‘నీళ్లు-నిధులు- నియామకాలు’` తెలంగాణ ఏర్పాటుకు ఊతమిచ్చిన నినాదమిది. తెలంగాణ రాష్ట్ర సమితి (తరువాత భారత రాష్ట్ర సమితి/ బీఆర్‌ఎస్‌) ఇచ్చిన నినాదం. అలాంటి బీఆర్‌ఎస్‌ను 2023లో జనం ఓడిరచారు. నినాదం సరే! వాస్తవంగా జరిగిందేమిటి అన్న ప్రశ్న మూడో అసెంబ్లీ ఎన్నికల వేళ పదునెక్కింది. నీళ్లకు బదులు కన్నీళ్లు మిగిలాయన్న సమాధానం వచ్చింది. నిధులు దుబారాలో ఆవిరి అయిపోయాయని ప్రజలు భావించారు. చంద్రబాబు కాలంలో మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు అప్పుల కుప్పగా మారిపోయాయన్న సత్యం బయటపడిరది. ఇక నియామకాలు జరుగలేదు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు నలుగురికీ మాత్రం మంచి ఉద్యోగాలు లభించాయి. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు రోడ్డున పడ్డారు. గ్రూపు-1 పేపర్‌ లీక్‌ కావడంతో 33 లక్షల కుటుంబాలు కేసీఆర్‌ను అనుమానించి, వ్యతిరేకంగా పోరాటం సాగించారు. తత్ఫలితంగా డిసెంబరు 3,2023న ఆయన ప్రభుత్వం పేకమేడలా కూలిపోయింది. ఇదొక నిశ్శబ్ద విప్లవం. చరిత్రాత్మక ఘట్టం.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ సభ్యుడు. అక్కడ ఆశించిన పదవి దక్కకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక ఉద్యమ సంస్థను స్థాపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలు పెట్టారు. 1969లో కూడా మర్రి చెన్నారెడ్డి ఇలాగే ఉద్యమం నడిపారు. అప్పుడు ఇందిరాగాంధీ ఉక్కుపాదంతో అణచివేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కేసీఆర్‌ మళ్లీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రమే అన్ని కష్టాలకూ కారణమని నమ్మబలికారు.  2014లో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన సోనియా గాంధీని మోసం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వగానే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెసులో విలీనం చేస్తానని నమ్మ బలికారు. పదేండ్ల క్రితం కేసీఆర్‌ అంటే తెలంగాణ జాతిపిత అన్న ప్రజలే  నేడు ఇంతగా ఎందుకు తిరగబడ్డారు? ఆయన ప్రభ ఒక్కసారిగా ఎందుకు మసకబారింది? సమాధానం  వెతకవలసిన ప్రశ్నలే మరి!

ఇవి మాత్రమే కేసీఆర్‌ పతనానికి కారణాలని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. తెలంగాణలో నలభై లక్షల మంది క్రైస్తవులున్నారు. వీరంతా సోనియా గాంధీకి ఓటు వేశారు. హైదరాబాదు, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలలోని అర్బన్‌ నక్సలైట్లు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడారు. ఒక్క హైదరాబాద్‌ మినహాయిస్తే మిగిలిన ప్రాంతాలలోని ముస్లిములు కేసీఆర్‌కు ఓటు వేయలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఇచ్చిన ‘బీసీ ముఖ్యమంత్రి’ నినాదాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు హామీ కూడా అంతే అనుకోవాలి. హైదరాబాదులోని లక్షలాది సోకాల్డ్‌ మేధావులు మూడు రోజులు వరుస సెలవులు వచ్చాయని ఓటు వేయకుండా స్వస్థలాలకు ఉడాయించారు.

ఇక చాలు దొర అనే నినాదాన్ని కేసీఆర్‌ వ్యతిరేకశక్తులు ప్రజలలోకి తీసుకొనిపోవడంలో సఫలమైనాయి. కేసీఆర్‌ను మించిన వాక్చాతుర్యం కలిగిన కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి ప్రజలలోకి దూసుకొనిపోయారు. తిట్ల దండకంలో  కేసీఆర్‌కు దీటుగా కనిపించారాయన. వారు తమలపాకుతో అలా అంటే తాము తలుపుచెక్కతో పెడీపెడీమనిపిస్తా మని రుజువు చేశారు. కేసీఆర్‌ పిచ్చికుక్కవు అని తిడితే, అదే తిట్టును తిరుగు టపాలో కేసీఆర్‌కు పంపేవారాయన. కొన్ని నెలల క్రితం వరకు బీఆర్‌ఎస్‌కు పోటీ అనుకున్న బీజేపీ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిందంటున్నారు. కానీ గణాంకాలు ఈ వాదనకు ఒప్పవు. ఇంతకు ముందు గోషామహల్లో రాజాసింగ్‌ అనే ఒకే ఒక్క నాయకుడు గెలిచారు. ఇప్పుడు ఎనిమిది మంది. ఎన్ని సీట్లకు ఎదిగినా అది విజయం కిందికే వస్తుంది.

తెలంగాణ మొదటి నుండి కాంగ్రెస్‌ కంచుకోట. రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ప్రత్యేక ఉద్యమ ఆవేశంతో రాజ్యాధికారాన్ని కేసీఆర్‌ చేజిక్కించు కున్నారు. దీనిని స్థానిక భూస్వాములు సహించ లేరన్నది చిదంబర రహస్యం.

ఇవన్నీ ఒక ఎత్తయితే విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్నలు ఇంకొన్ని వేసుకుతీరాలి. బంగారం లాంటి పాత సచివాలయాన్ని పనిగట్టుకుని ఎందుకు కూలగొట్టినట్లు? వాస్తు బాగాలేదని ఎవడో చాదస్తుడు చెప్పాడట! కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని కోట్లు పోశారు. ప్రయోజనం ఎంత? అక్కడ ఏం జరిగింది? యాదాద్రిలో జియ్యర్‌స్వామిని ఎందుకు తరిమివేసినట్లు? ఢల్లీి ముఖ్యమంత్రిగా వేషం వేసిన అర్బన్‌ టెర్రరిస్టు అరవింద కేజ్రీవాల్‌తో చేతులు కలిపి ఒక తెలంగాణ మహిళ కల్లు వ్యాపారం చేయటం ఏమిటి? ఎనభయ్‌ వేల పుస్తకాలు చదివిన మేధావి తెలుగుకు అక్షరభిక్ష పెట్టిన శ్రీకృష్ణదేవరాయల భువన విజయాన్ని ఆదరించకపోవడం దుర్మార్గం కాదా? నమ్మకస్థులుగా పనిచేసిన ఈటల రాజేందర్‌, కోదండరాం వంటి ఎందరో ప్రజా నాయకులను దురహంకారంతో దూరం చేసుకోవడం వెనుక ఉన్న హేతువు ఏది? ఏకకుటుంబ పాలనేనా? ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలిదానాలు చేసిన ఉస్మానియా విద్యార్థులే ఇవాళ కేసీఆర్‌ పతనానికి సంబురాలు ఎందుకు చేసుకున్నట్టు? దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానంటూ నమ్మబలికిన కేసీఆర్‌ నిజంగా అలాగే చేసి ఉంటే త్యాగధనుడు అని ప్రజలు కీర్తించేవారు. అది ఎందుకు జరగలేదు? ఎందుకూ అంటే, రాజకీయాల్లో అబద్ధాలు చెప్పకూడదు అని ఏమైనా నిబంధన ఉందా? మేమేమైనా సత్యహరిశ్చంద్రు లమా? కర్ణాటక తర్వాత తెలంగాణ కాంగ్రెసు వశం కావడంతో మొత్తం దక్షిణభారతంలో ఆ పార్టీ పునరుజ్జీవనం ఆలస్యం లేకుండా మొదలయిందనే  భ్రమను కల్పించడానికి కొందరు స్వయం ప్రకటిత రాజకీయ విశ్లేషకులు  ప్రయత్నిస్తున్నారు. కానీ నిజం ఏమిటి? ఇది తెలంగాణ ప్రజా విజయం!  రాహుల్‌ గాంధీకి ఈ విజయంలో ఎట్టి భాగస్వామ్యమూ లేదు. ఇదే నిజమైతే రాజస్తాన్‌లో అధికార కాంగ్రెసు ఎందుకు ఓడిపోయింది? అందరు నియంతలకు పట్టిన గతియే కేసీఆర్‌కూ పట్టింది. అలాగే చూడాలి. అయ్యో అని సానుభూతి చూపేందుకు కూడా ఒక్కడూ లేడు. ప్రాణాలకు తెగించి రేవంత్‌రెడ్డి పోరాడారు. ఇలాంటి పటిమ తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలలో ఎందరికి ఉంది? ఆత్మవిమర్శ చేసుకోండి!

కేసీఆర్‌ పథకాలన్నీ ప్రహసనాలను మరిపించా యంటే అతిశయోక్తి ఏమీ కాదు. దళితబంధు, రైతుబంధు పథకాలు బూమరాంగ్‌ అయినాయి. నీ పార్టీ సభ్యులకూ, ధనిక రైతులకూ పది లక్షలు ఇస్తే మా సంగతి ఏమిటి? అని అందని లక్షలాది రైతులు, దళితులు తిరగబడ్డారు. ఎన్నడూ సచివాలయానికి రాని ముఖ్యమంత్రి శుభ్రంగా ఉన్న సచివాలయాన్ని ఎందుకు కూల్చినట్లు? అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను టోకున కొనుగోలు చేయటంలో నైతికత ఎంత? బీఆర్‌ఎస్‌ సహా ఏ ప్రాంతీయ పార్టీ నిర్వాకం గమనించినా ఒక ప్రాంతీయ పార్టీ కంటే, రెండు జాతీయ పార్టీల విధానం మంచిదేనని అనిపిస్తుంది. ఐతే సోనియా గెలుపు ఎక్కడైనా సరే మత మార్పిడి శక్తులకు ఊతమిస్తుంది. భారాసను ఎంఐఎం అంటకాగితే, కాంగ్రెస్‌ను క్రైస్తవ ముఠా శాసిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 1.2 శాతం క్రైస్తవులున్నారు. ఈ నిష్పత్తి పెరిగే అవకాశం బాగా ఉంది. ఇప్పుడు ప్రజల బతుకు పెనం మీద నుండి పొయ్యిలోకి పోయినట్లుంది. ‘మార్పు’ అవసరమే కాని పూర్ణిమ తర్వాత వచ్చే అమావాస్యను స్వాగతించ లేము.

 తెలంగాణ ఎన్నికల ప్రభావం జాతీయ రాజకీయాలపైన ఎంతవరకు పడుతుంది? ఉచితాలు అనుచితాలు అనే సిద్ధాంతకర్తల మాట ఎలా ఉన్నా గ్యాస్‌ సిలెండర్‌ రూ. 500కే అన్న హామీ మహిళలను ఆకర్షించడం  సహజం. ఎన్నికలను బహిష్కరించండి అని పిలుపునిచ్చిన ఇలాకాలో భారీ ఓటింగ్‌ జరగడం దేనికి సంకేతం? తెలంగాణలో ఒకప్పటి కమ్యూనిష్టు కంచుకోటలైన నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఆ పార్టీ ఎందుకు అడ్రసు లేకుండా పోయింది? ఎందుకు కాంగ్రెసు ‘తోక’ పార్టీగా మిగిలింది?

ఒక పార్టీ విజయం దురదృష్టవశాత్తు ఆ పార్టీ గత కీర్తిని మార్చలేదు. నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణంలో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ బెయిల్‌ మీద ఉన్నారు. భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దబిడ్డ పీవీ నరసింహారావు చనిపోతే అంత్యక్రియలు ఢల్లీిలో జరుగకుండా సోనియా ఎంత అవమానించిందో తెలంగాణ ప్రజలు మరిచి పోయారనుకోవడం భ్రమే. కాసు బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపడం కోసం చెన్నారెడ్డి చేసిన ఉద్యమం, చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం వైఎస్‌ఆర్‌ హైదరా బాదులో మత కల్లోలాలు సృష్టించినట్టు ఉన్న ఆరోపణలు గుర్తుకు రాకుండా ఉంటాయా? అందువల్ల కేసీఆర్‌ పాలన పోయి కాంగ్రెసు పాలన వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజల కష్టాలు తీరతాయని భ్రమించకూడదు. కాంగ్రెసుకు ఓటు వేసినందుకు ఇవాళ కన్నడ ప్రజలు ఎంత బాధ పడుతున్నారో మనం చూస్తున్నాం. అయినా కాంగ్రెస్‌ను ప్రజలు ఎందుకు ఎంచుకున్నారు? కేసీఆర్‌ మీద ఉన్న ఆగ్రహానికి అది నిదర్శనం.

సమాధానాల కోసం వేచి ఉన్న ఇంకొన్ని ప్రశ్నలు:

రాజశ్యామల యాగం కేసీఆర్‌ను ఎందుకు రక్షింపలేకపోయింది?

 కర్ణాటకకు చెందిన డి.కె. శివకుమార్‌, మల్లికార్జున ఖర్గే తెలంగాణ ప్రజల భవితను నిర్ణయించాలా?

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి అభివృద్ధి పనులు కేసీఆర్‌ను ఎందుకు గెలిపించలేదు?

మునుగోడు ఎన్నికలలో గులాబీ రంగులో కనిపించని ప్రజా వ్యతిరేకత, నియంతృత్వం ఈ ఎన్నికలలో కమ్యూనిస్టులకు ఎందుకు కనిపించాయి? సీపీఎం, సీపీఐ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు ప్రవర్తించాయి?

విష్ణువును, గణేశుణ్ణి పూజించకూడదు అని విద్యార్థుల చేత ప్రమాణం చేయించిన ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ కోసం మాయావతి ఎందుకు ప్రచారం చేసింది? ఐనా ప్రవీణ్‌ ఎందుకు ఓడినట్టు?

కామారెడ్డిలో ఒక సామాన్య బీజేపీ కార్యకర్త పదవిలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, కొత్త ముఖ్య మంత్రి అభ్యర్థి రేవంత్‌ రెడ్డిని కూడా జమిలిగా ఎలా ఓడిరచగలిగాడు?

మోదీ వ్యతిరేకతే కేంద్రబిందువుగా ఏర్పడిన ‘ఇండియా’ భవిష్యత్తు ఏమిటి?

రెండు పర్యాయాలకే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా మళ్లీ నెగ్గిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌ను ఎలా బేరీజు వేయాలి?

సంక్షేమ పథకాల పేరుతో ప్రజాకర్షక పథకాలు అన్ని వేళలా పనిచేయవు. వాటిని ప్రజలు ప్రలోభాల కిందకు కూడా జమకట్టగలరు. ప్రజలు పథకాలను చూసే ఓటేస్తారనుకుంటే గ్యాస్‌ సిలెండర్‌ రూ. 400కే ఇస్తామని వాగ్దానం చేసిన  కేసీఆర్‌, అశోక్‌ గెహ్లోత్‌  ప్రభుత్వాలు ఎందుకు ఘోరంగా ఓడిపోయాయి?

ఫలశ్రుతి:

రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ సాధించిన ఘన విజయం లోక్‌సభ ఎన్నికల భవిష్యత్తుకు దిక్సూచిగా కనిపిస్తున్నది. రాహుల్‌ నాయకత్వం యథాప్రకారం ప్రశ్నార్థకమైంది.

 ఇది రేవంత్‌ రెడ్డి వ్యక్తిగత విజయం!

సినీ నటుడు ప్రచారం చేస్తే జనం వినోదంగా చూడడానికి వస్తారు తప్ప ఓట్లు వేయరు. దీనికి రుజువు తెలంగాణలో జనసేన ప్రభావం చూపలేక పోవడమే. మరీ డిపాజిట్‌ కూడా దక్కలేదు.

స్వయం ప్రకటిత మేధావులు ఓటు విలువను గుర్తించరు. ఇది నిత్యసత్యం. రోజూ అవినీతిని విమర్శిస్తూ మాట్లాడే గుంపులు, పోలింగు నాడు ఇల్లు కదలలేదు. ఇది మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక వికృత కోణం.

–  ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE