నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సగానికి పైగా తిరిగి టిక్కెట్‌లు ఇవ్వబోమని జరుగుతున్న ప్రచారంతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వంపై గల వ్యతిరేకతను ఎమ్మెల్యేలపై రుద్ది తాను తప్పించుకోవాలని చూస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. అసలు తామే ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నామని అంటున్నారు. అభ్యర్థులను చూసి ఓట్లేసే రోజులు కావివి. పార్టీ అధినేతను చూసి ఓట్లేయడం అనేది రెండు దశాబ్దాల నుంచి జరుగు తోంది. ఇందులో ఏదో ఒక పార్టీని ఉదాహరణగా చూపాల్సిన పనిలేదు. జాతీయ పార్టీల నుంచి స్థానిక పార్టీల వరకు అన్నిటి పరిస్థితి ఇంతే. ఇక ఆంధప్రదేశ్‌లో ఈ పరిస్థితి మరింత ఎక్కువ. ముఖ్యంగా వైసీపీ అధినేత తానే అన్నీ అయి పాలన సాగిస్తూ, ఎమ్మెల్యేలను నిమిత్తమాత్రులను చేశారు. అయిదేళ్లలో ఆయనతో పది నిమిషాలు మాట్లాడిన ఎమ్మెల్యేలు పదిమంది కూడా లేరంటే అతిశయోక్తి కాదు. వైసీపీ గెలిచిన 151 నియోజకవర్గాల్లో ఒక్కదానిలోను ఒక్క పనిచేయలేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించలేదు. అసలు ఈ ప్రభుత్వం వీటి జోలికి పోలేదు. కేవలం నవరత్నాలనే సంక్షేమ పథకాలను ఆటూ ఇటూగా మాత్రమే అమలుచేశారు తప్పించి అభివృద్ది మాట మరిచారు. పైగా వార్డు సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెచ్చి ప్రజాప్రతినిధుల ప్రాధాన్యతను తగ్గించారు. గ్రామం నుంచి నగరం వరకు కనీసం ధ్వంసమైన రహదార్లకు మరమ్మతులు చేసుకోలేని అసహాయత ఉన్న ఎమ్మెల్యేలను ప్రజలు ఈసడించుకున్నారు.
ఎన్నికల ముందు ప్రజలతో కలసి తిరిగిన జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలు జరిగి, ముఖ్యమంత్రి అయ్యాక కనీసం ముఖం కూడా చూపించలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఇబ్బందులు పెట్టారు. అన్ని వర్గాలు ఆయన పట్ల ఆగ్రహంతో ఉన్నాయి. ఈ ఆగ్రహం రెండేళ్ల క్రితమే కనిపించింది. 108 నియోజక వర్గాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. అప్పుడే పార్టీ పట్ల ప్రజల అభిప్రాయం తెలిసిపోయింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోనుందని ప్రజలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. అలా మాట్లాడని వారు వీరికి రెండింతలు ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో తన ఓటమి ప్రచారాన్ని విని తన తప్పిదాలకు ఎమ్మెల్యేలను బాధ్యుతలను చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ నెలలో 11 నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను మార్చేశారు. రెండో జాబితా నేడో రేపో రానుందని అంటున్నారు. జనవరిలో దాదాపు సగానికిపైగా ఇన్‌ఛార్జుల మార్పు, నియోజకవర్గాల మార్పు జరుగుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
బానిసలుగా చూశారు
ముఖ్యమంత్రి తమను బానిసల్లా చూశారని ఎమ్మెల్యేలు ఆవేదనతో చెబుతున్నారు. సీఎం కాగానే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకూ దూరమయ్యా రంటున్నారు. ‘మమ్మల్ని నేరుగా కలవరు. నియోజక వర్గాల అభివృద్ధి, సమస్యల గురించి చెప్పుకొనే అవకాశమివ్వడంలేదు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎంను వ్యక్తిగతంగా ఒకసారి కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు సగం మందే ఉంటారు’ అని చెబుతున్నారు. మిగిలిన సగం మందికి ఒక్కసారి కూడా సీఎంను నేరుగా కలిసే అవకాశమే రాలేదట. అతి కొద్దిమంది మాత్రమే ఆయనను తరచూ కలుస్తారట. ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లినా ఆయన దర్శనం లభించదని, తాను నియమించు కున్న ప్రతినిధులను మాత్రమే కలసి రావాల్సిందే అంటున్నారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు వెళ్లినపుడు, అసెంబ్లీ సమావేశాలు, పార్టీ కార్యక్రమాల సందర్భంగా కూడా తమకు నేరుగా కలిసే అవకాశం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఆయన ఎదురుపడినప్పుడు దూరం నుంచి నమస్కరించడమే తప్ప నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మహా అయితే వినతి పత్రం ఇవ్వొచ్చు. జిల్లా పర్యటన సమయంలో అయితే ముఖ్యమంత్రి అల్లంతదూరాన కనిపిస్తారు. హెలిప్యాడ్ వద్దకు ప్రొటోకాల్ ప్రకారం ఎవరెవరు రావాలో ముందుగా జాబితా విడుదల చేస్తారు. జాబితాలో పేర్లు ఉన్నవాళ్లను మాత్రమే భద్రతా సిబ్బంది పంపుతారు. మిగిలిన నేతలు ఎంతటి ప్రజాదరణ ఉన్నవారైనా, కేంద్ర మాజీ మంత్రులైనా సరే నిర్దాక్షిణ్యంగా గెంటేస్తారని చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి వేదిక మీదకు వచ్చే సమయానికి నేతలు కొన్ని నిబంధనలు పాటించాలి. ఆయన వేదిక మీదకు రాకముందే కుర్చీలకు అతికించిన పేర్లను బట్టి వరుస క్రమంలో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కూర్చోవాలట. వేదికపైనే ఉన్నామని అతి చనువు ప్రదర్శించి ఆయన దరిదాపులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తామంటే కుదరదు. ఇన్ని అవమానాలు నాలుగున్నరేళ్లుగా పడ్డామని, చెబుతున్నారు.
వలంటీర్ల కన్నా….
వలంటీర్‌కు ఉన్న విలువ కూడా తమకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు ఎన్నో సార్లు వాపోయారు. కుదిరితే దందాలు చేసుకోవడం.. లేకపోతే సైలెంట్‌గా ఉండటం మినహా వారు చేసిందేమీ లేదు. ఏం చేసినా మొత్తం అధినేతే. సంక్షేమ పథకాల విషయంలో కానీ, ఇతర అంశాల్లో కానీ ఎమ్మెల్యేల ప్రమేయం లేదు. తమకన్నా వలంటీర్లు నయమని ఎమ్మెల్యేలు అనుకునే పరిస్థితి వచ్చింది. ఓ వైపు నిధులు ఇవ్వకుండా మొత్తం అధికారాలు సీఎం వద్ద దఖలు పడగా, చిన్న చిన్న పనులు కూడా వలంటీర్లతో చేయించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. వాస్తవానికి జగన్మోహన రెడ్డి సీఎం కాకముందు చేసిన పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలే వెన్నంటి ఉన్నారు. జనసమీకరణ, యాత్ర ఖర్చులు భరించామని, పార్టీ అధికారంలోకి రావడానికి పార్టీ అధినేతతో పాటు తాము కూడా కారణమే కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచాక ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి రూ. కోటి ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసిన పరిస్థితి లేదు. కాగా, బిల్లుల వస్తాయని పార్టీ నేతలతో చేయించిన పనులకు సంబంధించి, బిల్లులు మాత్రం రూ. కోట్లకు కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తమనే కాదని, చివరికి సొంత క్యాడర్‌నూ సీఎం దివాలా తీయించారంటున్నారు.
ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్ని సర్వేలూ చెబుతున్నా, ఈ నిజాన్ని అంగీకరిం చేందుకు సీఎం సిద్ధంగా లేరు. పైగా ఎమ్మెల్యేలపైనే తప్ప ప్రభుత్వంపై అసంతృప్తి లేదని, ఎమ్మెల్యేలందర్నీ మార్చేస్తే వైసీపీకే తిరిగి పట్టం కడతారన్న ఆలోచనలో అధినేత ఉన్నారు. తాను గొప్ప పాలన అందిస్తు న్నానని, సర్వేలో తనకు అరవై శాతానికి పైగా సాను కూలత వచ్చిందని బలవంతపు సర్వేలతో చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలను ఇప్పుడు బలి పశువుల్ని చేస్తున్నారు. అభివృద్ధి చేయాల్సింది ప్రభుత్వమేనని.. రోడ్లు, నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత సీఎంపైనే ఉందని జనం అనుకుంటున్నారని, అయితే తమపై నెపం మోపాలని చూస్తున్నారని ఎమ్మెల్యేలు అంటున్నారు.
బెడిసికొట్టిన ముందస్తు ప్రచారం
ఓపక్క ఎలాంటి అభివృద్ధి లేక ఊళ్లు అల్లాడు తున్నాయి. ఓ రోడ్డు వేయలేదు.. ఓ మురుగుకాల్వ కట్టలేదు. వీధి దీపాలు వెలగవు. ఉద్యోగాల భర్తీ లేదు. కొత్త పరిశ్రమలు రాలేదు. కనీసం ఇంటికో నిరుద్యోగి ఉన్నాడు. సర్పంచ్‌లకు అధికారాల్లేవు.. వారి నిధులన్నీ ప్రభుత్వం ఊడ్చేసింది. ధరలు పెరిగితే అదుపు చేసే శక్తి లేదు. పలురకాల పన్నులు వేసి ప్రజలపై మరింత భారం మోపారు. ఈ పరిస్థితుల్లో గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమ పథకాలు 87 శాతం ఇళ్లకు చేరినందున, 175 స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి ఊదరగొట్టారు. పథకాల గురించి జనాలకు వివరించి ఓట్లేయించుకోవాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. సమస్యలు పరిష్కరించకుండా జనంలోకి వెళితే నిలదీతలు తప్పవని.. ఏం సమాధానం చెప్పాలని కొందరు ఎమ్మెల్యేలు వాపోయారు. ప్రచారానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. అయితే ముఖ్యమంత్రి విధేయులు మాత్రం దానిని కొట్టి వేశారు. అయితే వారికి గ్రామాలకు వెళితే గానీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలియలేదు. అభివృద్ధి పనులపై మహిళలు ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు నీళ్లునమిలే వారు. ఈ నేపథ్యంలో ఐపాక్ ఇతర సంస్థలతో చేసిన సర్వేలలో ఓటమి ఖాయమని తెలీడంతో అభ్యర్థులను మారిస్తే పార్టీ గెలుస్తుందని భావించడం వైసీపీ అధినేత అపరిపక్వత అని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
తప్పిన మాట
‘సీపీఎస్ రద్దుచేస్తాం, ప్రత్యేక హోదా తెస్తాం. మద్యపాన నిషేధం అమలుచేస్తాం. విశాఖకు రైల్వే జోన్ తెస్తాం. విశాఖకు మెట్రో తెస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ, రామాయపట్నం పోర్టు పనులు పూర్తి చేస్తాం. పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్, బస్సు చార్జీలు తగ్గిస్తాం. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 2.30 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం. మెగా డీఎస్సీ వేస్తాం. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ప్రకటిస్తాం, ఎంత మంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తాం. వృద్ధాప్య, దివ్యాంగుల పెన్షన్ లు రూ.3 వేలు చేస్తాం. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం అందిస్తాం. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ రూపొందిస్తాం. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తాం. సన్న బియ్యం పంపిణీ ఇస్తాం. ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాం. ప్రతి మండలంలో వృద్ధాశ్రమం కడతాం. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ కడతాం. రైతుల కోసం పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తాం. పది రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం. రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఇస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థీరీకరణ నిధి ఇస్తాం. గిట్టుబాటు ధర గ్యారంటీ ఇస్తాం. ఉచితంగా బోర్లు వేస్తాం. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తాం. ప్రతి రైతుకి రూ.12,500/- ఇస్తాం.
ప్రతి నియోజకవర్గంలోనూ డీఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంటికీ రక్షిత మంచి నీరు కల్పిస్తాం. ఇంటి నిర్మాణం మీద పావలా వడ్డీకే రుణం ఇస్తాం. పేదల ఇళ్లకు రూ.3 లక్షలు మాఫీ చేస్తాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేస్తాం. వైద్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. ఏఎన్‌ఎంల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్‌కి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. కాపుల కోసం ఏడాదికి రూ.2000 కోట్లు ఇస్తాం. రూ.2వేల కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉన్న చెరువులన్నీ పునరుద్ధరిస్తాం. కౌలు రైతులకు రూ. 7 లక్షల బీమా ఇస్తాం.
జిల్లాకో విమానాశ్రయం, జిల్లాకో వైద్య కళాశాల, నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం. ఇలా ఇస్తాం.. చేస్తాం.. తెస్తాం..కడతాం..’ అని చెప్పడం తప్ప చేసిందేమీ లేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడంలో చతికిలపడింది. సీఎం చెప్పిన సంక్షేమం సంక్షోభంలో పడింది. ఇలా అన్ని వర్గాలకు హామీలిచ్చి దేనిని నెరవేర్చని వైసీపీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి ఎందరిని మార్చినా ఓడిపోవడం మాత్రం ఖాయమనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
టిఎన్. భూషణ
సీనియర్ జర్నలిస్ట్