మిజోరం ఓటర్లు మార్పుకు జై కొట్టారు. ఇక్కడ అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) పార్టీని ఇంటికి పంపి జోరంపీపుల్స్‌ మూవ్‌మెంటు (జడ్పీఎమ్‌) పార్టీని అధికారపీఠంపై కూర్చోబెట్టారు. మిజోరంలోతమ ఆశలు పండిరచుకుందామని నెగెటివ్‌ క్యాంపయిన్‌తో ముందుకెళ్లిన కాంగ్రెస్‌ చతికిలపడిరది. బీజేపీ గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. ఈశాన్య రాష్ట్రమయిన మిజోరంలో ప్రజాతీర్పు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

మొత్తం 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీలో, 27 స్థానాల్లో విజయం సాధించి జోరం పీపుల్స్‌ మూవ్‌మెంటు (జడ్పీఎమ్‌) పార్టీ విజేతగా నిలిచింది. 73ఏళ్ల లాల్దూహోమ మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎమ్‌ఎన్‌ఎఫ్‌)కి 10 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ రెండు, కాంగ్రెస్‌ కు ఒకటి సీటు దక్కింది. ముఖ్యమంత్రి జొరంతంగ తన సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయారు.

1987లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయిన నాటి నుంచి మిజోరం ఎన్నికలలో కాంగ్రెస్‌, మిజోనేషనల్‌ ఫ్రంట్లు పార్టీలు ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చాయి. ఎమ్‌ఎన్‌ఎఫ్‌కి చెందిన జొరంతంగ, పదేళ్ల కాంగ్రెస్‌ పాలనకు తెరవేస్తూ 1998లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దశాబ్దం పాటు ఎమ్‌ఎన్‌ఎఫ్‌ పాలన తర్వాత, 2008, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అనంతరం 2018లో తిరిగి అధికారాన్ని దక్కించుకున్న ఎమ్‌ఎన్‌ఎఫ్‌ ఈ దపా మళ్లీ అవకాశం దక్కుతుందని ఆశపడిరది. మొదట్లో ప్రాంతీయపార్టీలు, పౌరసమాజ నేతల సంకీర్ణ కూటమిగా ప్రారంభమైన జడ్పీఎమ్‌ 2019లోనే రాజకీయపార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. మాజీ ఆర్థిక మంత్రి లాల్‌ స్వాతాకు రాష్ట్ర పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ మార్పుతో తమ అదృష్టం కలిసొస్తుందని ఆశపడిరది. బీజేపీ వ్యతిరేక నినాదంతోనే కాంగ్రెస్‌ ప్రచారం సాగింది. కేవలం 23 స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపిన బీజేపీ తాను ‘కింగ్‌ మేకర్‌’ కాగలనని భావించింది. ప్రధాన పోటీ మాత్రం ప్రాంతీయ పార్టీలు మిజోనేషనల్‌ ఫ్రంట్‌ (ఎమ్‌ఎన్‌ఎఫ్‌), జోరం పీపుల్స్‌ మూవ్‌మెంటు (జడ్పీఎమ్‌) మధ్య త్రిముఖ పోటీ ఉందన్న ప్రచారం సాగింది. ఆమ్‌ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే, 17 మంది ఇండిపెండెంట్లు రంగంలో ఉన్నారు.

2018 ఎన్నికలు అంతకు ముందు నిర్వహించిన రెండు ఎన్నికల కంటే విశిష్టంగా నిలిచాయి. ఎమ్‌ఎన్‌ఎఫ్‌ పార్టీ 26 సీట్లు సాధించి విజేతగా నిలవటమే కాదు, కాంగ్రెస్‌ను ఐదు స్థానాలకు పరిమితం చేసింది.1993తో పోలిస్తే ఓట్‌ షేర్‌ విషయంలోనూ ఎమ్‌ఎన్‌ఎఫ్‌ గణనీయంగా మెరుగుదల సాధించింది. దాదాపు 37.7 శాతం సాధించింది. జొరంతంగ ముఖ్యమంత్రిగా మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

కాంగ్రెస్‌ 29.98 శాతం ఓట్‌ షేర్‌ సాధించినా, సీట్ల విషయంలో 22.9 శాతం ఓట్‌ షేర్‌ సాధించిన జడ్పీఎమ్‌ కంటే వెనకపడిరది. జడ్పీఎమ్‌ కు 8 సీట్లు దక్కాయి. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన విజయం సాధించిన అభ్యర్థులందరూ కలసి, ఫలితాల అనంతరం ఒకే వేదికపైకి వచ్చారు. కొత్తగా ఏర్పాటయిన జడ్పీఎమ్‌ పార్టీ గొడుగు కిందకు వచ్చారు. ఆ తర్వాత ఈ పార్టీ గుర్తింపు తెచ్చుకుంది. స్థానిక ఎన్నికల్లో విజేతగా నిలిచింది. జొరంతంగ సొంత గడ్డ అయిజాల్‌ ఈస్ట్‌ 1 నియోజకవర్గంలోనూ విజయం సాధించింది. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో తన ఖాతాను తెరిచింది. కేవలం ఒక్కసీటు, 8.09 శాతం ఓట్‌ షేర్‌ సాధించిన బీజేపీ ఈ దఫా క్రిస్టియన్‌ మెజార్టీ రాష్ట్రం మిజోరంలో నాన్‌ మిజో ఓట్లపైనదృష్టి పెట్టింది.మిజోరంలో 87 శాతం మంది క్రిస్టియన్లే. కుకి, జామి, హమర్‌ కమ్యూనిటీలు మిజోరం వాసులతో అనుబంధంగా ఉంది.

మిజోరంలో ఆశ్రయం పొందిన శరణార్ధుల పక్షాన ఏ రాజకీయ పార్టీ నిలబడుతుంది అనే అంశం మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన అంశంగా నిలిచింది. ఐదు దశాబ్దాల తర్వాత, మొట్టమొదటిసారి మిజోరంలో విదేశీయుల అంశం కీలకంగా నిలిచింది. జో కమ్యూనిటీ ఏకీకరణ.. ప్రధానంగా మిజోరాంకు చెందిన ఆధిపత్య మిజో వర్గాలు, మణిపూర్‌కు చెందిన కుకీలు, మయన్మార్‌, బంగ్లా దేశ్‌లకు చెందిన చిన్‌ల సంక్షేమానికి కట్టుబడుతామని ఎంఎన్‌ఎఫ్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో హావిూ ఇచ్చింది. మణిపూర్‌, మయన్మార్‌ల నుంచి వచ్చిన 12,500 మంది శరణార్ధులు మిజోరంలోని ఫాల్క్‌ లాండ్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపులో ఆశ్రయం పొందారు. ఇది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అయిజాల్‌ ఈస్ట్‌1 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. తాను తిరిగి అధికారంలోకి వస్తామని ఎమ్‌ఎన్‌ ఎఫ్‌ ధీమా వ్యక్తం చేయటానికి ఇదొక కారణం అని చెప్పాలి.

జడ్పీఎం అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి లాల్దుహోమ దీనిని తప్పుపడతున్నారు. ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజలను దృష్టిని మళ్లించటానికి ఎమ్‌ఎన్‌ఎఫ్‌, మణిపూర్‌ హింసను వేదికగా తీసుకుందని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలకు నిరాశ్రయులయిన ప్రజల పట్ల సానుభూతి ఉందని, కానీ దాని ద్వారా రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని మాత్రం చూడటం లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో జడ్పీఎం తన ప్రజాదరణను పెంచుకుంటూ వస్తోంది.

ఎమ్‌ఎన్‌ఎఫ్‌ పార్టీ బీజేపీకి చెందిన నార్త్‌ ఈస్ట్‌ డెమోక్రటిక్‌ ఎలయెన్స్‌లో భాగస్వామ్యంగా ఉండేది. ఒకవైపు జడ్పీఎమ్‌కు ప్రజాదరణ పెరుగుతూండటం, మరో వైపు మణిపూర్‌లో పరిణామాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకత పెరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో, బీజేపీకి దూరంగా జరిగారు ముఖ్య మంత్రి జొరంతంగ. మణిపూర్‌ లో హింసకు మైతీలే కారణం. మిజోరంలో క్రిస్టియన్లకు వ్యతిరేకంగా, తాను ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాని మోదీతో తాను వేదిక పంచుకోదలుచుకోలేదని వ్యాఖ్యా నించారు. అంతేకాదు. మయన్మార్‌ శరణార్ధులను మిజోరాం నుంచి తరిమివేయాలని, వారికి బయోమోట్రిక్‌ గుర్తింపు ఇవ్వాలని లేదా కేంద్రం ఆదేశాలను అమలు చేయటం లేదని పేర్కొన్నారు. అలాగే ఏకరీతి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మణిపూర్‌ లో కుకీలకు ప్రత్యేక రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే అంశానికి మద్దతు ప్రకటించారు. ఇదంతా ఎన్నికల ఎత్తుగడగా ప్రజలు భావించారు. ప్రధాని మోదీ మిజోరం పర్యటన రద్దయ్యింది. తాను 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో సాగిన అభివృద్ధిని ప్రత్యేకంగా వీడియో సందేశంలో వివరించారు ప్రధాని. రవాణా, టూరిజం, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో సాగిన అభివృద్ధిని వివరించటమే కాదు. టూరిజం హబ్‌గా మిజోరంను తీర్చిదిద్దు తామని, దీనివల్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఆదాయం వచ్చి చేరుతుందని వివరించారు. ప్రభుత్వఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ హావిూ ఇచ్చింది. అలాగే జొరంతంగ ప్రభుత్వం అవినీతిపైన విచారణ చేపడతామని, ప్రధానంగా ఎమ్‌ఎన్‌ఎఫ్‌ చేపట్టిన సోషియోఎకనమిక్‌ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రామ్‌ లో అవకతవకలపైన దర్యాప్తు చేస్తామని పార్టీ ప్రకటించింది.

మణిపూర్‌ అంశం కాంగ్రెస్‌కు ఆయుధంగా మారింది. ప్రధాని మోదీని విమర్శిస్తూ కాంగ్రెస్‌ నేతల ప్రచారం సాగింది.‘‘ఆరునెలలుగా మణిపూర్‌ మండు తోంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి మణిపూర్‌లో సంక్షోభాన్ని పెంచుతున్నాయి, ఈశాన్య సమాజంలో అసమానతలను రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తున్నా యని’’ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ఎమ్‌ఎన్‌ఎఫ్‌, బీజేపీ ఒకే నాణానికి రెండు వైపులా ఉన్న బొమ్మలని, ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించాలని రాహుల్పిలుపు నిచ్చారు.

మిజోరంలో 92శాతం అసెంబ్లీ సీట్లు ఎస్టీలకు రిజర్వ్‌ అయి ఉన్నాయి. నవంబరు 7వ తేదీన ఒకే దఫాలో మిజోరం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 78.4 శాతం ఓట్లు పోలయ్యాయి. సెర్చిప్‌ జిల్లాలో అత్యధికంగా 84.78 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే, మామిట్‌ జిల్లాలో 84.23 శాతం, హ్యాథియల్‌ జిల్లా 84.1 శాతం ఓట్లు పోల య్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే త్రూకుమ్‌ 27 అత్యధికంగా 87.32 శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే ఎక్కువ మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఎన్నికల అధికారుల అధికారిక వెబ్‌ సైట్‌ లెక్కల ప్రకారం 81.25శాతం మంది మహిళా ఓటర్లు, 80.04 శాతం మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటువేసిన వాళ్లలో 70 శాతం మంది 35 ఏళ్ల వాళ్లయితే, ఇక్కడ పోటీ చేసిన ప్రధాన పార్టీల నేతలంతా 70 ఏళ్ల పై బడిన వారు కావటం విశేషం.

నాలుగు ఎగ్జిట్‌ పోల్స్‌లో రెండు జడ్పీఎమ్‌ కు మెజార్టీ వస్తుందని చెబితే, మరో రెండు ఎమ్‌ఎన్‌ఎఫ్‌ విజయం సాధిస్తాయని చెప్పారు. ఇండియాటుడే.. ఏక్సిస్‌, జన్‌ కీ బాత్‌`న్యూస్‌ 18లు జడ్పీఎమ్‌ గెలుస్తుందని పేర్కొంటే.. ఎబీపీ`సీఓటర్‌, పీ`మార్గ్‌ లు ఎమ్‌ఎన్‌ఎఫ్‌ కు గెలుస్తుందని చెప్పాయి. ఈ నాలుగు కూడా కాంగ్రెస్‌ మూడోస్థానం వస్తుందని పేర్కొన్నాయి. మొత్తం 174 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు.

ఫలితాలు చూసినప్పుడు జడ్పీఎమ్‌ 27 స్థానాలు, ఎమ్‌ఎన్‌ఎఫ్‌ 10, బీజేపీ2, కాంగ్రెస్‌1 స్థానం దక్కించుకున్నాయి. అయిజ్వాల్‌ ఈస్ట్‌1 నియోజక వర్గంలో పోటీ చేసిన ముఖ్యమంత్రి జొరంతంగ, జడ్పీఎమ్‌ అభ్యర్థి లాల్తాసంగ చేతిలో 2,101 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జొరంతంగను ఓడిరచి లాల్తాసంగ జెయింట్‌ కిల్లర్‌ గా నిలిచారు. తన గెలుపుపైన ఆయన విూడియాతో మాట్లాడారు. ‘‘అధిష్టానం నన్ను అభ్యర్థిగా ప్రకటించగానే, వ్యక్తిగతంగా సర్వే చేసుకున్నాను. ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా జొరంతంగ విఫలమయ్యారని, నేను గెలవటం పెద్ద కష్టం కాదనే విషయం అర్ధమైంది’’ అని వివరించారు. కాంగ్రెస్‌ , ఎంఎన్‌ఎఫ్‌ కొత్త తరానికి చేసిందేవిూ లేదని, అధికారం కోసం అవి పాకులాడుతున్నాయని విమర్శించారు. బీజేపీ మద్దతు ఇస్తే వారిని ప్రభుత్వంలోకి తీసుకుంటారా అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదని వ్యాఖ్యా నించారు. డిప్యూటీ సీఎం తాన్లూయియా కూడా జడ్పీఎమ్‌ అభ్యర్థి చేతిలో 909 ఓట్లతో పరాజయం పాలయ్యారు.

సెర్చిప్‌ నుంచి జడ్పీఎమ్‌ అధ్యక్షుడు లాల్‌ తంన్సంగ2,982 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 8,314 ఓట్లు రాగా, ఎంఎన్‌ఎఫ్‌ అభ్యర్థి జె. మాల్సాంజుయలాకు 5,332 ఓట్లు లభించాయి.

ఓటమిని అంగీకరిస్తున్నా

‘‘యాంటీఇంకెబెన్సీ ప్రభావం.. నా పనితీరు ప్రజలను మెప్పించలేకపోవటం వల్ల ఓడిపోయా’’ అన్నారు జొరంతంగ. ప్రజల తీర్పు తనకు శిరోధార్యం అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఫలితాన్ని ఊహించలేదు

మిజోరంలో మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ రెండు సీట్లను సాధించింది. ఇక్కడ ఫలితాలు ఇలా ఉంటాయని తాము ఊహించలేదని, హంగ్‌ వస్తుందని భావించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వన్లాల్‌ మౌఖా పేర్కొన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని అన్నారు. గతంలో ఒక్క చోట మాత్రమే విజయం సాధించాం. ఇప్పుడు రెండు సీట్లు దక్కించుకున్నామని అన్నారు. మిజోరం లోక్‌ సభకు ఒక ఎంపీని మాత్రమే పంపుతుంది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో అంత ప్రభావం చూపవనే చెప్పాలి.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE