సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ కార్తిక బహుళ చతుర్దశి – 11 డిసెంబర్ 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
డిసెంబర్ 3న వెల్లడైన ఫలితాలు, వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాల తీరును సూచనప్రాయంగా వెల్లడిస్తున్నాయన్న వ్యాఖ్య వినిపిస్తున్నది. అంటే కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమనే. ఇది సహజంగా ఏర్పడే అభిప్రాయం. ఇప్పుడు మూడు రాష్ట్రాలలో సాధించిన ఘన విజయంతో హిందీ భాషా ప్రాంతాల సంపూర్ణ మద్దతు బీజేపీ పరమైందన్నది ఆ విశ్లేషణల విశ్వాసం. ఇది తప్పు పట్టవలసినది కాదు. కానీ నానాటికీ ఎన్నికల విశ్లేషణలు మూస ధోరణికి మరలుతున్నాయని అనిపిస్తుంది. వాటిలో ఇంకాస్త సమగ్రత అవసరమని చెప్పినా దోషం కాదు. ఎన్నికలు, రాజకీయం పరిధుల నుంచి బయటకొచ్చి చూడవలసిన విషయాలు ఉన్నాయని గుర్తించాలి. ఒక వర్గం టీవీ వ్యాఖ్యాతలు, పత్రికా రచయితలు ఈ మూస ధోరణిలో ఉండిపోతున్నారు. కారణం బీజేపీ మీద ఉన్న అంధ వ్యతిరేకత. ఇదే బీజేపీ వరస విజయాల వెనుక ఉన్న ఒక నిర్మాణాత్మక కోణం ప్రజల దృష్టికి చేరకుండా నిరోధిస్తున్నది.
ఇంకొంచెం సూటిగా` బీజేపీ విస్తరణకీ, బీజేపీయేతర పక్షాలు క్రమంగా చతికిల పడడానికి వెనుక ఉన్న కారణాలను ఆ మీడియా వాస్తవికంగానే చర్చిస్తున్నదా? లేదనేదే సమాధానం. గడచిన పదిహేనేళ్లుగా బీజేపీ అయోధ్య అంశాన్ని ఎన్నికల ప్రచారంలో తీసుకురావడం లేదు. ఎన్ని ఎన్నికలు జరిగితే అంతగా పార్టీ బలపడుతుందని నమ్మే నాయకత్వం బీజేపీది కాదు. మీడియా పరిభాషలో ‘మత ఉద్రిక్తతలు రేపే ఉద్వేగపూరిత అంశాన్ని’ ప్రచారంలోకి తేలేదు. అయినా బీజేపీ ఎన్నికల పోరాటాలలో విజయాలు సాధిస్తూనే ఉన్నది. రాజకీయపక్షంగా అన్ని వర్గాలకు చేరువ అవుతూనే ఉన్నది. దీనిని అర్ధం చేసుకోవడం నేటి అవసరం. తన దృష్టి యావత్తు సమ్మిళిత వృద్ధికి అంకితం చేసే అవకాశం ఇప్పుడు బీజేపీకి వచ్చింది. బీజేపీ తన విస్తరణను, విజయాలను అందుకు ఉపయోగించుకుంటున్నది కూడా. సమ్మిళిత వృద్ధి అన్న పదబంధం రాజకీయ ఆర్ధిక కోణం నుంచి అంటున్నా, బీజేపీ ఎదుగుదల వరకు ఆ అంశాన్ని రెయిన్‌బో సోషల్ కొయిలిషన్ అనడం సబబు. అంటే జాతి, వర్గ భేదాలకు చోటులేని బహుళ సంస్కృతీ సమ్మేళనాన్ని ఆహ్వానించడం, విశ్వసించడం. అలాంటి సమాజాన్ని నిర్మించడం. ఆ దిశగానే బీజేపీ ప్రయాణిస్తున్నది.
ఐదేళ్ల క్రితం మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల ఎన్నికలకీ, తాజా ఎన్నికలకీ మధ్య వ్యత్యాసం ఆ ప్రయాణాన్ని సూచించేదే. 2018 ఎన్నికలలో ఆ మూడు చోట్ల బీజేపీ పరాజయం చవి చూసింది. తరువాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిరది. ఆ చర్యను ఇప్పటికీ విమర్శిస్తున్నవారి వాదనను త్రోసిరాజని ప్రజలు మళ్లీ బీజేపీకే అఖండ విజయం ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ బీజేపీ దూసుకువచ్చింది. ఈ మూడు రాష్ట్రాలలో కమల వికాసమే 2024 లోక్‌సభ ఎన్నికలలో విజయం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ముందే ధీమా వ్యక్తం చేసే అవకాశం ఇచ్చింది. వీటికి ఆ విధమైన ప్రాధాన్యం కూడా ఉంది.
బీజేపీ తన సామాజిక న్యాయసూత్రాన్ని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణలో వెనుకబడిన వర్గాల వ్యక్తికే ముఖ్యమంత్రి అవకాశం ఇస్తామని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చింది. అయినా ఎనిమిది స్థానాలతో పార్టీ సరిపుచ్చుకుంది. ఇక్కడ ప్రశ్న సీట్లు కాదు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలూ కాదు. బీజేపీ దృష్టి. అధికారంలోకి వచ్చి వెళ్లిన పార్టీ ఇచ్చిన ఎస్సీ ముఖ్యమంత్రి హామీ దారుణంగా అపహాస్యం పాలైన చరిత్రను గుర్తు చేసుకుంటే బీజేపీ హామీ, విధానంలోని గొప్పతనం అర్థమవుతుంది. మధ్యప్రదేశ్‌లో మూడు ‘ఎం’లు తారక మంత్రాలుగా పనిచేశాయి. అవే మోదీ, మామ (శివరాజ్‌సింగ్ చౌహాన్ ముద్దుపేరు), మహిళ. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాడ్లీ బెహన్, లాడ్లీ బెమన్ పథకం కీలకంగా కనిపించాయి. ప్రభుత్వ వ్యతిరేకతను నిరంతరం గమనిస్తూ సత్వర చర్యలు తీసుకోవడం కూడా బీజేపీ జాగరూకత ప్రదర్శిస్తున్నది. అంటే తప్పులు ఎప్పటికప్పుడు దిద్దుకోవడం. పలువురు లోక్‌సభ సభ్యులను శాసనసభలకు పోటీ చేయించడం కూడా సమ్మిళిత దృష్టిలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో, రాష్ట్ర రాజకీయాలలో ఉనికిని చాటుకున్న నేతలను, ఇంకా చెప్పాలంటే తరువాతి తరం నాయకులను శాసనసభలకు పంపించాలని బీజేపీ అధిష్టానం భావించినట్టు కనిపిస్తుంది. పలుచోట్ల బీజేపీ ఎదుర్కొంటున్న నాయకత్వ సమస్యకు ఇదొక పరిష్కారం.
బీజేపీ ప్రయాణం ఈ దిశగా సాగుతుంటే కాంగ్రెస్, దాని నాయకత్వంలోని ఇండియా కూటమి కుల గణనను నమ్ముకున్నాయి. విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదని బీజేపీని విమర్శిస్తూనే బుజ్జగింపు ధోరణిని ఇంకాస్త బలపడేటట్టు చేస్తున్నాయి. అవి ముస్లింలను వాస్తవిక దృక్పథంలోకి తీసుకురావాలని కోరుకోవడం లేదు. ఇందుకు ఇందోర్ (మధ్యప్రదేశ్) ఘటన సాక్ష్యం. అక్కడ బీజేపీ చేపట్టిన విజయయాత్రకు వకీల్ పఠాన్ అనే ముస్లిం అభ్యంతరం చెప్పాడు. వాదోపవాదాలు జరిగాయి. అతడి ఆదేశం మేరకు భార్య షబ్నమ్ బీజేపీ కార్యకర్తల మీద వేడినీళ్లు పోసింది. చాలా ముస్లిం దేశాలు నిషేధించిన ముస్లిం సంప్రదాయాలను ఇక్కడి ముస్లిం మతోన్మాదులు కాపాడాలని అనుకుంటూ ఉంటే, దానికి కాంగ్రెస్, ఇతర విపక్షాలు వంత పాడుతున్నాయి. సంక్షేమం, సమన్వయం, సంస్కృతీ పరిరక్షణ అన్న బీజేపీ పాలనా సూత్రాన్ని అర్ధం చేసుకోవడం అందరికీ మంచిది. సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో పెళ్లగిస్తామని బీరాలు పలికే పార్టీలకు మిగిలిన పక్షాలు దూరంగా ఉంటే దేశానికి మంచిది. దేశంలో ముస్లింలు మాత్రమే మైనారిటీలు కారు. ఇది గుర్తించాలి. మైనారిటీలందరి మనోభావాలను గౌరవిస్తూనే మెజారిటీలకూ హక్కులు ఉంటాయన్న విజ్ఞతను విపక్షాలు పాటించాలి.