సమాజానికి హితం కలిగించేదే సాహిత్యమని ఆలంకారికులు అభిప్రాయం ప్రకారం, గోదాదేవి ఆలపించిన తిరుప్పావై పాశురాలలో సమాజశ్రేయస్సు కనిపిస్తుంది. శ్రీరంగనాథుని పెళ్లాడాలన్న మనోవాంఛతో పాటు సాహిత్యం ద్వారా సమాజ హితాన్ని కోరిన సౌజన్యమూర్తిగా ఆమె సాక్షాత్కరిస్తారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే కాకుండా సమష్టి లబ్ధి చేకూరాలన్న భావన ఆమె పాశురాలలో వ్యక్తమవుతుంది. ‘ఏడాదికి మూడు పంటలు పండాలి. చాలినంత వర్షం కురవాలి. గోవులు సమృద్ధిగా పాలు ఇవ్వాలి. ఏ సందర్భంలోనూ ‘లేదు’ అనే మాట వినిపించకూడదు’ అని ఒక పాశురంలో ఆకాంక్షించడం గోదా లోక కల్యాణాభిలాషకు ఉదాహరణ.

సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన నాటి నుంచి నెలరోజుల కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఆహ్లాదం, ఆనందం కలిగించేవి తానేనని శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పుకున్న సందర్భంలో ‘మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః’ (భగవద్గీత :10`35) అన్నారు. మార్గశీర్షం ధనుర్మాసం కావడం వల్ల భగవత్సంబంధిత పూజాపునస్కారాలు నిర్వహిం చడం విదితమే. మార్గశీర్షం… ‘మార్గం’ అంటే దారి. శిరము అంటే తల. మానవ శరీరానికి తల దిశానిర్దేశం చేసినట్లే మార్గశీర్ష మాసం ఆధ్యాత్మికత వైపునకు దారి చూపుతుందని చెబుతారు. శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావించే ఈ మాసంలో ఆయనను ఆరాధించడం వల్ల వెయ్యేళ్లపాటు చేసే శుభకర్మల ఫలితం లభిస్తుందని బ్రహ్మాండ, స్కంద, ఆదిత్య పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసం విశిష్టతను బ్రహ్మ మొదట నారదుడికి వివరించినట్లు పురాణ కథనం. బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలలోనూ, నారాయణ సంహితలో దీనికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడిగా అర్చిస్తారు.

లోక శ్రేయస్సుతో పాటు స్వకల్యాణాన్ని అపేక్షించిన గోదాదేవి తమ ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకునేందుకు ధనుర్మాసం వ్రతం పాటించి, రోజుకొకటి కీర్తన చొప్పున (తమిళంలో పాశురాలు) మాసం పాటు ముప్పయ్‌ పాశురాలు ఆలపించడం మరో ప్రత్యేకత. దీనినే శ్రీ వ్రతం, ధనుర్మాస వ్రతం, సిరినోము అనీ అంటారు. ‘తిరుప్పావై’ అనే ఈ తమిళ పదానికి ‘తిరు’ అంటే శ్రీ, శ్రీప్రదం, లక్ష్మి, సంపద, శ్రేష్ఠం, ఐశ్వర్యం, మోక్షం అనే అర్థాలు ఉన్నాయి. ‘పావై’ అంటే పాట(లు)లేక వ్రతమని అర్థం.

ఆధ్మాత్మిక భావనను పెంపొందించుకుంటూ స్వకార్యాన్నే కాక లోకహితాన్నీ కాంక్షించాలన్న భావన గోదాదేవి రచనల్లోనూ, ఆమె జీవన శైలిలోనూ వెల్లడవుతుంది. వివిధ జాతుల పూలను సేకరించి అందమైన మాలకట్టినట్లే వివిధ వర్గాలకు చెందిన భిన్న ప్రవృత్తులు గల యువతులను సమీకరించి శ్రీవ్రతానికి శ్రీకారం చుట్టింది. పెళ్లికాని పడుచులు తమకు నచ్చిన,మెచ్చిన వారిని భర్తను ప్రసాదించ వలసిందిగా శ్రీకృష్ణుడిని వేడుకుంటూ పాటల పాడుకునే సంప్రదాయం కూడా అప్పటి నుంచి మరింత ప్రాచుర్యంలోకి వచ్చి ఉండవచ్చని ఆధ్యాత్మిక వాదులు చెబుతారు.

భారతీయ భక్తి సాహిత్యంలో ఆళ్వార్‌ దివ్య ప్రబంధాలు అత్యంత ప్రముఖ స్థానాన్ని అలంకరించగా, శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ గోదాదేవి గానం చేసిన పాశురాలు ‘తిరుప్పావై’ దివ్య ప్రబంధంగా శిఖరాయమానంగా వెలుగొందుతోంది. గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడిన తిరుప్పావై ఉపనిషత్తుల సారమని పూర్వాచార్యులు అభివర్ణించారు. ‘మంచిచెడులను వివేచన చేసుకోవాలి. భగవత్‌ సేవకైనా, లౌకిక వ్యవహారాలలో నైనా సత్వరం స్పందించాలి. క్షణం వృథా చేసినా సాధన తగ్గిపోతుంది. సకల జంతుజాలం పరమాత్మ అవతార విశేషమే. వాటిపట్ల దయ, కరుణ కలిగి ఉండాలి. భగవదర్చన, నివేదన సహా అన్ని ఉపచారా లలో నిశ్చలభక్తి తప్ప, ఆడంబరాలు అవసరంలేదు. చిత్తశుద్ధితో చేసే స్వల్ప ఆరాధనైనా అఖండంగా స్వీకరిస్తాడు.

మధురభక్తికి గోదాదేవిని ప్రతీకగా చెబుతారు ఆధ్మాత్మికవాదులు. లోకంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, లౌకికం కాగా, భగవంతుడికి భక్తుడికి మధ్య గల ప్రేమ అలౌకికం. అదే మధురభక్తి. ఆ మార్గంలో భగవంతుడిని సేవించి తరించిన వనిత, దివ్యాంశ సంజాత గోదాదేవి.

భూదేవి అంశగా పూదోటలో విష్ణుచిత్తుడి (పెరియాళ్వార్‌)కి లభించిన గోదాదేవి భగవంతుడినే పరిణయమాడాలన్న సంకల్పంతో పాటు సమాజ హితం కోరి దీక్ష బూనింది. ఆ క్రమంలోనే ధను ర్మాసంలో వేకువనే మేల్కొని స్నేహితురాళ్లతో కలసి హరి పూజ చేస్తూ, ఆ అనుభవాలను రోజుకు ఒక కీర్తన (పాశురం)గా రాసి శ్రీకృష్ణ అంశ శ్రీరంగ నాథుడికి అర్పించింది.

‘కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీకాననోద్భవామ్‌

పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్‌’

తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరులో ముకుందా చార్యులు, పద్మావతి దంపతుల పుత్రుడు భట్టనాథుడు (విష్ణుచిత్తుడు) తన జీవితాన్ని భగవత్‌ సేవకు అంకితం చేశారు. వటపత్రసాయికి నిత్యం తులసి, పూమాలలను సమర్పిస్తూ, తాను రాసిన కీర్తనలు (తిరుపల్లాణ్డు) గానం చేసేవారు. .

రంగనాథ పెరుమాళ్‌ పుష్ప కైంకర్యం కోసం ఆయన పెంచుతున్న పూలు, తులసివనంలో కర్కాటక మాసం, పుబ్బ నక్షత్రంలో చిన్నారి లభించింది. పూలమాల అని అర్థం వచ్చేలా చిన్నారికి ‘కోదె’ అని పేరుపెట్టారు. ఆ పదమే ‘గోదా’ అని సంస్కృతీక మైంది. భూమిని ‘గో’ అంటారు. ఆమె భూదేవి అంశ కనుక, ‘గోదా’ అనే పేరు కలిగిందని వ్యవహారంలో ఉంది. జానకీసతిలా భూజాత అయిన ఆమెను పాలక తండ్రి విష్ణుచిత్తులు ‘ఆండాళ్‌’ (కాపాడునది) అని సంబోధించారు. తనను తరింపచేసేందుకు ఆమె తన కుమార్తెగా లభించిందని ఆయన భావన.

విష్ణుచిత్తుడు కుమార్తెకు శ్రీకృష్ణ వైభవాన్ని వినిపిస్తుంటే మైమరచి ఆలకించేది. శ్రీకృష్ణుడి బాల్యంలోని గోపికలలో తాను ఒకరిగా, ఉద్యాన వనంలోని తండ్రి కుటీరాన్నే యదునందనుడి రాజ్యంగా భావించుకునేది. ద్వాపరంలో యాదవ కన్యలు జరిపిన ఉత్సవాలను మానసికంగా తనకు అన్వయించుకుంటూ, ఆ అనుభూతికి అక్షరరూపం ఇచ్చింది. మంచి అలవాట్లతో జీవించాలని, తోటి వారికి సాయపడాలని, భగవంతుడిని ఆరాధించాలని ఈ పాశురాలు ప్రబోధిస్తాయి. వీటిలో పరమాత్ముని తీరు, ఆయనను చేరేందుకు అనుసరించవలసిన మార్గాలు, పల్లెల అందాలు, ఉదయం కాలపు వర్ణనలు ఉంటాయి. అలా కృష్ణునిపైగల భక్తి ప్రేమగా మారి ఆయనను పతిగా ఊహించుకుంటూ, ఆయన కరుణ కోసం పూజలు ఆచరించింది.

ఆముక్తమాల్యద

స్వామి సేవకోసం పెరియాళ్వార్‌ తయారు చేసిన పూమాలలను గోదాదేవి ముందుగా ధరించి బావిలోని నీటిలో (బావి శ్రీవిల్లిపుత్తూరులో నేటికీ ఉంది) ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయేదట. ఆది తెలియని పెరియాళ్వార్‌ ఆమె ‘ధరించి విడిచిన మాలలనే స్వామివారికి సమర్పించేవారు. ఒకరోజు దండలో కనిపించిన శిరోజం కూతురిదిగా గ్రహించి, స్వామి పట్ల తన అపచారానికి కలత చెంది ఆ రోజు ఆలయానికి మాలలు పంపలేదు. అదే రోజు రాత్రి విష్ణుచిత్తుడికి స్వప్న సాక్షాత్కారం చేసిన శ్రీరంగ నాథుడు ‘గోదా ధరించిన మాలలే నాకు ఇష్టం. ఆమెను పరిణయమాడతాను. నా వద్దకు చేర్చు’ అని సూచించి, పాండ్యరాజుకు కలలో కనిపించి, ‘ఆండాళ్‌ కోసం పల్లకీ పంపవలసిందిగా ఆదేశించాడు. స్వామి కబురుతో ఆనందోత్సాహాలతో ఆలయం చేరుకున్న ఆండాళ్‌ ఆయనను పరిణయ మాడి ఆయనలో ఐక్యమైంది. ‘రంగనాయికి’గా ఆరాధనీయ అయ్యింది. ఆమెకు శూడికొడుత్త నాచ్చియార్‌, ఆముక్తమాల్యద అనే పేర్లు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. స్వామి కోసం తయారైన పూలమాలలు ఆమె ధరించిన తర్వాతే స్వామికి చేరేవి కాబట్టి ఆమెకు ‘శూడి కొడుత్త నాచ్చియార్‌’ (సంస్కృతీకరణ రూపం ‘ఆముక్తమాల్యద) అని వ్యవహారంలోకి వచ్చింది. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ‘చూడరమ్మ సతులాల సోబాన ఁబాడరమ్మ/కూడున్నది పతి ఁజూడికుడుత నాచారి’ అని కీర్తించారు.

విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులు రామానుజా చార్యుల శిష్యులు అనంతాచార్యులు ఆమెను మొదటిసారిగా ‘ఆముక్తమాల్యద’ అని వ్యవహరించి నట్లు ఆయన కావ్యం ‘ప్రసన్నామృతం’ పేర్కొంటోంది. అనంతర కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఆ పేరునే యథాతథంగా స్వీకరించి కావ్యరచన చేశారు.

ఆళ్వారుగా…

ఆధ్యాత్మిక సాగరంలో తరించిన వారిని శ్రీవైష్ణవ సంప్రదాయంలో ‘ఆళ్వారులు’ అంటారు. అలాంటి పన్నెండు మందిలో విష్ణుచిత్తుడు ప్రథములు (పెరియాళ్వార్‌). ప్రణవ, ప్రణయ తత్వాలకు పసిడి సేతువుగా నిలిచిన ఆండాళ్‌ ఆళ్వారులలో ఏకైక మహిళ. రామానుజాచార్యులు ప్రతి విష్ణ్వాలయంలో గోదాదేవి సన్నిధిని ఏర్పరచి ఆమెకు, ఆమె పాశురాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావైనే గానం చేస్తారు (అన్ని విష్ణ్వాలయాలలో వేకువ జామున దీనిని పాటిస్తారు). తిరుమలేశుడు తమ బ్రహోత్సవాలకు శ్రీవిల్లిపుత్తూరు నుంచి ప్రత్యేకంగా వచ్చే పూలమాలలు ధరిస్తాడు..

తిరుప్పావై వ్రత విధివిధానాలు

తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు నిర్దేశితమయ్యాయి. వేకువజామునే నిద్రలేచి స్నానాదులు ముగించుకుని పాశురాలను, స్వామి కీర్తనలను ఆలపించాలి. దేవదేవేరులకు ఇష్టమైన పుష్పాలు సమర్పించాలి. పొంగలిని నివేదించాలి. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడిగా అర్చించి, మొదటి పక్షం రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నివేదిస్తారు.

తరువాతి పక్షం పాటు దధ్యోజనం సమర్పిస్తారు. ప్రధానంగా పులగం, పాయసం, దధ్యోజనం సమర్పిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే, చలికాలంలో కడుపులో జఠరాగ్నితో పాటు ఆకలి పెరుగుతుంది. సాత్త్వికాహార స్వీకరణతోనే జఠరాగ్ని చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పులో చలువు చేసే గుణం ఉన్నందున వాటిని ప్రసాదంగా వినియోగిస్తారని చెబుతారు.

దీక్ష, పట్టుదల, నియమం, అనుష్ఠానం, ఉపవాసం, పారాయణం, పూజాది ధార్మిక కార్య కలాపమే వ్రతమని పెద్దలు నిర్వచించారు. శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధితో లోకహితం కోరి చేసే వ్రతం చక్కని ఫలితాన్నిస్తుందనేందుకు గోదామాత అనుభవం చాటిచెబుతోంది.

‘స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధుర జిష్ణవే

విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళమ్‌’

–  డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE