– చాగంటి ప్రసాద్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

ద్వారకాధీశ్‌కి సాయంకాల హారతి ఇచ్చే సమయం. ఠంగ్‌ ‌ఠంగ్‌ ‌మంటూ ఘంటారావం ద్వారకా పట్టణమంతా వినబడుతోంది. పక్కనే ఉన్న గోమతి నదిలో కొందరు యాత్రికులు స్నానాలు చేస్తున్నారు. సముద్రపు గాలికి గోపురం మీద ఎగురుతున్న కాషాయ రంగు జెండాలు కనపడ్డాయి. అచ్యుత్‌ని తీసుకుని గుడి ముందుకు వచ్చాను. గుడికి రావడం ఇష్టం లేదని వాడి మొహం చెప్తోంది. విధిలేక నాతో వచ్చాడు. స్వామి అంతరాలయం ముందు క్యూలో ఉన్న భక్తులు జై హో నంద్‌ ‌లాల్‌కి’’.., అంటూ భక్తి పారవశ్యంతో గొంతెత్తి ప్రార్థ్ధిస్తున్నారు. నాట్య భంగిమలో ఉన్న నల్లనయ్యని హారతి వెలుగులో దర్శించగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది.

అచ్యుత్‌ ‌కేసి చూశాను. వాడి మనస్సు ఇక్కడ లేనట్టుంది. ఏదో పొగొట్టుకున్న వాడిలా విచారంగా తల వంచుకుని నడుస్తున్నాడు. బయటకి వచ్చి చుట్టూ ఉన్న ఉపాలయాలు చూసి, గుడి ప్రాంగణంలో నేల మీద కూర్చున్నాం. చల్లని గాలి మమ్మల్ని పలకరి స్తోంది.

‘‘ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ? అన్నాను ..

 ‘‘ఊ’’ .. అంటూ నా కళ్ళల్లోకి చూసి తల వంచేసుకున్నాడు.

‘‘రేపు మరో చోటికి వెడదామా ?’’…అడిగాను.

‘‘ఎక్కడికి?’’ అని అడగలేదు.. బాగా మూడీగా ఉన్నాడు.

‘‘కృష్ణుణ్ణి దర్శించుకున్నాక నీకేమనిపించింది?’’.. మళ్లీ కదిపాను.

‘‘నాకు.. నాకు …నాకు చెప్పడం రాదు ’’. మౌనం వహించాడు.

అనుభూతిని వర్ణించే వయస్సు కాదు కదా వాడిది.. ఈ ప్రశ్న అడగడం.. నాదే తప్పు.. అనుకున్నాను.

‘‘కృష్ణుడు ఎక్కడ పుట్టాడో తెలుసా?’’..

‘‘తెలుసు!..జైల్లో పుట్టాడు అంకుల్‌’’ అన్నాడు.

‘‘అవును! చెరసాలలో!.. లోపల సంకెళ్ల బంధనాలతో తల్లిదండ్రులు, బయట భయంకర రాక్షసుల పహారా. చిన్న అలికిడి వినబడినా లోపలికి వచ్చి ప్రాణం తీసేస్తారు. అటువంటి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో పుట్టాడు, ఎంత కష్టమో కదా’’ ? అన్నాను.

‘‘అవును పాపం!’’ అన్నాడు జాలిగా మొహం పెట్టి.

గుడి ప్రాంగణంలో చాలా మంది ధ్యానం చేసుకుంటు న్నారు. వాడు దిక్కులు చూస్తూ, వేళ్లతో నేల మీద గీతలు గీస్తూ ఆలోచిస్తున్నాడు. కొంతసేపు అక్కడ గడిపేక….

‘‘నడు!.. టిఫిన్‌ ‌చేద్దాం’’.. అంటూ గుడి బయటకు బయల్దేరదీశాను .

నెయ్యి వేసి కాల్చిన వేడి వేడి పుల్కాలు, ఆలుగడ్డల కూర వేసి ఇచ్చాడు హోటల్‌ ‌వాడు. త్వరగా రూమ్‌కి వెళ్లిపోయి పడుకోవచ్చని కాబోలు!, అచ్యుత్‌ ‌వాటిని హడావి•డిగా నోటిలో కుక్కుకుని తింటున్నాడు, వచ్చిన దగ్గర నుండి నిర్లిప్తంగా ఉంటున్నాడు. ఏ పని చెప్పినా యాంత్రికంగా చేసుకు పోతున్నాడు తప్ప, ఏదీ మాట్లాడడు, బయటకి చెప్పడు. మనసు పెట్టి చేస్తున్నట్టుగా అనిపిం చడం లేదు. రూమ్‌కి చేరాము. బట్టలు మార్చుకుని పక్క మీదకు చేరాను. ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ పడుకోవడం నాకలవాటు.. నిద్రకి ఉపక్రమిం చిన అచ్యుత్‌, ‌గుండెల మీద చేతులు వేసుకుని, కళ్లు తెరుచుకుని పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు.. కొంతసేపయ్యాక…

‘‘ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అంకుల్‌? ‌మా ఊరు ఎప్పుడు పంపుతారు నన్ను?’’.. నా వైపుకి తిరిగి నెమ్మదిగా అడిగాడు.

‘‘ఏం? ఇక్కడ నీకు నచ్చలేదా?’’

‘‘మ్‌.. ‌మ్‌ .. అది కాదు’’. అని ఆగిపోయాడు.

‘‘రేపటి నుంచి కొన్ని ప్రదేశాలకి తీసుకు వెడతా! తర్వాత ఆలోచిద్దాం.. గుడ్‌ ‌నైట్‌’’.. అం‌టూ లైట్‌ ఆర్పేసాను.

మర్నాడు రూమ్‌ ‌నుండి బయటకి వచ్చి ఆలూ పోహా, సమోసా తిని, నా మోటర్‌ ‌సైకిల్‌ ‌మీద బెట్‌ ‌ద్వారక బయలుదేరాం. అచ్యుత్‌ ‌నిశ్శబ్దంగా దారిలో కనిపించే ఉప్పు మడులు చూస్తున్నాడు.

కొంతసేపటికి ‘‘ఒఖా’’ అనే ఊరి దగ్గర సముద్రపు ఒడ్డుకు చేరాం. బెట్‌ ‌ద్వారక ఒక చిన్న ద్వీపం. సముద్రపు పాయ దాటడానికి ఒక పెద్ద మోటార్‌ ‌బోట్‌ ఎక్కాం. సముద్రం తరంగాలకు అది ఊయలలా ఊగుతోంది. దానిలోకి ఎక్కిన కొంతమంది పిల్లలు పల్లీలు, చిన్నచిన్న బిస్కెట్లు అమ్ముతున్నారు.. వాటిని కొని, సముద్ర తరంగాల మీద ఎగురుతున్న సీగల్స్ అనే సముద్రపు పక్షుల వైపుకు యాత్రికులు విసురుతూంటే, అవి వేగంగా వచ్చి వాటిని ముక్కులతో పట్టుకుంటున్నాయి.

అచ్యుత్‌ ‌సంభ్రమాశ్చర్యాలతో వాటిని చూస్తున్నాడు. వాడికి ఒక బిస్కట్‌ ‌పాకెట్‌ ‌కొనిచ్చాను. బిస్కెట్స్ ‌పైకి విసురుతున్నాడు, అవి ‘‘క్రీక్‌ ‌క్రీక్‌’’ ‌మంటూ కూస్తూ బోట్‌ ‌పైదాకా వచ్చి ముక్కుతో పట్టుకుంటుంటే, వాడి మొహంలో ఆనందం తొంగి చూసింది..

‘‘ఆహారం కోసం అవి శబ్దానికి భయపడకుండా, ధైర్యంగా ఎగురుతూ కావలిసిన తిండిని దక్కించు కుంటున్నాయి. వాటి ధైర్యం ముందు నిలబడలేక ‘‘భయం తోక ముడిచింది’’ అన్నాను.

ఆ మాటకి అచ్యుత్‌ ‌గట్టిగా నవ్వాడు. వాడి నవ్వు మనోహరంగా ఉంది.

సముద్రపు పాయ దాటి.. బెట్‌ ‌ద్వారకలో కృష్ణుడు నివసించాడు అని చెప్పబడుతున్న మందిరానికి వచ్చాం. దర్శనం చేసుకుని, బయటకి వచ్చి తిరిగి బోట్‌ ఆగిన ప్రదేశానికి బయలుదేరాం.

‘‘అంకుల్‌ ! ఇక్కడొక కృష్ణుడు, నిన్న చూసిన గుడిలో మరో కృష్ణుడు. ఏమిటి తేడా?’’ అడిగాడు సందేహంగా.

ఒక చేయి వాడి భుజం మీద వేసి, మరో చేత్తో సముద్రం కేసి చూపిస్తూ .. ‘‘ఈ సముద్రం అడుగున ద్వారకా నగరపు అవశేషాలు దొరికాయి. దానిని బట్టి ద్వారకా నగరం శ్రీకృష్ణుడు ఇక్కడే నిర్మించాడని తెలిసింది. ఆయన నివసించే మధుర మీద ఎన్నో దాడులు జరిగినప్పుడు, అక్కడ ఉండడం సురక్షితం కాదని, తన ప్రజల రక్షణ, పరిపాలన కోసం ఇక్కడ కొత్త రాజధాని నిర్మించాడు. కాల క్రమేణ ద్వారక సముద్రంలో మునిగిపోయింది. తర్వాత ఆయన భక్తులు స్వామి విగ్రహం ప్రతిష్టించారు.

 నిన్న చూసిన గుడి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మిం చినట్టు చారిత్రక ఆధారా లున్నాయి. ఎందరో ఆయన మీద దండయాత్రలు చేసినా, ఎన్నో అడ్డంకులు వచ్చినా చలించకుండా మళ్లీ ఇక్కడ నగరం నిర్మించి పరిపాలన సాగిం చాడుట. కృష్ణునికి ఉన్న పట్టుదల, కార్యదీక్ష గొప్పవి కదా అచ్యుత్‌ !’’.

‘‘అమేజింగ్‌.. అం‌కుల్‌’’.. అన్నాడు మెరుస్తున్న కళ్లతో.

బోట్‌లోకి ఎక్కిన తర్వాత, నానుండి ఎన్నో విషయాలు అడిగి తెలుసు కున్నాడు, నేను నెమ్మదిగా వాడి చదువు, కాలేజీ విషయాలు అడిగాను. ఉత్సాహంగా చెప్తున్నాడు. వాడిని మర్నాడు ‘‘గోకుల్‌ ‌ధామ్‌కు తీపుకువెళ్లాను. అది శ్రీకృష్ణుని నిర్యాణ ప్రదేశం. శ్రీకృష్ణుని కాలి బొటనవేలికి బాణపు మొన గుచ్చుకున్నట్టు ప్రతిష్ఠించిన విగ్రహం, దాని ఎదురుగా క్షమించమని ప్రార్థిస్తున్న కిరాతుని విగ్రహం కనబడ్డాయి. అచ్యుత్‌ ఆసక్తిగా అక్కడ శిలాఫలకం మీద రాసినది చదువుతున్నాడు.

గుడి బయట సాల వృక్షాల క్రింద కూర్చున్నాం.

‘‘అంకుల్‌ ! ‌కృష్ణుడు దేవుడు కదా ? ఆయన చనిపోవడం ఏమిటి? దేవుడికి చావుంటుందా?’’.. సందేహం వ్యక్త పరిచాడు.

‘‘మంచి ప్రశ్న వేశావు! ఎవరికైనా మరణం తప్పదు. సృష్టిలో శాశ్వతమన్నది ఏదీ లేదు.. మనిషి సాధారణంగా చనిపోతే మరణించాడు అంటాం. ఎన్నో గొప్ప పనులు చేసినవాడు చనిపోతే అవతారం చాలించాడు అంటాం అలాంటి వాణ్ణే ఈ ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది. దేవుడు అని గుడి కడుతుంది. పూజలు చేస్తుంది. పుట్టడం, చావడం ఎవరికైనా తప్పవు. గొప్పగా జీవించి చూపించాలి.

కృష్ణుని జీవితమే గొప్ప సందేశం. కన్నతల్లి ఒడిలో చుక్క పాలు కూడా తాగకుండానే, పసిగుడ్డుగా ఉన్నప్పుడే కష్టాల కడలి దాటుకుని, పెంపుడు తల్లి దగ్గర చేరి రేపల్లెలో పెరిగాడు. గొప్ప,పేద అనే తేడా లేకుండా గోవులు కాసే వారితో స్నేహం చేశాడు. రాక్షసమందల దాడినుండి చిన్నతనంలోనే యుక్తిగా తప్పించుకున్నాడు. వీరుడిగా ఎదిగాడు.. ఎన్నో అవమానాలు భరించాడు. మొక్కవోని ధైర్యంతో నిలబడ్డాడు. ప్రత్యక్ష యుద్దం చేయకుండా ధర్మం వైపు నిలబడి పరోక్ష యుద్ధం చేశాడు. ఫలితం ఆశించకుండా పని చేయమని చెప్పాడు. ఈ ప్రపంచా నికి.. భగవద్గీత అందించాడు’’.. వివరించాను.

 ‘‘భగవద్గీతలో ఏముంటుందంకుల్‌ ?’’

 ‘‘‌ధైర్యం!… జీవితంలో ధైర్యం ఉంటే చాలు! ఏది లేకపోయినా పరవాలేదు.. ఎంత డిఫికల్ట్ ‌సిట్యుయేషన్‌లో ఉన్నా ధైర్యంగా ఉంటే బయట పడవచ్చు. అనుకున్నది సాధించవచ్చు. పిరికితనంతో వెనక్కి అడుగు వేసిన అర్జునుడికి ధైర్యం చెప్పి, శత్రువుల మీద యుద్ధం చేయడానికి ప్రేరేపించాడు కృష్ణుడు. అందుకనే ఆయన విశ్వగురువయ్యాడు. ఓటమిని ఎన్నటికీ ఒప్పుకోకూడదు. గెలుపు కోసం కసిగా మళ్లీ పోరాడాలి. అప్పుడు విజయం వాడి ముందు సాగిల పడుతుంది’’… అంటూ వాడి మొహంలోకి చూశాను.. అర్థం అయినట్టు తల ఊపి నవ్వాడు. సాయంకాలానికి ఇల్లు చేరాం.. డిన్నర్‌ ‌చేసిన తర్వాత, అచ్యుత్‌ ‌చేతిలో వాడి ఫిజిక్స్ ‌పుస్తకం కనబడింది. తీక్షణంగా చదువుతున్నాడు.. లైటు ఆర్పకుండా.. నిద్రలోకి జారుకున్నాను.

కొంతకాలానికి అచ్యుత్‌లో చాలా మార్పు చూశాను. వాడిలో స్తబ్ధత నెమ్మదిగా తొలిగి పోతోందనిపించింది. చదువు మీద శ్రద్ధ పెరిగింది. తెల్లవారుజామున నా కన్నా ముందే లేచి యోగా చేస్తున్నాడు. వాడి పనులు వాడే చేసుకుంటున్నాడు. ఒకరోజు ఇద్దరం కలిసి వంట చేశాం. మరోరోజు వాడు స్వంతంగా వంట చేయడానికి ప్రయత్నిం చాడు. బాగా రాలేదని నిరుత్సాహ పడకుండా మళ్లీ ప్రయత్నం చేశాడు. తర్వాత రోజు బాగా చేశాడు. బంగారానికి వన్నె రావాలంటే ఇంకాస్త పుటం పెట్టాలి అనుకున్నాను.

 ఆరోజు కృష్ణాష్టమి. ద్వారక వీధుల్లో చాలా చోట్ల ఉట్టి కొడతారు.. ఇద్దరం బయటికి వెళ్లాము. బాగా రద్దీగా ఉన్న నాలుగు రోడ్ల కూడలి దగ్గర నిలబడి చూస్తున్నాం.

‘‘అసలు ఉట్టి ఎందుకు కొడతారు?’’ అడిగాడు అచ్యుత్‌.

‘‘ఈ ‌రోజు ప్రాధాన్యత ఏమిటో తెలుసా ?’’

‘‘శ్రీకృష్ణాష్టమి. కృష్ణుని జన్మదినం’’.. అన్నాడు.

‘‘అవును కదా!. అందుకే, ఆయన బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు, ఉట్టి మీద పెట్టిన కుండల్లో పాలు, వెన్న దొంగిలించే చిలిపి పనులు స్మరించుకోడానికి ఇలా చేస్తూ ఉంటారు.. కాని దీనిలో ఒక అంతరార్థ్ధం ఉంది’’..

‘‘ఏమిటంకుల్‌ ?’’ అడిగాడు ఆసక్తిగా

‘‘ఉట్టిని అందుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా దానికి కట్టిన త్రాడు బాగా పైకి లాగుతారు, మళ్లీ క్రిందకు చేతికి అందేలా దింపి ఆశ పెడతారు. ఎంత ఎత్తుకు లాగినా, ఉట్టిని అందుకోవడానికి మరింత ఎగిరి ఓర్పుగా ప్రయత్నం చేసి చివరకు ఉట్టిని అందుకుంటాం. జీవితంలో పైకి ఎదగడానికి ఆశ ఉండాలి. అదే మనిషిని బ్రతికించే శ్వాస.. ఎంత కష్టమైన లక్ష్యమైనా సాధించాలంటే, ఆశ, శ్రమ, ఓర్పు… మూడూ ఉండాలి… అది దీని అంతరార్థ్ధం’’… విడమర్చాను.

‘‘ఓహ్‌ ! ‌చాలా బావుంది అర్థం’’… అన్నాడు.

ఊరంతా కోలాహలంగా ఉంది. జనంతో కిక్కిరిసి ఉన్నాయి రోడ్లు. ఇంతలో నా వెనకాల పాకెట్‌ ‌లోంచి ఎవరో పర్స్ ‌తీస్తున్నట్టు అనుమానం వచ్చి వెనక్కి తిరిగే లోపులో, పర్స్ ‌దొంగిలించిన వాడు అప్పటికే పరుగు పెట్టాడు.. నేను ‘‘చోర్‌ ‌చోర్‌’’ అని అరుస్తున్నాను. ఇంతలో అచ్యుత్‌ ‌వాడి వెనకాలే వేగంగా .. విల్లు నుంచి వదిలిన బాణంలా పరుగెత్తి దొంగ కాళ్లకి అడ్డం పడ్డాడు. వాడు బోర్లా పడ్డాడు… ఇద్దరూ పెనుగులాడుతున్నారు.. జనం గుమిగూడే లోపులోనే వాడు అచ్యుత్‌ని ఒక్క తోపు తోసి క్షణంలో మాయమయ్యాడు.. నేను అచ్యుత్‌ ‌దగ్గరకు వెళ్లి ..

 ‘‘వాడి దగ్గర ఏ ఆయుధమైన ఉండుంటే ప్రమాదం కదా.? ఎందుకు అంత రిస్క్ ‌చేశావు?’’ అంటూ వాణ్ణి పైకి లేపాను. చేతిలో గట్టిగా పట్టుకున్న నా పర్స్ ‌కనిపించింది… నివ్వెరపోయాను.

‘‘వాణ్ని ఎలాగైనా పట్టుకోవాలనిపించింది అంకుల్‌. ఏదో తెలియని ధైర్యం, ఆవేశం వచ్చాయి నాకు’’ అంటూ చేతికి అంటుకున్న మట్టిని దులుపు కుంటూ చెప్తూంటే… వాడి మాటల్లో ఆత్మవిశ్వాసం కనబడింది.

అచ్యుత్‌ ‌వాడింటికి తిరిగి వెళ్లిపోతుంటే, చాలా బెంగగా అనిపించింది.. టిఫిన్‌ ‌ప్యాకెట్‌, ‌పళ్లు,వాటర్‌ ‌బాటిల్‌ ‌వాడి సీటు మీద పెట్టాను. జేబులో కొంత డబ్బు పెట్టాను.

‘‘వెళ్లగానే నాన్న చేత ఫోన్‌ ‌చేయించు. బాగా చదువుకోమని నీకు చెప్పనవ సరం లేదు. ఎందు కంటే, కాలం, జీవితం ఎంతో విలువైనవని నువ్వు తెలుసుకున్నావని నా నమ్మకం. ఎల్లప్పుడూ నీ మీద నీకు ప్రేమ, విశ్వాసం ఉండాలి. మన చేతుల్లో ఉన్నదే మనం చేయగలము! అనే సంకుచిత ఆలోచన కన్నా, ఈ ప్రపంచమంతా నాదే అనే విశాల ధృక్పథం నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది ‘‘అంటూ భుజం తట్టి ఆల్‌ ‌ది బెస్ట్ ‌చెప్పాను.

 ‘‘థాంక్స్ అం‌కుల్‌!’’ ‌నా కాళ్లకి నమస్కరించాడు.

‘‘అరే ఎందుకు?’’.. అంటూ వాణ్ణి లేపి గుండెలకు హత్తుకున్నాను. ట్రైన్‌ ‌కదులుతుంటే వాడి మొహంలో చిన్న విచార వీచిక కనబడింది.. వెంటనే సర్దుకుని, నవ్వుతూ చేయి ఊపాడు. నా కంటికి కన్నీటి తెర అడ్డు పడింది.

తాళం తీసి రూమ్‌లోకి అడుగుపెట్టగానే అచ్యుత్‌ ‌లేని ఇల్లు బోసిగా అనిపిం చింది. వాడి ఆలోచనలు కొన్ని రోజుల వెనక్కి పయనించాయి..

ఆఫీసులో బిజీగా ఉండగా, నా క్లోజ్‌ ‌ఫ్రెండ్‌ ‌శేఖర్‌ ‌ఫోన్‌ ‌చేసి..

‘‘చూశావురా గోవిందు! ఇంటర్‌ ‌ఫెయిల్‌ అయ్యాడని, మా అచ్యుత్‌ ‌గాడు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అదృష్టవశాత్తు శైలజ చూసి వాణ్ని ఆపగలిగింది. అది జరిగినప్పటి నుంచి వాడు చాలా డల్‌గా ఉంటున్నాడు. ఎవ్వరితోను మాట్లాడడం లేదు. తిండి కూడా సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. ఉండుండి మళ్లీ ఏ అఘాయిత్యం చేసు కుంటాడోనని భయంగా ఉంది. ఒక్క గాని ఒక్క కొడుకు, వాడి మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకు తున్నాం’’… ఏడుస్తూ చెప్పాడు..

‘‘ముందు నువ్వు ఏడుపు ఆపు!.. అధైర్య పడకు. నా మాట కాస్త సావధానంగా విను!. ప్రస్తుతం నేను డిప్యూటేషన్‌ ‌మీద ద్వారకలో ఉన్నాను. ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నారు. నేను ఇక్కడ కొంత కాలం ఉంటాను. మీరు ముగ్గురూ ఇక్కడకు రండి. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉంటే మంచిది.. మీకు రిలాక్స్‌గా ఉంటుంది’’.. అన్నాను.

‘‘ఇప్పుడా? ద్వారకా ?’’.. సందేహం వ్యక్తం చేశాడు.. ‘‘నేను చెప్పినట్టు వినండి ఇద్దరూ’’.. శైలజకి కూడా నచ్చచెప్పాను.

వాళ్లు వచ్చి కొన్ని రోజులు నాతో గడిపారు. తర్వాత..

‘‘అచ్యుత్‌ని నాకు వదిలేయండి.. వాణ్ని తిరిగి పంపించే వరకు ఫోన్‌ ‌చేయకండి’’ అని వాళ్లకు నచ్చచెప్పి పంపించేశాను.. నేను కొంతకాలం సెలవు తీసుకున్నాను. ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు చేశావని వాణ్ణి అడగలేదు. వాడికి జీవితం విలువ, కష్టం విలువ తెలియజేయలనుకున్నాను. దగ్గర నుండి గమనించడం వల్ల వాడు అంతర్ముఖుడు, సున్నిత మనస్కుడని తెలుసుకున్నాను. నెమ్మది, నెమ్మదిగా నా దారిలోకి తెచ్చుకున్నాను. ఏ పనైనా మొదలు పెట్టాలన్నా, కొనసాగించాలన్న, చేయలేనేమోననే పిరికితనం వాడికున్న ముఖ్యమైన మానసిక రుగ్మత అని గ్రహించాను. క్రమేపీ తనను తాను మార్చు కున్నాడు. బలహీనతలని జయించాడు. ఇప్పుడు అచ్యుత్‌ ‌సానబెట్టిన వజ్రం.

శేఖర్‌ ‌నుంచి ఫోన్‌.. ‘‘అచ్యుత్‌ ఇం‌టికి వచ్చేశాడురా! పంపించే ముందు ఫోన్‌ ఎం‌దుకు చేయలేదు?’’.. కంగారు పడుతూ అడిగాడు.

‘‘అవసరం లేదు’’అంటూ ఫోన్‌ ‌పెట్టేసాను.

కొత్త అచ్యుత్‌ ‌వాడు. వాడి గురించి తన కంగారులో అర్థం లేదని తెలుసుకోవడానికి శేఖర్‌కి కొన్నాళ్లు పడుతుంది. ఇంకా ఎదగాలి వీడు.. అనుకుని నవ్వుకున్నాను.

వచ్చేవారం కథ..

గతితప్పిన అక్షరం

– దాట్ల దేవదానం రాజు

About Author

By editor

Twitter
YOUTUBE