ఆధునిక భారత రాజకీయాలలో ఏమాత్రం నిలకడ లేని నాయకుడు రాహుల్ గాంధీ. అందుకే కాబోలు. ఆయన సూచన మేరకు బాలసార జరిగిన ‘ఇండియా’ కూటమిలో కూడా మొదటి నుంచి అంతే అనిశ్చితి కనిపిస్తున్నది. ఇండియా ఏర్పడిన తరువాత కొన్ని ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచినా, తమకు ప్రాధాన్యం లేదంటూ భాగస్వాములు అలగడం రివాజుగా మారింది. కర్ణాటక ఎన్నికల వేళ మిత్రపక్షాల నుంచి కాంగ్రెస్ అదే ఆరోపణను ఎదుర్కొన్నది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలోను విజయం సాధించినా అదే నిష్టూరాలని భాగస్వాముల నుంచి ఎదుర్కొంటున్నది. చిత్రంగా తెలంగాణలో ఏర్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అనిశ్చితి వెంటాడడం ఖాయం. మ్యాజిక్ నంబర్‌కు మించి తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన స్థానాలు నాలుగంటే నాలుగు. చిత్రంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల తరువాత ఇండియా కూటమి ఇంకాస్త అస్థిర పరిస్థితులలోకి వెళ్లిపోయింది. ఇక్కడ బీజేపీ గణనీయమైన విజయం సాధించింది. ఆ పరిణామాన్ని బట్టి విపక్షాల మధ్య బంధం ఇంకా గట్టిపడవలసి ఉందని అర్థమవుతుంది. కానీ వాటి మధ్య దూరం పెరుగుతోంది. టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ, జనతాదళ్ (యు), ఆర్‌జేడీ బాహాటంగానే కాంగ్రెస్‌కు చీవాట్లు పెట్టాయి. డిసెంబర్ ఆరో తేదీన ఢల్లీిలో జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి తాను హాజరు కాబోవడంలేదని ఈ వ్యాసం రాసే సమయానికి మమతా బెనర్జీ చెప్పేశారు. ఆమె ఆ మాట మీద ఉంటారో లేదో వేచి చూడాలి. ఎన్నికల సమయంలో తమకు మధ్యప్రదేశ్‌లో పోటీకి అవకాశం ఇవ్వనందుకు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ మెటికలు విరిచిన మాట నిజం. అఖిలేశ్ గిఖిలేశ్ పక్కన పెట్టిండి అని సాక్షాత్తు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు కమలనాథ్ వ్యాఖ్యానించడం అఖిలేశ్ తీవ్రంగా పరిగణించక తప్పని పరిణామమే.
తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి చర్చించడానికి డిసెంబర్ 4వ తేదీన ఢల్లీిలో సమావేశమైన కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాల సమావేశం ఇండియా కూటమిలోని డొల్లతనాన్నే దేశం ముందు ప్రదర్శిం చింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఇండియా కూటమి భాగస్వాముల మధ్య ఉండవలసిన సయోధ్య గురించి ఒక అంచనాకు వచ్చే ఉద్దేశంతో జరిపిన ఈ సమావేశంలో పెదవి విరుపులే ఎక్కువ వినిపించాయి. పైగా దీనికి సోనియా గాంధీ అధ్యక్షత వహించారు. భాగస్వాములందరి బాధ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీది ఒంటెత్తు పోకడ. కానీ బీజేపీయేతర పక్షాల మధ్య మరింత సయోధ్య పెరగవలసిన అవసరం ఉందని ఈ సమావేశం అభిప్రాయ పడిరదని దౌత్యభాషలో పార్టీల అధికార ప్రతినిధులు చెప్పడం విశేషం. ఎస్పీ, టీఎంసీ, వామపక్షాలు, ఎన్‌సీపీ వంటి పక్షాలన్నీ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకోవాలని కోరారట. కానీ డిసెంబర్ ఆరున సమావేశం ఎలా జరుగుతుందో ఈ సమావేశంతోనే తేలింది. టీఎంసీ తాను హాజరు కావడం లేదని చెప్పేసింది. ఇంతకీ ఎన్నికల ఫలితాల గురించి సమావేశమైన ఈ పక్షాలు ఆ పని చేయకుండానే లేచి వచ్చేశాయి. శరద్ పవార్ చేసిన ప్రకటనే ఇందుకు రుజువు. మేం మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైనప్పుడు ఇంకా కూలంకషంగా చర్చిస్తామని ఆయన అన్నారు. ఇది చాలు ఇండియా కూటమి నడక ఎటు సాగుతున్నదో తెలియడానికి!
హిందీ భాషా ప్రాంతాలకు కీలకమైనవిగా చెప్పే మూడు రాష్ట్రాలలోను కూడా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం పట్ల మమతా బెనర్జీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ఘోర పరాజయం అపశకునంగానే మమత పరిగణిస్తున్నారు. వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదే. అక్కడ కాంగ్రెస్ ఓటమి అంటే అదేదో ఇండియా కూటమి ఓటమిగా చూస్తే ఏమాత్రం కుదరదని కూడా ఆమె తెగేసి చెప్పేశారు. ఎన్నికల వ్యూహాలు ఎప్పుడూ పటిష్టంగా ఉండాలే తప్ప, ఊకదంపుడు ఉపన్యాసాలతో ఓట్లు వచ్చిపడవు అని మమతా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రకటించారు. అయితే ఓట్లు ఎలా వచ్చి పడతాయో మమత దగ్గర తర్ఫీదు పొందితే మంచిదే. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఆమె ప్రదర్శించే విద్యలన్నీ కాంగ్రెస్ నేర్చుకుంటే ఫలితాలు రావచ్చు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రదర్శించినదంతా జమిందారీ పోకడ అని ఆమె పేరు పెట్టారు. ప్రతిపక్షాల ఓట్లు ఇలా చీలికలు పేలికలు అయితే ఎలా అన్నదే ఆమె ప్రశ్న. ఇక్కడ మరొక ప్రశ్న కూడా పాఠకులకు వస్తుంది. కాంగ్రెస్‌కు ఆ మాత్రం జ్ఞానం లేకపోయినా విపక్షాల ఓట్లు చీలిపోకుండా చూసే బాధ్యత మమత, అఖిలేశ్, తేజస్వీ యాదవ్ వంటి వారు ఎందుకు స్వీకరించరు? కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఆ మూడిరటి వలె ప్రాంతీయ పార్టీ కాదు. దానికి అన్ని రాష్ట్రాలలోను కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి బీజేపీని ఓడిరచడమే వాటి అంతిమ ధ్యేయమైతే ఆయా ఎన్నికల పోరాటాలలో కాంగ్రెస్‌కే ఈ పార్టీలు ఎందుకు చేయూతనివ్వకూడదు? అసలు ఇదే కాంగ్రెస్ అంతరంగమై ఉండవచ్చు కూడా. అయినా ఆ మూడు ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాలలో ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు అక్షరాలా బిచ్చం పడేసినట్టు మూడేసి నాలుగేసి స్థానాలు కేటాయిస్తుంటాయి. కానీ ఈ పార్టీలకు ఏ మాత్రం ఉనికి లేనిచోట పోటీ చేస్తే మాత్రం తమను గుర్తుంచు కోవడం లేదని వాపోవడం ఏపాటి విజ్ఞత ఉన్నదో అర్ధం కాదు. ఎన్నికల బరిలో కాంగ్రెస్ సమాజ్‌వాదీ వంటి పార్టీలకు ఎందుకు స్థానాలు కేటాయించడం లేదని ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా ప్రశ్నించింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ ఇండియా కూటమి నిబంధనలను ఏ మాత్రం గౌరవించడం లేదని ఉద్ధవ్ శివసేన పత్రిక సామ్నా ప్రశ్నించింది కూడా. ఈ విమర్శ రాహుల్, ప్రియాంకా వాధ్రాలకు కూడా వర్తిస్తుందని మరొక చురక కూడా వేసింది. ఇలాంటి నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం విజయవంతం కావడం ఎంత వరకు సాధ్యమని ఈ శివసేన వర్గ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మరొకపక్క ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది మూడు రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం తరువాత మోదీని అభినందించడం విశేషం. అసలు ప్రాంతీయ పార్టీల బలం మీద కాంగ్రెస్‌కీ, రాహుల్‌కీ నమ్మకం గౌరవం ఉన్నాయా అన్న విచికిత్సకు ఆ పార్టీలన్నీ లోనవుతున్న వాతావరణం స్పష్టంగా నెలకొని ఉన్నది. ఒక వాస్తవం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తనకు కాస్త బలం ఉన్నచోట ఇండియా భాగస్వాములకు స్థానాలు కేటాయించడం కాంగ్రెస్‌కు కూడా ఇష్టం ఉండదన్నది అనుభవజ్ఞుల మాట.
కేరళం ముఖ్యమంత్రి, సీపీఎం నాయకుడు పినరయ్ విజయన్ కూడా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు మీద ప్రతికూల వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ మరీ అత్యాశకు పోతున్నదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి వల్ల ఇండియా భాగస్వాముల మధ్య ఐక్యత సాధ్యం కావడం లేదని ఆయన అంటున్నారు. ఇక బీజేపీని ఓడిరచే ప్రయత్నం ఎందుకు విజయవంతం అవుతుందని కూడా అన్నారు. ఎంతైనా మార్క్సిస్టు కాబట్టి వీళ్లకి సహజంగానే జ్ఞానం ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ మేరకే పినరయ్ మరొక సంగతి బయట పెట్టారు. మధ్యప్రదేశ్ ఎన్నికలలో సమాజ్‌వాదీని కలుపుకుని వెళ్లాలని దిగ్విజయ్ సింగ్ ప్రయత్నించినా, మరొక నాయకుడు కమల్‌నాథ్ ఆ ప్రయత్నానికి గండి కొట్టారని పినరయ్ చెప్పారు. పినరయ్‌కి నిజంగానే తెలంగాణ ఎన్నికల సరళి తెలిసినట్టు లేదు. ఇక్కడ సీపీఎంను సోదర సీపీఐ దూరం పెట్టింది. పాత చుట్టరికం మేరకు సీపీఐకి మాత్రం కాంగ్రెస్ ఒక్క స్థానం పడేసింది. సీపీఎం తెలంగాణలో 19 చోట్ల అభ్యర్థులను నిలిపి ఒక్కచోట కూడా ధరావతును తెచ్చుకోలేకపోయింది. కమ్యూనిస్టులు ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. వాటిలోని నిజం ఫలితాల తరువాతనే తెలుస్తుంది. తెలంగాణలో అదే జరిగింది. మధ్యప్రదేశ్ ఎన్నికలలో తనతో కలసి పోటీ చేయనందుకు అసలే మంట మీద ఉన్న అఖిలేశ్ మరొక సత్యం కూడా బయట పెట్టాడు. అహంకార యుగం అంతమైందని పెద్ద ప్రకటనే చేశారాయన. మీరైనా, మేమైనా బీజేపీ వంటి పెద్ద రాజకీయ శక్తిని ఓడిరచాలంటే చాలా కసరత్తు అవసరమవుతుందని ఇంకా పెద్ద సంచలన వాస్తవం చెప్పారు అఖిలేశ్. సమాజ్‌వాదీ నేతకీ, సంజయ్ రౌత్ వంటి వారికి మోదీ మీద ఉన్న ఆగ్రహాన్ని అర్ధం చేసుకోవచ్చు.
1989 ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన ప్రాంతీయ పార్టీలు ఒక్కసారిగా 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభను కోల్పోయాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇందుకు ఉదాహరణ. కొన్ని చోట్ల, అంటే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ, ఒడిశాలో బిజూ జనతాదళ్ ప్రాంతీయ పార్టీలే అయినా ఇండియా కూటమి సుదూరంగా ఉంటూ, అవసరమైనప్పుడల్లా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉపయోగ పడుతున్నాయి. అయినా ఇండియా వెంట దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ నడుస్తున్నాయని ఎవరు చెబుతారు? కానీ కర్ణాటక, తెలంగాణ ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకోవలసిన అవసరం కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ. ఆ రెండు రాష్ట్రాలలోను కాంగ్రెస్ పార్టీయే విజేత. ఒకచోట జాతీయ పార్టీ బీజేపీని ఓడిరచింది. మరొక చోట ప్రాంతీయ పార్టీని ఓడిరచింది.
ఇదంతా చూస్తుంటే ప్రాంతీయ పార్టీల పాత వైభవాన్ని 2024 లోక్‌సభ ఎన్నికలతో అయినా పునరుద్ధరించుకోవాలన్న ఆశ తాజా అసెంబ్లీ ఎన్నికలు వమ్ము చేశాయని, అందుకు కాంగ్రెస్ కారణమని ఆ పార్టీలు గట్టిగా నమ్ముతున్నట్టే ఉంది. తమ రాష్ట్రాలలో మాత్రం కాంగ్రెస్ వీరి దయాదాక్షిణ్యాలకు లోబడి అభ్యర్థులను నిలపాలి. ఇందులోని వాస్తవికత ఎంత? అంతో ఇంతో పునాది ఉన్న బీఎస్పీయే తెలంగాణ ఎన్నికలలో చతికిల పడిరది. వందకు పైగా స్థానాలలో అభ్యర్థులను నిలిపినప్పటికీ ఒకటి రెండు చోట్ల మాత్రమే ధరావతు వచ్చింది. ఇక కాస్త పునాది కూడా లేని సమాజ్‌వాదీ, ఆర్‌జేడీ వంటి పార్టీలు ఇక్కడ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి? కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా అవి ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటాయి? అంటే కాంగ్రెస్ గెలిపిస్తే తమ ఘనతగా అవి చెప్పుకుంటాయి. ఇంత భారం తానెందుకు మోయాలన్నదే కాంగ్రెస్ ప్రశ్నలా కనిపిస్తుంది. వారి వారి రాష్ట్రాలలో బిచ్చం పడేసినట్టు స్థానాలు పడేసే వారి భారం కాంగ్రెస్ మోయాలని చెప్పడం విచిత్రం. ఇదే కూటమి ధర్మం అంటే కూటమే నిలబడలేదు. నిజానికి ఇండియా కూటమి ఆ దిశగానే వెళుతోంది. జేడీ(యు) అధికార ప్రతినిధి సునీల్ కుమార్ పింటూ ఏమన్నారు? 2024 ఎన్నికలలో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే ప్రాంతీయ పార్టీలతో మరింత సయోధ్యగా ఉండాలట. ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తిసింగ్ యాదవ్ ప్రకటన మరీ విడ్దూరం. కాంగ్రెస్ నాయకత్వం ఈ ఎన్నికలలో ఇండియా కూటమి నాయకులను ప్రచారం కోసం కాంగ్రెస్ పిలిచిందా? లేదు. ఒకవేళ కాంగ్రెస్ ఆ పని చేసి ఉంటే కాంగ్రెస్ ఇంత దారుణంగా ఓడిపోయి ఉండేది కాదు అన్నారాయన. నిజంగా ఆయన ఆత్మ విశ్వాసానికి జోహäర్లు. ఇదంతా చూస్తుంటే ఓడిపోయినప్పుడు ఆ ఘనత కాంగ్రెస్ సవినయంగా స్వీకరించాలని, గెలిస్తే ఆ ఫలితం మాత్రం ఇండియా కూటమికి దక్కాలని ప్రాంతీయ పార్టీలు గట్టిగా కోరుకుంటున్నట్టే ఉంది. అందుకు కాంగ్రెస్ ఎలా అంగీకరిస్తుంది? పార్టీ ఓడిపోతే స్థానిక కాంగ్రెస్ నేతలు బాధ్యత వహించడం, నెగ్గితే నెహ్రూ`గాంధీ కుటుంబానికి ఆ ఘనత చెందడం అక్కడి సంస్కృతి. ఈ సంస్కృతిని మేం కూడా అనుసరిస్తామని బీజేపీయేతర విపక్షాలు అంటే కాంగ్రెస్‌కు ఆమోదయోగ్యంగా ఉంటుందా?
– జాగృతి డెస్క్