సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ కార్తిక బహుళ సప్తమి – 04 డిసెంబర్ 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
హిందూ, హిందూత్వం, హిందూయిజం.. ఈ మూడు పదాల మీద చర్చ ఇప్పటిది కాదు. ఈ పదాల మీద ఇంత చర్చకు కారణం, అంత పురాతన జీవన విధానాన్ని నిర్వచించడానికి ఆ మాత్రం చర్చ, సమయం అవసరమేనని ఏ కొందరో భావించడం కానేకాదు. ఆ చర్చ మేధోపరమైనది కాదు. సామాజిక శాస్త్ర పరిధిలోది అంతకంటే కాదు.ఆ పదాల అర్థాలు, భావనను ఎంత గందర గోళంలోకి నెట్టగలరో అంత గందరగోళంలోకి నెట్టడమే కొందరికి కావాలి. హిందూ శబ్దాన్ని, దానితో ముడిపడి ఉన్న వ్యవస్థలను, మొత్తంగా ఆ జీవన విధానాన్ని అవమానపరిచే ప్రక్రియ శతాబ్దాలుగా సాగేటట్టు చూడడం మరొకటి. హిందూత్వం లేదా హిందూయిజం అనే రెండు పదాలను ఎవరు ఎన్నికల ప్రసంగాలలో ప్రయోగించినా దానిని నిందార్హంగా పరిగణించనక్కరలేదని కోర్టులు చెప్పాయి. హిందూత్వం అన్నంత మాత్రాన అందులో హిందూ ‘ఫండమెంటలిజం’ వెతకనక్కరలేదని కూడా అవి చెప్పాయి. కానీ ఇక్కడ కోర్టుల ఎడల మన్నన ఎంతో తెలియనిది కాదు. వాటి తీర్పులను రాజకీయాల కోసం ఉపయోగించుకునే తీరు రహస్యం కాదు. తీర్పులు కూడా బుజ్జగింపు రాజకీయాల పాల్పడినవే. హిందూయిజం అనేది సనాతన ధర్మానికీ, సహిష్ణుతకీ మూలమైన మతమని, హిందూత్వ అంటే విభజన రాజకీయాలు చేసేదని కొందరు అంగుష్టమాత్ర నాయకులు స్వకపోల కల్పిత భాష్యాలు వెలగబెట్టడమే ఇందుకు రుజువు.
ఈ నేపథ్యంలో హిందూయిజం అన్న పదాన్ని పరిత్యజించాలని ప్రపంచ హిందూ కాంగ్రెస్ ఈ నవంబర్ 24వ తేదీన తీర్మానించడం చరిత్రాత్మక నిర్ణయమే. ‘ఇజం’ అన్న పదం అణచివేత, వివక్షలతో కూడిన సిద్ధాంతాన్ని ధ్వనింపచేస్తుందని హిందూ కాంగ్రెస్ అభిప్రాయపడిరది. నిజం చెప్పాలంటే, అది హిందూ కాంగ్రెస్ అభిప్రాయం మాత్రమే అనుకోలేం. హిందూయిజం అన్న పదాన్ని ప్రచారం చేస్తున్న వారి అంతరంగం కూడా అదే. హిందూత్వను అణచివేత సిద్ధాంతాల పక్కన చేర్చడమే. అందుకే హిందూయిజం అనే మాటకు బదులు హిందూత్వం లేదా హిందూధర్మం, ఇంకా కావాలంటే సనాతనధర్మం అని నిత్య నూతనమైన ఈ జీవన విధానం గురించి ప్రస్తావించాలని సమావేశం నిర్ణయించింది. హిందూ అన్న పదం ఉన్నందున హిందూత్వం అని పిలుచుకోవడమే సముచితమని సమావేశం అభిప్రాయపడిరది.
హిందూధర్మం అనే పదబంధంలో రెండు పదాలు ఉన్నాయి. అవి హిందు, ధర్మం. హిందు అన్న పదానికి ఎల్లలు లేవు. అంటే సనాతనం లేదా నిత్యనూతన మని అర్ధం. ధర్మం అంటే స్థిరంగా ఉండేది. కానీ హిందూత్వకు ఇజం అన్న పదం కలపడం దగ్గరే చిక్కంతా ఉంది. అణచివేత స్వభావం, వివక్ష నేపథ్యం ఉన్న ఒక సిద్ధాంతాన్ని ఆ ఇజం ధ్వనింపచేస్తుంది. అందుకే మన పూర్వికులు హిందూయిజం అని వ్యవహరించకుండా హిందూత్వం అన్న మాటనే ఉపయోగించారని కూడా ఆ తీర్మానం గుర్తు చేసింది. ఆ పెద్దలతో ఏకీభవిస్తూ మనం కూడా హిందూత్వం అనే మన ధర్మాన్ని పిలుచుకోవాలని తీర్మానం కోరింది. హిందుత్వం అన్న పదం సంక్లిష్టమైనదేమీ కాదని, హిందూనెస్ అన్న అర్ధాన్ని చెబుతుందని ఆ తీర్మానం చెప్పింది. కొంతమంది హిందూత్వనే సనాతనధర్మం అని పిలుచుకోవడం ఉంది. అదే సనాతనం. సనాతనం అన్న పదం హిందూధర్మానికి ఉన్న నిత్య నవీనం అన్న అర్ధాన్నీ, లక్షణాన్నీ వ్యక్తీకరిస్తుంది. ఈ మధ్య కొందరు అజ్ఞానంతో హిందూధర్మానికి హిందూత్వం వ్యతిరేకమన్న వాదనను ముందుకు తెస్తున్నారని తీర్మానం విమర్శించింది. ఇలాంటి వికృత వాదాలు తీసుకువచ్చేవారు ఎక్కువమంది హిందూత్వ వ్యతిరేకులేనని ఆరోపిం చింది. వీళ్లే సనాతన ధర్మాన్ని నిరంతరం విమర్శిస్తూ విషం చిమ్ముతున్నారని గుర్తుచేసింది. ఈ విష ప్రచారం అంతర్జాతీయంగా కూడా యథేచ్ఛగా సాగుతోంది. హిందూధర్మం మీద పథకం ప్రకారం జరుగుతున్న ఇలాంటి దాడిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా కలసికట్టుగా ఎదుర్కొనవలసి ఉంటుందని హిందూ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
హిందూయిజం, హిందూత్వం అన్న పదాలను ఎలా రాజకీయం చేస్తున్నారో ఒకసారి పరిశీలించాలి. హిందూయిజం అంటే మన రుషి పరంపరకు చెందు తుందని కొన్ని పార్టీల ఉవాచ. కానీ ఈ పదబంధం 1877లో మోనియర్` మోనియర్ విలియమ్స్ తయారు చేసిన పదకోశంలోనిది. ఆ పదకోశాన్ని అచ్చువేసి వదిలిపెట్టినదే సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియన్ నాలెడ్జ్. అంటే 150 ఏళ్ల క్రితమే హిందూత్వకు వ్యతిరేకంగా జరిగిన, ధర్మానికి చేటు చేయడానికి ఉద్దేశించిన ఒక ముఠా చేసిన ఒక రకమైన మేధో దగా ఆ పదం. సుప్రీంకోర్టు కూడా రెండు పదాలు నిందార్హాలు కాదని చెప్పినప్పుడు హిందూయిజం పదం పట్ల ఇక అభ్యంతరం ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. హిందూత్వం, లేదా వైదిక ధర్మాన్ని హిందూయిజం అన్న పదంతో ప్రస్తావించడం పెద్ద కుట్ర కనుక తీవ్ర అభ్యంతరం చెప్పవలసిందే. ఫాసిజం, నాజీజం పక్కన చేర్చే ఉద్దేశంతోనే హిందూ వ్యతిరేకులు హిందుత్వానికి పక్కన ఆ ఇజాన్ని తగిలిస్తున్నారు. మరీ విచిత్రంగా హిందూత్వం అన్న పదం బీజేపీదేనని వాదించే వాజమ్మలకు కూడా ఇవాళ కొరత లేదు. నిజానికి ఆ పదాన్ని ‘యసన్షియల్స్ ఆఫ్ హిందూత్వ’ అన్న తన వ్యాసంలో చంద్రకాంత బసు 1892లో ఉపయోగించారన్న వాదన రూఢ అయినదే. తరువాత మూడు దశాబ్దాలకు 1923లో వినాయక్ దామోదర్ సావర్కార్ హిందుత్వ పేరుతో ప్రతిపాదించారు.
హిందూత్వం గురించి ఏ అజ్ఞాని అయినా ఉదారవాదం పేరుతోనో, మేధావి బిరుదుతోనో, చరిత్రకారుడు పేరుతోనో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు వెలగబెట్టవచ్చునని అనుకుంటున్నారు. ఈ ధోరణికి ముగింపు పలకాలి. బ్యాంకాక్ ప్రపంచ హిందూ కాంగ్రెస్ తీర్మానం ఆ పని చేస్తుందని ఆశిద్దాం.