ఇటీవలికాలంలో కొందరు పార్లమెంట్‌ ‌సభ్యులు ప్రజాహిత సమస్యలపై హేతుబద్ధ చర్చకంటే సున్నిత అంశాలను లేవనెత్తడానికే ఉత్సాహపడుతున్నారు. వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న అలాంటి పరిణామాలు అంతకంతకు పెరుగుతున్నాయి. సమావేశాలను స్తంభింప చేయడమే పరమావధిగా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామిక ప్రియులలో ఆందోళన రేకెత్తించడమే కాదు, పార్లమెంట్‌ ‌చర్చల మీద ప్రజాప్రతినిధుల నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తోంది.

దేశభద్రత రీత్యా సున్నిత అంశాలను లేవనెత్తి అనవసర గందరగోళం సృష్టిస్తున్న వీరి వ్యవహార శైలిని ఏ విధంగా పరిగణించాలి? డీఎంకే సభ్యులు సెంథిల్‌కుమార్‌, ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఎం.‌పి. మహువా మెయిత్రా, మహమ్మద్‌ అబ్దుల్లా, బీఎస్‌పీ ఎంపీ డానిష్‌ అలీలు వివాదాలు సృష్టించి వార్తల్లో నిలవడం ఇందుకు తాజా ఉదాహరణ. డీఎంకే సభ్యులు హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించడంతో వాటిని రికార్డుల నుంచి తొలగిం చారు. జమ్ము-కశ్మీర్‌ ‌రిజర్వేషన్‌ అమెండ్‌మెంట్‌ ‌బిల్‌ (2023)‌పై కూడా ఆయన ‘ఎక్స్’‌లో పోస్ట్ ‌చేసిన అభిప్రాయం కూడా వివాదం సృష్టించడంతో తరువాత క్షమాపణలు చెప్పారు.

మహువా మొయిత్రా

ఒక పారిశ్రామికవేత్తకు అనుకూలంగా ప్రశ్నల డిగినందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌సభ్యురాలు మహువా మొయిత్రా పార్లమెంట్‌ ‌నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్లమెంటరీ ఎథిక్స్ ‌కమిటీ సిఫారసు మేరకు ఈ చర్య తీసుకున్నప్పటికీ, ఆమెలో తప్పుచేశానన్న భావం కించిత్‌ ‌కూడా కనిపించకపోవడం గమనార్హం. పైగా పార్లమెంట్‌ ‌నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ప్రజాస్వామ్యంపట్ల, పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల ఆమెకు ఎంతమాత్రం విశ్వాసం లేదన్న సత్యాన్ని నిరూపిస్తోంది. పార్లమెంటరీ ఎథిక్స్ ‌కమిటీ సిఫారసు చేసిన తర్వాత కూడా, సభలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌సభ్యులు మహువా మొయిత్రాకు మద్దతుగా నినాదాలు చేస్తూ గలభా సృష్టించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఎథిక్స్ ‌కమిటీ ముందు తనను తాను సమర్థించుకునే అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నందున, పార్లమెంట్‌లో మాట్లాడటానికి స్పీకర్‌ ఓం ‌బిర్లా ఆమెకు అవకాశం ఇవ్వలేదు. గత అక్టోబర్‌లో బీజేపీ ఎంపీ నిశికాంత్‌ ‌దుబే మొయిత్రాపై పార్లమెంట్‌లో ఒక ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం ఆమె గౌతమ్‌ ఆదానీ గ్రూపు లక్ష్యంగా, దర్శన్‌ ‌హీరానందానీ అనే వ్యాపారవేత్తకు అనుకూలంగా పార్లమెంట్‌లో ప్రశ్నలు సంధించారన్నది ఆయన ఫిర్యాదులోని అభియోగం. ఇందుకు ప్రతిఫలంగా ఆ వ్యాపారవేత్త నుంచి అనుచిత ప్రయోజనాలు పొందారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఎథిక్స్ ‌కమిటీ విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలడంతో ఆమెను పార్లమెంట్‌ ‌నుంచి బహిష్కరించడం తదనంతరం జరిగిన పరిణామం. మరి ఎథిక్స్ ‌కమిటీలో విపక్షాల సభ్యులు కూడా ఉంటారు కనుక ఈ కమిటీ వివక్షా పూరితంగా వ్యవహరించిందనడానికి వీల్లేదు. కానీ మొయిత్రా మాత్రం ఎథిక్స్ ‌కమిటీ విచారణను కూడా తప్పుపట్టారు. ఆమెకు వత్తాసుగా విపక్షాలన్నీ ఏకమవడం మరో విచిత్రం! ఇక్కడ ఒక అనైతిక పనికి పాల్పడి, దాన్ని తప్పు అని తేల్చినప్పుడు, అంగీక రించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఇక్కడ మొయిత్రా విపక్షాల అండ చూసుకొని రెచ్చిపోతుంటే, ప్రతి పక్షాలు నైతికతను పక్కన బెట్టి కేవలం ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లడం వర్తమాన చరిత్ర.

డానిష్‌ అలీ

బీఎస్‌పీ పార్లమెంట్‌ ‌సభ్యుడు డానిష్‌ అలీ వివాదాస్పద వైఖరితో పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. నిజానికి దేవెగౌడ సిఫారసుతో బీఎస్‌పీ ఆయనకు టిక్కెట్‌ ఇచ్చింది. ఇదే విషయం సస్పెన్షన్‌ ‌లేఖలో పేర్కొన్నది కూడా. బీఎస్‌పీ ప్రస్తుతం కేంద్రం పట్ల కొంతమేర సానుకూల వైఖరితో ఉంది. పార్టీ వైఖరికి భిన్నంగా డానిష్‌ అలీ, త్రిపుల్‌ ‌తలాఖ్‌, ‌కాశ్మీర్‌ ‌బిల్లు వంటి అంశాలపై ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని అవలంబించారు. మొహువా మొయిత్రా బహిష్కర ణను కూడా ఆయన నిరసించడమే కాకుండా లోక్‌సభ నుంచి విపక్షాలతో కలిసి వాకౌట్‌ ‌చేయడం బీఎస్‌పీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన్ను పార్టీనుంచి బహిష్కరించారు.

మహమ్మద్‌ అబ్దుల్లా

డీఎంకే సభ్యుడు మహమ్మద్‌ అబ్దుల్లా రాజ్య సభలో మాట్లాడుతూ, కశ్మీర్‌ ‌సమస్యను ద్రవిడవాద ఉద్యమంతో పోలుస్తూ మాట్లాడటం మరో వివాదాన్ని లేవనెత్తింది. చివరకు రాజ్యసభ ఛైర్మన్‌ ‌జగదీష్‌ ‌ధన్‌కర్‌ ఆయన్ను తీవ్రంగా హెచ్చరించే వరకు వెళ్లింది. జమ్ము-కశ్మీర్‌ ‌బిల్లును, 370 అధికరణాన్ని ఎత్తివేయడాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఇవి కేవలం సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించడంతో రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలు దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునే ధిక్కరించేవిగా ఉన్నాయంటూ అధి

కారపక్ష సభ్యులు ఎదురుదాడికి దిగారు. చివరకు రాజ్యసభ ఛైర్మన్‌ ‌ధన్‌కర్‌ ‌కలుగజేసుకొని సర్వోన్నత• న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు మనమంతా కట్టుబడి ఉండాలని హితవు పలికారు. అయితే కాంగ్రెస్‌ ‌సభ్యుడు కె.సి.

వేణుగోపాల్‌ ‌లేచి, ప్రతి సభ్యుడికి తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉన్నదంటూ డీఎంకే సభ్యుడిని సమర్థించడం ఆ పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోంది. స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదని ధన్‌కర్‌ ‌హితవు చెప్పినా తాను సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడం లేదంటూ తనను తాను సమర్థించుకోవడం ఎంతవరకు సమంజసం? పైగా ‘‘ప్రతి జాతికి స్వీయ నిర్ణయాధికారం ఉంటుంది’’ అన్న పెరియార్‌ ‌వ్యాఖ్యలను ఉటంకించి వివాదాన్ని మరింత తీవ్రం చేయడం ఆయన ఉద్దేశ పూర్వక వైఖరికి నిదర్శనం. స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమేంటి? దేశ హితాన్ని సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకపోతే ఎట్లా?

స్వేచ్ఛకు పరిమతులుండాలి

రాజ్యాంగంలోని 105,194 అధికరణాలు పార్లమెంట్‌లో సభ్యులకు వాక్‌ ‌స్వాతంత్య్రపు హక్కును పరిరక్షిస్తున్నాయి. అయితే ఈ హక్కును ఉపయో గించుకునే ముందు పార్లమెంట్‌ ‌సభ్యులు ముఖ్యంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మొదటిది, సభ నియమ నిబంధనలకు లోబడి ఉండటం, వాక్‌స్వాతంత్య్ర హక్కును ఉపయోగించుకునే సమయంలో తన వాదనకు అనుగుణంగా సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడం, ప్రజా ప్రయోజనాల అంశాలను లేవనెత్తి, వాటిపై తన వాదనను వినిపించడం. రాజ్యాంగంలోని అధికరణం 105 క్లాస్‌ (1),(2)‌లు పార్లమెంట్‌లో ఒక సభ్యుడు మాట్లాడిన అంశం లేదా ఆయన చేసిన ఓటింగ్‌పై కోర్టులో సవాలు చేయడానికి వీల్లేకుండా రక్షణ కల్పిస్తున్నాయి. కాగా రాజ్యాంగంలోని 105 అధికరణంలోని (4)వ క్లాజు బ్రిటిష్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యులకున్న ప్రయోజనాలను మన పార్లమెంట్‌ ‌సభ్యులకు కూడా కల్పిస్తోంది. అయితే పార్లమెంట్‌ ‌సభ్యుడు తాను వాస్తవమని నమ్మిన లేదా కనీసం విచారణార్హత కలిగిన అంశాలను లేవనెత్తే స్వేచ్ఛను కలిగివుంటాడు. పార్లమెంట్‌ ‌సక్రమంగా పని చేయాలంటే ప్రాథమికంగా ఇది అవసరం కూడా. ముఖ్యంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగి నప్పుడు, అధికార దుర్వినియోగం, ఆర్థిక అవక తవకలు జరిగాయని భావించినప్పుడు ఈ స్వేచ్ఛను సభ్యులు ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో సభ్యులు సవివరమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ఇదే కారణం, సభ్యులు హక్కుల పేరుతో స్వేచ్ఛను దుర్వినియోగం చేయడానికి దోహదపడుతోంది. నిజానికి సభ్యుల వాక్‌ ‌స్వాతంత్య్రం పార్లమెంట్‌ ‌సమగ్రతను కాపాడటమే కాదు, అమాయకులపై కార్యనిర్వాహక శాఖ అణచివేత చర్యలను నిలదీయడం ద్వారా ఆ శాఖను జవాబుదారీ చేయడం సాధ్యం కాగలదన్నది ఎంత నిజమో, ఒక సభ్యుడు రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులను దుర్వినియోగం చేసినట్లయితే, పార్లమెంటరీ చట్టాల ప్రకారం శిక్షార్హుడవడం కూడా అంతే నిజం.

దేనిపై విపక్షాల పోరాటం?

ప్రస్తుతం విపక్షాలు దేశ అనైక్యత కోసం ఐక్యంగా పోరాడుతున్నట్టు పార్లమెంట్‌ ‌సమావేశాలను పరిశీలిస్తున్న వారికెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో పార్లమెంట్‌ ‌రూల్‌ ‌బుక్‌ను విసిరికొట్టడం, టేబుల్‌పై నిలబడటం వంటి సభ్యుల చర్యలను కూడా గమనిస్తున్నాం. నిజానికి ఇవన్నీ పార్లమెంట్‌ ‌పవిత్రతను భగ్నం చేసే దుశ్చర్యలే. ఎందుకంటే పార్లమెంట్‌, ‌ప్రజాస్వామ్యా నికి దేవాలయం వంటిది. మరి ఈ పవిత్రతను కాపాడాల్సిన సభ్యులే దాన్ని దెబ్బతీసే రీతిలో ప్రవర్తిస్తుండటం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. కొన్ని సందర్భాల్లో సభ్యులు తమ తప్పుడు ప్రవర్తనకు క్షమాపణలు చెప్పినా, చాలా సందర్భాల్లో వారందుకు అంగీకరించడంలేదు. తమ ప్రవర్తనను ‘గొప్ప’దిగా భావిస్తుండటమే బహుశా ఇందుకు కారణమని భావించాలేమో! పార్లమెంట్‌ ‌సభ్యుల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉండటం, కొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావించడం, తమ మాటే నెగ్గాలన్న పట్టుదలకు ప్రధాన కారణం. వీరిలో చాలామందికి తగిన విద్యార్హతలు లేదా విషయ పరిజ్ఞానం లేకపోవడంగా భావించాలి. విషయ పరిజ్ఞానం ఉన్నవారు తమ అర్థవంతమైన వాదనతో అధికార పక్షాన్ని నిలదీయవచ్చు. కానీ అది లేనివారు, అరుపులు కేకలతో సభకు అంతరాయం కలిగించడం ద్వారా గుర్తింపు పొందాలనుకోవడం దురదృష్టకరం. కొందరు వితండవాదంతో తమ వాదనను, దేశ భద్రత రీత్యా అత్యంత సున్నిత అంశాలతో సరిపోల్చి అతిచిన్న సమస్యను లేదా లేని సమస్యను కెలికి పతాక శీర్షికలకెక్కాలన్న ఉద్దేశం మరొకటి. ఇంకొందరు సభ్యులు తాము కావాలనే తప్పుడు పనులకు పాల్పడి, దాన్ని మొండిగా సమర్థించుకోవడం లేదా విచారణను ఎదుర్కొనాల్సి వచ్చినప్పుడు లేనిపోని అభాండాలు వేసి తప్పును ఎదుటివారిపైకి నెట్టేయాలని చూడటం లేదా కోర్టులను ఆశ్రయించడం, ఎప్పుడూ ప్రచారంలో ఉండాలను కోవడం కూడా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయి.

విలువలు పతనం

ప్రస్తుతం పార్లమెంట్‌లో భద్రతావైఫల్యంపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీ యండంలో తప్పులేదు. కానీ ఇందుకోసం అనుచితంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తన కారణంగా లోక్‌సభ నుంచి 13మంది, రాజ్యసభ నుంచి ఒక సభ్యుడు సస్పెన్షన్‌కు గురయ్యారు. పార్లమెంట్‌ ‌భద్రతపై కంటే, విజిటర్స్ ‌పాస్‌ను మంజూరు చేసింది బీజేపీ ఎంపీ కావడం విపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. వీరి గొడవకు ప్రధాన కారణం ఇదే! ఇదే ఏ విపక్షపార్టీ ఎంపీనో ఇటువంటి పాస్‌లు ఇచ్చి ఉన్నట్లయితే, వారు ఇంతటిస్థాయిలో విరుచుకు పడేవారా? అన్న ప్రశ్నకు విపక్షాలు ఏం సమాధానం చెబుతాయి? ప్రస్తుతం దేశంలోని ప్రతిపక్షాలు తమవారిని కాపాడుకోవడం (తప్పు చేసినప్పటికీ), ఎదుటి వారిపై విరుచుకు పడటం అన్న పంథాను అనుసరిస్తున్నాయి తప్ప, దేశహితంపై వాటికి పెద్దగా పట్టింపు ఉండక పోవడం, విలువల పతనానికి నిదర్శనం. నిజానికి పార్లమెంట్‌ ‌భద్రత, పార్లమెంట్‌ ‌సచివాలయం పరిధిలోనిదని, అయినప్పటికీ ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని లోక్‌సభ స్పీకర్‌ ‌చెప్పి నప్పటికీ విపక్షాలు శాంతించలేదు. దేశ ప్రజలు తమను గమనిస్తున్నారని, ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో వారికి స్పష్టంగా తెలుస్తున్నదన్న సంగతిని వీరు విస్మరిస్తున్నారు. మీడియా విడమరచి చెప్పాల్సిన అవసరంలేదు. ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలే నిజానిజాలు తెలుసుకోగలుగుతున్నారు.

జమలాపురపు విఠల్‌రావు

About Author

By editor

Twitter
YOUTUBE