కామారెడ్డి చరిత్రాత్మక విజేత కాటిపల్లితో జాగృతి ముఖాముఖి
నిశబ్దంగా తన పని తను చేసుకుపోతూ, తుపాను ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో ప్రతిపక్షాల అనుభవానికి తెచ్చిన నాయకుడాయన… ఎన్నికల సమయానికి పెనుతుపానులా మారి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేవంత్‌రెడ్డినీ అనూహ్యరీతిలోనే అయినా అంతా ఊహించినట్టే ఓడిరచి కామారెడ్డి నియోజకవర్గం మీద బీజేపీ జెండాను ఎగరేసిన నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఏ ప్రభావమూ లేని ఎన్నికల యుద్ధంలో ‘జెయింట్ కిల్లర్’. తన గెలుపు వ్యూహం గురించి, భవిష్యత్ కార్యాచరణపైన ఆయన ‘జాగృతి’ వారపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ..
ఇది చరిత్రాత్మకం. ఈ ఘట్టానికి నేపథ్యంగా ఉన్న మీ రాజకీయ ప్రస్థానం గురించి వివరిస్తూ, మీ ఘన విజయాన్ని ఎవరికి ఆపాదిస్తారో కూడా చెబుతారా?
నేను 1990వ దశకం నుంచే రాజకీయాలలో ఉన్నాను. అయినప్పటికీ, 2018లో బీజేపీ టిక్కెట్టుపై ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలైన తర్వాతే నేనొక త్రిముఖ వ్యూహాన్ని రూపొందించుకున్నాను. 1. పార్టీ శ్రేణులను బలోపేతం చేయడం. 2. బీఆర్‌ఎస్ వ్యతిరేక నిరసనలు. 3. ఓటర్ల ధ్రువీకరణ. వీటితో పాటే అసలు డబ్బు, మద్యం పంచకుండా, ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఎన్నికలలో గెలవాలన్నది కూడా నా ప్రాధాన్యాలలో ఒకటిగా పెట్టుకున్నాను. అంతిమంగా ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనడంలో విజయవంతమయ్యాను. ఈ విజయం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. సమష్టిగా, టీంవర్క్‌తో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీజేపీ నాయకత్వానికి స్వచ్ఛమైన హృదయంతో తోడ్పడడమిది. గత ఐదు సంవత్సరాలలో నేను కేవలం ఆరుసార్లు నా నియోజకవర్గానికి దూరంగా ఉన్నాను. అదైనా పార్టీ పని కోసమే. నేను ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ అందుబాటులో ఉన్నాను. వారి సమస్యలను అర్థం చేసుకొని, పరిష్కారాలను లేదా మార్గాలను వెదకడం అప్పుడూ ఇప్పుడూ కూడా నా ప్రాథమిక దృష్టిగానే ఉంది.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ధరణి (డిజిటల్ భూ యాజమాన్య వ్యవస్థ), ఉద్యోగిత, కామారెడ్డి బృహత్ ప్రణాళిక, వరి కొనుగోలు, రేషన్ సరఫరా, వృద్ధులకు పింఛన్లు, భూకబ్జాలు, అవినీతి వంటి సమస్యలు బీఆర్‌ఎస్ చెత్త పాలన కారణంగా పునరావృతమవుతూ, నిరంతరం చర్చలో ఉన్నాయి. సంక్షేమ పథకాలు, సెటిల్మెంట్లలో పాత్ర, చట్టవ్యతిరేక, ఫోర్జరీ భూహక్కు పత్రాలు, అధికారులలో అవినీతి వంటివన్నీ ప్రతి ప్రభుత్వ రంగంలోనూ కనిపించడమే కాదు, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధనరెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అహంకారం కూడా వారి పట్ల ప్రజానీకంలో వ్యతిరేకతను పెంచింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే నేను ప్రజాదర్బార్లు నిర్వహించేవాడిని. తర్వాత వేలమంది బాధితులను ముందుపెట్టి నేను, నా అనుచరులు వారి వెనుక నిలబడి ఈ సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను నిర్వహించి, మీడియా దృష్టికి తీసుకవెళ్లేవాళ్లం. ఈ కార్యకలాపాల కారణంగా నెమ్మదిగా ప్రజలు నా మాటలను, చేతలను విశ్వసించడం మొదలుపెట్టారు. నిరసన ప్రదర్శనల సమయంలో నేను కేవలం జనాన్ని కదిలించడానికీ, ఆహార సరఫరాలకూ మాత్రమే పరిమితమయ్యేవాడిని. కేవీఆర్ ఉంటే, న్యాయం దక్కుతుందని ఇప్పుడు వారు నమ్ముతారు.
ఓటర్ల ధ్రువీకరణ
వారిలో విశ్వాసం దృఢపడిన తర్వాత, ఆలయాలపై ప్రత్యేక దృష్టితో ఓటర్ల ధృవీకరణ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపడం ప్రారంభించాను. ఆ క్రమంలోనే విభిన్న వర్గాలకు చెందిన, నిర్మాణం పూర్తికాని 700 ఆలయాలపై మా దృష్టి పడిరది. వివిధ కారణాలవల్ల ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలలో ఆటంకాలు, నిర్మాణంలో ఆలస్యం లేదా నిలిపివేత వంటి సమస్యలు తలెత్తినట్టు మా దృష్టికి వచ్చింది. వీటికి పరిష్కారంగా ప్రత్యక్ష ఆర్ధిక సహాయం కాకుండా అవసరమైన అత్యవసర సామాగ్రిని వారికి అందించడం ద్వారా నేను, నా బృందం ఈ సమస్యను చురుకుగా, శ్రద్ధగా పరిష్కరించాం. ఆలయాలకు వచ్చి తమ కోరికలను భగవంతుడికి చెప్పుకోవడం భక్తులకు గొప్ప ఊరట, సంతృప్తి. అందుకు తగిన వాతావరణం కల్పించాలన్నది నా లక్ష్యం. ఈ ఆధ్యాత్మిక లక్ష్యం ప్రజానీకంలో అపూర్వమైన సాహసాన్ని నింపి, దాదాపు ఒక దశాబ్దకాలం పాటు పరివర్తనాత్మక ప్రక్రియను రగిల్చింది. ఆలయాలను నిత్యం సందర్శించి, ప్రార్థనలు చేయడం అన్నది ప్రేరణకు మూలమై, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు, ఆ భగవంతుడు సర్వవ్యాపకుడనే నమ్మకాన్ని సుదృఢం చేసి, వ్యక్తులు తమ ఆకాంక్షలను సాధించుకునేందుకు తోడ్పడిరది.
కమ్యూనిటీ హాళ్లు కొనసాగించడానికీ, అవి ఆర్ధికంగా నిలదొక్కుకునేటట్టు చేసేందుకు నేను కట్టుబడి ఉన్నాను. నిత్యం నా నియోజకవర్గ ప్రజలతో సంప్రదింపులు, సంపర్కం అన్నవి వారి బంధువులను మించి నా వైపు నుంచి ఉండేవి. వారంతా కూడా హైదరాబాదులోనూ, ఇతర ప్రాంతాలలో ఉన్న తమ సమీప బంధువుల కన్నా ఎక్కువగా నాతో సన్నిహితంగా ఉంటూ సమస్యలను పంచుకునేవారు.
ఆర్ధిక సహాయం అన్నది నా పద్ధతిలో భాగం కాదు. నేను వారిని పెయింటింగ్, రెయిలింగ్‌లు ఏర్పాటు చేయడం, ఫ్లోరింగ్, సెంటరింగ్, సీలింగ్ పని వంటి వివిధ ఆచరణాత్మక కార్యాలలో నిమగ్నం చేయడంలో తోడ్పాటునిచ్చాను. తక్షణ సమస్యలను పరిష్కరించడమే కాక, వారి సమగ్ర సంక్షేమం, సమాజ సభ్యులలో సానుకూల పరివర్తనకు దోహదం చేయడం అన్నది ఈ సాయం వెనుక లక్ష్యం.
బీఆర్‌ఎస్ నాయకులు, షబ్బీర్ అలీ శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులకు హాజరయ్యేవారు. ఇది ఇక్కడి ప్రజలకు నచ్చలేదు. ఈ క్రమంలో రాజకీయ ప్రచారాల సందర్భంగా ఆలయాలు, మసీదుల సందర్శన అన్నది పక్కన పెట్టి తీరాలంటూ ఒక నిమిషం వీడియో రూపొందిస్తే బాగుంటుందని పించి, చేశాను. దీనికి ముస్లింల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది.
శాసనసభ్యునిగా వచ్చే ఐదేళ్లకు మీ ప్రణాళికలు ఏమిటి? పార్టీలో మీ భూమిక ఎలా ఉండబోతున్నది?
ఎమ్మెల్యేగా కొన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. అవి` 1.రేషన్ కార్డు 2.పింఛన్లు 3.భూ పట్టాపుస్తకం 4. గృహ నిర్మాణం (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) వంటి సౌకర్యాలు నా నియోజకవర్గంలో అవసరమైన వారికి చేరేలా చూడడం. వీటితో పాటు పొగ తాగకూడని, పార్కింగ్ చేయకూడని జోన్లలాగా కామారెడ్డిని అవినీతిరహిత జోన్‌గా తీర్చిదిద్దడం. నా నియోజకవర్గంలోని అవినీతి అధికారులు వారే బదలీ చేయించుకొని వెళ్లడమో లేక అవినీతికి తావు లేకుండా సేవ చేయడమో నిర్ణయించుకునేలా చేయడం. మద్యం లేదా ధన ప్రలోభాలకు లోనుచేయనప్పుడు, తప్పు చేసేవారిని గట్టిగా ఆత్మగౌరవంతో ప్రశ్నించడమే కాదు, ఏదైనా తప్పు జరిగితే అధికారులకు వ్యతిరేకంగా నిలబడే గట్టి సాహసం ఓటర్లలో ఉంటుంది. ప్రజలు అవినీతిని నివారించి, కొన్నింటికి తామే స్వచ్ఛందంగా స్వంత డబ్బు ఖర్చుపెట్టుకున్నప్పుడు ఒక బలమైన గొంతుగా ఉండేందుకు వారికి అన్నిరకాలుగా హక్కు ఉంటుంది.
ముఖ్యమంత్రి నిధుల పట్ల నేను ఎప్పుడూ సానుకూల వైఖరినే కలిగి ఉంటాను. కానీ, కావలసిన ఫలితాలను సాధించడంలో విఫలమైతే బీఆర్‌ఎస్‌తో చేసినట్టే తిరిగి ఉద్యమ పంథాలోకి వెడతాను. బీజేపీకి చెందినవారం కాబట్టి మాకు కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులో ఉంటాయి. నైపుణ్యాలు లేని యువత గల్ఫ్‌కు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలుస పోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఈ ప్రాంతంలో ఆదాయాన్ని, ఉద్యోగితను పెంచేందుకు పర్యావరణ అనుకూల పరిశ్రమలను తీసుకురావాలన్న ప్రణాళికలు నాకున్నాయి.
నాకిచ్చిన ఏ బాధ్యతనయినా స్వీకరిస్తూ, పార్టీ ఆదేశిస్తే పని చేసేందుకు సదా అందుబాటులో ఉంటాను. నన్ను ఏ మేరకు ఉపయోగించుకోవాలో పార్టీ నిర్ణయించాలి. చేస్తున్న పని పట్ల దార్శనికత, స్పష్టత నాకు ఉన్నాయి.
నిజామాబాద్‌లో ఇటీవలే నిషేధిత ఉగ్రవాద సంస్థ పిఎఫ్‌ఐ సభ్యులను ఎన్‌ఐఎకు పట్టుబడ్డారు. ఈ రాడికల్ ఇస్లామిక్ శక్తులను మీరు ఎలా చూస్తారు?
నా అభిప్రాయంలో ఈ అంశం దారిద్య్రం, సమాజంలోని దుష్టశక్తులు ముస్లింలను సమాజ వ్యతిరేక, జాతి వ్యతిరేక వైఖరిని తీసుకోవాలని బోధించి, తర్ఫీదునివ్వడం కారణంగా ఉత్పన్నమవుతున్నది. ఒక సాధారణ ముస్లిం, రాడికల్ ఇస్లాం బాధితుడవుతున్నాడు. సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన కొందరు ముస్లింలకు చిన్న వయసులోనే బ్రెయిన్‌వాష్ చేయడం, వారు వైద్యులుగా, ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలలో విద్యార్ధుల ముసుగులో చెలామణీ అవుతూ కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, ముస్లింలలో దారిద్య్రం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముస్లింలు సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ రాడికల్ శక్తులు వీరిని చేరుకుని, సాంత్వన కల్పించి, తర్వాత వారిని తీవ్రవాదం దిశగా మళ్లేలా ప్రభావితం చేస్తారు. దారిద్య్రాన్ని నిర్మూలించి, వారికి మంచి విద్యనందించడం అన్నది వారిని తీవ్రవాదం నుంచి దూరంగా ఉంచుతుంది.
మీకు స్ఫూర్తి ఎవరు?
నా తండ్రి రాజారెడ్డి. 60లు, 70ల కాలంలో 25 సంవత్సరాల పాటు సమితి ప్రెసిడెంట్ హోదాలోనే పని చేస్తూ, రాజకీయ భూమికలకు అతీతంగా ఇద్దరు ఎమ్మెల్యేలు చూపగలిగేటంత ప్రభావాన్ని ఆయన కలిగి ఉండేవారు. అదే నేను రాజకీయాలలోకి రావడానికి ప్రేరణ. పాలనారంగంలో ఎన్‌టీఆర్ తెచ్చిన పునర్వ్యవస్థీకరణ, సంక్షేమ పథకాలు, రాజీవ్ గాంధీ రాజకీయ వ్యూహం, హిందువులకు ధైర్యాన్ని ఇస్తూ అడ్వానీజీ చేపట్టిన రామ జన్మభూమి రథయాత్ర, మోదీజీ అభివృద్ధి నినాదం` ఇవన్నీ కూడా నా రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేశాయి.
మీ వెనుక ఉన్న శివాజీ విగ్రహానికి ఉన్న ప్రతీకాత్మక ప్రాముఖ్యం కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రాధాన్యం ఎలాంటిది?
ధర్మసంరక్షకుడిగా, బలమైన రాజ్యాన్ని ఏర్పరచినవాడిగా శివాజీ వారసత్వాన్ని ప్రతిబింబించేదే ఈ మూర్తి. ఇక ఈ ప్రతిమ ఇచ్చే సందేశం మన చూపే సామాజిక బాధ్యత, అందించే సామాజిక సేవలో ఇమిడి ఉందని నేను భావిస్తాను. భిన్న విశ్వాసాలను గౌరవించడం, విద్యను, విలువలను ప్రోత్సహించడం అన్న సూత్రాలపై ఆయన తన రాజ్యాన్ని నిర్మించారు. అవి నేటికి కూడా సహేతుకమైనవి, ఉచితమైనవి. ప్రతి మలుపులోనూ స్వీయ లబ్ధి కోసం ప్రయత్నించకుండా, మనమంతా కూడా సామాజిక సంక్షేమపరంగా ఆలోచించాలి. అనేకమంది ప్రజలు గ్రామాలలో పెరిగి, నగరాలకు వలస వెళ్లిన తర్వాత వారు తమ మూలాల నుంచి విడవడి, తమ సమాజాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. సరిగ్గా ఇక్కడ శివాజీ ఉదాహరణ ముఖ్యమైంది. తన స్థాయి ఏదైనా, ఆయన తనని తాను ప్రజలకు అంకితం చేసుకున్నాడు. ఎమ్మెల్యే లేదా ఎంపీ నిధులపై ఆధారపడడం అన్నది విషయం కాదు. వైద్యులు, ఇంజినీర్లు, విద్యావేత్తలు, ప్రొఫెషనల్స్ కూడా తమ ఆదాయంలో చిన్న భాగాన్ని ఇవ్వడం ద్వారా తమ గ్రామాల సంక్షేమానికి దోహదం చేయవచ్చు. తాము వచ్చిన మూలాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తిరిగి సమర్పించుకోవడం ప్రారంభిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించండి! ప్రతి గ్రామం కూడా శివాజీ చేసిన సేవలకు మించి మెరుగుపడుతుంది.
ఇంటర్వ్యూ : కె. సురేందర్