ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం జమ్మూ కశ్మీర్‌ రాజకీయాన్ని సమూలంగా మార్చబోతోంది. ఇంతకాలం అన్యాయానికి గురైన ఎస్సీలు, ఎస్టీలు, మహిళలతో పాటు శరణార్థులుగా మారిన హిందువులకు, యుద్ధాల కారణంగా చెదిరిపోయిన కుటుంబాలకు ఆ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించబోతోంది. రాష్ట్ర రాజకీయాలను చిరకాలంగా గుప్పిట్లో పెట్టుకున్న అబ్దుల్లా-ముఫ్తీ కుటుంబాలకు, గుప్పెడు మంది సున్నీ వేర్పాటువాదులకు ఇది ఎదురుదెబ్బ. ఏడు దశాబ్దాల అన్యాయాన్ని సరిదిద్దే  రెండు కీలక బిల్లులను పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.

జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023.. భూతల స్వర్గంలో మరో విప్లవాత్మక నిర్ణయాలు. ఉగ్రవాదంతో దశాబ్దాలుగా రగిలి పోయిన జమ్మూ కశ్మీర్‌లో ఇప్పుడు శాంతి కుసుమాలు విరబూస్తున్నాయి. ఇందుకు కారణం 2019 ఆగస్టు 5న ఆర్టికల్‌-370ని రద్దు చేయడమే.

దీనికి తోడుగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చేర్చిన ఆర్టికల్‌- 35ఎ ప్రకారం 1954 మే 14వ తేదీకన్నా ముందు తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి, పదేళ్ల పాటు కశ్మీర్‌లో నివసించిన వ్యక్తి కశ్మీర్‌ శాశ్వత నివాసి అవుతాడు. దీని ప్రకారం వారు స్థిరాస్తులు కలిగి ఉండవచ్చు. ఆర్టికల్‌-370ని రద్దు చేయడంతో జమ్మూ కశ్మీర్‌ ప్రజలు కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలతో పాటు సమాన హోదా పొందుతున్నారు

దశాబ్దాల అన్యాయం నుంచి విముక్తి

ఆర్టికల్‌ 370 ఉనికిలో ఉన్న కాలంలో జమ్మూ కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు విచ్చల విడిగా చెలరేగి పోయాయి. అక్కడి రాజకీయాలపై కొద్దిమంది సున్నీ ముస్లింల పెత్తనం ఉండేది. ఉగ్రవాదులు, పాకిస్తాన్‌ ప్రేరిత వేర్పాటువాద నాయకుల కనుసన్నల్లో పాలనా యంత్రాంగం నడుస్తుండేది. 1947లో జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో సంపూర్ణంగా విలీనం జరుగుతున్న సమ యంలో పాకిస్తాన్‌ దాడి చేసింది. ఆ సమయంలో దాదాపు 31,789 కుటుంబాలు నిర్వాసితు లయ్యాయి. ఆ తర్వాత 1965, 1971 యుద్ధాల సమయంలో 10,065 కుటుంబాలు వలసబాట పట్టాయి. ఈ మూడు యుద్ధాల్లో మొత్తం 41,844 కుటుంబాలు శరణార్థులుగా తరలివచ్చాయి. వీరెవరినీ కనీసం పౌరులుగా కూడా గుర్తించలేదు. దీంతో వీరు అక్కడి ఓటు హక్కుకు కూడా నోచు కోకుండా పోయారు. వారికి జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడంతో వారి గోడును వినే నాథుడే లేకుండా పోయాడు

భారతదేశమంతటా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు, మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ వర్గాల వారు విద్య, ఉపాధి అంశాల్లో రిజర్వేషన్ల కారణంగా సామాజిక న్యాయం పొందుతున్నారు. చట్టసభలో వారికి రాజకీయంగా ప్రాతినిధ్యం కూడా ఉంది. దురదృష్టవశాత్తు జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌-370ని అడ్డం పెట్టుకొని ఈ వర్గాలకు ఎలాంటి రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్యాయం చేశారు. కొండ ప్రాంతాల్లో నివసించే షీనా, బకర్వాల్‌, బాల్టీ, పహడీ, గుజ్జర్‌ ముస్లింలు షెడ్యూల్డ్‌ తెగల కిందకు వస్తారు. రాష్ట్ర జనాభాలో వీరు 17 శాతం ఉండేవారు. వీరికి ఇంత కాలం ఎలాంటి రిజర్వేషన్‌ లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2023 ఈ అన్యాయాన్ని సరిదిద్దుతోంది.

ప్రాతినిధ్యంలో అసమానతలు

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యం విషయానికి వస్తే ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. లోయ ప్రాంతంతో పోలిస్తే భౌగోళికంగా జమ్మూ ప్రాంతం పెద్దది. కానీ అసెంబ్లీలో కశ్మీర్‌కు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించారు. అసెంబ్లీలో సీట్లు జనాభా, ఓటర్ల సంఖ్యకు తగ్గట్లుగా కేటాయించలేదు. 2023 జనాభా లెక్కల ప్రకారం చూస్తే జమ్మూ ప్రాంత జనాభా 53,50,811 కాగా, కశ్మీర్‌ ప్రాంత జనాభా 69,07,622. అలాగే 2022 నాటి ఓటర్ల జాబితా ప్రకారం జమ్మూలో 33,88,947 ఓటర్లు, కశ్మీర్‌లో 37,61,810 మంది ఓటర్లు ఉన్నారు.

జమ్మూ ప్రాంతంలో 37 అసెంబ్లీ నియోజక వర్గాలు, కశ్మీర్‌ ప్రాంతంలో మాత్రం 46 సీట్లు ఉన్నాయి. జనాభా దామాషా ప్రకారం చూస్తే జమ్మూకు మరిన్ని సీట్లు ఉండాలి. జమ్మూలో సగటున ప్రతి 91,593 మందికి ఒక ఎమ్మెల్యే ఉంటే, కశ్మీర్‌లో సగటున 81,778 మందికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలలో కశ్మీర్‌ లోయకు చెందిన పార్టీల పెత్తనం ఉండేలా మొదటి నుంచి జాగ్రత్త పడుతూ వచ్చారు.

దేశ వ్యాప్తంగా 2002లో నియోజకవర్గాల పునర్విభజన కమిటీని వేశారు. 2019లో నియోజక వర్గాల పునర్విభజన మేరకే ఎన్నికలు నిర్వహించారు. కానీ జమ్మూ కశ్మీర్‌లో మాత్రం పునర్విభజన చేపట్టలేదు. ఆర్టికల్‌-370 కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి ప్రకారం ఈ రాష్ట్రానికి వర్తించకుండా చేశారు. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం జమ్మూ నుంచే వస్తుంది. కానీ నిధుల కేటాయింపులో సింహభాగం కశ్మీర్‌కే పోతుంది. జమ్మూకు నిధుల కేటాయింపు అంతంత మాత్రమే. కేంద్రం తీసుకొచ్చిన జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023తో ఈ అన్యాయానికి ముగింపు పలకక తప్పదు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా డిసెంబర్‌ 6న జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2023, జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023 బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఆరు గంటలకు పైగా చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది. ఏడు దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యానికి దూరమైన వర్గాలకు శుభవార్త ఇది.

ఈ బిల్లులు చట్ట రూపం పొందితే జమ్మూ కశ్మీర్‌ రాజకీయ స్వరూపం పూర్తిగా మారుతుంది. ప్రాంతీయ అసమానతలు తొలగి, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం దొరుకుతుంది. కశ్మీర్‌ లోయకే పరిమితమైన రాజకీయ పార్టీల పెత్తనం తొలగి పోతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ వర్గాల ప్రజలకు, మహిళలకు రాజకీయంగా గుర్తింపుతో పాటు రిజర్వేషన్లు అందుబాటులోకి వస్తాయి. విద్య, ఉపాధి రంగాల్లో తోటి భారతీయులతో సమానంగా అవకాశాలను పొందుతారు.

ఇందులోని ముఖ్య అంశాలు….

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 114 అసెంబ్లీ సీట్లు (లద్దాక్‌-4 కలిపి) ఉంటే ఇప్పుడు 117కి పెరిగాయి. షెడ్యూల్డ్‌ కులాలకు 7, షెడ్యూల్డ్‌ తెగలకు 2 సీట్లు రిజర్వ్‌ చేశారు. కశ్మీర్‌ హిందూ పండితలకు 2 స్థానాలు కేటాయించి అందులో ఒకటి మహిళలకు ప్రత్యేకించారు. యుద్ధాల సమయంలో రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చెల్లా చెదురైన వారికి 1 స్థానం రిజర్వ్‌ చేశారు. కశ్మీర్‌ లోయలో ఒక నియోజవర్గం అదనంగా పెరిగి వాటి సంఖ్య 47కి చేరింది. జమ్మూ డివిజన్‌లో ఆరు సీట్లు పెరిగి వాటి సంఖ్య 37 నుంచి 43కు చేరింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రాంతానికి 24 సీట్లు రిజర్వు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు, వృత్తి విద్యా సంస్థల్లో పలు కేటగిరీల వారికి ఈ బిల్లు ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఆర్థికంగా వెనకబడిప వర్గాలకు కూడా ఆ సౌకర్యం అందుతుంది. ప్రస్తుత రిజర్వేషన్‌ చట్టంలోని ‘బలహీన, గుర్తింపునకు నోచని వర్గాలు (సామాజిక కులాలు)’ అనే పదబంధాన్ని ‘ఇతర వెనకబడిన’విగా మారుస్తారు. జమ్మూ కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్‌, లద్దాక్‌ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తారు.

ఆ 24 సీట్లు పీవోకేకు

 ఈ బిల్లుల ఆమోదం సందర్భంగా పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానిస్తూ, ఇది పూర్తిగా భారత్‌లో అంతర్భగమేనని, ఏనాటికైనా తిరిగి మనకు దక్కుతుందని స్పష్టం చేశారు. పీఓకే కూడా మన భూభాగమే కాబట్టి అక్కడి వారికి 24 సీట్లు కేటాయించామని, ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

జమ్మూ కశ్మీర్‌లో 1980 దశకంలోని ఉగ్రవాద కార్యకలాపాలను హోంమంత్రి గుర్తుకు తెస్తూ, దేశంలో ఓ భాగాన్ని ఆక్రమించుకుని అక్కడి ప్రజలను నిరాశ్రయుల్ని చేశారని మండిపడ్డారు. కశ్మీరీ పండిట్‌లు తమ సొంత దేశంలో శరణార్థులుగా బతకవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 46,631 కుటుంబాలు, 1,57,968 మంది తమ సొంత స్థలాలను వదిలి వచ్చారని వివరించారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి ఇప్పటిదాకా 45 వేల మంది బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు.

కశ్మీరీలకు పూర్తి న్యాయమే లక్ష్యం

ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమివ్వ కుండా మొదట్లోనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి ఉంటే పండిట్‌లు లోయను వీడాల్సిన అవసరమే వచ్చేది కాదని అమిత్‌ షా అన్నారు. ‘ఉగ్రవాదం వల్ల మరెన్నో వేల మంది స్వదేశంలోనే శరణార్థు లయ్యారు. ‘ఎంతోమంది కశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. హక్కులన్నింటినీ కోల్పోయి అన్నివిధాలా అన్యాయానికి గురైన కశ్మీరీలకు పూర్తిగా న్యాయం చేయడమే ఈ బిల్లుల ఉద్దేశమని, ఈ బిల్లుల ద్వారా వారందరికి హక్కులు సంక్రమిస్తాయని చెప్పారు. విద్య, ఉద్యోగావకాశాలు వస్తాయి. ఎన్నికల్లో నిలబడి గెలిచే ఆస్కారముంటుంది’ అని అమిత్‌ షా వివరించారు. 2024లోనూ నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని, అనంతరం రెండేళ్లలో జమ్మూ కశ్మీర్‌ను పూర్తిగా ఉగ్రవాద విముక్తం చేసి తీరతామని అమిత్‌షా చెప్పారు.

 నెహ్రూ చేసిన చారిత్రిక తప్పిదం

ఏడు దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్‌ అనుభవిస్తున్న కష్టనష్టాలన్నింటికీ తొలి ప్రధాని జవాహర్‌లాల్‌ నెహ్రూ చేసిన తప్పిదాలే కారణమని అమిత్‌ షా ఆరోపించారు. ‘ఆయన విధానాలు, కశ్మీర్‌లో ఉగ్రవాదానికి, వేర్పాటువాద కుంపట్లకు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పుట్టుకకు కారణమయ్యాయి. 1947 యుద్ధంలో మన సైన్యం పాకిస్తాన్‌ దళాలను తరిమికొడుతున్న వేళ, పూర్తిగా తిరిగి స్వాధీనం చేసుకోక ముందే ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించారు. అప్పటికి మన సైన్యం పంజాబ్‌ దాటి కశ్మీర్‌కేసి దూసుకుపోతోంది. నెహ్రూ కాల్పుల విరమణను కనీసం మూడు రోజులు ఆలస్యం చేసినా పీఓకే ఇప్పుడు భారత్‌లో అంతర్భాగంగా ఉండేది. అంతటితో ఆగక జమ్మూ కశ్మీర్‌ అంశాన్ని హడావిడిగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చేసిన ఈ రెండు ఘోర తప్పిదాలే కశ్మీర్‌లో చిచ్చుకు కారణమయ్యాయి. ఇది నెహ్రూ చేసిన చారిత్రిక తప్పిదం’ అని అమిత్‌షా వ్యాఖ్యానించారు.

 1962లో చైనాతో భారత యుద్ధానికి దారి తీసిన నెహ్రూ ‘భారీ తప్పిదం’ గురించి కూడా మాట్లాడాలని బిజూ జనతాదళ్‌ సభ్యుడు భర్తృహరి మహతబ్‌ కోరగా అమిత్‌ షా స్పందిస్తూ, ‘నెహ్రూ తప్పిదాల్లో రెండిరటిని ప్రస్తావిస్తేనే విపక్షాలు అలిగి వాకౌట్‌ చేశాయి. ఇక భారీ తప్పిదం గురించి మాట్లాడితే ఏకంగా రాజీనామా చేసేవేమో!’ అని ఎద్దేవా చేశారు. ఇక 370 ఆర్టికల్‌ను రద్దు చేసే దమ్ము గత కాంగ్రెస్‌ సర్కారుకు లేకపోయిందని అమిత్‌ షా అన్నారు. హోం మంత్రి వ్యాఖ్యలు ఎవరినీ అవమానించడానికి కాదని, జరిగిన వాస్తవాలను దేశం ముందుంచే ప్రయత్నం మాత్రమేనని స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు.

– క్రాంతి,  సీనియర్‌ జర్నలిస్టు,

జమ్మూ కశ్మీర్‌ స్టడీ సెంటర్‌ ప్రతినిధి

About Author

By editor

Twitter
YOUTUBE