డిసెంబర్ 10 ధన్వంతరి జయంతి
‘జాగృతి’ జాతీయ వార పత్రిక తన ఏడున్నర దశాబ్దాల అక్షర యజ్ఞ ప్రస్థానంలో అనేక అంశాలను స్పృశిస్తూ వస్తోంది. అలాంటి వాటిలో మరో ముఖ్యాంశం ఆయుర్వేద వైద్య విధానం. దీనిపై ఎన్నో సంచికలలో, ఎన్నో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ప్రధానంగా ‘ఆంధ్రాయుర్వేద పరిషత్’ స్వర్ణోత్సవాల సందర్భంగా వెలువడిన ప్రత్యేక సంచిక (13.1.1975)లో ఆయుర్వేద వైద్యం ఆవిర్భావం, చికిత్సా విధానం, విదేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వైనం, అనంతర కాలంలో దీనిపై కమ్ముకున్న నిర్లక్ష్యపు నీడలు… తదితర అంశాలను విశ్లేషించింది. ఆయా రచయితల వ్యాసాల సారాంశంతో ‘ధన్వంతరి’ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం..
ఆయుర్వేదం ఎంత ప్రాచీన దేశీయ వైద్యమో, అంత ఆధునికమని, మన దేశానికి ఒకే సంస్కృతి, ఒకే నాగరికత, ఒకే జాతీయపతాకం ఉన్నట్లు, ప్రాచీన వైద్యంలో ఆయుర్వేదం భారతదేశ జాతీయ సమగ్ర వైద్య విధానమని ఎందరో వైద్య నిపుణులు శ్లాఘించారు. ఇది దేశదేశాలను విశేషంగా ఆకర్షించిందని, విదేశీయులకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ‘మన దేశానికి దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ వంటి వారు సహితం మన విజ్ఞాన ఔన్నత్యాన్ని గుర్తించి తమతో గ్రంథాలను తీసుకు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. ‘అలెగ్జాండర్ కాలానికి ముందు నుంచే ఎందరెందరో కేవలం ఆయుర్వేదం అధ్యయనానికి ఇక్కడికి వచ్చేవారు. బాగ్దాద్ రాజ్యంలో భారతీయ వైద్యులు నిపుణులుగా ఉంటూ వచ్చారు. ఎన్నెన్నో గ్రంథాలను అరబిక్, పర్షియన్ భాషలలోకి అనువదించడంలో వారు సాయపడ్డారు. ప్రస్తుతం కూడా అమెరికా, ఐరోపా దేశాల విద్యాధికులు ఏటేటా అధిక సంఖ్యలో భారతీయ విజ్ఞానం ఎడల అధికాధిక ఆసక్తి చూపడం గమనిస్తున్నాము. వారిచటికి వచ్చి వ్యాధులను నయం చేయడంలో మనం అనుసరించే విధానాలను పరిశీలించి తమతమ దేశాలలో అన్వయించుకోవ డానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దేశములోని ప్రాచీన విజ్ఞానం, వేదాంతముల ఎడ అమెరికా, యూరోప్‌లలో ఆసక్తి అంతకంతకు ఎక్కువవు తున్నది’ (ప్రపంచ జైత్రయాత్రకు బయల్దేరేందుకు ఇది సమయము/) అని ఆయుర్వేద వైద్యనిఫుణులు కేఆర్ శ్రీకాంతమూర్తి వివరించారు.
‘సర్వ కాలావస్థలకు అనుగుణము, సమగ్రము, సంపూర్ణమైనది ఆయుర్వేద విజ్ఞానం’అని ‘ఆంధ్రాయుర్వేద పరిషత్’ అప్పటి అధ్యక్షులు పీబీ శఠకోపాచార్యులు పేర్కొన్నారు. ‘ఆయుర్వేదము ఒక శాస్త్రము, కళ, భారతీయ జాతీయ వైద్యములు. మానవ కళ్యాణము కొరకై భగవద్దత్తమైనవి. భారత సమాజ నైతిక విలువలు,ఆర్థిక సామాజిక స్థితులు, ఆచార్య వ్యవహారములు, పర్వములు, నిత్యనైమిత్తిక కర్మలు ఈ దేశమున లభించు ద్రవ్యములతో సముచ్ఛయం చేస్తూ రచించుకోవాలి. అట్టి వైద్యము ఆయుర్వేదము’ అని నిర్వచించారు. ‘దీని రచనా విధానము, అంగము పరిశీలించిన దీని ఘనత ద్యోతకమగును’ అనీ పేర్కొన్నారు.
దేహానికి మనస్సుకు చికిత్స చేసే సమగ్ర వైద్యం ఆయుర్వేదశాస్త్రము’ అని మరో ఆయుర్వేద వైద్య నిపుణులు డా. గంటేల వెంకటేశ్వరశాస్త్రి అన్నారు. ‘శరీరము, ఇంద్రియములు, మనస్సు, ఆత్మ-ఈ నాలుగింటి సంయోగమునకే ఆయువని శాస్త్రంలో చెప్పారు. పై నాలిగింటిని వివరముగా తెలియజేయు శాస్త్రమునకు ఆయుర్వేదమని పేరు. దీనియందు మనకు ప్రత్యక్షముగా కనిపించు శరీరమునకు సంబంధించిన విషయములే గాక, అనుమాన ప్రమాణము ద్వారా గ్రహించదగిన యింద్రియములు, మనస్సు, ఆత్మ అను వానిని గురించి కూడా వివరముగా చెప్పారు. కనుకనే ఆరోగ్యవంతుని లక్షణములను చెప్పుచూ ఆయుర్వేదములో ‘సమ దోషస్సమానిశ్చ సమధాతు మలక్రియః/ప్రసన్నాత్మేంద్రియ మవా/ స్వస్థయిత్పభి ధీయతే..’ వాతాది దోషములు హెచ్చుతగ్గులు లేక సమస్థితిలో నుండువాడు. జఠరాగ్ని సమస్థితిలో కలవాడు. రసరక్తాది ధాతువులు, వాని మలము యొక్క వ్యాపారము సమముగా నుండువాడు ఆరోగ్య వంతుడని చెప్పి, ప్రసన్నమైన ఆత్మ, ఇంద్రియములు, మనస్సు కలిగి యుండుట గూడ ఆరోగ్యవంతుని లక్షణముగా చెప్పబడినది’ అని వివరించారు.
చరకుడు, బౌద్ధ నాగార్జునుడు, జీవకుడు, భావమిశ్రకుడు, శాజ్ఞాధరుడు తదితరులు, రుషులు తమ తపోబలం, యోగసిద్ధులు, దివ్య దృష్టితో ఎన్నో ఓషధులు కనుగొన్నారు. గురుశిష్య సంప్రదాయ ముగా భావితరాలకు అందించారు. ఈ వైద్యం పుట్టు పూర్తోత్తరాల గురించి డాక్టర్ వైవీఎన్ మోహనరావు తమ వ్యాసం (జాతీయవైద్యం ఆయుర్వేదం.. సనాతనము, నిత్యనూతనమునగు శాస్త్రమిది)లో ‘ఆయుర్వేదము వేదముల అంతర్భాగము. సృష్టికి పూర్వము సృష్టి కర్తయగు బ్రహ్మకు వేదములు శబ్ద రూపమున వినబడినవి. అట్లు వినబడినవానిని బ్రహ్మ స్మరించెను. ప్రజలను సృష్టించి, ఆ ప్రజల మేలుగోరి-మొదట దక్ష ప్రజాపతికి ఆయుర్వేదమునుపదేశించెను. అతడు దేవతలలో ప్రచారం కోసం అశ్వనీదేవతలకుపదేశించాడు. వారి నుండి ఇంద్రుడు నేర్చుకొన్నాడు. అతని నుంచి భరద్వాజ మహర్షి నేర్చుకొని వచ్చి భూలోకమున ప్రచారము చేశాడు. భరద్వాజులు నుండి ఆయుర్వేదము పరంపరగా పునర్వసు (ఆత్రేయుడు), అగ్నివేశాదులు, చరకుడు, ధన్వంతరి (కాశీరాజు దివోదాసు), సుశ్రుతుడు, నాగార్జునుడు, దృఢబలుడు, ఆ తర్వాత వ్యాఖ్యాతరులగు చక్రపాణి, డల్హౌణుడు, గయదాసు, శివదాసు..వీరి ద్వారా వాడుకలోకి వచ్చినది’ అని వివరిచారు. ‘మానవుని తీర్చిదిద్ది ఆయువును పెంపొందించి ఇహలోకమందు సుఖమును, పరలోక మందు మోక్షమును ప్రసాదించునట్టి గొప్పశాస్త్రమా యుర్వేదము. ఆయుర్వేదములో ఫిలాసఫీ, రెలిజియన్స్, సైన్సు.. అంతా ఇమిడియున్నది. ఇందు పారా సైకాలజీ, ఇమ్మానాలజీ, బాక్టీరియాజీ, క్రిమిరోగముల గురించి, వాక్సినేషన్ గురించి వివరముగా చెప్పబడినది’ అనీ వెల్లడిరచారు
‘ఆయుర్వేదము పాతకాలపు భావముల వారి వైద్య విధానము’ అని వ్యాఖ్యానాలు ఎదుర్కొన్నా, ఆనాడే సాంకేతికతను ప్రదర్శించింది. అదే విషయాన్ని డా.డి.హనుమంతరావు తమ వ్యాసం (‘ఇంజక్షన్ విధానము ఆయుర్వేద సమ్మతమే’/ జాగృతి,5.4.63) వివరించారు. తరువాతి తరాలు చెబుతున్నట్లు ఇంజక్షన్ ప్రక్రియ ఆధునికం కాదని సోదాహరణగా తెలిపారు. ‘పూర్వము సూచీముఖ యంత్ర ప్రయోగము ద్వారా ఔషధమును శరీరములోనికి పంపునట్లు బౌద్ధ సాహిత్యము చెప్పుచున్నది’ అని పేర్కొన్నారు. ‘వేదకాలము మొదలు వాగ్భటుని కాలము వరకు మన దేశమున ఆయుర్వేద వైద్యాంగములగు ‘సూచీముఖ యుంత్ర, శల్యతంత్రము’ మిక్కిలి ఉచ్ఛదశలోనున్నట్లును శుశ్రుతాది శస్త్రచికిత్స నిపుణులు గొప్పగొప్ప రోగములకు శస్త్రచికిత్సలు, సూచీముఖ యంత్ర ప్రయోగములు జయప్రదముగా జరిపినట్లును కూలంకషముగా చదివిని వారికి బోధపడగలదు. రెండు వేల సంవత్సరముల పూర్వమే శస్త్రచికిత్స యందు సూచీముఖ యంత్ర ప్రయోగము నందును పూర్వాచార్యులకు గల నైపుణ్యములను జూచి ఈ కాలపు వారు ఆశ్చర్యపొందుచుండ, నత్యంత స్వల్ప విషయమగు ఇంజక్షన్‌ల పద్ధతి ఆయుర్వేదమున లేదనుట గాని, దేశీయవైద్యులు దీనిని వాడరాదనుటగాని అసమంజసము! ’ అని పేర్కొన్నారు.
బౌద్ధులు దేశంలోని తక్షశిల, నలందా, ఉజ్జయిని, కాశీ మున్నగుచోట్ల విశ్వవిద్యాలయాలు నెలకొల్పి ఆయుర్వేద విద్యను ప్రోత్సహించారు. వారి వల్లనే ఆయుర్వేదము నవమానకారాము ధరించిందని ఆ వైద్య నిపుణులు చెబుతారు. అంతటి ఈ వైద్య విద్య ప్రాభవం పరపాలకుల కాలంలో మసకబారింది. దేశంలో జరుగుతున్న యుద్ధాలు, విదేశీయులైన మహమ్మదీయుల పరిపాలన కారణంగా ఆయుర్వేదము క్షీణించింది (జాగృతి/ 5.4.1963). దీని పట్ల నిరాదరణ పెరగసాగింది. ‘పాలకులను బట్టే పాలితులు’ అన్నట్లు వారి నిర్లక్ష్యానికి తోడు ప్రజల్లోనూ విశ్వాసం సన్నగిల్ల సాగింది. స్వతంత్ర భారతంలోనూ అదే పరిస్థితి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సుమారు పాతికేళ్ల వరకు అదే పరిస్థితి కొనసాగింది. ‘బానిసకాలములో భారతీయలు చాలా విజ్ఞానమును కోల్పోయినారు. అట్టి వానిలో ఆయుర్వేదమును ఒకటి. పలు గ్రంథములు అలభ్యములైనాయి. పండితులు కరవైనారు. ఆ విద్యా విధానం అస్తవ్యవస్థితమైనది. ఓషధులను గుర్తించువారు లేరు. పెంచు యోజనలు లేవు. అనేకములు అలభ్యములు. స్వతంత్రావరణతో ఈ పరిస్థితి యందు మార్పు వచ్చి యుండవలసింది. కాని తగినంత మార్పు రాలేదు’ (ఆయుర్వేద అభివృద్ధి/సంపాదకీయం/13.5.1975) అని ఆందోళన వ్యక్తమైంది. ఆయుర్వేదము పాతకాలపు భావములవారి వైద్య విధానమయినది. దానికి ప్రజల ఆదరణ, ప్రభుత్వ ప్రోత్సాహము రెండూ అల్పంగానే ఉన్నాయి. ఆయుర్వేదీయ వైద్యునిది ద్వితీయశ్రేణి మాత్రముగనే నున్నది. ఈ ఔషధములు వెదకి సంపాదించవలసినవి గానే ఉన్నవి. ఉద్ధరించువారు లేక దీనమై నిలిచి యున్నది’ అనీ పేర్కొంది.
ఆయుర్వేదం సనాతన వైద్య విధానమైనా, ఇతర వైద్య పద్ధతులను నిరాదరించలేదు. అంకితభావం, చిత్తశుద్ధితో దీనిని అభ్యసించి, చికిత్స అందించడంతో పాటు ఇతర శాస్త్రాలను అధ్యయనం చేయాలని ఆయుర్వేద పూర్వాచార్యులు సూచించించారు. ‘ఆయువును పెంపొందించి సుఖ జీవితమును నిర్దేశించు శాస్త్రమాయుర్వేదము. దయా, ధర్మ, సత్య, శుచిత్వ సౌజన్యములు, త్యాగము, సౌశీల్యము, ప్రశాంత జీవనంతో అభ్యసించిన విద్యతో పాటు దయ, శుచిత్వం, సౌహార్ద్రం, నిర్మలమైనట్టి మనస్సు, ఏకాగ్రత, పట్టుదల, …ఇట్టి గుణములతో రోగులను ప్రేమగా చూసుకుంటూ అన్యశాస్త్రములను కూడా పఠించి, క్రొంగొత్త వివరములను కాయకల్ప చికిత్సలోనూ, శస్త్ర చికిత్సలోనూ వర్తింపచేయాలి’ (జాతీయ వైద్యం ఆయుర్వేదం) అని అని హితవు చెప్పారు.‘ఆయుర్వేద సిద్ధాంతాన్ని ఆధునిక వైద్య విధానాన్ని మేళవించాలి’ అంటూ డా. వై.సూర్య నారాయణరావు తమ వ్యాసంలో అభిప్రాయపడ్డారు.
‘ఈ మధ్యకాలమున ప్రపంచమున ఆధునిక వైద్య విధానములు వెల్లివిరిసినవి. ఎన్నెన్నో నూతన విధానములు గుర్తింపబడినవి. నూతన విధానముల ఔన్నత్యమును గుర్తించుట యోగ్యుడగు అధ్యయ నపరుని లక్షణము. ప్రాచీన మౌలిక విజ్ఞానము, ఆధునిక విధాన విజ్ఞానమును సమన్వయించుకొని ఈ భవనము నిర్మించగల అవకాశము నన్వేషించుట దేశ కాలానుగుణయమైన కృషి కాగలదు’ అని ‘జాగృతి’ సంపాదకీయం అభిప్రాయపడిరది.
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆయుర్వేదం ఆధునిక వైద్య ప్రభావాన్ని తట్టుకుంటూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తోంది. అయితే ప్రభుత్వపరంగా అంతగా ప్రోత్సాహం లేదని నాటి వార్తా కథనాలను బట్టి తెలుస్తోంది. సుమారు ఐదు దశాబ్దాల నాటి పరిస్థితికి నేటి స్థితి అంత భిన్నంగా ఉండకపోవచ్చు. విజయవాడ ఆయుర్వేద కళాశాల అప్పటి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వీరంరాజు కృష్ణమూర్తి వ్యాసం (అధ్వాన్న స్థితిలో ఉన్న ఆయుర్వేద కళాశాలలు)లో ‘ఆంధ్రదేశమునందు ఆయుర్వేదము చాలా ప్రజాదరణ పొందిన వైద్యము. నేటికినీ భారతావనిలో ఆయుర్వేద వైద్యులకు ప్రత్యేక స్థానము కలదు. కానీ కాలక్రమేణ ఆధునిక వైద్యమునందలి ఇంజక్షను విధానము,రోగ నిర్ణయ పద్ధతులు, యక్స్ రే, శస్త్ర కర్మ విధానముల ద్వారా ప్రజాదరణ పొందుచున్నవి. అయినప్పటికీ ఆయుర్వేదం ప్రతి గ్రామమునందే గాక ప్రతి గృహమునందు గూడ ఉపయోగించబడు తున్నది’ అని తెలిపారు.
ఆయుర్వేదం పట్ల పాలకుల, పాలితుల తీరుతెన్నులను అటుంచితే ఈ ఔషధ తయారీలో శ్రద్ధాసక్తులు కనబరచాలని నిపుణులు చెప్పారు. ‘ఆయుర్వేదానికి మంచిరోజులు రావాలంటే ఔషధాల తయారీ శాస్త్ర ప్రకారం జరగాలి’ అని ఆయుర్వేద వాచస్పతి డాక్టర్ ప్రకాశచంద్ర శతపథి అభిప్రాయ పడ్డారు. ‘ఆయుర్వేద శాస్త్రమున సోముడు ప్రధానుడు. ఈ సోముడు శరీరంలో మనోంద్రియ మునకు అధిష్ఠానుడు. వాతపిత్త శ్లేష్మములలో శ్లేష్మం సోమాంశయే. కనుకనే ఓషధులను చంద్రుడు సర్వసంపన్నుడుగా నుండు తరిన గ్రహించాలి. గనుకనే ఆయుర్వేద తంత్రజ్ఞులు‘శరద్యఖిల కార్యార్థం గ్రాహ్యం పరమౌషధమ్/’శరత్కాలమున ఓషధులు వీర్యమంతముగా నుండుటచే ఆ కాలముననే సర్వ ద్రవ్యములు సంగ్రహించ వలయునని తెలిపినారు. ఉదాహరణకు: పుష్యామగ చూర్ణమున్నది. ఇందులోని ఓషధులన్నీ పుష్యమీ నక్షత్రములో కూడిన దినముననే సంగ్రహించి ఆ రోజునే యీ ఔషధాన్ని తయారు చేయాలి’ అని వివరించారు.
దేవతల నుంచి రుషులకు, వారి నుంచి మానవ వైద్యులకు పరంపరంగా అందుతున్న ఆయుర్వేదం, ఎన్ని వైద్య విధానాలు వస్తున్నా తన ఉనికినికి కాపాడుకుంటూనే ఉంది, ఉంటుంది.
– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి