికి పెళ్లయింది గానీ కుటుంబాలతో రాలేదు. సకుటుంబంగా అమెరికాకు వెళ్లడమూ లేదు. ముందు అక్కడ డాలర్ల సేద్యం దిగుబడులు తీసిన తర్వాత గానీ.. తీసుకెళ్లే ఆలోచన లేదు. కర్ణాకర్ణీగా ఇక్కడి సిఫారసుల ధరవరల దోపిడీ తెలిసిన తర్వాత.. కుటుంబం సహా రావడానికి సాహసం చిక్కలేదు. వీసా పర్వం అయ్యాక మూడొందల టికెట్లతో దర్శించుకోవచ్చునని, ఇప్పుడు కార్యార్థులం గనుక.. మేం ముగ్గురం మాత్రమే వొచ్చాం. నా పక్కనున్న కన్నడోడికి దొరికిన ధరకే నాకు టికెట్ దొరికి ఉంటే శ్రీమతిని కూడా తీసుకొచ్చి ఉండేవాడిని. ఇంతకూ ఇప్పుడేం చేస్తోందో.. నా అందమైన శ్రీమతి? ఈ పాటికి నిద్ర లేచిందో లేదో?
క్యూలైను ఆగి ఆగి నెమ్మదిగా కదులుతోంది. సుమంత్ బుర్రలో కూడా ఇంతసేపు ఈ లెక్కలే తిరుగుతున్నట్టుంది. ‘ఇలా రోజూ వేలకు వేలు దండి ఏం చేస్తాడు వీడు?’ అన్నాడు కసిగా, గుసగుసగా! సుశాంత్ అందుకుని ‘సినిమా ప్రొడ్యూసర్లకు అయిదార్రూపాయల వడ్డీకి ఫైనాన్స్ కూడా వీళ్లే చేస్తుంటారు తెలుసా?’ అన్నాడు గంభీరంగా, అదే గుసగుసతో. ‘ఆర్రూపాయలా.. మనం రెండు రూపాయల ధర్మవడ్డీకి ఇస్తోంటేనే, ఫ్రెండ్స్ చుక్కలు చూపిస్తున్నారు’ అక్కసు కక్కేశాడు సుమంత్. ఈలోగా ఓ పొలికేకలా వినిపించింది.. ఆ సమయానికి లైనుతోపాటు ఆగి ఉన్న మాకు ముందువైపు నుంచి సుమారు పదీ ఇరవై అడుగుల దూరంలోంచి.
‘‘అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా గో..వింద’’ పదుల సంఖ్యలో స్వరాలు వంత పాడాయి.. ‘గో..వింద’! స్వరాన్ని అనుసరించి అటుకేసి చూపు సారించాను. నడివయసు దాటిన ప్రౌఢ, యాభై దాకా ఉండొచ్చు. తిరునామమే.. పుల్లతో కాదు, వేలితో వెడల్పుగా పెట్టుకుని ఉంది. దాని పాదం దగ్గర చందనపు బొట్టు. కళ్లకు చిక్కటి కాటుక, ముదురు కెంజాయ రంగు నేత చీర కట్టుకుంది. మెడలో పెద్దపెద్ద నవరత్నాలతో కూర్చిన దండ, దానికి వేళ్లాడుతున్న వెంకన్న! పొట్టిపొట్టి రింగులతో ఉన్న జుత్తును విరబోసుకుంది. భుజాల అంచుల దాకా విస్తరించిన నల్లటి ఆ కేశధామంలో కొలువుతీరిన ముగ్ధలాగా.. నిమ్మపండు వర్ణంలో ఉందామె మొహం. రంగులద్దిన పెదవులు బిగ్గరగా అరుస్తున్నాయి. మోర ఎత్తినప్పుడు కంఠనాళాలు భీతిగొలిపేంతగా ఉబ్బుతున్నాయి.
‘‘ఆర్తత్రాణ పరాయణా.. అనాథ రక్షకా.. దీనబాంధవా.. ఆపద మొక్కుల వాడా.. ఏడుకొండల వాడా.. గోవిందా.. గో..వింద’’ మరింత బిగ్గరగా అరచింది. ఈసారి మరిన్ని స్వరాలు జతకలిసి ‘గో..వింద’ అన్నాయి. మా పెదవులు కూడా కదిలాయి. క్యూలైను పొడవునా గుసగుసలుగా, కోలాహలంగా, రణగొణగా ఉన్న సద్దు కాస్త శాంతించింది. ఆమె చుట్టూ ఉన్న జనంలో బడి ఈడు పిల్లలు ఓ పదిమంది దాకా ఉన్నారు. వారినుద్దేశించి.. ఒకడి భుజం తడుతూ ‘‘ఏయ్ పిల్లలూ సైలెంటుగా ఉన్నారే.. నాతో పాటు అనండి.. వేంకటరమణా గోవిందా గో..వింద’’. వాళ్లందరూ అరిచారు. ‘‘అబ్బే లాభం లేదు. పిల్లలై ఉండీ ఇంత నీరసంగానా. నేను భయపడేంత గట్టిగా అరవాలి.. స్వామి దర్శనం కాగానే మీకందరకీ తలా ఒక లడ్డూ పెట్టిస్తా.. అనండి.. శ్రీనివాసా గోవిందా గో..వింద’’. పిల్లలు తుళ్లుతూ, ఆమె తీసిన రాగాన్ని అవకరంగా అనుకరిస్తూ ఇంకాస్త బిగ్గరగా అరిచారు. ఆమె మళ్లీ వారిని రెట్టించలేదు. కానీ చేతులు రెండూ పైకెత్తి జోడిరచి.. కళ్లు మూసుకుని, పెద్దగా ‘గోవిందా గో..వింద’ అంది. ఆమె చేతుల భంగిమ, తరంగంలా అటు ఇటు కదులుతున్న తీరు చూసి, పాట అందుకుంటుం దనిపించింది గానీ, చేతులు ఆ ముద్రలోనే ఉంచి, నిశ్శబ్దం అయిపోయింది.
రెండు నిమిషాలు వేచి చూశాడేమో.. నా వెనుకనుంచి ఎవడో ‘‘గొంతులో తడారిపోయింది’’ అని కిసుక్కున నవ్వాడు. మాకు ముందుగా కొంతదూరంలో ఉన్న ఆమెకు ఆ మాటలు వినిపించే అవకాశం లేదు. మరికొన్ని నవ్వులు చిలికాయి.
ఇంకో రెండు మూడు నిమిషాలు గడిచేలోగా.. మళ్లీ గలగలలుగా, గుసగుసలుగా, ఇంకా జోరందు కోని వర్షానికి ఆగిఆగిపడుతున్న చినుకుల రొదలాగా మాటలు మొదలైపోతున్నాయి. ఎవరో వినిపించీ వినిపించనట్టుగా వేంకటేశ్వర సుప్రభాతమూ, స్తోత్రాలు చదువుకుంటున్నారు. ఒకావిడ పెట్టుకున్న చెవిజూకాలను ‘ఎక్కడ కొన్నారక్కా’ అని పక్కనే ఉన్న ఓ కాలేజీ అమ్మాయి అడుగుతోంది. ఇంకో కుర్రాడు.. ఒక పడుచు మహిళ వస్త్రధారణతో దాచలేక పోయిన దేహభాగాలన్నింటినీ తదేక దీక్షతో చూస్తున్నాడు. ఇంతలో ఆమెకు సమీపంలో ఓ చంటిబిడ్డ కేర్‌మని తారస్థాయిలో అందుకున్నాడు. అమ్మ సముదాయిస్తోంది.
‘‘లడ్డూ పెడతా గోవిందా..’’ అని ఆమె పెద్ద పొలికేకతో మళ్లీ అందుకుంది. ఆ అదుటుకు పసివాడు ఏడుపు కూడా ఆపేశాడు. ఆ పసిబిడ్డ బుగ్గలు పుణుకుతూ ‘‘నీకు లడ్డూ పెడతా గోవిందా’’ అంది, వాడికే పెట్టేటట్టు. ‘నీకు దద్దోజనం పెడతా గోవిందా’, ‘నీకు చక్కెర పొంగలి పెడతా గోవిందా’ ఇక ఆమె అరుపులు రకరకాల విన్యాసాలు దిద్దుకుంటున్నాయి. స్వామివారి నిత్య కైంకర్యాలను తన కేకల్లో నివేదించేస్తోంది. క్యూలో ఉన్న భక్తుల్ని మొత్తం ఆమె తన కబ్జాలోకి తీసుకుంది. తన కేకలకు వంతగా క్యూలో ఉన్న భక్తులు అరవకపోతే.. చేతిసైగలో సూచిస్తోంది. మొత్తానికి క్యూలైను మొత్తం ఆర్తత్రాణ పరాయణుడిని నివేదించుకునే నినాదాలే అయిపోయాయి.
మహాద్వారం దాటాక కాస్త నెమ్మదించిందామె. రంగనాయక మండపం, ధ్వజస్తంభం, వెండివాకిలి దాటుతుండగా.. పూర్తిగా నిశ్శబ్దం అయిపోయింది. ఏదో తన్మయత్వంలో చేతులు జోడిరచుకుని పెదవులు మాత్రం కదుపుతూ అలౌకికంగా ఉంది. ఇంచు మించుగా మేమందరం కూడా! వీఐపీ బ్రేక్ దర్శనం గనుక బంగారువాకిలి, జయవిజయుల్ని దాటనిచ్చి వేంకటేశ్వరుణ్ని కాస్త దగ్గరినుంచి చూడనిస్తున్నారు. ఇంకా మేం స్వామిని సమీపించ లేదు.
‘కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి, ఘనమైన దీపసంఘములు గంటి, అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి, కనకాంబరము గంటి..’ ఎంత సొగసుగా చెప్పాడు అన్నమయ్య. క్యూలోనే ఉన్నప్పటికీ బంగారు వాకిలి నుంచే కనిపిస్తున్నాడు వజ్రకిరీటధారిగా దివ్య సమ్మోహనా కారుడైన స్వామి. జోడిరచిన చేతులు విడువకుండా, ఆ లిప్తపాటులో ఆ భాగ్యం కోల్పోతామనే భయంతో, రెప్ప వాల్చకుండా స్వామి చెంతకు అడుగులు వేస్తున్నాం. ‘అరుదైన శంఖ చక్రాదులిరుగడ గంటి, సరిలేని యభయ హస్తము గంటి, తిరువేంకటా చలాధిపుని జూడగ గంటి, హరి గంటి గురు గంటి..’ గురువు కూడా ఆయనేనా.. పునీతం అయిపోతున్న భావన.
స్వామి దర్శనం పూర్తయింది. అయ్యకు అన్నం పెట్టిన వకుళమ్మను కూడా చూసుకుని, ఆ ప్రాంగణంలో వేదపారాయణ మండపాల వద్ద కూచున్నాం. స్వామిని చూస్తుండగా.. కమ్మిన మైకంలో అసలు సంగతి మర్చిపోయాను. వీసా అప్లికేషన్ ఆయనకు నివేదించడం.
‘‘మనం వచ్చిందే అందుకు కదా.. అది మర్చిపోతే ఎలా.. నేను క్యూ మొత్తం అదొక్కమాటే చెప్పాను దేవుడికి’’ అన్నాడు సుశాంత్. ‘‘చెప్పకపోతే పెద్దాయనకు తెలీదా?’’ అన్నాను. వాడు బాధించాలని చూశాడు. నేను దబాయించి బయటపడ్డాను.
********************
ఆ రాత్రి ఓ రెస్టారెంటులో ఉన్నాం. ఉదయం దర్శనం తర్వాత టిఫినూ, శిలాతోరణం దాకా వెళ్లివచ్చాక మధ్యాహ్నం భోజనమూ. తరిగొండ వెంగమాంబ ఏ భిక్ష పెడితే అదే తినితీరాలన్న నా పట్టుదల మీద అన్నదాన కాంప్లెక్సులో కానిచ్చాం. ఇప్పుడిలా రెస్టారెంటులో.
కబుర్లు చెప్పుకుంటూండగా.. పక్క టేబుల్ మీద ఆమె కనిపించింది. క్యూలైన్లో కుదురుగా నిల్చోకుండా దేవుడికి లడ్డూలు, చిత్రాన్నం, దద్దోజనం, చక్కెర పొంగలీ ఆఫర్లు పెట్టిన ఆవిడ. మా వాళ్లిద్దరికీ సైగ చేసి చూపించాను. ‘‘నీకు లడ్డూ పెడతా గోవిందా..’’ ఆవిడ రాగాన్ని అనుకరిస్తూ సుశాంత్ ఓ పిల్లికూతలా కూశాడు, ఆవిడకు వినిపించే లాగానే. తలతిప్పి మా వైపు చూసింది. ఓ క్షణం మేం జంకిన మాట నిజం. అసలే ఆర్భాటం మనిషి, తగాదా పెట్టుకుంటుందేమో అని! లేచి, చిన్న చిరునవ్వుతూ వచ్చి మా టేబుల్ వద్ద ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ‘‘ఉదయం వీఐపీ బ్రేక్‌లో మీరూ ఉన్నారా నాయనా’’ అంది! అవు నన్నాం తలఊపుతూ. ‘‘స్వామి దర్శనానికి వెళ్లడం చాలా సరదాగా గడిచింది కదా’’ అంది. నోటితోనే అవునన్నాం, సుశాంత్ పిల్లికూత వలన ఏర్పడ్డ బెరుకు పోయింది. క్యూలైను ముచ్చట్లూ, ఇదివరకు తాను దర్శనానికి వచ్చినప్పటి అనుభవాలూ చెప్పడం మొదలెట్టింది. వయసు చాలా తేడా ఉంది గానీ.. సరదాగా మాతో కలిసిపోయింది. బేరర్ రాగానే అందరం మాకు కావాల్సినవి ఆర్డర్ చేశాం. కాస్త గ్యాప్ వచ్చింది.
‘‘ఉదయం మీరు భలే కామెడీ చేశారండీ’’ అనేశాడు సుమంత్.
మంచినీళ్లు తాగుతున్నదెల్లా గ్లాసు టేబుల్ మీద పెట్టి ‘‘అలా అనిపించిందా..’’ అంది కళ్లు మూసుకుని. ఆ మాటకు చిన్నబుచ్చుకున్నదేమో అనిపించింది నాకు. కొన్ని క్షణాలకు కళ్లు తెరచి, అర్థంతరంగా అడిగింది –
‘‘దేవుడు ఉన్నాడా నాయనా’’
‘‘అదేంటండీ అంత మాటనేశారు. పైగా ఉదయం అంతలేసి పొలికేకలు పెట్టారు కూడా..’’ సుమంత్ అక్కసుగా అన్నాడు.
‘‘అబ్బే అస్సల్లేడని కాదు. ఇక్కడే ఉంటాడా.. మీ యింట్లో ఉండడా అని..’’ ఆవిడ మమ్మల్ని తర్కంలోకి లాగుతున్నట్టు పజిలల్గా అడిగింది, వ్యక్తావ్యక్తంగా ఒక అసహజపు నవ్వు పులుముకుని.
‘‘ఇంట్లో కూడా ఉంటాడు గానీ, కనిపించడు కదా. కనిపిస్తే తప్ప మన అప్పీళ్లు పెట్టుకోలేం కద’’ అన్నాడు సుమంత్. సుశాంత్ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఒక నిమిషం పాజ్ తీసుకుని తను అన్నాడు.
‘‘మేడం! దేవుడు సర్వాంతర్యామి. కానీ ఈ తిరుమల ఆ దేవదేవుడు కొలువుదీరిన స్వక్షేత్రం. ఆనంద నిలయాంతరంగుడై ఉన్నాడే ఆ స్వామి, ఆ మూలవిరాట్టే మన చర్మచక్షువులకు గోచరించే జగద్రక్షకుడు’’ ఈ నిమిషం పాటు ఈ మాటల్ని వాడి బుర్రలో వండుతున్నాడన్నమాట. అయినా వాడిలో ఇంత ఉన్నదని నేను అనుకోలేదు.
‘‘కదా..’’ అన్నదామె గొంతు సవరించుకుంటూ. ఆ టోన్ గమనిస్తే.. వార్మప్ పూర్తిచేసి, ఇక జూలు విదిల్చి బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా ఉంది. ‘‘ఇక్కడే ఉన్నాడనే నమ్మకంతోనే కదా వచ్చాం. ఆ క్యూలైన్లో చూశావా.. ఇంకో అరగంటలో స్వామి దగ్గరకు వెళ్తామని, తరిస్తామని వాళ్లందరికీ తెలుసు. కానీ వాడి గురించిన చింతనలో ఎంతమంది ఉన్నారక్కడ? రియలెస్టేటు, షేరు మార్కెటు, వడ్డీ లెక్కలు, వ్యాపారంలో లాభాలు, పక్కింటోళ్ల ఆస్తులు ఇవే కదా వారు మాటాడుకుంటున్నది! ఏ ఆడది ఎంత సెక్సీగా ఉన్నది, ఎవడు ధరించిన వాచీ ఎంత కాస్ట్లీగా ఉన్నది, ఎవరు ధరించిన నగలు ఎంత మోడర్న్గా ఉన్నాయి ఇవే కదా వారు చూస్తున్నది!’’ ఆమె ఆపింది. క్యూలైన్లో మా మధ్య నడిచిన, మా చెవిన పడిన మాటలూ, గమనించిన వ్యవహారాలూ అన్నీ గుర్తుకొస్తున్నాయి.
‘‘నేనలా చెవికోసిన మేకలాగా అరుస్తున్న ప్పుడు…?’’ అప్పుడు ఏం జరిగిందో చెప్పమన్నట్టుగా ప్రశ్నను సంధించింది, తను ఆర్డరు చేసిన లస్సీ అందుకుంటూ.
అవున్నిజమే. ఆమె పొలికేకలకు జనం సైలెంట్ అయిపోతున్నారు. కొందరు వంత పాడుతూ గోవిందారావాలు చేస్తున్నారు. మొత్తానికి అందరి దృష్టిని- ఆమె తన వైపుకు, తన దైవనామస్మరణవైపు బలవంతంగా తిప్పేసుకుంటోంది. వశీకరణ మంత్రం వేస్తున్నట్టుగా..!
‘‘అవున్నాయనా! ఇక్కడ దేవుడున్నాడని మనం నమ్ముతాం. నానా పాట్లు పడి, నానా పైరవీలు చేసుకుని, బోలెడన్ని డబ్బులు తగలేసి వస్తాం. తిరుమలంటేనే దేవుడి పాదాల సన్నిధి. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచీ, దేవుడి ఆలోచనలో ఉండలేమా? పోనీ అంతటి ఏకమనస్కులం మనం కాదనుకో, కనీసం యింకో అరగంటలో దేవుడిని చూడబోతున్నాం అనే సమయంలోనైనా నీచమైన ఐహికమైన ఆలోచనలకు దూరంగా ఉండలేమా? బుద్ధిని కుదురుగా ఉంచలేమా? దేవుడు అక్కడ ఆ పెద్ద రాతిబొమ్మలో ఉంటాడో లేదో తర్వాత.. ఉంటాడని మనం నమ్మి చూడబోతున్నాం కదా.. మనసునీ, బుద్ధినీ, ఆలోచననీ, చైతన్యాన్నీ సశరీరంగా ఆయన మీద లగ్నం చేయలేమా? అందరికీ అలా కుదరడం లేదు నాయినా! అందుకే, నేను క్యూలో ఉన్న ప్రతిసారీ నా పొలికేకల్తో గావుకేకల్తో మీరు చెప్పే కామెడీతో అందరి ఆలోచనల్నీ హైజాక్ చేసే పనిలో పడతా.. అంతకు మించి పరమార్థం ఏమీ లేదు’’ చిరునవ్వు నవ్వుతూ ఆపింది.
ఏం చెప్పగలం ఆమెతో. అంత అసహ్యంగా ప్రవర్తించిన తర్వాత. అంతలా సుతిమెత్తగా, చిరునవ్వుతో మా తలంటిన తర్వాత! మేం ఆర్డర్ చేసినవి ఇంకా రాలేదు. ఆమె గ్లాసులోని లస్సీ అయిపోయింది. హోటలు కుర్రాడిచేతిలో డబ్బులు పెట్టేసి, లేచి నిల్చుంది. మేం షాక్లో ఉన్నాం. సిగ్గుతో, అవమానంతో కూడిన షాక్ అది! నేను ముందుగా తేరుకుని,
‘‘అమ్మా మీరు..’’ వెళ్లబోతున్న ఆమె గురించి తెలుసుకోవాలన్నట్టుగా అర్థోక్తిలో ఆపాను. ఆగి, నా వైపు చూసింది. ‘‘దిగువ తిరపతి పక్కనే ఒక్కదాన్నీ ఉంటాను నాయినా.. ఉద్యోగధర్మం! మా ఆయన ఇంకోచోట ఉంటాడు. ఆయన మహా బిజీ. అస్సలు ఖాళీ దొరకదు. నేనే అప్పుడప్పుడూ వెళ్లి కలిసి వస్తుంటాను.’’
‘‘ఏం అనుకోకపోతే మీ మొబైల్ నెంబరు..’’
‘‘వాడకం అలవాటు కాలేదు నాయినా! జాబు రాస్తివంటే తప్పకుండా అందుతుంది. మనసుపెట్టి తలిస్తివా, యింకా తప్పకుండా తెలస్తంది. గెమనంలో పెట్టుకో.. ఊరు- తిరుచానూరు. పేరు పద్మావతి!’’
మొబైల్ నోట్ ప్యాడ్ లో గబగబా అడ్రసు టైపు చేసుకుంటూ, ఏదో స్ఫురించి నేను తలెత్తేలోగా, ఆమె అదృశ్యjైుపోయింది.
‘హరి గంటి.. గురు గంటి..’ ఆయన మాట ఏదైనా, నా అనుభవం వేరు- ‘సిరి గంటి.. గురు గంటి..’!!