వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొదిన రచన
సునీతకు పట్టుదల ఎక్కువ. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోదు. కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. షిప్టుల్లో పనిచేయాల్సి రావడంతో మానేసింది. ఇంటి దగ్గరే ఉంటుంది. పరీక్ష చేయించుకుంటే మూడోనెల అన్నారు. వీరబాబు చాలా సంతోషించాడు. ఎత్తుకుని తిప్పాడు. ముద్దులు కురిపించాడు. అత్తారబత్తంగా చూసుకుంటున్నాడు.
సునీతకు కొన్ని రోజులుగా నిస్సత్తువ…నీరసం…
ఒకటే తలపులు… పుట్టింటి తలపులు… అమ్మా నాన్నా, అన్నా… బాల్య స్మృతులు పదే పదే వెంటాడు తున్నాయి… కుటుంబ బంధాలు దూరమైతే అదో గొప్ప వెలితి.
సునీతలో ముందు నుంచీ ఒక తెగింపు ఉంది. లెక్కలేనితనం ఉంది. అందుకే ప్రేమించిన వాడిని వదులుకోలేదు. అమ్మానాన్నలను విడిచిపెట్టింది. తెలియని మత్తు ఏదో ఆవహించిన క్షణాలు అవి. ఫలితంగా వీరబాబుతో బంధాన్ని ముడివేసు కుంది. మరో ధ్యాస లేకుండా తమదే లోకం అన్నట్లుగా ఒకరికొకరు పుట్టినట్లుగా సాగుతోంది జీవితం.
ఉన్నట్టుండి తండ్రి గారాబం గుర్తొచ్చింది. అమ్మ ప్రేమ గుర్తొచ్చింది. ఆడి పాడిన ఇల్లు గుర్తొచ్చింది. బంధువుల ఆప్యాయతలు గుర్తుకొచ్చాయి. ఊరి జనం మదిలో మెదిలారు.
సాయంత్రం వీరబాబు రాగానే పుట్టింటికెళ్లాలనే అభిలాషను అతని ముందు పెట్టింది. వీరబాబు వెంటనే ఒప్పుకోలేదు. సునీత నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది.
‘‘నీకు తెలీదు. లోకం అలా లేదు. మనం అనుకున్నంత మార్పు సమాజంలో రాలేదు. ఎన్ని వార్తలు వినడం లేదూ… సుఖాన ఉన్న ప్రాణం దుఃఖానికి పెట్టుకోడం అవసరమా? ఎందుకు ఆపద కొని తెచ్చుకోవడం?’’ అన్నాడు వీరబాబు. సునీత కళ్లం• నీళ్లు తిరిగాయి. ఆమెను దగ్గరకు తీసుకుని తలను ఒడిలో పెట్టుకుని చేతితో నిమిరాడు. ముంగురులు వెనక్కి సర్దాడు. గమ్మత్తుగా బుగ్గ మీద చిటికె వేశాడు. సునీత అందంగా నవ్వింది. ఆమె కళ్లు మిలమిలా మెరిశాయి.
వీరబాబు చిరు గడ్డాన్ని వేళ్లతో పట్టుకుని లాగింది మురిపెంగా. మెడ చుట్టూ రెండు చేతులతో దగ్గరకు లాక్కుని పెదాలపై ముద్దు పెట్టుకుంది. కాసేపు ఇద్దరికే చెందిన ప్రపంచంలో తేలియాడారు. ఆ సమాగమమే అందమైన అలసటై నుదుటన చిరుచెమటల సాక్షీభూతమైంది.
అంతా అయ్యాక – ‘‘మరి ఇప్పుడేమంటావ్?’’ అంది సునీత చిరునవ్వులు చిందిస్తూ.
‘‘ఈపాటికి మావోళ్లు చల్లబడే ఉంటారు. ఎన్నాళ్లిలా? మనిద్దరం వెళ్లి కలుద్దాం. ఏం చేస్తారు? చంపేయరు కదా…!’’ అంటూ పుట్టింటికి వెళ్లాలనే తలంపును మరోసారి బయట పెట్టింది.
‘‘కొన్నాళ్లు ఆగుదాం. కాదూ కూడదూ అంటే నీ ఇష్టం…’’ అన్నాడు వీరబాబు.
‘‘ఇద్దర్నీ తప్పక అంగీకరిస్తారు. అది నా నమ్మకం. సంవత్సరంగా కన్నవాళ్లను కలవలేదు. ముఖాలు కూడా చూసుకోలేదు. ఇదెంతో బాధాకరం కదా’’ అంది.
‘‘నీవెప్పుడంటే అపుడు కలసే వెళదాం… సరేనా…’’ అన్నాడు వీరబాబు సన్నగా.
సునీత చిన్నాన్న కొడుకు రామం వచ్చాడు. ఊహించలేదు. అదొక గొప్ప వేళావిశేషం.
సునీతలో సంభ్రమాశ్చర్యాలు. ఆపాద మస్తకం పులకింత. దయాసముద్రంతో నిండిన ఆత్మీయ పలకరింపులు గొప్ప శక్తినిచ్చే టానిక్. కరస్పర్శలు ఆప్యాయ తరంగాల మెత్తని చూపులు. చిరు మందహాసపు జల్లులు సాంత్వన కలిగించే దివ్యౌషధం.
మనసు రాగరంజితమైంది. మర్యాద మన్ననలకు లోటు చేయలేదు. దాదాపు సంవత్సరం తర్వాత ఒక కుటుంబ సభ్యుడ్ని కలిసిన సమయం. ఎంతో హాయి తీరని దాహమేదో తీరినట్టు మరెంతో సంతోషం.
సునీత సంతోషానికి అవధులు లేవు. స్వీటు, హాటు, కాఫీ…
రామంతో మాట్లాడుతున్నంత సేపు పరిసరాలు మరచింది. కుటుంబ క్షేమ సమాచారాల్ని ఆరా తీసింది. చిన్ననాటి ముచ్చట్లు జ్ఞాపకం తెచ్చుకుంది. నవ్వుల పువ్వులు పూయించింది. కొండంత బరువు దించుకున్న అనుభూతి. మారిన మనుషుల జాడకు ఆనందం పరవళ్లు తొక్కింది. కలల పంట గురించి చెప్పింది. రామం చిత్రంగా నవ్వి భుజం తట్టాడు.
‘‘సునీతా… మీ నాన్న నిన్ను కలవరిస్తున్నాడు. చూడాలని గోల పెడుతున్నాడు. ప్రస్తుతానికి మాకేమీ కోపాలు లేవు. ఇష్టపడ్డారు…దూరంగా వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇపుడు బిడ్డను కూడా కనబోతున్నావు. ఇలాంటివి ఇపుడు మామూలు అయిపోయాయి. జరిగిపోయింది అక్కడితో సరి. రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? వెంటనే బయలుదేరు. అందుకే వచ్చాను’’ కుర్చీ లోంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఫ్రేములో వీరబాబు- సునీతల ఛాయా చిత్రాన్ని చూస్తూ అన్నాడు రామం.
సునీత వెంటనే సమాధానం చెప్పలేకపోయింది.
కాసేపు ఆలోచించి – ‘‘వీరబాబు రావడం ఈవేళ ఆలస్యం అవుతుంది. ఎలా? మేం ఇద్దరం కలసి వస్తాం లే…అన్నా…’’
‘‘అలా కాదు, సునీతా… మనం వెంటనే వెళ్లాలి. పెదనాన్న ఎదురు చూస్తుంటాడు. ఈవేళ కచ్చితంగా తీసుకొస్తానని మాట ఇచ్చాను. ఆయన ఆరోగ్యం అంత బాగో లేదు. ఎందుకు చెబుతున్నానో… విను’’ అంటూ ఆగిపోయాడు రామం. ఇలా అనడంలో చెప్పరానిదేదో ఉన్నట్టు ధ్వని ఉంది.
తండ్రి ఆరోగ్యం పట్ల కీడు శంకించింది. వెంటనే వీరబాబుకు ఫోను చేసింది. కలవలేదు. నెట్‌వర్కు సమస్య. బయటకు వెళ్లి ప్రయత్నించింది. ఎట్టకేలకు ఫోను పనిచేసింది. విషయం చెప్పింది.
వీరబాబు ముందు వెనుకలు ఆలోచించకుండా వెంటనే వెళ్లడం పట్ల అభ్యంతరం చెప్పాడు. మర్నాడు ఇద్దరం కలసి వెళదామని చెప్పాడు. సునీత ఒప్పుకోలేదు. బతిమాలింది. ప్రాధేయపడింది. సునీత గొంతులో తారాడుతున్న సన్నని వణుకు గమనిం చాడు. ఇక వద్దని అనలేకపోయాడు. అయిష్టంగానే జాగ్రత్తలు చెప్పి వెళ్లమన్నాడు. వెళ్లిన వెంటనే ఫోను చేయమన్నాడు.
తల్లిదండ్రుల ఎడబాటు కలిగించిన శూన్యత లోంచి బయటపడి జ్ఞాపకాల్ని వెలిగించుకుంటూ రామంతో వెళ్లడానికి సిద్ధపడింది సునీత. నిజానికి పుట్టింటికి వెళ్లాల్సివస్తే వీరబాబుతో కలిసి మాత్రమే వెళ్లాలనుకుంది.
ఇంటికి తాళం వేసి గేటు తీసుకుని బయటకు వచ్చింది. ఏదో మరచి పోయినట్టు మళ్లీ మరోసారి తాళం తీసుకుని వంటింట్లోకి వెళ్లి వీరబాబుకు ఇష్టమైన పాకంగారెను కనపడేలా పెట్టింది. బెడ్ రూంలోకి వెళ్లి చిన్న కాగితం మీద కొన్ని అక్షరాలు రాసి తలగడపై ఉంచింది.
రామం బుల్లెట్టు బైకు మీద వచ్చాడు. కొత్తగా నిగనిగలాడుతూ యముని మహిషంలా ఉంది. పెద్ద కండచీమను జూమ్ చేసి చూస్తున్నట్టుగా ఉంది.
‘‘అంత దూరం దీనిమీద వెళ్లాలా? కారో బస్సో బావుంటుంది కదా’’ అంది బుల్లెట్టును తేరిపారి చూస్తూ
‘‘విమానంలో వెళుతున్నంత హాయిగా మనం వెళ్లొచ్చు… అడ్డదారిలో గమ్మున ఊరు చేరిపోతాం. కంగారుపడకు’’
అన్న భుజం మీద చేయేసి భయం భయంగా కూర్చుంది సునీత.
కిక్కిరిసిన నగర జనసందోహంలో ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. పట్టణ పొలిమేర దాటిం తర్వాత తన చోదక ప్రావీణ్యాన్ని చూపిస్తున్నాడు. వేగం పుంజుకుంది. అనాదరణకు గురైన రోడ్డు మార్గం. గతుకులమయంగా ఉంది. ఖరీదైన వాహనం కావడం వల్ల కుదుపులు లేవు. సౌకర్యం గానే ఉంది. బుల్లెట్ బండి లోంచి లయాత్మకంగా వెలువడే ధ్వని లబ్‌డబ్ గుండె చప్పుడులా చెవుల్లో సంగీతంలా వినబడుతోంది.
రామం తదేక దీక్షతో బండి నడుపుతున్నాడు. అతని చూపు సూటిగా గమ్యం వైపు ఉంటే మనసు మాత్రం అనేక ఊహలతో గింగిరాలు కొడుతోంది. మాటిమాటికి తల విదిలిస్తున్నాడు. జుట్టును ఒక చేత్తో వెనక్కి లాక్కుంటున్నాడు.
గోదారి వంతెన వచ్చింది. కుడివైపు ఏటిగట్టుకు తిప్పాడు. చల్లని గాలి రివ్వున వీస్తోంది. కుడివైపు నిండు గోదావరి. ఉరకలేస్తూ సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. వరద సమయం. ఏటిగట్టు అంచు వరకు నీరు చేరింది. రోడ్డు మార్గం అనేక వంకర్లతో ఉన్నప్పటికీ ఒకే వేగంతో పోనిస్తున్నాడు. లంకల్లోంచి తోలుకొచ్చిన పశువుల మందను చెట్ల కింద నీడల్లో కట్టారు.
రామం సినిమాలు చూస్తాడు. కథలు చదువుతాడు. అప్పటికప్పుడు కథలు అల్లి చెబుతాడు కూడా. కుర్రకారు సినీ హీరోల్లా జుట్టూ గెడ్డం పెంచాడు. జీన్ ఫాంటు…టీ షర్టులతో ఉంటాడు. చలాకీగా ఉండే అందమైన పాతికేళ్ల కుర్రాడు రామం.
‘‘అన్నా… కొంచెం స్పీడు తగ్గించు. ఇపుడు పులసల సీజను అనుకుంటాను. బాగా దొరుకు తున్నాయా?’’ గోదారి వైపు చూస్తూ సునీత అడిగింది. ఆగస్టు, సెప్టెంబరు లలో గోదారి చూస్తే ఈ ప్రాంతవాసులకు పులసలే గుర్తుకొస్తాయి. వరద తగ్గుముఖం పడితే గానీ పులసలు దొరకవు. అదే చెప్పాడు.
ఏటిగట్టున జనసంచారం లేదు. మనిషి జాడ లేదు. గోదారి ఉధృతంగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. కనుచూపు మేర తూర్పున సూర్య కిరణాల్లో బంగరు ఛాయతో మెరుస్తూ కలకనీరు.
‘‘పులస గురించి చెప్పనా? ఒక ఆడపులస మధుర జలాల గోదారి గొప్పతనం గురించి తన అమ్మమ్మ, నానమ్మల ద్వారా వింది. వాళ్లు అప్పటికే రెండుసార్లు గోదారి నీళ్లలో తనివితీరా ఈది మునకలేసి గంపెడు సంతానంతో తిరిగొచ్చాయి. పదేపదే ఊరిస్తూ చెబుతూ ఉండటంతో తనూ బయలుదేరింది. ఆస్ట్రేలియా నుండి ఖండాంతరాలు దాటి హిందూ మహా సముద్రం, బంగాళాఖాతం కడకు గోదారీ సముద్రం సంగమ స్థలికి చేరింది. పిల్లల్ని కని వెనక్కి వెళదా మనుకుంది. అదెంత ఆపదో ఊహించుకోలేదు.
అక్కడ చమురు సంస్థల తీవ్ర సవ్వడుల ప్రకంప నాలుంటాయి. దాటాలి. గోదారి వేటగాళ్ల చేతుల్లో తమకోసమే ప్రత్యేకంగా అల్లిన ఖరీదైన వలలుంటాయి. తప్పించుకోవాలి. ఈ సుదూర ఈత ఎంతో సాహసకృత్యం. అనుభవంలోకి వస్తే గానీ కొన్ని సమస్యలు తెలియవు. పులస రుచికి మాంసప్రియులు నాలుకలు చాపుకుని ఎదురు చూస్తుంటారు. జిహ్వా చాపల్యంగల ముసిలోళ్లు జీవితంలో చివరిసారిగా తిని తీరాలనుకుంటారు. సెన కలిగిన ఆడ పులసంటే మరీ ఇష్టపడ తారు. వాళ్లకు పులస తినడం నలుగురిలో పరువుకు సంబంధించిన విషయం. ఆ పరువు కోసం పుస్తెలైనా అమ్ముతారు.. ఆస్తులైనా అమ్ముకుంటారు ఎంతకైనా తెగిస్తారు. పట్టుబడిన ఆడపులసకు సంతానోత్పత్తి కలలు నెరవేరవు. నాలాంటివాడు సాగనీయడు. అది ఎలాగంటే…’’ అంటూ ఏటిగట్టు అంచు వరకు బులెట్ పోనిచ్చి గభాలున బలంగా సునీతను గోదారిలోకి నిర్దాక్షిణ్యంగా తోసేశాడు. కనురెప్ప మూసి తెరిచేంతలో జరిగిపోయింది. లిప్తలో సునీత వరద గోదారిలోకి జారిపోయింది.
‘‘వంశ ప్రతిష్ట గురించి ఆలోచించక్కర్లేదా…పైగా కులభ్రష్టత్వంతో కనడానికి కూడా సిద్ధపడతావా?’’ అనుకుంటూ కసిగా తిట్టుకుంటూ బుల్లెట్టును వెనక్కి తిప్పాడు. విజయగర్వంతో దారి మరల్చాడు.
వీరబాబు సాయంత్రం నుంచీ సునీతకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. పలకలేదు.
భయం…భయంతో పాటు కలల సౌథం కూలినట్లుగా ఆలోచనలు… వెనకాముందూ ఆలోచించకుండా అడగ్గానే పంపినందుకు గుండెల్లో వణుకు మొదలైంది. జరగరానిదేదో జరిగి పోతున్నట్టుగా అయోమయంతో నిస్సహాయంగా నిలుచుండిపోయాడు. సకల అవరోధాలు… ఆటంకాలు… ఎదురవుతాయని తెలిసే గాఢంగా ప్రేమించాడు. కుల తారతమ్యాల్ని పట్టించుకోకుండా ఇద్దరూ ఒక రకంగా సాహసమే చేశారు.
ఒకరికొకరు అన్నట్టుగా బతకాలనే అనుకున్నారు. కలల పంట పండుతున్న సమయంలో తప్పు చేశానేమోనని అపరాధభావంతో సర్వం కోల్పోయినట్లుగా కళ్లనీళ్ల పర్యంతమై ఏడ్చేశాడు వీరబాబు. వెంటనే సునీత తల్లిదండ్రుల దగ్గర కెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. లోలోపల అలజడి…ఉద్వేగ సంరంభం…
ఊరు చేరేటప్పటికి రాత్రి పదకొండు గంటలయ్యింది. సునీత ఎంతో ఇష్టపడే ఇల్లు అది. ఎదురుగా నిలుచున్నాడు. ఏ విధమైన అలికిడి లేదు. ధైర్యంగా గేటు దూకి కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరూ వస్తున్న జాడ లేదు. పదేపదే బెల్ నొక్కడం తలుపు గట్టిగా కొట్టడం చేస్తున్నాడు. కాసేపటికి తలుపు తెరుచుకుంది.
రాఘవరావు కళ్లు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. వచ్చినవాడిని పోల్చుకున్నాడు. వీరబాబును చీదరగా కోపంగా చూశాడు. లోపలికి రావడానికి వీల్లేదంటూ గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు.
‘‘ఎందుకొచ్చావ్?’’ తీవ్రంగా చూస్తూ అడిగాడు.
‘‘సునీత ఎక్కడ?’’ అంటూ తోసుకుని లోపలకి అడుగేశాడు వీరబాబు.
‘‘ఏయ్…ఆగు…’’ అన్నాడు. వినిపించుకోలేదు. ఈలోపు రాఘవరావు కొడుకు రవి పరిగెట్టుకుని వచ్చాడు. రాగానే వీరబాబు కాలరు పట్టుకున్నాడు. పిడిగుద్దులు గుద్దాడు. వీరబాబు మాట్లాడే ప్రయత్నాన్ని సాగనీయలేదు.
‘‘ఆఫ్ట్రాల్ పనిమనిషి కొడుకువి… పెద్దింటి పిల్ల కావాల్సి వచ్చిందా? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే దొంగ నా కొడుకా…నీ పని చెబుతానుండు’’ అంటూ గదిలోకి లాక్కెళ్లి తలుపు గడియ పెట్టేశాడు రవి.
రాఘవరావు తలుపు తీయమని బతిమాలినా తీయలేదు.
‘‘సునీత కోసం అంటున్నాడు. ముందు సునీత ఏమైందో కనుక్కో …ఎదవని’’
లోపల్నుండి అరుపులు, బూతులు, కొట్టుకుంటున్న దభేల్మనే చప్పుళ్లు వినిపిస్తున్నాయి. రవికి ఆవేశం ఎక్కువ. మొండివాడు. విచక్షణాజ్ఞానం లేనివాడు. ఎవర్నీ లెక్క చేయడు. గదిలో ఏం జరుగుతుందో…
కాసేపటికి గదిలోంచి మూలుగులు. ఆ తర్వాత అవీ ఆగిపోయాయి.
మండువాలోగిలిలోని గోడ మీద పులిని చంపి తుపాకీతో తీయించుకున్న ఫొటోలో రాఘవరావు ముత్తాత విజయ గర్వంతో నవ్వుతున్నాడు.
మురళి దిగ్గున లేచాడు. తీక్షణంగా చూశాడు. కళ్లల్లో రోషాగ్ని జ్వాలలు. ముఖంలో రంగులు మారాయి. కోపంతో ఊగిపోతున్నాడు. హఠాత్తుగా అతనిలోని మార్పు ఎందుకొచ్చిందో ఊహించలేక పోతున్నాను. భయం కలిగింది. నేనూ లేచి నిలబడ్డాను.
ఒక్కసారిగా నా కాలరు పట్టుకుని గుంజాడు. కళ్లజోడు కింద పడిపోయింది. చొక్కా బొత్తం ఊడిపోయింది. అక్కడితో ఆగలేదు. చెంప చెళ్లుమనిపించాడు. జుట్టు పట్టుకుని లాగాడు. పిడిగుద్దులు గుద్దడానికి సిద్ధపడుతున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఎందుకంత కోపం?
నిర్ఘాంతపో•యాను. కథ ఇచ్చాను. చదివాడు. అంతే కదా…అపరిచితుడిలా ఎందుకు మారాడు?
‘‘నీవు రాసింది మా బంధువు సత్తిరాజు కూతురు శారద గురించే కదా. నీకసలు బుద్ధీ జ్ఞానం ఉందా? శారద ప్రేమ… పుట్టింటికి బయలుదేరడం…ఆ బుల్లెట్టూ… గోదారి గట్టూ… వరద…నీళ్లలో పడటం… అక్కడి వరకు నిజమే. తర్వాత జరిగిందేమిటి? నీకు తెలియదా? ఎందుకిలా చేస్తారు మీ రచయితలు… అసలు జరిగిన వాస్తవం ఏమిటి? ప్రాణాలొడ్డి రక్షించిన ఆ చేపలు పట్టే వాళ్ల గురించి ఎందుకు రాయలేదు? సత్తిరాజు ఇద్దర్నీ అక్కున చేర్చుకున్నాడు కదా. జీవితం సుఖాంతమై ఇరువైపులా అందరూ హాయిగా చక్కగా ఉన్నారు కదా’’ మురళి స్వరంలో తీవ్రత పెరిగింది. బిగ్గరగా అరుస్తూ … ఆవేశంతో కదను తొక్కుతున్నాడు.
‘‘మరి… మరి… కథన్నాక ఒక సంఘర్షణ…ఒక సంచలనం… ఉండాలని…’’ నసిగాను.
‘‘నోర్ముయ్… ఏం సందేశం ఇస్తున్నావురా… పనికిమాలిన రాతలు… చెత్త నా కొడుకా… సందేహంలేదు. నీవు మావాళ్ల కథే రాశావు. గొప్పకి నాచేత చదివిస్తున్నావు. శుభ్రంగా సంసారం చేసుకుంటున్న వాళ్లను చంపేయ డమేమిట్రా… నీ అక్షరాలు గురి తప్పాయి. ధ్వంస రచన ఇది. చేతనైతే కాలం గెలుస్తుందనీ ప్రేమలూ గెలుస్తాయని రాయండి రా… మన కుటుంబ వ్యవస్థ, జీవన నేపథ్యం ఎలాంటిది? కాలాన్ని గౌరవించి చక్కగా వాళ్లిద్దరికీ సాంప్రదాయంగా పెళ్లి చేసినట్టుగా ముగింపు ఇవ్వొచ్చు కదా. కంపుకొట్టే రాతలు రాస్తే పాఠకుడు తిరుగుబాటు చేస్తాడు నాలా. జాగ్రత్త…’’ అంటూ మురళి తన చేతిలోని కాగితాల్ని పరపరా చింపేసి ఉండచుట్టి బయటకు విసిరేశాడు.
– దాట్ల దేవదానం రాజు
వచ్చేవారం కథ..
ఛాయచిత్ర కథనం – విజయార్కె