‘నిండుచంద్రులు మీరు -వెన్నెలను నేను

దివ్యభానులు మీరు – పద్మినిని నేను

మీపదాబ్జ సన్నిధియె స్వామీ! మదీయ

జీవనమ్ము సమస్త సంభావనమ్ము’

ఈ అంతరంగ తరంగం అలివేణమ్మది. పూర్తిపేరు బారు అలివేలమ్మ. ఆమె శిలా విగ్రహం రాజమండ్రిలో ఉంది. అక్కడి స్వాతంత్య్ర సమరయోధుల పార్కులో కనిపిస్తుంది.

భర్త రాజారావు సైతం అలనాటి పోరాట యోధుడు. స్వాతంత్య్ర  సాధనమహోద్యమంలో ఆ దంపతులు ముందువరసన ఉన్నారు. కారాగారవాసం అనుభవించింది ఆ జంట. శిక్షా కాలంలో ఆమెకు మనసు వికలమైనా, తనకు తానుగా తేరుకునేవారు. దాంపత్య అనుబంధమే జ్ఞాపకంగా ఉంటుండేవారామె.

ఆయన పదసన్నిధినే ఆమె కోరుకున్నా, తన జీవనమంతా ఆయనదేనని ఎంతగా తలపోసినా శిక్షాకాలం తప్పనిసరి కదా!

పరప్రభుత్వ దమనకాండ, అణచివేత ఎంత ఎక్కువైతే, అంతే ఎక్కువగా అలివేలమ్మ పట్టుదల ఉండేది. ఒకటే లక్ష్యం దాస్యం నుంచి విముక్తి. అందుకోసం ఎంత యాతననైనా భరించడం.

76 ఏళ్లు జీవించారు. జీవితకాలంలో తొలినుంచీ పోరు స్ఫూర్తినే కనబరిచారు. మరింత ప్రత్యేకత ఇంకొకటుంది. తాను ఎంత క్రియాశీలురాలో బహుభాషల్లో అంతే కోవిదురాలు.

అవి స్వాతంత్య్ర ఉద్యమ రోజులు.

దినదినగండ  వాతావరణం.

భారతీయుల భావోద్వేగం తీవ్రరూపం ధరించింది.

ఆంగ్ల దొరల ఆధిపత్యాన్ని అసలే భరించ లేకపోతున్నారు.

ఏదో ఒకటి తేల్చుకోవాలన్న దృఢ నిశ్చయం అందరిదీ. పాలకులు నానారకాల తంత్రాలూ ప్రయోగించారు.

సామ, దాన, భేద, దండోపాయాలు అంటారు కదా అవన్నీ!

కొన్నాళ్లకి దండోపాయాన్నే ఎంచుకున్నారు వాళ్లు.

అది అలహాబాద్‌ నగరం. సందర్భం విదేశీ వస్త్ర బహిష్కరణ.

అప్పుడు అలివేణి బాలిక. సాహసంలో మటుకు కాళిక!

బాలగంగాధర్‌ తిలక్‌ ఉద్యమానికి నేతృత్వం వహించారు. విదేశీ వస్త్రాలన్నింటినీ నడిరోడ్డున కుప్పపోగా పోసి  నిప్పంటించారు! మరికొన్నాళ్లకే ఉద్యమరా ఊపందుకుంది. పుణె నుంచి  తదుపరి కాలంలో దేశమంతటా వ్యాపించింది. లక్షలాది జనవాహిని కలసికట్టుగా ముందుకు సాగింది. ప్రాణాలకు తెగించి మరీ పోరుశంఖం ఊదింది.

ఆ అన్నింటికీ ప్రత్యక్ష వీక్షకురాలు అలివేణి

భారత్‌కు బ్రిటిష్‌ నుంచి వచ్చిన వస్తువు లెన్నింటినో బహిష్కరించారు ప్రజలు. పంచదారను కాదన్నారు. బెల్లం వాడటం ఆరంభించారు. అన్నీ స్వదేశీ సంబంధమైనవే. ఆంగ్లేయుల వ్యాపారానికి గండి.

ఇదంతా చూసిన అలివేణి ‘నేనుసైతం’ అంటూ వేసిన ముందడుగు మరెందరికో దీప్తిమంతమైంది.

మూర్తి దాల్చిన పౌరుషమో, అఖండ

మైన ఆత్మవిశ్వాస మహానదమ్మొ !

సాహసోత్సాహ సత్య లీతేజస్సో నీవు

విశ్వసౌభ్రాత్రి ! భారత వీరపుత్రి!

అనేలా  ఆ యువతి పోరుపతాక ఎగురవేసిన తరుణమది. అందుకు ముందుగా అలహబాద్‌ వెళ్లారు. అక్కడ ఏర్పాటైన ఉద్యమ ప్రక్రియకు అంతా తానై నిలిచారు. తెలిసింది కదా… ఒకప్పటి ప్రయాగ్‌ రాజ్‌. అటు తర్వాత అలహబాద్‌. నాటి ఉత్తర ప్రదేశ్‌లో కీలకం.

 అక్కడికి వెళ్లిన ఉద్యమకారిణిది దక్షిణాదిన రాజమండ్రి సమీప కాకినాడ. రాజమండ్రి, కాకినాడ…దేనికి అదే సాటి. గోదావరి ఒడ్డును నగరం రాజమహేంద్రవరం. అదే ప్రాంతంలోని కాకినాడ కూడా సామాజిక, సాంస్కృతిక పురోగమన నిలయం.

(రాజమండ్రిలోని ఆంధ్రకేసరి యువజన సమితి వారే ఆ నగరాన విగ్రహ ప్రతిస్ఠాపన చేశారు. అలివేలమ్మ జీవిత విశేషాలన్నింటనీ శిలమీద పొందికగా చెక్కించారు. ఆమె తల్లిదండ్రులు వెంకుబాయమ్మ, కృష్ణారావులను ప్రస్తావించి గౌరవాదరాలు ప్రకటించారు. ఇదే ఫలకం మీద అలివేలమ్మ భర్త రాజారావు స్వాతంత్య్ర సమరవీరులు అంటూ శ్లాఘించారు.)

‘ఒక్కమాటలో ‘ధృవతార’ ఆమె.

దరులు దొరకని నీదు వాగరుల ముంచి

వేలకొలదిగ ప్రజల జోకట్టగలవు

సత్యసందేశ మ్మొసగి జనతనెల్ల

కోడికూతవలెన్‌ మేలుకొలుపగలవు!’

అనిపిస్తుంది ఆ నేత వ్యవహార పటిమను తలచినప్పుడు!

అదీ ఆమె సందేశ ప్రాభవ వైభవం.

ఆ ధీరకు సంతానంలోని గోవిందరావు కూడా ఉద్యమ మార్గాన నడిచినవారే. అంటే, ఆ కుటుంబ సభ్యులు అందరూ పోరాట శూరులే!

అలహాబాద్‌ నుంచి రాజమండ్రికి చేరుకున్న అలివేలమ్మ అక్కడా శంఖం పూరించారు. ప్రత్యేకించి మహిళల ఉద్యమ భాగస్వామ్యం మరింత పెరిగేలా శ్రమించారు. అందుకు తాను ఎంచుకున్న విధానాలు ఐదు.

  1. పరిచయాలు పెంచుకోవడం.
  2. స్వతంత్ర భావాలు రేకెత్తించడం.
  3. క్రియాశీలత అవసరాన్ని చాటి చెప్పడం.
  4. ఉద్యమ అనివార్యతను ప్రస్ఫుటం చేయడం.
  5. బాధ్యతల విభజన ద్వారా, కవితల నాయకత్వ పటిమను విస్తరించడం.

ఈ ఐదు సూత్రాలతోనూ ముందడుగు వేసిన అలివేలమ్మ మరొక కీలకాంశాన్ని అధిక ప్రాధాన్యంగా గుర్తించారు. అది వనితల అక్షరాస్యత.

అంటే కేవలం చదవడం, రాయడం కాదు.

చుట్టుపక్కల స్థితిగతులను గమనించడం.

గమనించిన వాటిని సామాజికంగా విశ్లేషించడం.

విశ్లేషించిన విషయాలను క్రియత్వానికి ఆపాదించడం. దీనివల్ల ఏం జరుగుతుందని ఆమె భావించారో తెలుసా?

ధీర గంభీర పౌరుషోత్తేజ పటిమ

మిత నిజజాతి రక్షా ప్రమాణ దీక్ష

అదే కోణంలో తనదైన పంథాలో మున్ముందుకు పయనించారు. వనితాలోకాన్ని తీర్చిదిద్దడం భవిష్యత్తులోనూ అద్భుత ఫలితాలకు మూలమవు తుందని నిరూపించగలిగారు.

వాస్తవానికి అక్షరాస్యత అనేది నాలుగు అంశాల మిళితం.

  1. క్రియాత్మకం
  2. సాంస్కృతిక సంబంధం
  3. వ్యక్తిగత ఉన్నతి సాధనం
  4. విమర్శనాత్మక రీతికి ఆలంబనం.

విద్యాబుద్ధులు, సంస్కృతీ, నాగరికతలు, స్వయం`సమాజ వికాస ప్రకాశాలు. వీటి మేళవింపు కార్యక్రమాలు అనేక ఫలితాలనిచ్చాయి.

అక్షరాస్యత అనేది సామర్థ్యానికి సూచిక. రోజువారి జీవితంలో ఎవరైనా సరే ఎంత చిన్న ప్రకటనైనా సరే చక్కగా గ్రహించగలిగితే అదే సమర్థత. అంతటి గమనింపును స్త్రీలోకంలో పెంచడానికి ఎంత చేయాలో అంత చేశారు అలివేలమ్మ. అవగాహన స్థాయిని పెంచడం పైన చూపు కేంద్రీకరించారు. పర్యవసానంగా, నారీచేతన సుసాధ్యమైంది. ఉద్యమ స్థాయి తీవ్రతతో, పాలకవర్గం సంచరించింది. ఆమె నిర్వహణ సామర్థ్యం ఎంత గొప్పదో పాలకులకు తెలిసివచ్చింది.

1947 ఆగష్టు 15 మనకు స్వతంత్రత.

అదే సందర్భంలో ఒక అంశాన్ని పదే పదే గుర్తుచేసుకున్నారామే. సేవాగ్రామ ఆశ్రమం. పేరుకు తగిన నిర్మాణరీతి.

ఆశ్రమం అంటే పర్ణశాల అనుకుంటాం. తపస్సు జరిగే ప్రాంతమని భావిస్తాం. వేదాభ్యాస స్థలమనీ తలపోస్తాం. సేవాశ్రమం మాత్రం సాటివారికి దోహదపడే ప్రాంతీయ స్థలం. తన భావాలకు రూపుదిద్దుకుంది అక్కడే’’ అని ప్రకటించారు ` ఆ పడతి.

సేవాభావానికి ప్రతిరూపం ఆంధ్రకేసరి యువజన సమితి. విద్యను అభివృద్ధి చేయడం, సంస్కృతి విస్తరించే కృషిని ముమ్మరం చేయడం ముఖ్య లక్ష్యాలు.

అభివృద్ధి, వికాసం, వ్యాప్తి

ఆ యువజన సమితి నిర్వహణలోనే పలువురు మహిళా దేశభక్తుల విగ్రహాలు రాజమండ్రిలో ఏర్పాటయ్యాయి.

పదుల సంఖ్యలో ఉన్న ప్రతిమలు. అన్నింటినీ పార్కులో స్థాపించి, దేశభక్తి భావాన్ని నిలబెట్టకుండా సంస్థ. శిలాఫలకాలు ` వాటిమీద వివరాలు.

సమితి నిర్వాహక ముఖ్యునిగా యాదగిరి శ్రీరామ నరసింహారావు (వై.ఎస్‌.ఎస్‌.) ను ప్రస్తావించి తీరాలి. వై.ఎస్‌.ఎస్‌.

స్వాతంత్య్ర సమర వీరనారీ మణుల పార్కు ప్రాంతంలోనే ఇండిపెండెన్స్‌ సెంటర్‌!

నాటి ధీరుల చిత్రపటాలు, వారు ఆనాడు వినియోగించిన వస్తువుల ప్రదర్శనలు! వాటిని చూస్తుంటే….

`స్వాతంత్య్ర సమర ప్రచార ప్రశస్తమౌ

మహదానంద మహామహస్సు!

జాతీయ భావనా సార సంపన్నమౌ

బహు నికేతనోజ్జ్వల యశస్సు!

విజయ విశ్రుత వీర విక్రమ స్ఫురణమౌ

నవ్య ధర్మదీక్షా తపస్సు!

తరుణ భారత భావ చైతన్యశక్తి

భరతనారీ ప్రభాత వైభవ బలమ్ము’

ఈ అన్నీ మనముందు నిలుస్తాయి. ఉత్తేజితం చేసి, జాతీయతా స్ఫూర్తిని మరింత ప్రస్ఫుటంగా నిలబెడతాయి.

బారు అలివేలమ్మ కుటుంబ నేపథ్యం, వైవాహిక జీవితం, స్వాతంత్య్రోద్యమ భాగస్వామ్యం, సేవార్‌గాన ఆమె ప్రతిష్ఠించిన విలువల నిలయం ` అన్నీ తెలుగువారి మదిని ఆహ్లాదభరితం చేసేవే. తెలుగు, సంస్కృతీ, ఇతర భారతీయ భాషల్లో గొప్ప అభిప్రాయ వ్యక్తీకరణ చేసిన ధీశక్తి ఆమెది.

స్వేచ్ఛ, స్వతంత్రత, సమానత్వం. ఈ మూడిర టికీ పతాకగా నిలిచిన ఆమె స్మృతి సూచన కార్య క్రమాలు  తెలుగునాట  జరుగుతున్నాయి.

–  జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE