– కౌస్తుభ
డిసెంబర్ 23 గీతాజయంతి
ఈమధ్య రోజూ ఉదయం స్నానం, పూజ పూర్తయిన తరువాత ‘గోరఖ్ పూర్’ వారి భగవద్గీతలో ఒక అధ్యాయం చదువుతుంటే పండితులు చెప్పినట్టు ప్రతిసారీ కొత్త కొత్త అర్థాలు స్ఫురించసాగాయి. నాకు అవగాహన అయిన విధానం కాగితం మీద పెట్టాలనిపించింది.
విశ్వం అంతా ఒక మహా చైతన్యంతో ఆవరించి ఉన్నది. దానినే మన సౌలభ్యం కోసం పరమేశ్వరుడు, దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు ఇత్యాది పేర్లతో చెప్పుకుంటున్నాము. చైతన్యమనేది ఏ కొద్దిగా ఎక్కడ ఉన్నా అది స్థిరంగా ఉండదు. ఉదాహరణకు చిన్నపిల్లల్లోని చైతన్యం వాళ్లను ఒకచోట నిలవనీయకుండా ఎప్పుడూ ఏదో చలనం (అల్లరి) చేయిస్తుంటుంది. అందులో విశ్వ చైతన్యం మహాచైతన్యం కదా! పిల్లల బుర్రలలోని అల్లరి ఆలోచనలతో కొంతసేపు బొమ్మలాట ఆనందించిన తరవాత వాటిని చిందరవందర చేసి తీసేసినట్టు, ఈ కాలపు దీశ్రీశీషస తో ఆడుకుని తీసేసినట్టుగానే ఆ మహాచైతన్యం కూడ తన సంకల్పమనే ఆలోచనతో తనలోని మాయను తోడు చేసుకుని ఈ చరాచర జగత్తును సృష్టించటము, పెంచటము, లయము చేయటము చేస్తోంది.
మహాచైతన్యం స్థిరంగానే ఉండి, దాని అంశలతో సకల జీవరాశులలో ప్రకృతిలో జీవ చైతన్యం కలిగిస్తూ ఉంటుంది. మనిషి కాని, ఏ జీవి కాని మరణించిన తరవాత పంచభూతాలలో కలిసి పోవటం, జీవచైతన్యం మహాచైతన్యంలో లీనమవటం సహజంగా ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియ. ఎందుకంటే మళ్లీ ఈ సృష్టిలోని చైతన్య అంశలన్నీ మళ్ళీ ఆ మహాచైతన్యంలో కలిస్తేనే కదా, తనలో కలుస్తున్న చైతన్య అంశలతో అది ఎప్పుడూ పూర్ణంగానే ఉండి మళ్లీ మళ్లీ సృష్టిలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది ఒక మహావలయం. దీనికి మొదలు తుది లేదు. అందుకే ఇది సనాతనం.
ప్రకృతిలోని సాత్త్విక రజ స్తమో గుణాలనే మూడు ముఖ్యమైన గుణాలలోనే ఈ సృష్టి అంతా నిండి ఉంది. ఈ మూడు గుణాల ప్రభావమే సృష్టిలోని ప్రతి జీవరాశిపైన ఉంటుంది. గుణాల నిష్పత్తిని బట్టి స్వభావాలు, ప్రవర్తనలు మారుతుంటాయి. ప్రతి జీవి ఈ మూడు గుణాలతో ప్రభావితమౌతుంది గాని మహా చైతన్యానికి గాని దాని అంశ అయిన జీవ చైతన్యానికి కాని ఈ మూడు గుణాల ప్రభావం ఉండదు. పై మూడు గుణాల ప్రభావంతోనే విషయ ఇంద్రియ సంయోగముతో శీతోష్ణ సుఖదుఃఖాలు అనుభవంలోకి వస్తాయి. జీవి, దేహముతో సంయోగముతో ఉన్నప్పుడే ఇంద్రియ ప్రభావంతో శీతోష్ణ సుఖదుఃఖాలు అనుభవం లోకి వస్తాయి. కాని ఒకసారి జీవి దేహాన్ని వదిలేస్తే జీవికి దేహానికీ కూడ ఏ బాధా ఉండదు. జీవితోపాటు ఇంద్రియాల శక్తి, మనస్సు అన్నీ నిష్క్రమించటంతో శీతోష్ణ సుఖ దుఃఖాలు భౌతిక కాయానికి ఉండవు. అంటే శీతోష్ణ సుఖదు:ఖాలన్నీ మనస్సుకు, ఇంద్రియాలకు సంబంధించినవే. జీవి మహాచైతన్య అంశమే కనుక దానిపై వీటి ప్రభావం ఉండదు. జీవుడిలో భగవదంశ ఉంటుంది గాని జీవుడు భగవంతుడు కాడు. ఉదాహరణకు రొట్టె చేయటానికి గోధుమ పిండిలో ఉప్పు వేస్తే పిండిలో ఉప్పు ఉంటుంది. కాని గోధుమ పిండి ఉప్పు కాదు. ఇక్కడ మొత్తం ఉప్పు డబ్బా మహాచైతన్యమైతే గోధుమ పిండి పంచభూతాలతో ఏర్పడిన దేహము. అందులో వేసిన ఉప్పు మహా చైతన్యం నుంచి వచ్చిన జీవుడు.
శ్రీకృష్ణుడు అర్జునునికి ఏ జీవి కూడ తన సహజ స్వభావాన్ని విస్మరించలేదని, అర్జునుడు యుద్ధం చేయనని భీష్మించుకుని కూచున్నా సహజంగా ఆయనలో ఉన్న క్షత్రియ స్వభావం ఆయనకు తెలియకుండానే యుద్ధం చేయిస్తుందని అంటారు. ఉదాహరణకు మనం పెద్దవాళ్లమయ్యాక కూడ ఎంత శక్తి లేకపోయినా, పిల్లలు వారిస్తున్నా సహజంగా మనకు అలవాటైనా పనులు చేస్తుంటాము కదా!
ముఖ్యంగా వేదాలు చదివి అర్థం చేసుకోలేక పోయినా వాటి సారాంశం అయిన ఉపనిషత్తులు, పురాణాలలోనూ, వాటన్నింటిని సంక్షిప్తంగా క్రోడీకరించి, సులభంగా అర్థమయ్యే విధంగా ఉన్న భగవద్గీతలోనూ క్రమశిక్షణతో కూడిన సురక్షిత, సుసంపన్న సమాజ నిర్మాణమే ధ్యేయంగా కనిపిస్తుంది. అందరమూ అనుకునే మోక్షము, స్వర్గము ఉన్నవో లేవో ఎవరూ చూసి వచ్చి చెప్పలేదు. పునర్జన్మ సిద్ధాంతము కూడ అలాంటిదే. కాని ముందు జన్మలో మనం చేసిన మంచి చెడుల (పుణ్యపాపాలు) ప్రభావమే ఈ జన్మలో అనుభవిస్తామని, ఈ జన్మలోని ప్రవర్తనే తరవాత జన్మలో అనుభవానికొస్తుందని శాస్త్రాలలో నొక్కి వక్కాణించటంతో కొంత వరకైనా మానవులు తమ స్వార్థము, దుర్మార్గము మొదలైన దుర్గుణాల నుంచి వైదొలగుతారని, దాంతో సురక్షిత సమాజ నిర్మాణం జరుగు తుందని మన పూర్వులు ఆశించి ఉంటారు. సన్మార్గంలో పయనించవలసిన మానవ స్వభావాన్నే ‘ధర్మం’గా చెప్పారు మన పూర్వులు. సాధారణ మానవు లందరికీ ధర్మం గురించిన అవగాహన లేకపోవచ్చునని అందరికీ అర్థమయ్యేలా ‘పాపభీతి’ అనేది తెలిపి, పునర్జన్మ సిద్ధాంతంలో ముడిపెట్టి క్రమశిక్షణతో కూడిన సురక్షిత సమాజ నిర్మాణ ప్రణాళిక రచించారు. మన పూర్వుల దృష్టిలో నిత్యచైతన్య వంతమైన సమాజమే భగవంతుడు. నిజంగా కూడ ఆ మహాచైతన్యం నిండి ఆవరించినదే సమాజం కదా! భగవద్గీతలో చెప్పినట్టు మానవు లంతా ధర్మం తప్పకుండా పాపభీతితోను, ఎదుటి వారికి ఏ విధమైన అపకారము తలపెట్టకుండా తమకు లభించిన (భగవంతుడు ప్రసాదించిన) దానితో తృప్తిగా జీవిస్తూ ఈశావాశ్యోపనిషత్తులో చెప్పినట్టు విశ్వమంతా ఆ మహాచైతన్యంతో నిండి ఉందని, దాని అంశే మనలోనూ, అన్నిటిలోనూ ఉందని, మనకు ఏది మంచిదో అదే భగవంతుడు ప్రసాదిస్తాడని తలచి అందరూ తృప్తిగా జీవిస్తే లోకంలో అంతకన్నా స్వర్గం, మోక్షమేముంటుంది?
ప్రస్తుతం సమాజంలో వర్తమానమేగాని పునర్జన్మ సిద్ధాంతం గాని, ధర్మము, పాపభీతి కాని లేకుండా పోయాయి. భగవద్గీతలో ఎవరి ఆత్మను వారే ఉద్ధరిం చుకోవాలని చెప్పినట్టు మనలను మనమే సంస్కరించుకుని సురక్షిత సమాజంతో ఇదే మోక్షంగా జీవించవలసి ఉన్నది. ఫలితాన్ని ఆశించని నిష్కామ కర్మే మనశ్శాంతికి మూలం.
ఇంకా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో, భీష్మద్రోణులు మొదలైన యోధులు అందరూ ఇది వరకే చనిపోయారని చెప్తుంటే మొదట్లో అర్థం కాలేదు కాని చనిపోయారంటే వాళ్ల మరణ శాసనం తాను అదివరకే రాసి ఉంచానని అర్థము. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ ఎలా మరణించాలో జన్మించినప్పుడే ముందుగా నిర్ణయమై ఉంటుంది కదా!
హిందూ మతసారం
‘‘భగవద్గీత హిందూమత సార సంగ్రహము. గీతలో సర్వయోగ సమన్వయం ఉన్నది’’ అని ప్రాంత విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీ జటావల్లభుల పురుషోత్తము అన్నారు. ‘మన ప్రాచీన మహర్షుల బోధలన్నీ భగవద్గీతలో సంగ్రహంగా, సూటిగా ఉన్నాయని వివరించారు. భారతీయ తత్వరహస్యం, భారతీయ జీవన రహస్యం అంతటినీ ఒకచోట చేర్చింది గీత. అంతేకాదు మానవ జీవన తత్వములన్నిటినీ చెప్పింది గీత. అన్ని మతాలవారూ అధ్యయనం చేయదగిన గ్రంథం గీత. సాధనలనన్నింటినీ క్రోడీకరించి, వాటికి పరస్పర సంబంధాన్ని ఏర్పరచింది గీత. గీతలో భగవానుడు దైవీ సంపత్తినీ, అసురీ సంపత్తినీ వివరించి ఉన్నాడు. ఆ దైవీసంపత్తి తనలో ఎంతవరకు పెరుగుతున్నదో ఆత్మపరీక్ష చేసుకోవడానికై ప్రతి వ్యక్తి గీతను అధ్యయనం చేయాలి. గీత అభయమునకు ప్రాముఖ్యాన్ని ఇస్తోంది. వ్యక్తి భగవానునికి తప్ప మరెవ్వరికి భయపడకూడదు. ఎవరు ఏమనుకుంటారో అనే భయ సంకోచములు లేకుండా ధర్మమును ఆచరించాలనీ గీత బోధిస్తోంది’ అని విజయవాడలో గీతాధ్యయన తరగతుల ప్రారంభోత్సవంలో వివరించారు.
(27-09-1971 జాగృతి నుండి)